బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-కాలక్షేపం

    మా ఇంటావిడ మనవడితో బిజీ బిజీ అయిపోయింది.పాపం కంప్యూటర్ వైపు చూడ్డానికి సమయమే ఉండడం లేదు.నేను ఈ మధ్యన పూణే లోని సిటీ బస్సు వాళ్ళు, సీనియర్ సిటిజెన్స్ కి నెలవారీ (300 రూపాయలు) ఇచ్చే పాస్ ఒకటి పుచ్చుకున్నాను.

   ప్రొద్దుటే 8.15 కి మా నవ్య స్కూలు బస్సు వస్తుంది. ఈ లోపులో ఎదురుగా ఉండే గణపతి గుడికి వెళ్ళి ప్రసాదం తెస్తాను.ఇంతలో బస్సూ లో, మా పెద్ద మనవరాలూ(తాన్యా),మనవడు (ఆదిత్య) వస్తారు. ఈ ముగ్గురికీ ఈ ప్రసాదం ( పంచదార క్యూబ్బులు) ఇచ్చేసి టాటా చెప్పేసి, నా తరువాతి కార్యక్రమానికి
అంటే అయ్యప్ప గుడీ,దుర్గ గుడీ, హనుమాన్ గుడీ, దత్త మందిరం దర్శనం చేసికొని, దారిలో తెలుగు పేపరూ,ఓ ఇంగ్లీషు పేపరూ తెచ్చుకోవడం,కొంప చేరడం.బ్రేక్ఫాస్ట్ ఏ చపాతీయో,పరోఠా యో తినడం. అప్పుడప్పుడు బోరు కొడితే ఎదురుగా ఉన్న హొటల్ లో ఏదో ఇంకో వెరైటీ తినడం.

    10.00 గంటలకల్లా ఓ సంచీ, కెమేరా వేసికొని, ఏ బస్సు దొరికితే ఆ బస్సు ఎక్కేయడం చివరిదాకా వెళ్ళడం.45 ఏళ్ళనుండి ఇక్కడే ఉన్నా చాలా ప్రాంతాలు తెలియవు.ఇంకో సంగతేమంటే పూణే నగరం అన్ని దిక్కుల్లోనూ పెరిగిపోయింది.కొన్ని కొన్ని పేర్లైతే అసలు వినలేదు కూడానూ. ఈ బస్సు పాస్ ధర్మమా అని ఊరంతా తిరగకలుగుతున్నాను.ఏ ఒంటిగంటకో ఇంటికి చేరడం. ఈ లోపులో మేము రెంటు కి పుచ్చుకున్న ఫ్లాట్ కి వెళ్ళి
అక్కడకూడా ఓ సారి చూసుకోవడం. ఏదో లాగించేస్తున్నాను.

    ఈ మధ్యలో ఏదైనా మిస్టరీ షాపింగ్ ఎసైన్మెంట్ వస్తే దానికి వెళ్ళడం. భోజనం చేసేసి, ఓ గంట నిద్రపోవడం. సాయంత్రం 5.30 కి మళ్ళీ నవ్య స్కూలునుండి తిరిగి వస్తుంది. అప్పుడు మళ్ళీ మా తాన్యా, ఆదిత్య లకు టాటా చెప్పడం.ప్రతీ రోజూ వాళ్ళని పలకరిస్తున్నాను కదా అని, మా అమ్మాయికి ఫోన్ చేయడం కొంచెం అశ్రధ్ధ చేశాను. ఈ వేళ ఓ లెక్చర్ ఇచ్చేసింది-కొడుకూ కోడలే కాదూ, మేము కూడా ఈ ఊళ్ళోనే ఉన్నామూ అంటూ.’తల్లీ ! మనవడూ, మనవరాల్నీ రోజూ రెండు సార్లు పలకరిస్తున్నాను కదా అని ఫోన్ చేయడం లేదూ’అన్నాను.అంటే తను అందీ’నా పిల్లల్ని పలకరిస్తున్నావు సరే, నీ పిల్లని కూడా గుర్తుంచుకోవాలి కదా’ అని. ఇంక రేపటినుండి మర్చిపోకుండా చేయాలి!

    ఇంట్లో చెప్పాను, పూణే లో ఏ ప్రాంతం లో పని ఉన్నా నాకు చెప్పేయండి, బస్సు పాస్ ‘పైసా వసూలీ’ చేయాలి అని! ఇన్నీ పూర్తి అయిన తరువాత సాయంత్రం 7.00 నుండి 8.00 దాకా, మా బిల్డింగ్ గేట్ దగ్గరే నుంచోవడం-ఎవరో ఒకరు రిటైర్ అయినవాళ్ళో, సర్వీసులో ఉన్నవాళ్ళో పలకరిస్తూంటారు.

    ఇన్ని పనుల కార్యక్రమాల మధ్యలో ఇంట్లో ఉన్న పాత ‘రచన’ లు అన్నీ చదవడం.మొదటి సంచిక నుండి అన్నీ జాగ్రత్త చేశాము! అవి చదువుతూంటే తెలుస్తోంది, 10-15 సంవత్సరాల క్రితం ఆ పత్రికల్లో వచ్చే కథలు ఎంత బాగుండేవో అని.ఇప్పటి ‘సెక్స్ విజ్ఞానాలూ’అవీ లేకుండా
హాయిగా చదువుకోడానికి బాగుండేవి. ఇప్పుడు మనందరం బ్లాగ్గుల్లో వ్రాసే విషయాలు, ఆ రోజుల్లోనే అప్పటి వారు వ్యాసాలలో వ్రాశారు.ఒక్కోటీ చదువుతూంటే అప్పటి రచయితలు ఎంత ముందుచూపుతో వ్రాశారో తెలుస్తుంది.వారు ఆ రోజుల్లో వ్రాసినవన్నీ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాము.

    అదే కాకుండా ‘భక్తి’ ‘ఎస్.వి.బి.సి’ చానెల్లలో వచ్చే ‘ప్రవచనం’ కార్యక్రమాలు వింటూంటే, ‘అర్రే ఇప్పుడు ప్రపంచం లో జరుగుతున్నవన్నీ ఆ రోజుల్లోనే ఊహించేశారా’ అనిపిస్తుంది. మన పురాణాల్లో వ్రాసినవన్నీ నిజమే అనిపిస్తూంది.

    ఈ అంతర్జాల మహిమ ధర్మమా అని, కావలిసినవాటి అన్నింటిగురించీ తెలుసుకోకలుగుతున్నాను.ఇదివరకైతే అంతా మిడి మిడి జ్ఞానం! అలా అని ఇప్పుడు ఏదో మహా జ్ఞాని అయిపోయానని కాదు. కనీసం తెలియనివాటి గురించి, ఎవరో చెప్తే తల ఊపేయడం కాకుండా,స్వయంగా తెలిసికోవడానికి
ఓ ఉపకరణం దొరికింది.ఏమీ తెలియని నాకే ఇలాగుందంటే, కంప్యూటర్ లో ప్రవీణులైన మీకందరికీ ఎలా ఉంటుందో?

    అందుకే అంటాను-దేనికైనా టైము రావాలీ అని.మేము రాజమండ్రీ గోదావరి తీరానికి వెళ్ళుండకపోయినా, ఆ గాలి పీల్వకపోయినా, ఇంకా ‘ కూపస్థ మండూకం’ లాగానే ఉండేవాడిని .

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

శ్రీరామ నవమి పందిళ్ళల్లో పానకం తో పాటు ఇచ్చే ఓ చిరుకానుక.ఇప్పటి తరంలో ఎంతమంది చూశారు? క్రిందటేడాది రాజమండ్రీ వెళ్ళినప్పుడు,ఊరంతా వెదికి అపురూపరంగా కొనుక్కున్నాము. ఈ విసినకర్రలో ఉండే సుళువు ఇంక దేంట్లోనైనా చూస్తామా? ఎన్ని పవర్ కట్టులు ఉన్నా ఫర్వాలేదు. లాంగ్ లివ్ తాటాకు విసినకర్రా !!
Read it here

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-జీవితం

   ఇదివరకటి రోజుల్లో ఇంట్లో పిల్లలెంతముందుంటే అంత సందడిగా ఉండేది.ఇప్పుడు అలాగ కాదుగా.ఒకళ్ళు,లేక ఇద్దరూ.కొంతమంది ఒకరితోనే సరిపుచ్చుకుందామనుకుంటారు. కానీ, మాకు 1979 లో మా డాక్టరమ్మగారు చెప్పినది ఇప్పటికీ గుర్తు–ఒక్కళ్ళే ఉంటే, మీరున్నంతకాలం ఫర్వాలేదూ, మీతరువాత, ‘నావాళ్ళూ’ అనే ఒక్కరైనా ఉండాలి ఇప్పుడున్న బిడ్డకి,అందువలన మీరు ఇంకేమీ ఆలోచించకుండా రెండో బిడ్డకి వెళ్ళండి అన్నారు. ఆవిడ చెప్పిందికూడా కరెక్టే కదా.

అలా కాకుంటే,మన పిల్ల మానసికంగా కూడా ‘ఒంటరితనం’ ఫీల్ అవుతుంది.ఆడైనా, మగైనా ఇంట్లో ఇద్దరు పిల్లలుంటేనే సందడి.ముందుగానే
నిశ్చయం చేసికుంటే, రెండేళ్ళ వ్యవధిలోనే ఇద్దరినీ కనేయడం శ్రేయస్కరం.లేదా ఇద్దరు పిల్లలకీ కనీసం నాలుగైదేళ్ళైనా వ్యత్యాసం ఉండేటట్లు చూస్తే అందరికీ మంచిది.అంతేకానీ,మొదటి బిడ్డ ఏ మూడేళ్ళో ఉన్నప్పుడు ఇంట్లోకి ఇంకో బిడ్డ వచ్చిందా, ఆ తల్లితండ్రులు పడే యాతన చూడ్డం చాలా కష్టం.
ఈ మొదటి పిల్ల ఇంకా ఏ ప్లేస్కూల్ కో వెళ్తుంటే, అస్సలు వీళ్ళు ఎప్పటికైనా పెద్దవుతారా, అనిపిస్తూంది.తల్లి పూర్తిగా పసిబిడ్డకే అంకితం అయిపోతుంది. పెద్ద పిల్ల కేమో ఇన్నాళ్ళూ ‘అమ్మ నాతోనే ఉండేదీ, ఇప్పుడు ఇంట్లోకి ఇంకో బేబీ వచ్చిన తరువాత, నా సంగతే పట్టించుకోవడంలేదూ’ అనిపిస్తుంది.ప్రతీ రోజూ ఈ పిల్లని స్నానం చేయించి, యూనిఫారం వేసి స్కూలుకి పంపడం అవీ నాన్నే చూసుకోవాలి.ఇదేకాకుండా, పసిబిడ్డ ఏ కారణం లేకుండా రాత్రంతా ఈ భార్యాభర్తలని మెళుకువగా ఉంచుతాడు.ఇంక చూడండి వీళ్ళ అవస్థ!
పోనీ అలాగని ఈ పిల్లని పసిబిడ్డ దగ్గర వదులుదామా అంటే, ఏం చేస్తుందో అని భయం.ఇంకో సంగతండోయ్, ఎవరైనా పసిబిడ్డని చూడ్డానికి వచ్చినప్పుడు, చేతిలో పెట్టడానికి ఏదో తెస్తూంటారు.పెద్ద పిల్లకి ఏమీ ఇవ్వకపోతే దీనికి ఓ రకమైన విరక్తి పుట్టుకొచ్చేస్తూంటుంది, వచ్చిన వాళ్ళకి బేబీ అంటేనే అభిమానం, నా సంగతే మర్చిపోయారూ అని. ఎందుకంటే ఇన్నాళ్ళూ ఆ ఇంటికి, ఆ తల్లితండ్రులకీ ఈ పిల్లే అన్నీనూ. ఈ పీరియడ్ మాత్రం, అందరూ చాలా జాగ్రత్త గా ఉండాలి.పెద్ద పిల్లని అస్సలు ‘నెగ్లెక్ట్’ చేయకూడదు.లేకపోతే ఉత్తిపుణ్యాన్న లేనిపోని సమస్యలొస్తాయి.

అదే ఇద్దరు పిల్లలకీ ఏ అయిదేళ్ళో వ్యత్యాసం ఉందనుకోండి, ఈ గొడవలన్నీ ఉండవు. ఆ పెద్దపిల్ల ఏ సెకండ్ స్టాండర్డ్ లోకో వస్తుంది. ఇంట్లో తను అనుభవించే ఆనందం అంతా ఏకఛత్రాదిపత్యంగా జరిపించేసికుంటుంది అప్పటికే. ఇంట్లో ఇంకో బేబీ వస్తూందంటే పట్టలేనంత ఆనందంగా ఎదురు చూస్తూంటుంది.అదో రకమైన ‘మెటర్నల్ ఫీలింగ్’ కూడా వస్తుంది.తనే అన్నీ చూస్తూంటుంది.ఎప్పుడైనా అవసరం వచ్చి పసిబిడ్డని వదిలి వెళ్ళవలసి వచ్చినా, ప్రాణం పోస్తుంది.ప్రతీ రోజూ బయటకు ఆటలకి వెళ్ళడం మానేసి, ఇంట్లో ఉన్న తన తమ్ముడు/ చెల్లెలు తోనే సమయం గడపడానికి చూస్తుంది.అంతే కాదు మనింటికి ఎవరైనా వస్తే, ఆ తల్లితండ్రులు కూడా గర్వంగా చెప్పుకోగలుగుతారు-‘మా అమ్మాయికి వీడంటే ప్రాణం,అసలు నన్నేమీ చేయనీయదు‘ లాటి ప్రశంసలు ఇచ్చినప్పుడు ఆ పిల్ల మొహంలో కనబడే ఆనందం ఎంత బాగుంటుందో !

ఇలాటి కార్యక్రమాలన్నీ 35 సంవత్సరాలకల్లా పూర్తి చేసేసుకోండి. మీరు రిటైర్ అయే సమయానికి ( ఏ ఉద్యోగంలో ఉన్నా ఈ రిటైర్మెంటనేది తప్పదుగా!) హాయిగా చేతికి అందొచ్చిన పిల్లలుంటారు.అదృష్టం బాగుంటే వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా పూర్తిచేసేసికుంటే ‘ఏక్ దం సోనేపే సుహాగా’.వాళ్ళ పురుళ్ళూ, పుణ్యాలూ కూడా పూర్తి అయిపోతే ఇంక చెప్పేదేముంది? ఇవన్నీ ఏదో ‘హైపోతెటికల్’ గా చెప్పేది కాదు-అనుభవం మీద చెప్పేది.
చిన్నా చితుకూ చిరాకులుంటాయి, వాటిగురించి పట్టించుకోకపోతే, అవేమీ మననేం చెయ్యవు.అసలు చిరాకులూ,పరాకులూ లేకుండా జీవితం ఏమిటీ?
ఏదో ఒక కాలక్షేపం కూడా ఉండాలిగా. ఎలా కావాలంటే అలా అన్వయించుకోవచ్చు.ప్రతీ దానికీ పట్టించుకుంటే జీవితం నరకం అయిపోతుంది. అర్ధం చేసికోనే పధ్ధతిలో ఉంటే అందరికీ హాయి.

ఆ భగవంతుడు మనకి మానవ జన్మ ఇచ్చి ఓ అందమైన జీవితాన్ని ప్రసాదించారు. మహా ఉంటే ఎన్నాళ్ళు బ్రతుకుతామూ? ఉన్నన్నాళ్ళూ, పోయిన తరువాతా కూడా మన గురించి ‘ ఓ తీపి జ్ఞాపకం’ లా ఒక్కడు గుర్తుచేసికున్నా మన జీవితం ధన్యం అయినట్లే !
సర్వేజనా సుఖినోభవంతూ.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-సువాసనలు

    మా చిన్నప్పుడు వేశవి వెళ్ళి వర్షాలు అందులోనూ మొదటి వర్షం వచ్చేముందర ఒక రకమైన మధురమైన సువాసన ఆస్వాదించేవాళ్ళం.మట్టి
మీద మొదటి చినుకు పడగానే వచ్చే వాసన ఇప్పటి రోజుల్లో ఓ తీయటి జ్ఞాపకంగానే మిగిలిపోయింది
.నగరాల్లో అస్సలు మట్టి అనేది ఎక్కడైనా కనిపిస్తోందా? ఏదో గవర్నమెంటు క్వార్టర్స్ ఉన్నచోట కొన్ని కొన్ని ఖాళీ ప్రదేశాలు కనిపిస్తూంటాయి.పోనీ అక్కడైనా ఈ సువాసన ఉంటుందేమో అని చూస్తే, ఈ ప్రకృతి కూడా మనమీద కక్ష కట్టినట్లనిపిస్తూంది.

    క్రిందటేడాది రాజమండ్రీ లో ఉంటున్నప్పుడు పోనీ ఈ అదృష్టం కలుగుతుందేమో అనుకుంటే,అప్పుడు అసలు వర్షాలే పడలేదు !ఆ పాత రోజులు గుర్తుతెచ్చుకుంటూ బ్రతికేయడమే మనకి రాసిపెట్టినట్లుంది.ఆ మట్టి వాసన రావాలికదా అని,బయట ఉన్న మట్టిమీద నీళ్ళు పోస్తే వస్తుందా? ఆ తొలకరి చినుకు ప్రకృతిసిధ్ధమైన మట్టిమీద పడ్డప్పుడే ఆ సువాసన వస్తుంది. ఇప్పటి వాళ్ళకి ఆ విషయాలు చెప్తే ఏం అర్ధం అవుతుందీ? ఇప్పుడు ఎక్కడ చూసినా గ్లోబల్ వార్మింగే.

   అలాటిదే మరో సువాసన పురిటి రోజులు వెళ్ళేదాకా పసిబిడ్డ వద్ద వచ్చే సువాసన! ఇదివరకటి రోజుల్లో పసిబిడ్డలకి, ఆముదమో, ఏదో నూనో మర్దనా చేసి, నలుగు పిండితో నలుగు పెట్టి, శుభ్రంగా స్నానం చేయించి, సాంబ్రాణి పొగ పెడితే, రోజంతా , ఆ పసిబిడ్డ దగ్గర సువాసనే సువాసన.
ఇప్పటి రోజుల్లో అలా కాదే! నూనె పెడితే ఎలర్జీ,పెసరపిండి పెడితే ఎలర్జీ,సాంబ్రాణి పొగ పెడితే ఎలర్జీ.ఇవన్నీ నేను చెప్పేమాటలు కావండోయ్. ఏవో రాషెస్ వచ్చాయని డాక్టరు దగ్గరకు వెళ్ళడం, ఆయనేమో, ఈ బేబీ కి రోజూ ఏం చేస్తున్నారని అడగడం, వీళ్ళు చెప్పినదాన్ని బట్టి, పై చెప్పినవన్నీ
అంటే నూనె,పెసరపిండి, సాంబ్రాణి బ్యాన్ చేసేయడం! ఇదివరకటి రోజుల్లో శుభ్రంగా ఉపయోగించేవి, ఈ రోజుల్లో ఎందుకు పనికిమాలినవయ్యాయో నాకైతే తెలియడం లేదు. వాతావరణంలో మార్పా, మనం తినే తిండిలో మార్పా, లేక మన మనస్థత్వాల్లో మార్పా?

    ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే మొన్న 14 వతేదీ న ‘మీకోసం'(here) అనే బ్లాగ్గులో, ఈ రోజుల్లో గర్భిణీ స్త్రీలు ఇంటర్నెట్ ధర్మమా అని ఎంత వత్తిడికి లోనౌతున్నారో అనే అంశమీద ఓ మంచి బ్లాగ్గు వ్రాశారు.దాన్ని దృష్టిలో పెట్టుకుని,గర్బిణీ స్త్రీలే కాదు, పుట్టిన పిల్లల గురించి కూడా, ఇంటర్నెట్ లో ఏవేవో చూసేసి, ఏవేవో ఊహించేసి వాళ్ళు ఖంగారు పడిపోయి, ఇంట్లో ఉన్నవాళ్ళని ఖంగారు పెట్టేస్తున్నారు.పసిపిల్లాడు గుక్కత్రిప్పుకోకుండా ఏడిస్తే, వెంటనే నెట్ ఓపెన్ చేసేయడం,అందులో వాడేదో వ్రాస్తాడు, అది చదివేసి, వెంటనే డాక్టర్ కి ఫోన్ చేసేసి, ఎపాయింట్మెంట్ ఫిక్స్ చేసేసి, వెళ్ళడం.అక్కడ ఆయనేమో, వీళ్ళింకా ఉపయోగిస్తున్నవాటి గురించి అడిగి, వాటిని కూడా బ్యాన్ చేసేయడం.
నాకైతే మాత్రం పైన చెప్పిన రెండు సువాసనలూ చాలా చాలా ఇష్టం !
!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-రమేష్ నాయుడు గారు

Listen here

చందమామ మీద ఎన్నెన్నో పాటలు వచ్చాయి.కానీ 1957/58 అనుకుంటా, ‘మనోరమ’ చిత్రం లోని పాట ఓ ఆణిముత్యం. విని ఆనందించండి.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-సమాజసేవ

ప్రస్తుత ప్రపంచం లో ‘స్థితిమంతులు’ వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి, క్రెచ్ కి పంపుతూంటారు.వాళ్ళు 2000 రూపాయలనుండి మొదలెట్టి,వసూలు చేస్తారు.పనిలోకి వెళ్ళే తల్లులకి ఏ ఆదాయవర్గం వారికైనా ఈ అవసరం ఉంటూనేఉంటుంది. ఈ బామ్మగారిని చూడండి.

Read it here

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-స్వర్ణయుగ దిగ్గజాలు

తెలుగు చిత్రసీమ లో ఎందరో మహానుభావులు ఉన్నారు. వారు నిర్మించిన చిత్రాలు ఇప్పటికీ ఆణిముత్యాలే. ఆ స్వర్ణయుగానికి చెందిన దిగ్గజాలగురించి ఈ రోజు ‘వార్త’ పత్రికలో వచ్చిన వ్యాసాన్ని చదివి ఆనందించండి.
Read it here

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-పుత్రోత్సాహం–10

    పుత్రోత్సాహం గురించి ఇప్పటిదాకా 9 పోస్టులు చేశాను.అందులో రెండు పోస్టులలో, ఈ తరం పిల్లలు తల్లితండ్రుల్ని సుఖపెట్టడానికి చేసే ప్రయత్నాల గురించి చెప్పాను.పాపం వాళ్ళు తల్లితండ్రుల్ని కష్టపెడదామని ఎందుకు అనుకుంటారూ,వాళ్ళేం శత్రువులా?అయినా తరాల తారతమ్యంవలన వాళ్ళు చేసే ప్రతీ పనీ, ఈ పెద్దాళ్ళకి విపరీతంగానే కనిపిస్తుంది.కొడుకు/కూతురూ ఏం చెప్పినా,తమమీద ‘రివెంజ్’ తీసికున్నట్లుగానే కనిపిస్తుంది.అదీ ఒకే చూరుక్రింద ఉంటే ఇంకా కష్టం.ఇదివరకటి రోజుల్లో అయితే పుట్టిపెరిగిన ఊళ్ళోనే నాన్నగారు కట్టించిన ఇంట్లోనే ఇష్టమైనా, కష్టమైనా అందరూ సద్దుకుపోయేవారు.ఇప్పుడు అలాగ కాదే, ఉన్నఊళ్ళో ఉద్యోగాలు రమ్మంటే రావుకదా.పొట్టచేత పట్టుకుని ఇంకో పట్టణానికో, నగరానికో వెళ్ళవలసి వస్తోంది.నగరాల్లో ఉండే వైద్యసదుపాయాల వలనైతే కానీండి,లేక మరేదో కారణంచేతో, ఈ పెద్దాళ్ళు కూడా,పిల్లల పంచకే చేరాల్సొస్తోంది.

    మరో కారణం ఏమంటే, ఈ పెద్దాయన తను 30/40 సంవత్సరాలూ ఉద్యోగం చేసిన చోటే సెటిల్ అవుదామని అనుకుంటూంటారు. పిల్లలు కూడా తల్లి తండ్రులు ఎలాగూ సెటిల్ అయ్యారు కదా అని, వాళ్ళూ అక్కడే సెటిల్ అవుతారు. అమెరికాలూ,ఆస్ట్రేలియాలూ,ఇంగ్లాండులూ వెళ్ళి ‘గ్రీన్ కార్డ్’ తీసికోకపోతే!తండ్రికి ఉద్యోగరీత్యా కొంచెం స్థానబలం కూడా ఉంటుంది. ఇవన్నీ వదిలేసికొని స్వంత గడ్డకి వెళ్తే ఏం ఉంటుంది? 30/40 సంవత్సరాల తరువాత మళ్ళీ ఇంకో చోటుకి (అది స్వస్థలమైనా సరే) వెళ్ళి నెగ్గుకురావడం కష్టమైన పనే.చిన్నప్పటి పరిస్థితులు కావుగా.ఈయనని గుర్తుపట్టేవాళ్ళుకూడా ఉండరు.ఇన్నాళ్ళూ ఉద్యోగం,పిల్లలపెంపకం ధర్మమా అని, బంధువులతో రాకపోకలు కూడా ఎక్కువగా ఉండవు. అన్నీ ఆలోచించుకొని, ఈ కట్టె ఏదో ఇక్కడే వెళ్ళిపోనీ అనుకొని ఉద్యోగం చేసిన ఊళ్ళోనే సెటిల్ అవుతారు.

    7 పోస్టుల్లో పిల్లలు చేసే ప్రతీ దానిలోనూ విపరీతార్ధాలు ఎలా తీస్తారో ఈ తల్లితండ్రులు వ్రాశాను.ఇగో వల్లనైతేనేమిటి,కమ్యూనికేషన్ గాప్ వల్లనైతేనేమి, ఈ పెద్దాళ్ళు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవరు.దానికి సాయం వయస్సు మీద పడ్డకొద్దీ వచ్చే చాదస్తం,దానితో వచ్చే బైప్రోడక్ట్ బి.పీ, సుగరూ వగైరా..వీటన్నిటి కారణాలచేతా, తమ బ్రతుకూ, చుట్టూ ఉన్నవారి బ్రతుకూ నరకప్రాయం చేసికుంటారు.

    ఈ గొడవలన్నీ కలిసిఉండడం వల్ల ఇంకా మాగ్నిఫై అవుతూంటాయి.అలాగని ఉన్న ఊళ్ళోనే విడిగా ఉండడానికి ప్రయత్నం చేయొచ్చుగా! హాయిగా ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతకొచ్చు.ఎవరి ఫ్రీడం వాళ్ళకుంటుంది. ఎవరి స్పేస్ వాళ్ళకుంటుంది.ఊళ్ళో వాళ్ళేమనుకుంటారో అని భయం!అవ్వా కావాలి బువ్వా కావాలంటే ఎలా?

    ఇంతలో కొడుక్కో, కూతురికో ఓ పిల్లో పిల్లాడో </పుడతాడు.తను ఇన్నాళ్ళూ పడ్డ సోకాల్డ్ 'హింస' (ఆయన ఉద్దేశ్యంలో), ఇంక తన కూతురూ/కొడుకూ కూడా అనుభవిస్తార్లే అని అప్పుడొస్తుందిట అస్సలు సిసలైన 'పుత్రోత్సాహం'. ఈ రోజుల్లో పిల్లలు చాలా హైపర్ అక్టివ్ .మనలాగా, మన పిల్లలలగా ఉండడం లేదు.వీళ్ళకి అంతా ఫాస్టే.మనం అయిదో ఏడు దాటేదాకా అక్షరాభ్యాసం చేయలేదు.మన పిల్లల దగ్గరకు వచ్చేటప్పడికి ఏవో ఎల్.కేజీలూ, యూ.కేజీలూ వచ్చాయి.ఇప్పటివాళ్ళైతే మూడో ఏటి కే ప్లే స్కూల్ కి వెళ్తున్నారు.నాలాటి వాడికి (అంత చదువు అబ్బలేదు కాబట్టి)
పిల్లల చదువుల గురించి ఎప్పుడో నెలకోసారి యూనిట్ టెస్ట్ ల ప్రోగ్రెస్ కార్డుల మీద సంతకాలు చేసే టైములో మాత్రమే అడిగే అవకాశం ఉండేది.అదైనా ఏదో ఒకటి అడగాలి కాబట్టి. రోజూ చదివే పాఠాల గురించి అడగాలంటే భయం, ఎక్కడ నన్ను చెప్పమంటారో అని!పాపం అంతా మా ఇంటావిడే చూసుకొంది. ఇప్పుడల్లా కాదే. ప్రతీ రోజూ పిల్లలు కాన్వెంటు నుండి ఏం నేర్చుకున్నారో, మర్నాటి పాఠం ఏమిటో, ఇవి కాకుండా ప్రతీ నెలా ఏవో ప్రాజెక్టులూ వగైరా వగైరా.. మరి నాలాగ ఉండమంటే ఎలా వీలౌతుంది? తల్లీ, తండ్రీ కూడా ప్రతీదానిలోనూ ‘ఇన్వాల్వ్’ అవాలి.

    ఈ దినసరి కార్యక్రమాలు చూస్తూంటే ఈ పెద్దాయన ఎంత ‘అలౌకికానందం’ పొందుతాడో! అలాటప్పుడు ఈయనకి ‘పుత్రోత్సాహం’ వెల్లువలై పారుతుంది ! అదండీ ఆధునిక ప్రపంచం లో ‘పుత్రోత్సాహానికి నిర్వచనం !!

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–సి.జి.ఎచ్.ఎస్

Read it here

సి.జి.ఎచ్.ఎస్ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రులు డబ్బు చేసికోవడం కొత్తేం కాదు.మొదట కాన్పూర్ లో ప్రారంభం అయింది. ఆ తరువాత క్రమంగా
పూణే చేరింది.పూణే లో నాలుగేళ్ళక్రితం ఇక్కడి ప్రఖ్యాత కార్పొరేట్ హాస్పిటళ్ళు ‘రూబీ హాల్’, ‘జెహంగీర్’ లాటి వాటిని పట్టుకొని, రెండేళ్ళు బ్యాన్ చేశారు.ఇప్పుడు హైదరాబాద్ లో పట్టుకున్నారుట!ఈ హాస్పిటళ్ళకి ఏ గోరుచుట్టో అని వెళ్తే, వాడిని ఖంగారు పెట్టేసి, చివరికి ‘బైపాస్’ లేక ఇంకో ‘యాంజీ ప్లాస్టో’ చేసేస్తారు.పోనీ అలాగని ఏ ఇన్స్యూరెన్స్ (మెడికల్) పాలసీయో తీసికుందామనుకుంటే, వాళ్ళు పెట్టే తిప్పలు పగవాడికైనా వద్దు.
ఆతావేతా చెప్పొచ్చేదేమిటంటే మంచం పట్టకుండా హాయిగా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోగలిగితే అంతకన్నా ఆనందం ఏం ఉండదు.మనకేం రాసిపెట్టుందో!

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-పుత్రోత్సాహం-9

    మా రోజుల్లో అమెరికాకి వెళ్ళడం అనేది కొంచెం తక్కువ అనుకుంటాను.ఇప్పుడు విదేశాలకి అంటే ప్రపంచంలో ఏ దేశానికైనా సరే-జాంబియా, సూడాన్ లనుండి అభివృధ్ధిచెందిన దేశాలదాకా వెళ్ళని వాడిది పాపం! చదువుకున్నవాడైనా సరే,లేనివాడైనా సరే బయటకు వెళ్ళడం అనేది ఒక ‘అబ్సెషన్’ అయిపోయింది.

మన దేశం కంటే బయట దేశాలలో ఆదాయం,గుర్తింపూ ఎక్కువా అనేది ఒక వాదం.అదే కాకుండా ‘వాతావరణం’ కూడా అనువుగా ఉంటుందనుకుంటా.ఇక్కడ ఉన్నన్ని రూల్సూ, రెగ్యులేషన్లూ,వాటిని అధిగమించడానికి కావలిసిన ‘ఇన్ఫ్లుయెన్సూ’ ‘లంచాలూ’ గొడవా తక్కువైఉండొచ్చు.బయట ఉండి వచ్చినవారిని ఎవర్నైనా అడగండి, ‘అబ్బో అమెరికాలో ‘ అయితేనా అని మొదలుపెడతారు.ఇక్కడ ఉండే ప్రతీదీ వాళ్ళకి ‘సఫొకేటింగ్’ గానే ఉంటుంది.ట్రాఫిక్,పొల్యూషన్,సివిక్ సెన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ విషయంలోనూ మనం వెనుకబడే ఉన్నామనిపించేలా మాట్లాడతారు.బహుశా వారు రైటేమోనేమో అనిపిస్తుంది.

కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండి వస్తారా అంటే, అబ్బే అలా కాదు-వెళ్ళినప్పడినుండీ ‘గ్రీన్ కార్డ్’ కోసం ప్రయత్నాలు మొదలు. ఆఖరికి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే, వారం వారం టీ.వీ ల్లో వచ్చే జాతక ఫలాల్లో కూడా ‘ ఈ వారం మీరు చేసే గ్రీన్ కార్డ్ ప్రయత్నాలు కొంతవరకూ సఫలమౌతాయి‘ అని చెప్పేంతవరకూ !ఈ వ్యవహారం ఎక్కడదాకా వచ్చిందంటే,ఎవరైనా పాత స్నేహితుడు కనిపిస్తే ఇదివరకటి రోజుల్లో, ‘మీ నాన్నగారు ఎలా ఉన్నారూ, మీఅన్నయ్య కులాసాయేనా, చెల్లమ్మ ఎలా ఉందీ? ‘ అనే పలకరింపుల స్థానం లో, ‘మా అమ్మాయి లండన్ లోనూ,అబ్బాయి ఒకడు డిట్రాయిట్ లోనూ, ఒకడు వాన్కూవర్ లోనూ, నాలుగోవాడు జెనీవాలోనూ ఉంటున్నారు, ఈ మధ్యనే పిల్లలదగ్గరకు వెళ్ళి,అన్ని దేశాలూ చూసొచ్చాము’.కొంచెం సంస్కారం ఉన్నవాళ్ళు అక్కడితో ఆపేస్తారు. కొంతమందైతే’ మీ పిల్లలు ఎవరూ బయట లేరా, అయ్యో
అని పరామర్శ ఒకటీ. ఆ అడిగే పధ్ధతి ఎలా ఉంటుందంటే, ఈయన (అంటే పూర్తి స్వదేశీ పిల్లల తండ్రి), తన పిల్లలేదో అప్రయోజకులనీ,వాళ్ళకి ‘యాంబిషన్’ అనేది లేదనీ. ఆ చిరాకంతా ఇంట్లో పిల్లల మీదా, పెళ్ళాం మీదా చూపిస్తాడు.
ఉన్న ఉద్యోగంలో ఆన్ సైట్ దొరకడం లేదని ఉద్యోగాలు మార్చినవారిని చూశాను.జీవితంలో ఒక్కసారైనా బయటకు వెళ్ళకపోతే వాడి బ్రతుకు నిరర్ధకమేనా? ఏమో అలాగే అనిపిస్తోంది.నేను చెప్పానుగా మా పిల్లలు (కూతురూ,అల్లుడూ, కొడుకూ,కోడలూ)ఆన్సైట్ వెళ్ళమంటే ఉద్యోగం మార్చేస్తారు. అలాగని బయటకు వెళ్ళలేదా అంటే అందరూ కూడా ఏదో పనిమీద నాలుగైదు సార్లు వెళ్ళివచ్చిన వారే. నాకు వాళ్ళల్లో ఎలాటి అసంతృప్తీ కనిపించలేదు.ఇక్కడ జాబ్ ని (నలుగురూ సాఫ్ట్ వేర్ లోనే పనిచేస్తున్నారు) పూర్తిగా ఆస్వాదిస్తున్నారు.మా ఇద్దరికీ ఎలాటి ‘కాంప్లెక్సూ’ లేదు, అయ్యో మన పిల్లలు మిగిలినవాళ్ళలా అమెరికాలోనూ, ఇంగ్లాండ్ లోనూ లేరే అని ! హాయిగా ప్రతీ రొజూ మా పిల్లల్నీ,మనవళ్ళూ, మనవరాళ్ళనీ హాయిగా మనసారా చూసుకుంటున్నాము.అలాగని ప్రతీరోజూ వాళ్ళతో ఏదో ఇంటర్ యాక్షన్ ఉంటుందనికాదు. అవసరం వచ్చినప్పుడు పిల్లలు దగ్గర్లో ఉన్నారా లేదా అనేదే ప్రశ్న. కొంతమందనుకోవచ్చు- ‘ఈయనకి బయటకు వెళ్ళడానికి అవకాశం లేదూ, అందని ద్రాక్షపళ్ళు పుల్లన’అని.

జన్మనిచ్చిన తల్లితండ్రులకి అందనంత దూరం లో ఉంటే, ఇక్కడ వీళ్ళు పడే బాధ ఏమైనా తెలుస్తుందా? ప్రతీ నెలా డబ్బు పంపి, ఓ పేలెస్సో, మేన్షనో కట్టించేసి, అందులో అమ్మా నాన్నా బిక్కుబిక్కు మంటూ ఉంటుంటే, ఒకళ్ళమొహాలొకళ్ళు చూసుకుంటూ, పిల్లల దగ్గరనుండి వచ్చే మెయిల్సూ, వెబ్ మీటింగుల కోసం కళ్ళు కాయలు కాసేట్లా ఆవురావురుమంటూ ఉండడం లోనే సంతోషం ఉందేమో.

ఈ పరిస్థితి ఎలాటిదంటే,ఎంత ఐశ్వర్యమున్నా నోటికి నిండుగా ఏమీ తినలేనివాడు ( సుగరో,బీ.పీ వల్లో), బ్యాక్ ఏక్ ధర్మమా అని, వట్టినేలమీదే దొర్లవలసిన వాడిలా! ఎంతమంది పిల్లలుంటే లాభం?అందరూ బయటే ఉన్నప్పుడు. అప్పుడెప్పుడో ‘బాపు’ గారు ఓ కార్టూన్ వేశారు-తండ్రి కాలధర్మం చెందినప్పుడు, కొడుకు రాలేకపోతే, పదోరోజుకి వచ్చిన కొడుకుతో పురోహితుడంటాడూ’ మీరు టైముకి రాలేదని బాధ పడకండీ,క్రింద పెట్టినప్పటినుండీ, అస్థికలు కలెక్ట్ చేసేదాకా అన్నీ వీడియో తీయించేశామూ’ అని !చివరకి తల్లితండ్రుల ఆఖరి చూపు కూడా దక్కడంలేదు. ఇవన్నీ
ప్యూర్లీ సెంటిమెంటల్ స్టఫ్, ఇమోషనల్ బ్లాక్ మెయిలూ అని కొట్టిపారేస్తారు.మా ఫ్యూచరూ, మా పిల్లల ఫ్యూచరే మాకు ముఖ్యం, మీరు ఇక్కడికి వచ్చేసి, మాతోనే ఉండమంటే రారూ, పుట్టిన ఊరూ,అనుబంధాలూ, సింగినాదం అంటూ ఇంకో రకం వాళ్ళంటారు.

రైటే కాదనడం లేదు, ఓ సారి మీకు జన్మనిచ్చిన తల్లితండ్రులగురించి కూడా ఆలోచించండి. వెళ్ళద్దనడం లేదు, వెళ్ళినా కొన్నిసంవత్సరాలు సంపాదించేదేదో సంపాదించి, ఆ ఆనందం ఏదో మీ తల్లితండ్రులతో కూడా పంచుకోండి. మీ అభివృధ్ధే వాళ్ళకి కావలిసింది. ఇదంతా ఎందుకు వ్రాశానంటే ఈ వేళ మా కజిన్ ఒకతనికి ఫోన్ చేసినప్పుడు చెప్పాడు వాళ్ళ అబ్బాయి గత పాతిక సంవత్సరాలూ మాస్కో లోనూ, లండన్ లోనూ ఉండి, ఇండియా తిరిగివచ్చేస్తున్నాడూ, పూణే లో ఉద్యోగానికీ అని. తనకి ఎంత ఆనందంగా ఉందో! ఈయనకి డెభ్భైఏళ్ళ పైమాటే.ఒక్క కొడుకైనా దగ్గర ఉంటాడూ అని ఆ వెర్రిప్రాణికి సంతోషం!

%d bloggers like this: