బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అనవసరమైన మొహమ్మాటాలు


,p>     నిన్న వ్రాసిన పోస్ట్ కి ‘అవసరంలేని మొహమ్మాటాలు’అని పేరు పెట్టి, ఈవేళ ‘అనవసరమైన మొహమ్మాటాలు’ అని ఎందుకు పేరు పెట్టాను
అని అడక్కండి.రెండింటికీ ఒకటే అర్ధం అని నా అభిప్రాయం. ఏ రాయి అయితేనే బుర్ర పగులు కొట్టుకోవడానికి? నిన్నటిది వ్రాసిన తరువాత ఇంకా ఈ కోవకే చెందిన కొన్ని మొహమ్మాటాలు గుర్తుకొచ్చాయి.

    కొంతమంది, ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు, తెలియనివాటిగురించి ఎవరినైనా అడగాలి. కొంతమంది అన్నీ తమకే తెలుసూ అనుకునేవాళ్ళూ,ఇంకొంతమంది ఎవరినైనా అడగాలంటే కొంచెం సిగ్గూ, కొంచెం ఇదిగొ చెప్పానే అనవసరమైన మొహమ్మాటమూనూ. మా స్నేహితుడొకడికి, బొంబాయి లో ఉద్యోగం వచ్చింది, ఈ మధ్యన కాదు, 1964 లో. అప్పటిదాకా అమలాపురం దాటి రాని మనిషి, ఒక్కసారిగా బొంబాయి లాటి మహానగరానికి వెళ్తే అన్నీ చిత్రంగానే కనిపిస్తాయి.చర్చ్ గేట్ స్టేషన్ లో లోకల్ కి టిక్కెట్టు కొనుక్కుందామని, ఓ చోట పేద్ద క్యూ ఉంటే, అక్కడ వెళ్ళి నుంచున్నాడు.అడగొచ్చా ఎవరినైనా ఈ క్యూ దేనికీ అని.సిగ్గూ, మొహమ్మాటాలవల్ల ఎవరినీ అడగలేదు, ఎవరైనా నవ్వుతారేమో అని.ఆ క్యూ క్రమక్రమంగా, సాగుతూ, తన టర్న్ వచ్చింది కదా అని ముందుకు వెళ్ళాడు.తీరా చూస్తే అది టాయిలెట్ల క్యూ! వచ్చినా రాకపోయినా వెళ్ళాలిగా.ఇంక ఆ తరువాత ఎప్పుడూ, విషయం తెలుసుకోకుండా ఏ క్యూ లోనూ నుంచోడు !!ఇదంతా 45 ఏళ్ళక్రితం మాట !

    ఇక్కడ మాఇంట్లో పిల్లలు మార్కెట్ కి వెళ్ళినప్పుడు, వాళ్ళు తెచ్చే కూరలు నాకు ఇమడవు. అందుకని నేనే వీలున్నప్పుడల్లా కూరలు తెస్తూంటాను. అందులో మనం మామూలుగా తినే దొండకాయ, బెండకాయ తప్పకుండా ఉంటాయి. అవంటే అదేదో నాకిష్టమనికాదు, వాళ్ళు తెచ్చేకూరలు క్యాప్సికం, కాకర,బీట్ రూట్, నాకు అంత ఇష్టం లేవు.జిహ్వ కో రుచీ అంటారు.ఈ బెండకాయలేమో మా పిల్లలెవరూ తినరు. పైగా భోజనం చేసేటప్పుడు, మా నవ్యతో ‘ బెండకాయ కూర ఊరికే వేసికొని పారేయకు, అది తాతయ్యకు చాలా ఇష్టం’ అని ఓ డయలాగ్గూ.కూర తెచ్చిన పాపానికి, నాలుగు రోజులు ప్రొద్దుటా, సాయంత్రమూ ఆ బెండకాయ కూర తిన్నాను.పోనీ ప్రతీ రోజూ తినలేనూ అని చెప్పొచ్చుగా, అబ్బే ఏం అనుకుంటారో అనే భావం.మా అబ్బాయెల్లాగూ బెండకాయ తేడు, ఇంక నేను కూడా మళ్ళీ బెండకాయ తెస్తే ఒట్టు !!

    మా కోడలు పేరెంట్స్ ఎప్పుడైనా హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు,ప్రత్యేకంగా నేను తినగలిగే మెత్తగా ఉండే స్వీట్స్ తెస్తూంటారు.అలా అని పేరేం పెట్టరు, ఇంట్లో అందరూ తింటారనే వాళ్ళ ఉద్దేశ్యం. మరీ వాళ్ళ ఎదురుగుండానే ప్యాకెట్ ఓపెన్ చేసి తినేయలేనుకదా,ఇటొచ్చీ, అటొచ్చీ ఒకటీ అరా నోట్లోవేసికుంటాను ( అదైనా ఎవరూ చూడకుండా !!).మర్నాడు చూస్తే ఒక్కటీ ఉండదు, ఏమయిందా అని చూస్తే, అప్పుడు తెలుస్తుంది, మా అబ్బాయి ఆఫీసుకి వెళ్తూ, ఫ్రెండ్స్ అందరూ తింటారుకదా అని తీసికెళ్ళిపోయాడని! పోనీ నేను వాళ్ళతో చెప్పొచ్చుగా, ఫలానా స్వీట్, నాకు ఇష్టం,కొన్ని నాకోసం విడిగా ఉంచండి అని. చెప్తే ఉంచరూ? అదిగో ఇలాటి మొహమ్మాటాలతోటే, చిన్న చిన్న ప్లెజర్స్ మిస్ అవుతాము!

    నాకు చాకొలెట్లు, నోట్లో పెట్టుకుని చప్పరించాలని ఓ కోరికా.ఏం చెయ్యనూ, రాజమండ్రీ లో ఉన్నంతకాలం జేబులో ఓ డజను చాకొలెట్లు పెట్టుకునే వాడిని. ఎవరైనా అడిగినా, చిన్నపిల్లలెవరైనా కనిపిస్తే పెట్టడానికీ అని ఓ వివరణ కూడా చెప్పేవాడిని. అలాగని ఎవరికీ పెట్టకుండా నేనే మింగేసేవాడిననుకోకండి, ఎవరైనా చిన్న పిల్ల కనిపిస్తే చాలు, వాళ్ళకి ఒకటిచ్చి, ఒకటి నోట్లో వేసికునేవాడిని!అలాటప్పుడు అనిపిస్తుందేమో, ఆ చిన్నపిల్లతో ఉన్న పెద్దవాడికి, ‘పోనీ నాకూ ఒకటియ్యొచ్చుగా’అని.నాకు తెలుసున్నంతవరకూ తప్పకుండా అనిపిస్తుంది.అలాటప్పుడు, వాళ్ళ మొహం చూసి, వాళ్ళచేతిలోకూడా ఒకటి పెట్టేవాడిని! ‘ వద్దండీ అంటూనే, నోట్లో వేసేసుకునేవాళ్ళు. కానీ ఆ మొహంలో చూసే ఆనందం చూస్తే, ఓహో ఇతను కూడా నా బ్రాండే అనుకునేవాడిని !!

    కొబ్బరి బొండాలు త్రాగాలనీ, ఏ కూల్ డ్రింకో త్రాగాలనీ ఉబలాటం. ఇంట్లో ఎప్పుడైనా ఇలాటివి తెచ్చినప్పుడు,’ డాడి ఇలాటివి త్రాగరూ, ఆయనకోసం, మమ్మీ కోసం చాయ్ పెట్టండీ’ అంటాడు మా అబ్బాయి.ఎప్పుడో ఇమేజ్ బిల్డింగ్ పరిక్రమలో కూసిన కూతకి ఫలితం !

   ఇంకో సంగతేమంటే, ఎప్పుడైనా ప్రక్కవాళ్ళింటికి వెళ్ళినప్పుడు, వాళ్ళు ఏదైనా పెడితే మొహమ్మాటానికి కూడా బావుందీ అనకండి. అన్నారంటే మీ పని ఐపోయిందే! వాళ్ళింట్లో ఎప్పుడు ఆ పదార్ధం చేసినా, ‘ అంకుల్ కి చాలా ఇష్టం’ అంటూ ఓ డబ్బా లో పంపించేస్తారు. నచ్చినా నచ్చకపోయినా మింగ వలసిందే. ఏ డస్ట్ బిన్ లోనో పడేద్దామన్నా,మర్నాడు పనిమనిషి చూసి, వాళ్ళకి చెప్పేస్తుందేమో అని భయం!అలాటప్పుడు ఒకటే ఉపాయం- ఆ ఇచ్చినదేదో, నీళ్ళలో నానపెట్టి, దాని రూపం పూర్తిగా మార్చేసి, సింకులో పోసేయడమే !!
ఇంకా ఇలాటివి చాలా ఉన్నాయి…..
.

Advertisements

4 Responses

 1. హహహా. నా అనుభవంలో ఉన్న సంగతి చెప్పారు. ఎనభయైదెళ్ళ మా తాతగారు మాతోనే ఉంటారు. మాఇంట్లో పాపం ఆయనకి పెద్దరికం, ఆచారం అంటగట్టి రోజు రాత్రి అల్పాహారానికి ఏదో సంప్రదాయిక వంట వండేవాళ్ళు. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేను ధైర్యం చేసి ‘”తాతా మిర్చిబజ్జి తింటారా” అని అడిగా. శుబ్బరంగా తిన్నారు. తరవాతనుండి చాన్సు దొరికినప్పుడల్లా తాతయ్యకు నూడుల్స్, పావ్ భాజి రకరకాలు తినిపిస్తుంటా 🙂 మీ పోస్టు, నా కామెంటు చూసి కొందరైనా ఇలాంటి తప్పులు (పెద్దవాళ్ళ మీద అభిప్రాయాల్ని రుద్దటం) చేయకుండా ఉంటారని ఆశిద్దాం.

  Like

 2. రూపం మార్చేసి సింకులోవేసే ఐడియా అదిరిపోయిందండీ… నవ్వాపుకులేకపోయాను.. 🙂

  Like

 3. శ్రీనివాసా,

  మీలాటి చిన్నవాళ్ళకి ఉపయోగిస్తాయనే ఇలాటి ఐడియాలు ఇవ్వడం !!

  Like

 4. బుడుగోయ్,

  మన పోస్టులూ, వ్యాఖ్యలూ వలన మనుషుల్లో మార్పు వస్తే సంతోషమేగా !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: