బాతాఖానీ–లక్ష్మిఫణి కబుర్లు–పుత్రోత్సాహం –2


    కాలేజీ చదువులలో ఉండగానే అబ్బాయికీ, అమ్మాయికీ కూడా లోకంలో ఉన్న ‘ నిన్న లేని అందాలేవో’ కనిపించడం మొదలెడతాయి. అప్పటిదాకా ‘పార్వతీ పరమేశ్వరుల్లాగ’ ఉన్న తల్లి తండ్రులు అంటే కొంచెం ‘ బోరు’ కొట్టడం ప్రారంభం అవుతుంది. అబ్బా ఎప్పుడూ వీళ్ళేనా అనిపిస్తుంది.కొంచెం కొంచెంగా ప్రాపంచిక విషయాలలో ఆసక్తి పెరగడం కూడా మొదలౌతుంది. కాలేజీ చదువుల్లో ఉన్నాడు కాబట్టి మరీ బరి తెగించేయడు.ఇంకా కొద్దికాలం తండ్రి ‘ఆర్ధిక సహాయం’ మీదే బ్రతకాలిగా, అందుకూ !

కాలేజీ చదువులు పూర్తి అయి ఉద్యోగంలో చేరేటప్పటికి ‘ఆర్ధిక స్వాతంత్రం’కూడా వచ్చేస్తుంది.సడెన్ గా ఓ రోజు అమ్మాయైతే ఫలానా అబ్బాయంటే ఇష్ట పడుతున్నానూ అంటుంది.ఈ విషయంలో అమ్మాయికి తండ్రి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది.కారణాలు ఏమైనా ఇష్టపడిన అబ్బాయితో వివాహం చేసేస్తారు. ఇంక ఇంట్లో మిగిలేది అబ్బాయి ఒక్కడే.వీడు కూడా చదువు పూర్తి అవగానే, ఓ ప్రకటన చేసేస్తాడు.ఫలానా అమ్మాయంటే ఇష్ట పడుతున్నానూ అంటూ.అమ్మాయికే చేయగాలేనిది, అబ్బాయి విషయంలో ఎందుకు కాదనడం అనుకుంటారు తల్లితండ్రులు. పెళ్ళి అయినప్పటినుంచీ, ఆ వచ్చిన అమ్మాయే లోకంగా ఉంటాడు. ప్రపంచంలో ఇంకేదీ కనిపించదు.
ఇక్కడ తండ్రి అనుకుంటాడూ, ‘మనం కూడా పెళ్ళి అవగానే ఇలాగే ఉన్నాము కదా’ అనుకొని సరిపెట్టేసుకుంటాడు.తను ఈ పాతికేళ్ళూ, ఏం చేశాడో అప్పుడు గుర్తుకు రావడం మొదలెడతాయి. దేముడు మన తల రాతలు రాసేసి ఈ భూలోకంలోకి పంపుతాడు–మనం మన తల్లితండ్రులకి ఏం చేశామో అది మన పిల్లలు మనకి చేస్తారు.ఇందులో ఆశ్చర్యపడఖ్ఖర్లేదు.
పిల్లలు మనకేదో చెయ్యడం లేదూ అని ఏడవడం కంటే, మనం మన తల్లితండ్రులకి ఏం చేశామో గుర్తుతెచ్చుకుంటే అసలు గొడవే ఉండదు.అసలు సమస్యలు ఎప్పుడు వస్తాయంటే, ఈ విషయాలు మర్చిపోయి, ‘పెళ్ళైన తర్వాత మనం అల్లం, పెళ్ళాం బెల్లం అయిందీ’ అని ఏడ్చినప్పుడు.

పిల్లల పెళ్ళిళ్ళు అవడంతోటే ఈ యజ్ఞం పూర్తి అవదు. వాళ్ళ పురుళ్ళూ అవీకూడా చూసుకోవాలి కదా. ఇదివరకటి రోజుల్లో అయితే మొదటి పురుడు అమ్మాయి వైపు వారు పోసేవారు. ఇప్పుడు అందరూ తెలివిమీరి పోయారు. యువజంటలు ఒకళ్ళనొకరు వదలి ఇదివరకటి లాగ చాలా రోజులు ఉండలేరు.అమ్మాయి తల్లితండ్రులు కూడా, ‘పోన్లెండి, అక్కడే పోసేయండి, ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కూడా తక్కువే’ అంటూ,గొడవ వదిలించుకుంటారు. ఏదో చుట్టపు చూపుగా పురిటి రోజుకి వచ్చి, ఇరవై ఒకటో రోజు దాకా ఉంటే సరిపోతుంది.ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగాల ధర్మమా అని ఓ సౌలభ్యం వచ్చింది ఈ రోజుల్లో, పురిటి ఖర్చులు చాలా భాగం కంపెనీ ఇన్స్యూరెన్స్ లో కవర్ అవుతోంది.మిగిలిందేదో పెట్టుకుంటే సరిపోతుంది.

ఇంట్లో ఓ పిల్ల ( ఆడైనా సరే, మొగైనా సరే) వచ్చిందంటే చాలు, ఆ పిల్లే లోకంలా పెంచుతారు. మిగిలిన విషయాలూ, మిగతా వారూ ‘ టు హెల్ విత్ దెం’. చిన్నప్పుడు వాళ్ళు ఏమేం కోల్పోయారో, అవన్నీ తమ బేబీకి ఎలా సమకూర్చుకోగలమో, క్షణక్షణం ఈ తల్లితండ్రులకి గుర్తుచేస్తూంటారు. ఒక్క విషయం మర్చిపోతూంటారు–తన తల్లితండ్రులు కూడా,తమ కున్నంతలో పిల్లలకే పెట్టారు. ఒక్కొక్కప్పుడు అప్పైనా చేసి పిల్లల్ని సుఖపెడతాడు.ఏ తల్లీ తండ్రైనా ఇంతే. ఎప్పుడైనా ఎక్కడైనా ఇది జగమెరిగిన సత్యం. అయినా మైకం కమ్మేసి, తమకేదో తక్కువయ్యిందీ,తమ పిల్లలు అలాగ పెరగకూడదూ,తమని ప్రెండు లా చూసుకోవాలీ ( ఒకటి చెప్పండి, తన తల్లితండ్రులు వీడిని ఫ్రెండు లాగ చూసుకోపోతే వీళ్ళ పెళ్ళి అయేదా!).

ఇంట్లో కొత్త మెంబరు వచ్చినప్పటినుండీ ఇంక హడావిడి మొదలు. ఆ బిడ్డ అడిగితే ‘కొండ మీద కోతి’ అయినా వచ్చేస్తుంది.ఇంట్లో అందరికీ డిసిప్లీన్ నేర్పేస్తారు. పైగా ఇవన్నీ ఆధునిక పధ్ధతుల్లో మరీనూ! అందరూ ఇంగ్లీషులోనే మాట్లాడాలి, ప్రతీ దానికీ థాంక్యూ చెప్పాలి,అందర్నీ అంకులూ, ఆంటీ యే అని పిలవాలి ( చివరకి వాచ్ మెన్,చాకలి కూడా అంకులే). ఏదో మనల్ని మాత్రం మరీ ‘గ్రాండ్ పా’ ‘ గ్రాండ్ మా’ అనకుండా ఏదో ‘తాతయ్యా’ ‘ అమ్మమ్మా/ నానమ్మా’ అని పిలవడానికి పెర్మిషన్ ఇస్తారు. మళ్ళీ వాళ్ళని ‘ మమ్మీ, డాడీ’ అనే పిలవాలి. లేకపోతే ఎంత సిగ్గుచేటూ!పోన్లెండి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని పిలవ్వలసినట్లే పిలుస్తున్నారుగా, ఇంకోళ్ళని ఎలా పిలుస్తే వీళ్ళకెందుకూ? ఇదిగో ఇక్కడే వస్తాయి గొడవలు, అవసరం లేని చోట్ల తల దూర్చడం, అందరిచేతా చివాట్లు తినడం. ఛాన్స్ దొరికింది కదా అని ‘తాత’ గారి భార్య కూడా ‘ఓ రాయి’ వేస్తుంది.నలభయేళ్ళు ఈయనతో మాటలో మాటా, చూపులో చూపూ కలిపిన భార్య కూడా అవతలి పార్టీ లో చేరుతుంది–‘ మీకెందుకూ వాళ్ళకి కావల్సినట్టుగా పెంచుకుంటారు’అంటుంది. ఇక్కడే ‘తాత’ గారికి మొదటి దెబ్బ.….. అప్పుడే ఎక్కడ అయింది.ఇంకా ఉంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: