బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-టెన్షన్లు–1


    మీరు చూసే ఉంటారు,ప్రపంచం లో నూటికి 90 మందికి ఏదో రకమైన ఒత్తిడి ( మన భాష లో ‘టెన్షన్’ అందాము.) తో బాధ పడుతూంటారు. అది ఆర్ధిక సంబంధమైనది కావచ్చు,ఆఫీసులో ఏదో రకమైనది అవొచ్చు. ఈ లోకంలోకి వచ్చిన ప్రతీ ప్ర్రాణికీ ( అప్పుడే పుట్టిన పసి పాప తో సహా) ఈ ఒత్తిడి ఉంటూనే ఉంటుంది.కొంతమంది చెప్పుకుంటారు,కొంతమంది తమలో తమే బాధ పడుతూంటారు. ఇంకో రకం, వాళ్ళ టెన్షన్ ని ఎదురుగుండావాడికి ట్రాన్స్ఫర్ చేసేసి, వాళ్ళు చిదానందంగా ఉంటారు.వాళ్ళ పని అందరిలోకీ హాయి.పడే తిప్పలేవో రెండో వాడే పడతాడు. పసి పాపల టెన్షన్ ఈ కోవలోకే వస్తుంది. ఆ పాపకి వచ్చిన టెన్షన్ తెలిసికోవడానికి మనకి తాతలు దిగి వస్తారు.

ఇంకొంతమందుంటారు, ఊరికే పనీ పాటా లేకుండా, ఊళ్ళోవాళ్ళదగ్గర పోజు పెట్టడానికి, ఈ టెన్షన్ అనేదానిని ఓ ‘హాబీ’లా ఉపయోగిస్తూంటారు. తనేదో సొసైటీ కి ఏదో ఉపకారం చేస్తున్నట్లున్నూ, దానికోసం తను ఎన్ని తిప్పలు పడుతున్నాడో అందరికీ తెలియాలీ అన్నట్లు బిహేవ్ చేస్తూంటారు. ఇలాటివి తనంతట తనే తెచ్చికొన్నవి, ఇంట్లో వాళ్ళ ఆవిడని అడిగితే అసలు నిజం తెలుస్తుంది–‘ ఈయనకేమీ పని లెదండీ, ఊళ్ళోవాళ్ళ గొడవలన్నిటిలోనూ వేలెడతారు,అందుకే లేనిపోని గొడవలు.హాయిగా తిని రామా కృష్ణా అంటూ కూర్చోక రిటైర్ అయిన తరువాత ఎందుకూ ఈ తలనొప్పులూ’ అని అస్సలు సంగతి చెప్పేస్తారు.

ఇంకో రకం వాళ్ళు- ‘ మా రోజుల్లో ఎలా ఉండేదండి, తండ్రి ఎదురుగుండా నుంచునే ధైర్యం ఉండేదా? ఇప్పుడు చూడండి, అస్సలు క్రమశిక్షణే లెదు,వాళ్ళకి తెలియదు, చెప్తే కోపాలు, వీళ్ళూ, వీళ్ళ ఖర్చులూ, అయిపూ అదుపూ లేదు, ఎలా బాగుపడతారో తెలియదు’ అని పిల్లలు ఎదురుగుండా లేనప్పుడు, తమ ఇంటికి వచ్చిన స్నేహితులతో చెప్పుకుని, వాళ్ళని ‘స్ట్రెస్ బస్టర్’ లాగ వాడుకుంటారు.

చదువుకునే రోజుల్లో ఉండే ‘టెన్షన్’ ఇంకోలా ఉంటుంది. పరీక్ష పేపర్లు ఎలా ఉంటాయో అని మొదలెట్టినది, రిజల్ట్ వచ్చేదాకా వాడి మొహంలో కనిపిస్తూంటుంది,ఇది ఎవరికీ, శ్రధ్ధగా చదివి,పరీక్షలు రాసేవాళ్ళకి. నాలాటి వారు ‘ చిదానంద స్వరూపులు’ పరీక్షలు ఎప్పుడైపోతాయా అనే టెన్షన్ తప్పించి, ఏదో ప్రపంచాన్ని ఉధ్ధరించేద్దామన్న కోరికా ఉండేది కాదు,దేనికీ టెన్షనూ పడలేదు.అందుకే వఠ్ఠి డిగ్రీ చేతికొచ్చేసిన తరువాత ఊరిమీద పడ్డాను.

ఇదివరకటి రోజుల్లో అంటే ఇంకా ఈ ప్రెమ వివాహాలూ అవీ ప్రాచుర్యం పొందని రోజుల్లో, గుర్తుందిగా, అందరికీ, పెళ్ళిచూపుల కార్యక్రమం నుండి,కూతురు కాపరం పెట్టేదాకా అన్నీ టెన్షన్ లే.ఇంక అక్కడినుండి, పెళ్ళికొడుకు వాళ్ళకి టెన్షన్ ప్రారంభం అవుతుంది-కొత్త కోడలు ఎలా ఉంటుందో, చెప్పిన మాట వింటుందో లేదో,వేరింటి కాపరం పెడదామంటుందో, ఆడపడుచుని ఇంటికి రానిస్తుందో లెదో లాటివి. పెళ్ళిచూపుల టైములో అయితే, పెళ్ళికూతురి తండ్రికి టెన్షన్ ఉంటుందని తెలుసు, కానీ కొన్ని కొన్ని కేసుల్లో, పెళ్ళికొడుకు కి కూడా టెన్షన్ ఉంటుందండోయ్,ఉదాహరణకి నేను, అమలాపురం లో చూసి,అన్నవరంలో తాళి కట్టేదాకా అసలు నన్ను ఒప్పుకుంటుందో లేదో అనే టెన్షనే.దానికి సాయం,మేము పెళ్ళికి కాకినాడ మీదుగా బయలుదేరినప్పుడు, ఎక్కడో ఒక సందర్భంలో మా నాన్నగారు, రిక్షావాళ్ళతో దెబ్బలాట పెట్టుకున్నారు, ఎదో మాట తేడా వచ్చింది, ఎలాగో లాగ
అవన్నీ సెటిల్ చేసికుని, ఓ వ్యాన్ మాట్లాడుకుని వెళ్తూంటే, ఆరోజు కాకినాడలో ట్రాఫిక్ బందూ, మా గాడీని వదలమని గొడవా.ఎలాగోలాగ, ఆ హర్డిల్ దాటుకుని, అన్నవరం చేరిన తరువాత, అప్పటికింకా ఆడపెళ్ళివారు తణుకు నుండి రాలేదన్నారు.ఎవరినైనా అడగాలంటే సిగ్గూ,నా టెన్షన్ ఎవరికి చెప్పుకోనూ? ఓ చెవి మా వాళ్ళందరూ మాట్లాడుకొనేదానిమీద వేసుంచాను.ఇంతలో
తణుకు బస్సు వచ్చిందన్నారు. మెల్లిగా అందరూ దిగుతున్నారండి, ఇంతట్లో ఎవరో అరుస్తున్నారు-‘వెధవా ఫణీ అలా పారిపోకురా’ అని. అది నా చెవిన పడి వీళ్ళిళ్ళు బంగారంగానూ, పెళ్ళవకుండానే ఇలా తిడుతున్నారూ అనుకొని, పోన్లే ఎడ్జుస్ట్ అయిపోదామనుకున్నాను. ఆ తరువాత తెలిసింది ‘ఆ వెధవా ఫణీ ‘ అని పిలువబడిన ప్రాణి, నేను కాదనిన్నూ, నాకు స్నాతకం టైములో గెడ్డం క్రింద బెల్లంముక్క కొట్టబోయే నా ‘బావ మరిదీనూ’అని.ఇంక కొండమీద కి వచ్చిన తరువాత, ఎవరో చెప్పారు, దేవస్థానం ఆఫీసులోకి వెళ్ళి సంతకాలు పెట్టాలని, అదేదో తొందరగా చేసేస్తే గొడవ ఉండదుగా, ఇంక నచ్చినా నచ్చకపోయినా నాతోనే ఉంటుందీ అని, అప్పటిదాకా పడ్డ టెన్షన్ లోంచి బయట పడ్డాను.

ఇవాళ్టికివండి, మళ్ళి తరువాతి టపాలో ఇంకొన్ని కామన్ టెన్షన్ల గురించి…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: