బాతాఖానీ-లక్ష్మిఫణి ఖబుర్లు-పెళ్ళిళ్ళల్లో సంగీత కచేరీలు


    ఆంధ్రదేశం లో సినిమా సంగీతానికి ఉన్న ప్రోత్సాహం, కర్నాటక/శాస్త్రీయ సంగీతానికి ఉన్నట్లుగా కనిపించదు.మనకి ఉన్న సంగీత విద్వాంసులకి ,పొరుగు రాష్ట్రాలలోనే ఎక్కువ సత్కారాలు జరుగుతూంటాయి. జాతీయ పురస్కారాలు వచ్చినప్పుడు మాత్రం,”మనవాడికొచ్చేసిందోచ్” అంటూ దండొరా వేసుకుంటూంటాము.

   దీనికి కారణం ఏమిటో తెలియదు.మనవారిని గుర్తించడం మనకి నామోషీయా? అందుకే కాబోలు, మన కళాకారులు కూడా అలవాటు పడిపోయారు–బయటకు వెళ్ళి తమ కళని ప్రదర్శించుకోవడానికి.అలాగని మన ఆంధ్ర దేశం లో సంగీత కచేరీలు జరగడంలేదని కాదు. వాటి శాతం ఎంత? ఈమధ్యన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ధర్మమా అని అన్నమాచార్య ‘లక్షగళార్చన’ ఆస్వాదించకలిగాము.అదొక అద్భుతమైన ప్రదర్శన, అందుకే ‘గిన్నెస్ రికార్డ్’లలో స్థానం సంపాదించకలిగింది.

   నాకు బాగా గుర్తు-పూణే లోనూ, బొం(ముం)బాయి లోనూ ఎప్పుడైనా వైణిక విద్వాంసుడు శ్రీ చిట్టిబాబు గారు, ఏదైనా ఆడిటోరియం లో కచేరీ చేసినప్పుడు, ముందుగానే ప్రకటించేవారు, ఆయన కచేరీ చేస్తున్నంతసేపూ,ప్రక్కవాయిద్యాలవాళ్ళు, తన్యావర్తనం చేసినప్పుడూ ప్రేక్షకులు ఎవరూ బయటకు వెళ్ళడానికి వీలులేదనీ,తనే స్వయంగా ఓ పావుగంట ఇంటర్వెల్ ఇస్తాననీ.ఆయనకు తెలుసు, సామాన్యంగా ప్రేక్షకులు,తన్యావర్తనం సమయంలో
కాఫీలూ,టీలూ త్రాగడానికి,కుర్చీలు జరుపుకుంటూ బయటకు వెళ్ళిపోతూంటారు
( శంకరాభరణం లో గుర్తుందా!).అలాటప్పుడు వాయించే కళాకారులకి ఎంత నిరుత్సాహంగా ఉంటుందో?
అలాగే,మనవైపు శ్రీరామనవమి ఉత్సవాల్లో ఎవరో ఒక కర్ణాటక సంగీత కళాకారుడిని ఆహ్వానిస్తూంటారు.ఒకసారి కొన్ని సంవత్సరాలక్రింద తణుకు లో శ్రీ ఎం.ఎస్. బాలసుబ్రహ్మణ్య శర్మ గారి కచేరీ పెట్టారు, మొత్తం అంతా కలిపి పదిహేను మంది ( అందులో ఆరుగురు కళాకారులే) ఉన్నారు.ప్రోత్సాహం లెనిచోట్ల ఈ కళాకారులు కచేరీలు చేయడానికి ఎందుకు ఒప్పుకుంటారో? ఆ మర్నాడు ‘భోగం మేళం’ పెట్టారు, దానికి మాత్రం ‘పందిరి ఫుల్’ !

   ఇంక కొంతమంది తమ తాహతుని బట్టి పెళ్ళి రిసెప్షన్లలో సంగీత కచేరీలు పెడుతూంటారు. శ్రోతలు ఆ కచేరీలు ఆస్వాదించాలంటే,విడిగా ఒక వేదిక ఏర్పాటు చేయాలి.అంతేకానీ ఓ వైపు భోజనాలూ, ఇంకోవైపు కచేరీలూ కాదు.తణుకులోనే
ఒకసారి ఎవరిదో పెళ్ళి సందర్భంగా,శ్రీ ఈమని శంకరశాస్త్రిగారి వీణా వాదనం వినే అదృష్టం కలిగింది. ఆపెళ్ళి ఎవరిదో తెలియదు,అయినా రోడ్డుమీద నుంచొని కచేరీ వింటూంటే, ఎవరో లోపలికి పిలిచి,’శుభ్రంగా లోపల కూర్చొనే వినండి’అన్నారు.లోపలకి వెళ్ళి చూస్తే, అక్కడ ఈ రోజుల్లోలాగ చేతుల్లో డిన్నర్ ప్లేట్లూ, కాఫీ కప్పులూ లేవు.శ్రోతలందరూ శ్రధ్ధగా వింటూ,ఆనందిస్తున్నారు.

    గడిచిన సంవత్సరంలో, రాజమండ్రీ లో మా అపార్ట్మెంట్ పక్కనే జరిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాలూ,అలాగే హిందూసమాజం వారు ఏర్పాటు చేసిన శ్రీరామనవమి సందర్భంగా సంగీత కచేరీలూ.అక్కడకు వచ్చిన ప్రేక్షకులు కూడా ఎంతో ఉత్సాహంగా, కళాకారులని ప్రోత్సాహ పరిచారు.అలాగే,ఓ పెళ్ళిలో ఒకాయన ఘంటసాల గారి పాటల కచేరీ చేశారు,పాపం ఆయన దారిన ఆయన పాడుతూనే ఉన్నారు,మిగిలినవాళ్ళు వాళ్ళ గొడవలో ఉన్నారు.అలాగే మొన్న భాగ్యనగరంలో
నేను వెళ్ళిన ఒక పెళ్ళిలో ఒకాయన తన బృందంతో వేణుగాన కచేరీ చేశారు.పక్కనే ఒకవైపు డిన్నర్ జరుగుతోంది, ఇంకోవైపు పిల్లల సందడీ,ఇది ఇలా ఉండగా, వాళ్ళు కచేరీ చేస్తున్న స్టేజ్ మీదే కొందరు పెద్దవాళ్ళూ, పిల్లలకి భోజనాలు పెట్టడమూ, ఎవరిదారిన వాళ్ళు పేద్ద గొంతుకలతో ఊళ్ళో ఖబుర్లన్నీ చర్చించుకోవడమూ, చూస్తే చాలా బాధనిపించింది.వేణువాయిద్య కచేరీ మాత్రం, నేను స్టేజ్ పక్కనే కూర్చొని,వినకలిగాను.అద్భుతంగా ఉంది.

    నేను చెప్పొచ్చేదేమిటంటే, ఎవరికైనా పెళ్ళిళ్ళ సందర్భాల్లో ఏ సంగీత కచేరీయేనా పెట్టదలుచుకుంటే, డిన్నర్ జరుగుతున్న హాల్ లో మాత్రం అరేంజ్ చేయకండి.కళాకారుణ్ణి అవమాన పరచకండి.వీలుందా విడిగా ఏ గొడవా లేనిచోట పెట్టండి, లేదా,వదిలేయండి.అంతేకానీ,మన స్టేటస్ చూపించుకోవడానికి ఇంకోరి మనస్సు నొప్పించకండి.

Advertisements

4 Responses

 1. పది పదిహేనేళ్ళ క్రితం వరకూ తమిళనాట, ఒకమోస్తరు డబ్బున్నవారైతే ఇంటో అమ్మాయి పెళ్ళయితే సంగీత కచేరీ లేకుండా జరిఘేది కాదు. తెలుగిళ్ళల్లో ఈ సాంప్రదాయం చూసిన గుర్తు నాకైతే లేదు.
  ఏదేమైనా, పెళ్ళిహడావుడిలో ఈ సంగీత కచేరీలు ఎవరికీ సుఖం కాదు.

  Like

 2. సంగీతమంటె టి వి లో పిల్లలు పాడే పాటలు కుప్పిగంతులు అదె సంగీతం అనుకుని ఆనందించడం నేర్చుకున్న జనానికి నిజమైన సంగీతం రుచి ఏం తెలుసు చెప్పండి. నా బ్లాగు చదివి రిప్లై చేసినందుకు ధన్యవాదాలు

  Like

 3. కొత్తపాళీ,

  ఈ రోజుల్లో స్థితిమంతులైన కుటుంబాల్లో సంగీత కచేరీలు ఒక భాగం అయిపోయింది.మీరు ఆంధ్ర దేశం లో ఈ మధ్యన పెళ్ళిళ్ళు చూసినట్లుగా లేదు.

  Like

 4. భారతీ,
  సంగీతం విలువే తెలియనక్కరలేదు,’అప్ప్రీసిఏటివ్ ఇయర్’ ఉన్నా చాలు.ఇంక నీ బ్లాగ్గుల విషయానికొస్తే, ఏమీ తెలియదంటూనే, తెలుగులో బ్రహ్మాండంగా టైపు చేసి,అమోఘంగా వ్రాస్తున్నావు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: