బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-పేర్లు గుర్తుకు రావు!


    నెమలికన్ను వ్రాసిన ‘మరచిపోయా..’బ్లాగ్గు చదివిన తరువాత, నేను దానిమీద వ్యాఖ్య వ్రాయడం మొదలెడితే, అదో బ్లాగ్గంత అవుతోందని,ఆపేసి,ఓ చిన్న వ్యాఖ్య మాత్రం పోస్ట్ చేశాను.నెమలికన్ను గారూ, మీరు వ్రాసినది చదివినతరువాత ఆలోచిస్తే, నాకు ఇలాటి అనుభవం
చాలా సార్లు జరిగింది.

    మీరు చెప్పినది అక్షరాలా కరెక్టు.రోడ్డుమీద వెళ్తూంటే ఎవరో కనిపించి ‘హల్లో ఫణిబాబూ’ అని పలకరిస్తారు.నేనుకూడా సమాధానంగా ‘హాయ్’ అనేసి ఊరుకోలేను.అతని మొహం గుర్తుంటుంది కానీ పేరు మాత్రం చచ్చినా గుర్తుకు రాదు. అతనితో మాట్లాడుతూ,ఫాక్టరీలో నాతో పనిచేసినవాడా,
లేక నాతో పరిచయం ఉన్న ఏ వెండరా( నేను మా ఫాక్టరీలో పర్చేస్ డిపార్ట్మెంటు లో 7 సంవత్సరాలు పనిచేశాను), లేక ఇంకోరా అని బుర్ర బ్రద్దలుకొట్టుకుంటాను.నా మొహం ఒకసారి చూసినవాళ్ళకి గుర్తుంటుంది.అంటే అదేదో ‘ఫేమస్’ అనికాదు.నా బట్టతలా, బొట్టూ,కళ్ళజోడూ లాటివి
కొంతమంది ఆద్వానీగారిలాగ ఉంటానంటారు.ఇంకోళ్ళు గాంధీగారిలాగ అని. ఏమైతేనేంలెండి గొప్పవాళ్ళతోనే పోల్చారు!!తిట్టడం లేదుగా !

    ఈ సందర్భంలోనే ఓ సంఘటన గుర్తొస్తుంది-ఒకసారి మా రోడ్డుమీదనుండి ఎల్.కే.ఆద్వానీ గారి రాక సందర్భంలో పోలీసు బందోబస్తూ అవీ పెట్టారు.అంతమంది పోలీసులిని చూసి, ఏమిటి సంగతీ అని ఓ పోలీసు ఇనస్పెక్టర్ ని అడిగితే, అతను నన్ను చూసి ముందర ఆశ్ఛర్యపడిపోయి, ఎటెన్షన్ లోకి వచ్చేసి’ అర్రే బాప్రే, ఆప్ యహా కైసా’ అన్నాడు.’హమారా ఘర్ పాస్ మే హై’ అనగానే, ‘సారీ సర్, ఆప్కో మే ఆద్వానీసాబ్ సంఝా’ అన్నాడు !

    ఎప్పుడైనా ఓ రిటైర్ అయిన స్నేహితుడెవరైనా కనిపిస్తే,చాలా కష్టాల్లో పడుతూంటాను.పేరు గుర్తుకు రాదు, ఎక్కడ పనిచేసేడో గుర్తుకు రాదు,అంతా అయిన తరువాత పేద్ద గొప్పగా ‘నీ ఫోన్ నెంబర్ ఇయ్యి’అని సెల్ లో నోట్ చేసికోవడం, పేరేం రాయాలో తెలియదు,సిగ్గు విడిచి, పేరేం వ్రాయమంటావూ అని అడిగేయడం.’అర్రే నా పేరు మర్చిపోయావా’అని అతగాడు నిలదీసినా, ‘మర్చిపోలేదూ, షార్ట్ లో ఏంరాయాలో అనీ...’అడిగానూ అనడం !

    నా అదృష్టం బాగోక రోడ్డుమీద వెళ్తున్నప్పుడు నాతో మాఇంటావిడో, అబ్బాయో ఉన్నారా, ఇంక నా కష్టాలు అడక్కండి- ఇంట్రడ్యూస్ చేయాలి, పేరు తెలియదూ,’ వీళ్ళు మా ఫామిలీ అని చెప్పేసి ఊరుకుంటాను’. ఇంక ఆ తరువాత మా వాళ్ళు నన్ను ఆట పట్టేస్తూంటారు. ‘ఆయనెవరో గుర్తు లేదు కదూ’ అని.

    ఈ మధ్యన బస్ స్టాప్ లో బాగా తెలిసున్న ఒకాయన (తెలుగు వారే) కనిపించారు. ఆయన పేరు ఇంకోలా అనుకొని ధైర్యం చేసేసి,అదేదో నేను ఆయన మూవ్మెంట్స్ ఫాల్లో అవుతున్నట్లుగా-‘ ఈ మధ్యన ఇక్కడ ఫ్లాట్ కొన్నారుటకదా ‘అన్నాను.ఆయన మొహం కొంచెం అదోలా పెట్టడం చూసి,టాపిక్ మార్చేసి,’చాలా రోజులయిందీ,ఎలా ఉన్నారూ ఫలనా ఫలానా…’ అని అడిగేసి ఊరుకోపెట్టాను.ఆయన బెంగుళూరు నుండి అదే రోజు వచ్చారుట, మా ఇంకో ఫ్రెండు ఇంట్లో ఉన్నారుట.ఇంతలో ఆయన బస్సొచ్చింది, నేను బ్రతికిపోయాను.కొంతసేపటికి మా కామన్ ఫ్రెండొస్తే, ఈ సంగతంతా చెప్పి,’బాబూ ఆయన పేరు మర్చిపోయానూ ‘అని చెప్పి నా గోలంతా చెప్పాను.అతనికీ ఇదే సమస్య !

   మా ఇంటావిడ అలాగ కాదండోయ్, ఎవరు పలకరించినా సరే, వాళ్ళ పిల్లల పేర్లూ, చుట్టాల పేర్లూ పెరు పేరునా అడిగి వాళ్ళ క్షేమ సమాచారాలు అడుగుతుంది.అవతలివాళ్ళు ఐసై పోతూంటారు.ఎప్పుడో సంవత్సరాల క్రింద పరిచయం ఉన్నవాళ్ళైనా సరే మర్చిపోదు!

    మా చుట్టాల విషయంలోనూ నాకు ఇదే బలహీనత!ఒక్కళ్ళ పేరూ గుర్తుండదు.అయినా ఏదో పెద్దాడైపోయాడూ అని వదిలేస్తూంటారు. ఈ సీనియర్ సిటిజెన్ పదవి వల్ల కొన్ని సుఖాలూ ఉన్నాయి.

3 Responses

 1. అరే ! నేనూ అలానే అనుకున్నా. మురళి కి నేనూ ఒక లిస్టు ఇద్దామనుకుని, అమ్మో అది చాలా పెద్దది అయిపోతుందని ఊరుకున్నాను.

  పేరు గుర్తు రాక పోవడానికి విరుగుడు గా.. టి.వీ న్యూసు వాళ్ళలాగా పదే పదే ఎదుటి వారి పేరు ఉచ్చరిస్తూ, జపం చేస్తూ మాటాడితే, ఇంక జనమ లో మరిచిపోం. ఇదో చిట్కా.

  ఒక సారి నాకూ ఇలాంటిదే జరిగింది. నేను విశాఖ లో ఉద్యోగ పర్వం మొదలు పెట్టిన కొత్తలో, బస్సులో ఒక మంచి అమ్మాయి పరిచయం ఐంది. తను నేనూ, బస్టాపులో ఒకరి కోసం ఒకరు వెయిట్ చేసి మరీ ఒకే బస్సు ఎక్కేవాళ్ళం. తను ఉషోదయా జంక్షన్, నేను వాల్టేరు లోనూ దిగే వాళ్ళం. ఆమె నాతో ఎంత సన్నిహితం గా మాటాడేదంటే, తనని నేను ఎప్పటికీ మరిచిపోలేను.

  ఆ తరవాత గాప్ వచ్చింది. తర్వాత, కొన్నేళ్ళకి తను బీచ్ లో కనిపించింది. పెళ్ళీ అయినట్టుంది. నేను వెళ్ళి ‘భానుమతీ, బావున్నారా ?’ అని పలకరిస్తే, నెత్తి కొట్టుకుంది గానీ నేనెవరో తనకి గుర్తు రాలేదు. చాలా సారీ చెప్పి వెళీపోయింది. నాకు చాలా బాధా, ఆశ్చర్యమూ కలిగాయి. అప్పటి నుంచీ – ఒక వేళ ఎవర్నైనా నేను గుర్తుపట్టకపోయినా, గుర్తుపట్టినట్టు నటిచేస్తాను.

  Like

 2. సుజాతా,
  నేను కూడా ఓ కామెంటేద్దామని మొదలెట్టేసరికి, రెండు బ్లాగ్గులు పోస్ట్ చెయ్యవలసివచ్చింది.అయినా ఇంకా అలాటి సంఘటనలు కోకొల్లలు !

  Like

 3. maa babu ku peru pettali modati aksharam sam to vachhindi meeku telisisna perlu cheputara

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: