చిన్నతనం లో అయితే జ్ఞాపకశక్తి బాగానే ఉంటుంది.కానీ వయస్సు పెరిగేకొద్దీ కొంచెం కష్టాల్లో పడిపోతూంటాము.అదీ ఏ సరుకు ఎక్కడ పెట్టామో,ఏ కాగితం ఎక్కడ జాగ్రత్తగా పెట్టేమో,సమయానికి ఛస్తే గుర్తుకు రాదు.సరుకులైతే ఫర్వా లేదు, కనిపించకపోతే బజారులోకి వెళ్ళి కొనుక్కునేనా రావచ్చు. కాగితాల సంగతి అలా కాదే.
బస్సు టిక్కెట్ల దగ్గరనుంచీ నేను అన్నిటినీ ఓ కారీబాగ్ లో పడేసి ఉంచుతూంటాను.నెలకో, రెండునెలలకో ఇంటావిడ చేత చివాట్లు తిన్న తరువాత, అవన్నీ ముందేసుకొని, పోస్ట్ మాన్ లా సార్టింగ్ చేసి, అందులో మళ్ళీ కొన్ని వడబోసి,
ఇంకో బాగ్ లో దాచడం.రిటైర్ అయాను కాబట్టి కావలిసినంత టైము, కాలక్షేపానికి,ఈ వ్యాపకం బాగానే ఉంది.ఇందులో<b< కొన్ని పరీక్షల ముందు మార్క్ చేసుకుంటామే ప్రశ్నలు,వె.ఇంప్, వె.వె.ఇంప్ లాగ,కొన్నింటిని కప్బోర్డ్ లో దాచడం.వాటిని సార్ట్ చేయడానికి ఇంకో రోజు.
మా ఇంటావిడ నేను రిటైర్ అయినప్పటినుండీ మొత్తుకుంటోంది(5 సంవత్సరాలనుండి), నా పెన్షన్ పేపర్లు, బాంక్ కాగితాలూ అన్నీ ఒకచోట గుర్తుగా పెట్టండీ అని.ఇదిగో అదిగో అని ఏమైతేనేం ఈ మధ్యన రాజమండ్రీ నుండి మకాం ఇక్కడికి మార్చిన తరువాత పూర్తి చేశాను.ఇవన్నీ ఒక ఎత్తూ,ఎప్పుడైనా అవసరం వస్తాయని తీయించుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు ఓ ఎత్తూ.ఎక్కడో భద్రంగా దాచేమని అనుకుంటాము,అబ్బే సమయానికి కనిపించవు. మళ్ళీ ఏదో ఫోటోఫాస్ట్ కో వెళ్ళి,
ఇంకో డజను ఫొటోలు తీయించుకోవడం.
ఈ డిజిటల్ కెమేరాలూ,హాట్షాట్లూ రాని ముందర, కొడాక్ డబ్బా కెమేరా తో తీసిన బ్లాక్ ఎండ్ వైట్ ఫొటోలు చాలానే ఉంటాయి,వీటినన్నీంటినీ ఆల్బంలో అంటించడానికి గత 30 ఏళ్ళుగా ప్రయత్నం చేస్తున్నాను, ఈవేళా ,రేపూ అంటూ, వాయిదా వేస్తూ, అన్నీ కలిపి ఓ కవరులో జాగ్రత్త చేశాను. ఆ కవరులో ఉండి ఉండి,వాటి షేప్ కూడా మారిపోయింది. ఎప్పుడో జ్ఞాపకం వచ్చినప్పుడు అవన్నీ మళ్ళీ చూసి ఆనందించడం!
పూణె లో వచ్చే ప్రతీ తెలుగు పుస్తకమూ కొంటానని చెప్పానుగా, వాటిలో నాకు నచ్చినవి అన్నీ కట్ చేసి దాచడం ఓ అలవాటు.ఈ మధ్యన చాలా పుస్తకాలు నెట్ లో వస్తున్నాయి కాబట్టి, కొన్ని కొనడం మానేశాను.దేముడి పుస్తకాలైతే,
మా ఇంటావిడ జాగ్రత్త చేస్తుంది.ఏమిటో ఈ తాపత్రయం అనిపిస్తుంది.ఎలాగూ మనం వెళ్ళిపోయిన తరువాత, పిల్లలు వీటన్నింటినీ రద్దీ వాడికిచ్చేస్తారు.ఉన్నన్నాళ్ళూ చూసుకొని ఆనందించడం.తెలుగు పుస్తకాలు నేనైతే, ఇంగ్లీష్ వి,మా అబ్బాయి
దాస్తాడు !!వాడు పుట్టినప్పడినుంచీ నేను కొన్న స్పోర్ట్ స్టార్ ల మిద ఎవరినీ చెయ్యి వేయనీయడు. తండ్రీ కొడుకులు ఇలా ఉంటే, ఇంట్లో చెత్త పేరుకోకుండా ఎలా ఉంటుంది ?
నేను 1963 నుండి 1975 దాకా కొని సేకరించిన గ్రామఫోన్ ఎల్.పీ లూ,ఈ.పీ లు,78 ఆర్.పి.ఎం లూ, వాటి శకం పూర్తయిన తరువాత కెసెట్లూ,ఇప్పుడు సీ.డీ లూ.ఇంట్లో చాలా భాగం వీటితోనే నిండిపోయింది, ఇవికాకుండా మా అబ్బాయికి పుస్తకాలు కొనడం ఓ వ్యసనం( హెరిడిటరీ!!).ఇన్నింటిలో మనకి కావలిసిన వస్తువు/పేపర్ దొరకాలంటే ఎలా వీలౌతుంది? ఇందులో ఎవరికి వాళ్ళవే ముఖ్యం.
ఇంకోటండోయ్, గత 10 సంవత్సరాలుగా నేను ఇంట్లోకి కావలిసిన ఎలెక్ట్రానిక్ వస్తువులన్నీకొనెసి ఉంచాను.వాటి రసీదులూ, వారెంటీ కార్డులూ ఇవన్నీ ఎక్కడో జాగ్రత్తగానే పెట్టాననుకుంటూంటాను. అవసరం అయినప్పుడు ఒక్కటీ కనిపించదు.
మా ఇంట్లో ఉన్న వార్డ్రోబ్ లో మా ఇంటావిడ నాకు ఒక్కటంటే ఒకటే అర అలాట్ చేసింది. పోనీ దానిలో నా బట్టలు పెట్టుకుందామా అంటే, మళ్ళీ అందులోనే,కొంచెం ‘హడప్’ చేస్తూంటుంది. ఏమైనా అంటే, మీకు,మీ బట్టలకీ ఈ మాత్రం జాగా ఎక్కువే అంటుంది ! వీటిలో నాచేత బలవంతంగా కొనిపించి,ధరింపచేసిన డ్రెస్సులూ(మా అబ్బాయి ఎంగేజ్మెంట్, వివాహం సందర్భంలో).అవి ఎప్పుడైనా వేసికుందామా అంటే, ఒక్కదానికీ బటన్ ఉండదు.అవన్నీ ఎక్కడో జాగ్రత్త చేసి ఉండే ఉంటాను!
ఇదిలా ఉండగా, ఇంట్లో అన్నిటికంటే ఎక్కువ జాగా ఆక్రమించేవి పాదరక్షలు.ఒక్కోళ్ళకి నాలుగేసి చెప్పులూ,నాలుగేసి షూస్సూ.నేను వీలైనంతవరకూ చెప్పులు వేసికుంటాను. ఎవరైనా ( ఇంకెవరు, మా ఇంటావిడ) బలవంతం చేస్తే షూస్ వేసికుందామనుకుంటే వాటికి సాక్స్ దొరకవు.దొరికినా వాటికి ఎక్కడో చిల్లుంటుంది.
మహాత్ములు జ్ఞానం అన్వేషీంచేవారుట. మనమూ అలాగే జీవితమంతా ఏదో ఒకటి అన్వేషిస్తూనే ఉంటాము. ఎవరి కష్టాలు వాళ్ళవీ !!
Filed under: Uncategorized |
బీరువాలో ఒక్క అరనే నాకూ మా ఆవిడ కేటాయించింది. సాక్సుకి చిల్లులు అనేది నాకు నిత్యమూ ఉండే తలపోటే. ఎప్పుడూ బూట్లే వేస్తుంటాను చక్కెఱ వ్యాధి గ్రస్థుడిని కాబట్టి. చిల్లులున్నాయంటే మీ జీతమంతా మీ సాక్సుకే సరిపోవటం లేదని దెప్పటం ఒకటి ! ఏం చేస్తాం ? సర్దుకు పోవటమే !
LikeLike
చొక్కాలకి బొత్తాల సమస్యకూడా చాలా ఇబ్బంది పెట్టేదే . నాలుగైదు సార్లు గొణగ్గా గొణగ్గా అప్పటికి ఓరోజు వాటికి మోక్షం దొరుకుతుంది .
LikeLike
చాల బాగుందండి. ఇక్కడ స్థితి డిట్టొ
LikeLike
నరసింహరావు గారూ,kvrn,
కొంచెంతేడాగా అందరివీ ఇవేనండి బాబూ కష్టాలు.
LikeLike
ఏమిటండి మీ కష్టాలు,మా ఆయన కూడా ఇలాగే చేస్తుంటాడు.ఎక్కడో జాగ్రత్తగా పెడతారు.మర్ఛిపొతారు.నాకు చాలా కొపం వస్తుంది.ఇంతకు ముందు ఏదన్నా కనపడకపొతే నన్ను కూడా వెతకమనేవారు.నేను రెండు సార్లు బాగా క్లాస్ పీకే సరికి,ఇప్పుడు ఎదన్నా కనపడకపొతే నాకు డౌట్ రాకుండా వెదకడానికి ప్రయత్నం చేస్తాడు పాపం.కాని దొరకదు.ఇంక చివరగా వచ్చి ఒక స్మైల్ ఇచ్చి అది ఎక్కడో పెట్టెసాను కనిపించడం లేదు అని చావు కబురు చల్లగా చెబుతాడు.తర్వాత నెను వెదకాల్సిందే
మళ్ళి దొరికాక నాకు గుర్తుంది ఇది ఇక్కడే పెట్టాను అని డైలాగ్ ఒకటి.
LikeLike
పండు,
మీరు చెప్పిన పరిస్థితి నాకు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. అలవాటు పడిపోయి దాని గురింఛి వ్రాయడం మరచిపోయాను.
LikeLike