బాతాఖానీ-లక్ష్మిఫణి ఖబుర్లు–ప్రసార మాధ్యాలు(పత్రికలు)


    మన బ్లాగర్లలో చాలా మంది ఆంగ్ల పత్రికలు చదివే వారుంటారు. ప్రత్యేకంగా సినిమా పత్రికలు– ఫిలింఫేర్, స్టార్ డస్ట్ లాటివి. ఒక విషయం గమనించారా? వీటిలో దక్షిణ భారత సినిమా గురించి ఒక్క విషయమూ ఉండదు. ఫిలింఫేర్ అయితే కొంచెం పర్వాలెదు,దక్షిణభారత సినిమాలకి ఏవో అవార్డులూ అవీ ఇస్తూ ఉంటారు. ఏడాదికి ఒక సారైనా కొంచెం ప్రస్తావిస్తూంటారు. స్టార్ డస్ట్ వాళ్ళైతే అస్సలు హిందీ తప్ప ఏ భాష లోనూ సినిమాలు తీస్తారన్న సంగతి తెలియనట్లుగా ఉంటారు. తెలుగు, తమిళ భాషల గురించే ఇలాగ ఉంటే ఇంక దేశంలోని మిగతా భాషలలో తీసే సినిమాల గురించి ఏం చెప్పమంటారు?

ఇండియన్ ఎక్స్ ప్రెస్స్ గ్రూప్ ద్వారా ప్రచురించే “స్క్రీన్” మళ్ళీ అలాగ కాదు. దక్షిణ భాషా చిత్రాలగురించి పూర్తిగా ఒక పేజీ లో వ్రాస్తారు. వీళ్ళ సంగతి ఇలాగ ఉంటే మన వార పత్రికలు మాత్రం, ఇంకేమీ లేనట్లు హిందీ వాళ్ళ గురించే వ్రాస్తారు. “ఆంధ్ర భూమి” వారపత్రిక అయితే, పేజీకి ఎవరో ఒక హిందీ తారామణి గురించి వ్రాస్తేనే కానీ వాళ్ళకి నిద్ర పట్టదు.మనవాళ్ళు వ్రాయకూడదని కాదు,ఆ రాసేదేదో తెలుగువాళ్ళ గురించే వ్రాయవచ్చుకదా.అయినా “పొరిగింటి పుల్లకూర రుచి” అన్నట్లుగా తెలుగు అభినేత్రి ల గురించి బహు తక్కువగా ఉంటుంది.

ఇంక ఇంగ్లీష్ వార పత్రికలు తీసికుంటే, ఇండియా టుడే, వీక్, ఔట్ లుక్–వీళ్ళు కొంచెం ఫర్వాలేదు. మన రాజకీయ నాయకుల ధర్మమా అని ప్రతీ వారం ఎవరో ఒకరి గురించి వార్త వస్తూంటుంది. ఇండియా టుడే అయితే తెలుగులో కూడా ప్రచురిస్తున్నారు. వీక్ కేరళ నుండి వస్తుంది కాబట్టి దక్షిణభారతదేశానికి సంబంధించిన వార్తలు బాగానే వస్తూంటాయి.ఇంక వీళ్ళ సంగతి తీసికుంటే రెండు మూడు నెలలకోసారి ఏదో “సర్వే” పేరుతో అందరూ ఒకే విషయాన్నిగురించి వ్రాస్తారు. బెస్ట్ బిజినెస్ స్కూల్స్, బెస్ట్ కాలేజెస్,వెల్నోన్ ఇండియన్స్ అంటూ.పత్రిక సేల్స్ పడిపోతున్నాయని అనుమానం వస్తే ఇంక “సెక్స్ సర్వే” లోకి వెళ్తారు. ఆ సెక్స్ సర్వేలు ఎవరికి ఉపయోగిస్తాయో భగవంతుడికే తెలియాలి. అవి చదువుతున్నప్పుడు ఒక్కోసారి నవ్వువస్తుంది. అసలు వీళ్ళు ఎవరినైనా నిజంగా ఇంటర్వ్యూ చేస్తారా, లేక యాజమాన్యాల ఊహాగానాలా?

సెక్స్ విషయానికొస్తే, “స్వాతి” లాటి విజయవంతమైన వారపత్రికలో ఈ విషయాన్ని గురించి రెండు పేజీల నస అవసరమా?వీళ్ళని చూసి ఈమధ్యన ” నవ్య” లోకూడా ఒక సెక్స్ పేజీ మొదలెట్టారు. నేనేదో పాత చింతకాయ పచ్చడి లాగ వ్రాస్తున్నాననుకోకండి. ఒకవైపున పిల్లలు తెలుగు నేర్చుకోవడంలేదో అని అఘోరిస్తున్నారు కదా, మరి ఈ సెక్స్ విజ్ఞానం ఎవరికోసమండి బాబూ? తెలుగు మాట్లాడడం, చదవడం వచ్చినవాళ్ళందరికీ, సెక్స్ విజ్ఞానం కూడా బాగానేఉంది, ఇంక మళ్ళీ ఈ పత్రికల ” జ్ఞానబోధ” ఎందుకంట? అయినా వీటి గురించి తెలియకపోయినా, మన సినిమాలు ఉండనే ఉన్నాయి. ఏదో సెన్సార్ వాళ్ళనేవారు ఉన్నారు కాబట్టి సరిపోయింది, లెకపోతే స్క్రీన్లమీద “కాపురం” ఎలా చేయాలోకూడా చూపెట్టేవారు !! ఇప్పుడు మాత్రం తక్కువేమిటీ?

ఈ ఇంటర్నెట్ ఉన్నరోజుల్లో ఏమైనా తెలుసుకోవాలంటే సవాలక్ష మార్గాలు ఉన్నాయి. ఈ పత్రికలూ అవీ కంప్యూటర్లు గురించి తెలియనివారికి.అలాటి వారు ఎవరు?కొంచెం వయసు మళ్ళినవారూ,ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి ఈ సెక్స్ విషయాలు నేర్పడం అంటే ” తాతకి దగ్గు నేర్పినట్లు “. వాళ్ళ మానాన ఏదో హాయిగా చదువుకోనీయకుండా ఈ పనికిమాలిన విషయాల గురించెందుకండీ? ఇదివరకటి రోజుల్లోనే నయమండి బాబూ–సినిమాల్లో బట్టలూడదీసికొని డాన్సులు చేయడానికి ప్రత్యేకంగా ఉండేవారు, ఓ జ్యోతిలక్ష్మో, సిల్క్ స్మితో,ఓ హలమో ఎవరో ఒకరుండేవారు. వాళ్ళని ఏదో ఓ డ్యాన్సుకోసమే ఉంచేవారు. సినిమా మధ్యలొనే వాళ్ళని చంపేసేవారు.ఇప్పటి సినిమాల్లో, ప్రస్తుతపు హీరోయిన్లు వాళ్ళ నోట్లో దుమ్ము కొట్టేసి, వాళ్ళని కనుమరుగు చేసేశారు.ఏమైనా అంటే నేను చేసేది ” ఎక్స్పోజింగ్” కాదూ, “కలాపోసణా” అంటున్నారు!!

ఇంక పత్రికల విషయానికొస్తే,ఇదివరకటి రోజుల్లో సెక్స్ విషయాల గురించి చదవాలన్నా,సినిమా వాళ్ళమీద రూమర్ల గురించి తెలుసుకోవాలన్నా ప్రత్యేకంగా పుస్తకాలూ,పత్రికలూ ఉండేవి.అప్పుడప్పుడు అలాటి పత్రికలమీద సినిమా నటులు పరువు నష్టం దావాలు వేసిన సంఘటనలుకూడా ఉండేవి. ఇప్పుడో సినిమా వాళ్ళే,తమ మీద ఓ రూమర్ ప్రారంభించేయడం,వాళ్ళకి ఫేవర్బుల్ గా ఉండే విలేఖరికి ఈ “రూమర్” గురించి ఉప్పందించడం, మర్నాడు పేపర్లలో ఈ “వార్త” పతాక శీర్షికల్లో ప్రచురించేయడం, కావలిసినంత పబ్లిసిటీ కొట్టేయడం.
ఇంక టి.వీ. ఛాన్నెల్స్ అయితే వీటినన్నింటినీ మించిపోయాయి.ఏ భాషైనా ఒకటే. వీటిగురించి ఇంకో రోజు !

Advertisements

2 Responses

  1. మన తెలుగు పత్రికలకి తెలుగు సినిమా వాళ్ళమీద గాసిప్ రాసే దమ్ము ఉండదనుకుంటా.
    అందుకే హిందీ తారలమీద గాసిప్పులు వ్రాసి పేజీలు నింపుతుంటారు.

    Like

  2. బోనగిరి,

    బహుశా మీరు చెప్పేదీ రైటేనేమో.గాసిప్ కాకుండా, వ్రాయడానికి ఇంకేమీ ఉండదా?

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: