బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-క్రొత్త పరిచయం


   ఈ వీకెండంతా మా అబ్బాయీ,కోడలూ, మనవరాలితో గడిపి ప్రొద్దుటే మా ‘గూటి’కి చేరాము. మధ్యాహ్నం ‘సుందరకాండ’ సినిమా వస్తూంటే చూస్తూ కూర్చొన్నాను.సాయంత్రం 5 దాకా దానితో కాలక్షేపం అయింది.సరే కంప్యూటర్ దగ్గరకు వద్దామనుకుంటే, అప్పటికే మా ఇంటావిడ అక్కడే సెటిల్ అయి కనిపించింది. ఇప్పుడే కూర్చొన్నాను,అప్పుడే తయారా అంది.ఇదికాదు పధ్ధతీ అని రిలాక్స్ అవుతున్నాను. ఇంతలో ‘మీ ఫ్రెండెవరో ఆన్లైన్ లో హల్లో అంటున్నారూ, చూడండి’ అంది. దొరికిందే చాన్స్ అని వచ్చి చూస్తే ఇందుకూరి శ్రీనివాస రాజు ( తెలుగు బ్లాగర్–‘పడమటి గోదావరి రాగం’ ).అతను పూణే లోనే ఉన్నానని చెప్పాడు.సరే ఎక్కడా అని అడిగితే మేము ఉండే ప్రదేశానికి కొంచెం దూరం లోనే ఉన్నాడని తెలిసి, మేం ఉండే ఏరియా చెప్పి రమ్మన్నాను.

    ఓ పదిహేను నిమిషాల్లో సాయంత్రం 6.15 కి వచ్చాడు.ఏదో ఫార్మల్ పరిచయాలూ అవీ అయిన తరువాత ఇంక ఖబుర్లు మొదలెట్టాము.మర్చిపోయానండోయ్ చెప్పడం, వచ్చేటప్పుడు నా పేవరెట్ బెల్లం మిఠాయి తెచ్చాడు.ఇంతా చేస్తే, శ్రీనివాసరాజు, మా అబ్బాయికంటె ఓ నాలుగు రోజులు మాత్రమే చిన్న ! ఇతనితో ఏం మాట్లాడతాములే అని కొంచెం సంకోచించాను.ముందర ‘మీరూ’ అని ఎడ్రస్ చేసి, ‘నువ్వు’ లోకి దిగిపోయాను. పాపం మొహమ్మాటానికి ‘పరవా లేదండీ’ అన్నాడనుకోండి. ఏదో నా వయస్సు అడ్డంపెట్టుకొని,ఇలా జబర్దస్తీ చేస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు?

   ఎవరైనా కొత్తవాళ్ళు వస్తే నన్ను పట్టుకునే వాడెవరూ? అవతలి వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా ఏదో వాగేస్తూంటాను.మా ఇంటావిడ అనేదేమిటంటే’అస్తమానూ మీరే మాట్లాడుతారూ, అవతలి వాళ్ళకు ఛాన్సెక్కడిస్తారూ’అని.అంటే ‘ప్రతీ రోజూ నువ్వు మాట్లాడేవన్నీ వింటున్నానా లేదా, ఏదో దొరక్క దొరక్క ఛాన్సొస్తే నీకెందుకూ దుగ్ధ ‘ అంటూంటాను ! మా దెబ్బలాట చూసి ఆ వచ్చిన అబ్బాయి హడలిపోతాడేమో అని నా బెంగ.బ్లాగ్గులమీద కొంచెంసేపు మాట్లాడుకున్నాము.తను తెలుగులో మొదట బ్లాగ్గు ప్రారంభించినప్పుడు ఎలా ఉండేదో, తనని సీనియర్ బ్లాగర్లు ఎలా ప్రోత్సహించేవారో అన్నీ చెప్పాడు.నా గొడవేదో నేను చెప్పాను.
అవీ ఇవీ ఖబుర్లు చెప్పుకుంటూంటే మధ్యలో అతని భార్య దగ్గరనుండి ఫోన్ వచ్చింది, దానికి సమాధానంగా ‘ఇదిగో వచ్చేస్తున్నాను పది నిమిషాల్లో’అన్నాడు. ‘ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి వచ్చానండి, అప్పుడే 2 గంటలయింది’ అన్నాడు.
అన్ని ఖబుర్లూ పూర్తి చేసికొని, ఇంక క్రిందికి వచ్చి ఇంకో అరగంట ఖబుర్లు చెప్పుకున్నాము! అంతా కలిపి 3 గంటలు పూర్తయింది ! చెప్పొచ్చేదేమిటంటే, నేను ఒక పూర్వ పరిచయం లేని వ్యక్తిని మూడు గంటల సేపు కూర్చోపెట్టకలిగాను.

   మా ఇంటావిడంటుందీ ‘ పాపం మీరు చెప్పే లెక్చర్ వినలేక ఎంత బాధపడ్డాడో, మొదటిసారే అలా భయ పెట్టేస్తే ఇంకోసారి మళ్ళీ అడుగెట్టడు’అని.
ఈ సారి వచ్చేటప్పుడు తన భార్యని తీసికొస్తానని,చెప్పాడు. చూద్దాం! నాతో ఖబుర్లు నచ్చాయో లేక బోరు కొట్టాయో! నా అనుభవంలో ఉన్న విషయం ఏమంటే, ఎవరైనా సరే, బయటివాళ్ళతో గడపడానికి ఎప్పుడూ ముందే ఉంటారు!ఇంట్లో వాళ్ళకి వీళ్ళ విషయం అంతా ముందే తెలుసుగా! చెప్పిందే చెప్తూ, విన్నదే వింటూ ఎన్నిసార్లు ఓపిక పడతారూ? దేనికైనా ‘ ప్రెష్ నెస్’ అనేది ఉంటేనే అందరికీ బాగుంటుంది.
Thank you Srinivas, for the nice company you gave us. God Bless you& your wife.

9 Responses

  1. > నా పేవరెట్ బెల్లం మిఠాయి తెచ్చాడు
    మొత్తం ఒకేరోజు తిన్నారా? లేక దాచుకుని రోజు కొంచెం కొంచెం తింటున్నారా?

    Like

  2. అంత హింసేం లేదండి… నాకు చాలా మంచి ఫీలింగ్ కలిగింది.. మాకూ చుట్టాలున్నారు ఫూణే లో అని చాలా సంతోషపడ్డాను.. (నిజ్జంగా..!!)

    ఇక బెల్లం మిఠాయి సంగతంటారా… ముందు తీసుకొచ్చేంతవరకూ నాకు అనిపించలేదు… కానీ దారిలో అనుకున్నా స్వీట్సు ఇవ్వటం సబబేనా?, అందులోనూ క్రికెట్ బాల్ అంత గట్టిగా ఉన్న స్వీట్.. (ఒకొక్కసారి.. నేనే నమలలేక తినటం మానేసా… ఇంట్లో ఉన్నంతకాలం ఈ స్వీట్లు తినబుద్దికాదు.., అయిపోయాకా ఉన్నాయా అని అడుగుతాం.. అదేంటో మరి..), కానీ మన గోదావరి స్పెషల్ అనుకుని.. ఆనందిస్తారులే.. అని సర్దిచెప్పుకున్నా.. తరువాత అది మీకు చాలా ఇష్టమైన స్వీట్ అని తెలుసుకుని హమ్మయ్య అనుకున్నా…

    ఏది ఏమైనా… ఈ కొత్తపరిచయం చాలా బాగుంది… 🙂

    ఇక ఫణిగారు గురించి చెప్పాలంటే… ఫొటోలో కనిపించినంత వయసున్న వారిలా నాకనిపించలేదు… చాలా హూషారుగా.. నవ్వుతూ… భలే సరదా అనిపించింది…, ఆయనకు తగ్గవారే.. ఆవిడకూడానూ… ఇలా ఎప్పుడూ నవ్వుతూ ఉండటమే మంచి ఆరోగ్య సూత్రం అంటుంటే విన్నాను.. కానీ ఇప్పుడు చూసాను…

    బోడి సాఫ్వేర్ లోనే మాకు మీకన్నా కొద్దిగా తెలుసేమో.. కానీ ఎన్నో తెలియని విషయాలు మీ నుండి మేం చాలా నేర్చుకోవాలండి… ఇక సిద్ధంగా ఉండండి మరి… మిమ్మల్ని విసిగిస్తా… 😉

    Like

  3. పానీపూరీ,

    చిరకాల దర్శనం! ఎక్కడకి వెళ్ళిపోయావు బాబూ ఇన్నాళ్ళూ? శ్రీనివాసు బెల్లం మిఠాయైతే తెచ్చాడు, కానీ తను వ్యాఖ్యలో వ్రాసినట్టుగా, మరీ క్రికెట్ బాల్ అంత గట్టిగా ఉంది. పళ్ళులేవుగా, తినలేకపోయాను.

    Like

  4. శ్రీనివాసూ,

    సహృదయంతో తెచ్చిన బెల్లం మిఠాయి, నాకు చాలా ఇష్టమైనదే కానీ,మరీ గట్టిగా ఉంది బాబూ.మా గురించి కొంచెం అతిశయోక్తిగా వ్రాశావు.ఇంక నన్ను సిధ్ధంగా ఉండమన్నావు. నేను ఎప్పుడైనా రెడీయే. నీదే ఆలశ్యం !!

    Like

  5. సాక్షి పేపర్ మరో పత్రికకుపోటీ గా పెట్టారు.కాని బానర్లో మాత్రం
    పసుపు రంగు నే వాడుతున్నారు.ఈనాడు అందమైన సీనరీస్ తో
    కాలండర్ వేసారు.చూసారా. ఐనా ఇది కాలెండర్ ల సీజను.
    కబుర్లు బాగున్నాయి.

    Like

  6. ఫణి బాబు గారు:
    మీ టపా పుణ్యమా అని, శ్రీనివాస రాజు గారి బ్లాగు చూసే అవకాశం దొరికింది.
    మీ బ్లాగులో వచ్చిన టపాలు తప్పకుండా చదువుతాను కాని వ్యాఖ్య వ్రాయడానికి బద్ధకం. మొన్నీ మధ్య మీరు గోళ్ళు కొరకడం గురించి వ్రాసింది చూసి నవ్వుకోలేక చచ్చాను. మా రూం మేట్స్ అందరికి చూపించాను కూడా!

    Like

  7. గురువు గారూ,
    మాకు అందమైన సీనరీలు ఉన్న కేలెండర్ ఏదీ కనిపించలేదు. వచ్చిందల్లా తిథి,నక్షత్రాలుండే ‘స్వాతి’ ‘ఈనాడు’, వై.ఎస్.ఆర్ గారి ఫొటోలతో ‘సాక్షి’ కేలెండర్లు మాత్రమే!

    Like

  8. గణేష్,
    శ్రీనివాసు లో మరో ‘కోణం’ కూడా ఉంది. అతను మంచి గేయ రచయిత కూడా. ఈ లింకు చూడండి http://www.weekendcreations.com/telugu_short_film.php?film_id=10 . నా గోళ్ళ గోల నచ్చినందుకు ధన్యవాదాలు.

    Like

  9. ఏం కోణమో ఎంటో.. చెప్పుకోటానికి చాలా కోణాలున్నాయి.., కానీ ఈ సాఫ్ట్వేర్ చట్రంలో పడ్డాకా అన్ని కోణాలు భంద్.. అంతే…

    ఒకొక్కసారి అనిపిస్తుంటుంది.. (ఏ మేనేజరో పెదవి విరచినపుడు.. ).. ఛీ వెధవ జీవితం… వెండితెరపై ఉండాల్సిన వాడిని… ఇక్కడ వీళ్ళతో ఏంటీ.. నస అని… [:D], కానీ ఆ ఫీల్డ్ (సినిమా రంగం) కత్తిమీదసాము లాంటిదే…, చేతిలో ఫైలు పట్టుకుని, ప్రతివాడి కాళ్ళా వేళ్ళా పడి నేనెక్కడ తిరిగేది…?? , సరేలే… బ్రతకడానికి ఏదొకటి చెయ్యాలిగా మరి…!

    చూద్దాం..!! ఎప్పటికైనా రాకపోతుందా… ఆ ఒక్క చాన్స్… [:)]

    ధ్యాంక్స్ గురువుగారు… నా పాటల లింక్ అభిమానంతో ఇక్కడ ఇచ్చినందుకు..

    Like

Leave a comment