బాతాఖానీ–లక్ష్మిఫణి కబుర్లు–పేర్లు


   మా చిన్నప్పుడు ఒక్కొక్క ఇంటిలోనూ కనీసం అయిదారుగురు సంతానం (3+3) లేక (4+2) ముందరిది మొగ పిల్లల సంఖ్యా, రెండోది ఆడ పిల్లల సంఖ్యా.ఎక్కడో రేర్ గా ( 1+5 ) ఉండేవారు.ఇంక వాళ్ళకి పేర్లు పెట్టడం లో ఒక పధ్ధతి ఉండేది. ఇంటికి పెద్ద అబ్బాయికి తాత(తండ్రిగారి తండ్రి) గారి పేరు ఫిక్స్! రెండో వాడికి అమ్మగారివైపు తాతగారి పేరు.ఆమూడో వాడు వాళ్ళు మొక్కుకున్న దేముడి పేరు. అస్సలు రెండు వైపుల తాతలు,మామ్మ,అమ్మమ్మల పేర్లు వంతులవారీగా పెట్టడానికేనేమో ఇంటినిండా అంతమంది పిల్లలు !!   ఈ పేర్లలో వాళ్ళ ఇష్టదైవాలు వీలున్నన్ని ఇరికించేయడం. అన్నీ కలిపి ఈ అబ్బాయి పేరు ఎస్.ఎస్.ఎల్.సీ పుస్తకంలో రెండు లైన్లలో వ్రాయవలసి వచ్చేది!!ఉదాహరణకి … వీరవెంకటసత్యమార్కండేయనరసింహ….ఏదో రావో,శర్మో,వర్మో. ఎవరికి తోచినది వాళ్ళు పిలిచేవారు.కీర్తిశేషులైన భర్త గారి పేరుండడం వలన మామ్మగారు, తన నోటితో ఆ పేరు ఉఛ్ఛరించేవారు కాదు.ఇందులో ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉండేది, ఎవరూ వీడిని ఒక్కమాటన్నా ఊరుకునేది కాదు. మా పెద్దన్నయ్య గారిది మా తాత గారి పేరు అందువలన ఆయనని ‘నాన్నారూ’ అని పిలిచేవారు మానాన్నగారు. రెండో ఆయన పేరు మా ఇంకో తాత గారి పేరు, అందువలన ఆయనని, మా అమ్మమ్మ గారు’చిట్టిపంతులూ’ అనేవారు.

ఇంత పేద్దపేరు పలకలేక ఏదో ముద్దుపేర్లు పెడతారు. చంటి,పంతులూ,అబ్బాయి,… ఇంక వీళ్ళు జీవితాంతం ఆ ముద్దుపేరుతోనే చలామణి అవుతారు. పంతులు మావయ్య, అబ్బాయి మావయ్య అంటూ. ఇంట్లో ఒక్కళ్ళకి పెద్దబ్బాయీ, రెండో వాడికి చిన్నబ్బాయీ, మూడో వాడికి బుల్లబ్బాయీ. మాకు ఓ పోస్ట్ మాస్టారుండే వారు, ఆయనని అందరూ బుల్లబ్బాయి అని పిలిచేవారు. ఆయన పేరేమిటో ఆయనే మరచిపోయుంటారు!!

ఇంక ఆడ పిల్లలకి చిట్టి, బేబీ, పాపాయి,చిన్న చెల్లీ, పెద్ద చెల్లీ –అందరూ ఇలాగే పిలిచేవారు. ఆఖరికి ఆ ‘చిన్నచెల్లి’ అనే ప్రాణిని ఆవిడ భర్త కూడా. మా అమ్మగారిని ‘చిట్టి అమ్మన్న’ అనేవారు.అందరికీ ఆవిడ ‘చిట్టి పిన్ని’ గానే తెలుసు.మా పెద్దమ్మగారొకరు ఉండెవారు, ఆవిడ అందరికీ చిన్నక్కయ్యే. ఏమిటో అసలు చుట్టరికం ఏమిటో తెలిసేది కాదు. మా పిన్ని గారిని’ బంగారం’ అనేవారు.పేరు ఏ రామలక్ష్మో అయితే ‘రామం’ అనేవారు. ఈ రామం అనే వ్యక్తి మొగో, ఆడో బయటవాళ్ళకి ఎవరికీ తెలిసేది కాదు.మాకో వెంకటం పిన్ని ఉండేవారు–ఆవిడపేరు వెంకట లక్ష్మి.సూర్య తో వచ్చేపేరైతే ‘సూరీడు’ గ్రాంట్ అయేది.చంద్రశేఖరం అయితే ‘చంద్రుడు’.

ఉద్యోగం లో చేరినప్పుడు నాకు ఓ మంచి స్నేహితుడు ఉండేవారు, అతని పేరు సక్సేనా,ఆంధ్రేతరులు ఇంటిపేరు అసలు పేరు తరువాత పెట్టుకుంటారని నాకేం తెలుసూ, ఒకసారి వాళ్ళింటికి వెళ్ళి, సక్సేనా ఉన్నారా అంటే, ఇంట్లో ఉన్నవాళ్ళంతా వచ్చేశారు.అయ్యబాబోయ్, మీరుకాదూ, నా ఫ్రెండ్ సక్సేనా కావాలీ అన్నాను. మేం అందరమూ సక్సేనాలమే, నీక్కావలిసిన వాడి పేరేమిటీ అని నన్నేడిపించేశారు. ఇంతట్లో నాక్కావలిసిన సక్సేనా వచ్చి నన్ను రక్షించాడు. అతని పేరు అడిగితే చెప్పాడు -‘సురేంద్ర’ అని.అలాగే మేము వరంగాం లో ఉన్నప్పుడు ‘శ్రీవాత్సవ’ అని ఒకతను ఉండేవాడు, అది ఆయన ‘గోత్రం’ పేరనుకుని, మా చుట్టం ఒకాయన, ‘ మన వాడేనా ‘ అన్నాడు !

ఇప్పటి వాళ్ళకి ఈ గొడవలేమీ లేవు. పిల్లలకి అన్నీ రెండక్షరాలో, మహా అయితే మూడక్షరాలో పేర్లు పెట్టేయడం.ఇంటిపేరుని ఎలాగోలాగ ఉంచేసుకుంటున్నారు. ఛాన్స్ దొరికితే దాన్ని కూడా కుదించడానికి ఏమీ సంకోచించరు.ఈ రోజుల్లో
తాతా లేడూ, అమ్మమ్మా లేదు.అన్నీ ‘ఓ’ పాజిటివ్ లాగ ‘యూనివర్సల్’ పేర్లే
!! హాయిగా ఉంది కదూ!!

   కానీ పీత కష్టాలు పీతవన్నట్లు,వీళ్ళ నాన్నల పేర్ల ధర్మమా అని ఇప్పటి వాళ్ళకీ కష్టాలున్నాయి. పాస్ పోర్ట్ లోనూ, ‘పాన్ కార్డ్’ లోనూ ఈ నాన్నలు అనే ప్రాణి పేరు తప్పని సరి చేశారు మన ప్రభుత్వం వారు.పాస్ పోర్ట్ లో ఆ చేంతాడంత ( నాన్న గారిది) పేరు వ్రాయడానికి కొంతైనా స్థలం ఉంటుంది.పాన్ కార్డ్ లో లిక్కంత చోట్లో ఈ పేరు వ్రాయడానికి నానా హైరాణా పడిపోతారు.కానీ తన తండ్రి పేరులో ఉన్న ఆ అనుబంధం,ఈ నాటి వాళ్ళకి తెలుస్తాయా?

 

 

!

Advertisements

2 Responses

  1. Well said

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: