బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–బూంద్ బూంద్ సే !!


    ఈ మధ్యన బంగారం రేటు కొండెక్కేసింది.నాకు బాగా గుర్తు-నేను ఉద్యోగంలో చేరినప్పుడు అంటే 1963 లో 10 గ్రాముల బంగారం 80/- రూపాయలకి వచ్చేది.నా జీతంతో పాటే దాని ఖరీదుకూడా పెరుగుతూ వచ్చింది. 80/- రూపాయలున్నప్పుడు నా జీతం 200/- మాత్రమే. పైగా ఆరోజుల్లో స్మగ్లింగ్ చేసి తెచ్చేవారు, దానిఖరీదు కొంచెం తక్కువ ఉండేది.తెలిసున్నవాళ్ళకి తప్ప ఇతరులకి అమ్మేవారు కాదు.కాలక్రమేణా బంగారం ఖరీదూ, నా జితమూ ఒకేలా ఉండేవి.అదేదో తక్కువ ఉంటే కొనేవాడిననికాదు.ఊరికే పరిస్థితి చెప్పానంతే !!

    అయినా అప్పటికి మనకి మంచి ఆలోచనలు ఎందుకు వస్తాయీ?స్వతంత్రం (నాకు !!) వచ్చిన కొత్తరోజులూ, అడిగేవాళ్ళెవరూ లేరు. మన ఇష్టం వచ్చినట్లుండేవాడిని.చేతిలో డబ్బులుంటే, ఏ సినిమాకి వెళ్దామా అనేకానీ ఇంకో ఆలోచన వచ్చేది కాదు. పైగా ఇంకో నమ్మకం–ఈ బంగారం వ్యవహారాలన్నీ ఇంట్లో వాళ్ళే చూసుకుంటారని( అంటే తల్లితండ్రులన్నమాట!). పెళ్ళి అయే సూచనలేమీ ఉండేవికావు. ఎవడికోసం ఈ బంగారం అవీనూ అని ఇంకో ఆలోచనా!! ఇలాటి అప్రయోజక ఆలోచనలకేమీ లోటు లేదు.ఎప్పుడైనా అమలాపురం వెళ్తే అందరికీ అదో పేద్ద ఇంప్రెషనూ, చిన్న వయస్సులోనే అంత మంచి జీతంతో ఉద్యోగం సంపాదించాడూ, ఒక్కడే ఉంటున్నాడూ, ఇంటికి ఏమీ పంపఖ్ఖర్లేదూ ఎంతో కొంత వెనకేసేఉంటాడూ అని !!నాకొచ్చే 400/- రూపాయలూ ఆరోజుల్లో మంచిజీతంక్రిందే లెఖ్ఖండి !! ఒక్కొక్కప్పుడు ఇవన్నీ విని ‘గిల్టీ’ గా ఫీల్ అయేవాడిని.మా నాన్నగారికి ఎంతో కొంత పంపించిఉంటే ఆయనేం తినేస్తారా? వీడు ఎలాగా పంపడు అని ఆయనకి తెలుసు.నేను ఉద్యోగంలో చేరేటప్పుడు,నా మొదటి జీతం చేతికి వచ్చేలోపల, మా అన్నయ్య లిద్దరూ తలో వెయ్యి రూపాయలూ ఇచ్చి పంపారు.ఇంక మా నాన్నగారికి, ఓ వంక దొరికింది-‘మీ అన్నయ్యల దగ్గర పుచ్చుకొన్న డబ్బు వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి రా ‘ అని ఓ ఉత్తరం వ్రాసి, నా దగ్గరనుండి ఆడబ్బు ఎలాగోలాగ తీసికున్నారు. ఓ విషయం చెప్పనా-అలా నాదగ్గరనుండి తీసికున్న డబ్బుని ఫిక్సెడ్ లో వేసి, ఆడబ్బుతోనే నా పెళ్ళికి కావలిసిన బంగారం కొన్నారు !

    నాకు వయస్సులో పెద్ద అయిన ఓ స్నేహితుడు ఒకరుండేవారు.నన్ను ఎప్పుడు కష్టాల్లో ఉన్నా ‘బెయిల్ ఔట్ ‘ చేసింది ఆయనే. పెళ్ళి అయినతరువాత కూడా, ఆయనే దిక్కు.వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఒకసారి ఆయన చెప్పారు.వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలూ,ఒక అబ్బాయీ.-ఆవిడకూడా టీచర్ గా పనిచేసేవారు. ఆయన నాకు ఓ అమూల్యమైన సలహా ఇచ్చారు.-వాళ్ళకి మొదటి కూతురు పుట్టినప్పటినుండీ, ప్రతీ నెలా ఓ గ్రామో,అరగ్రామో బంగారం కొనడమూ, దానిని ఓ కాగితంలో పొట్లంకట్టేసి, దానిమీద కొన్న తారీఖూ, రేటూ వ్రాసేసి కప్ బోర్డ్ లో పెట్టేయడం, దానిగురించి మర్చిపోవడం. ఇలా ఆ దంపతులు,ఇద్దరు పిల్లలి పేరనా ప్రతీ నెలా బంగారం కొనేవారు.అలా పోగెట్టిన బంగారం తోనే, వాళ్ళ పెళ్ళిళ్ళు చేశారు. మనవాళ్ళు, ఆంధ్రా వాళ్ళైనా,ఇంకో ప్రదేశం వాళ్ళైనా అమ్మాయి పెళ్ళిలో బంగారం తప్పకుండా పెడతాముకదా ( మన పిల్లకే కదండీ).ప్రతీ నెలా ఓ గ్రాము బంగారం కొనడం ఓ పేద్ద ఘనకార్యం కాదు. మనం చేసే పిచ్చి ఖర్చుల్లో ఇదెంతా? కానీ దాని ఉపయోగం ఏమిటో కూతురి పెళ్ళి చేసినప్పుడు తెలుస్తుంది.
మేము కూడా ఇలాగే చేశాము. మా డాక్టర్ ఫ్రెండు గారికి ఈ సంగతి చెప్తే వాళ్ళూ మొదలెట్టారు.మా అమ్మాయి పెళ్ళిలో బంగారం పెట్టవలసివచ్చినప్పుడు,ఇది ఎంత ఉపయోగించిందో చెప్పలేము.మా మనవరాలు ( అబ్బాయి కూతురు) పుట్టినప్పుడు వాళ్ళకి సలహా ఇస్తే ముందర కొంచెం వెనుకాడేరు కానీ,ఆ తరువాత దానిలో ఉన్న సుఖం ఏమిటో తెలిసి, మా కోడలు వాళ్ళు కొన్నదానిగురించి చెప్పినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో!

    ఇప్పుటి జనరేషన్ వాళ్ళకి ఇదంతా చాదస్థంగా కనిపించవచ్చు. చదువుతున్నాము కదా అని ఈయన ఊరికే ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నాడూ,బంగారం కొనాలంటే పేద్ద లేఖ్ఖేమీ కాదు,పిల్ల పెళ్ళి అవడానికి ఇంకా పాతికేళ్ళుంది, ఇప్పటినుండీ ఇవన్నీ ఎందుకూ అనవసరం అని. ప్రస్తుత రేట్ల ప్రకారం గ్రాము బంగారం ఎంతవుతుందీ–1700/- రూపాయలు మాత్రమే. ఆ ఎమౌంట్, మీరు,కుటుంబంతో హొటల్ కి వెళ్ళి ప్రతీ వారం తినేటంత కూడా ఉండదు. ఓ వారం వెళ్ళలేదనుకోండి ఏం అవుతుంది.? మీ లక్షరీస్ మానుకోమని చెప్పడం లేదు.. మనకి నచ్చినా, నచ్చకపోయినా అమ్మాయికి పెళ్ళి చేసినప్పుడు ఏ యుగంలోనైనా స్త్రీ ధనం క్రింద బంగారం ఇవ్వాల్సిందే. ఆ ఇచ్చేదేదో మనకి సౌకర్యంగా ఉండే పధ్ధతిలో చేస్తే ఎంత హాయిగా ఉంటుందీ?

    ఇన్ఫ్లెషన్ అయినా ఇంకో ‘ఫ్లేషన్’ అయినా బంగారం బంగారమే. పైగా ఇలా పిల్ల పేరుమీద కొంటే దానిమీద చెయ్యి వేయము !! అదో సెంటిమెంటూ.ఒక్క ఏడాది చేసి చూడండి, జస్ట్ సరదాగా !!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: