బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు–పిల్లల మాంద్యం

Details_

    మేము ఉద్యొగరీత్యా 1983 లో మహరాష్ట్రలోని వరణ్ గాం వెళ్ళాము.అప్పటిదాకా మా అమ్మాయి పూణే లో కాన్వెంట్ లో చదివేది. అక్కడకు వెళ్ళిన తరువాత, కేంద్రీయ విద్యాలయం లో చేర్చాను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి సౌకర్యంగా ఉండేటట్లు, చాలా మారుమూల ప్రదేశాల్లో ఈ స్కూళ్ళు తెరిచారు. ఇక్కడదాకా బాగానేఉంది. ఆ స్కూల్లో ప్రవేశం, మామూలుగా అయితే కేంద్రప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకే ఉండేది. అయినా పాఠశాల నడవాలంటే, పిల్లలు కూడా ఉండాలిగా, అందువలన బయటివారికి కూడా ప్రవేశం ఇచ్చేవారు.

    ఎంత చెప్పినా కాలనీ కదండీ, అక్కడ ఉండే మా ఫాక్టరీ వాళ్ళు ఒకసారి వచ్చేరంటే ఓ పది, పదిహేను ఏళ్ళు, ఎలాటి బదిలీలూ లేకుండా ఉండిపోయేవారు. దానితో, ఈ కేంద్రీయ విద్యాలయంలో, పరిస్థితి ఎలా వచ్చిందంటే, విద్యార్ధుల సంఖ్య ఏడాది,ఏడాది కీ తగ్గిపోవచ్చింది.ఒక ఏడాది, ఇంక స్కూలు మూసేయవలసివస్తుందేమో అన్నదాకా వచ్చేసింది. చాలా మంది బయటవాళ్ళు, రాష్ట్ర సిలబస్సు స్కూల్లోనే చేర్చేవారు( అక్కడ సిలబస్ కొంచెం తేలికగా ఉంటుందని).

    స్కూలు నడపాలని,మావాళ్ళందరూ, పిల్లలు పుట్టించడమే ధ్యేయంగా పెట్టుకోలేరుగా !! ఇలాటి ఒకానొక సందర్భంలో, మా ప్రక్కన ఒక కేంద్రీయ విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ గారు ఉండేవారు, ఒక రోజున మా ఇంటావిడ, ఆయన భార్యని అడిగింది–” భాయ్ సాబ్ కహా హై?“అని . దానికి జవాబుగా ఆవిడ అన్నారూ ” పేరెంట్స్ కో ఇఖట్టా కర్నేకేలియే గయే, బచ్చేకో పైదా కర్నా హైనా !!”…..

    ఈ వేళ సాక్షిలో ( డిటైల్స్ మీద నొక్కండి) వచ్చిన వార్త చదవగానే ,పాతికేళ్ళ క్రితం జరిగిన సంగతి గుర్తుకొచ్చింది !! ఇప్పుడు వస్తున్న కార్పొరేట్ స్కూళ్ళ ధర్మమా అని మన ప్రభుత్వ పాఠశాలలు ఇంక మూసివేయాల్సిన పరిస్థితి తొందర్లోనే రావొచ్చు. ఇక్కడ సంగతి ఆర్ధిక మాంద్యం బదులుగా పిల్లల మాంద్యం అనాలేమో !!

%d bloggers like this: