బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు

   నిన్న నెను పోస్ట్ చేసిన బ్లాగ్గు గురించి, సాహితి
గారు వివరణ ఇచ్చారు. నాకు వచ్చిన మెయిల్ ఏదో అందరికీ ఉపయోగిస్తుంది కదా అనే ఉద్దేశ్యం తో, నా బ్లాగ్గులో పెట్టాను. క్షంతవ్యుడిని. ఒక్కటి మాత్రం నిశ్చయించుకున్నాను–నాకు ఏదైనా అనుభవం అయితేనే ఇటుపైన పోస్ట్ చేస్తాను, ఇలాటి హొక్స్ మెయిల్స్ ఇంక ఎప్పుడూ పెట్టకూడదనీ. అయినాఒకసారి చేతులు కాలిన తరువాతే కదా తెలిసేది. సాహితి
గారూ ధన్యవాదములు,
నన్ను జాగరూకుడిని చేసినందుకు.

   ఈ వారం రోజులూ చాలా బ్రహ్మాండంగా గడిచిపోయాయి. మా ఫ్లాట్ కి ఎదురుగా ఇదివరకు ఎవరొ అద్దెకుండేవారు. క్రితంవారం ఆ ఫ్లాట్ ఓనర్స్ హైదరాబాద్ నుండి వచ్చారు. వారు రావడానికి రెండు మూడు రోజులనుండీ, ఏవేవో సామాన్లు రావడం మొదలెట్టాయి. క్రిందటి సోమవారం, ఆ ఫ్లాట్లోకి, యజమాని అనుకుంటా ఒకాయన వచ్చారు. వారు, రాజమండ్రీ వాస్తవ్యులే, ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్నారు. ఈవేళ ఆయన అరవయ్యో జన్మదినం, ఈ లోపులో ఆవిడ ఋషిపంచమి నోము చేసికున్నారు, లక్షవత్తుల నోము చేసికోవడానికి ముందుగా ఈ ఋషిపంచమి నోము చేసికోవాలట.ఈ వారం రోజులలోనూ,హోమాలూ,జపాలూ, గృహశాంతీ, రుద్రాభిషేకం, దానాలూ, సత్యనారాయణ వ్రతం చేశారు.

   పిఠాపురం నుండి వేద పండితులు తొమ్మండుగురు వచ్చారు. వారు ప్రతీరోజూ, ప్రొద్దుట ఏడు గంటలనుండి, సాయంత్రం దాకా హోమాలూ, వేద పఠనమూ, అబ్బ ఈ వారంరోజులూ ఎంత శ్రవణానందం గా ఉందో చెప్పలేము. వారి ఉఛ్ఛారణా, పలుకులో స్పష్టతా, శ్రధ్ధా, భక్తీ చూస్తూంటే, మేమెంత అదృష్టవంతులమో అనిపించింది, వాటన్నింటినీ వినడానికి. ఏదో డబ్బు ఇచ్చేరుకదా అని చేసేయడం కాకుండా, ఆ కార్యక్రమానికి ఓ పవిత్రత తెచ్చారు.

   మేము ఎంత డబ్బు ఇచ్చినా ఇలాటి వాతావరణం పూణే లో తేలేముకదా.మేము ఇక్కడకు ( రాజమండ్రీ) కి వచ్చిన ఉద్దేశ్యం , ఈ కార్యక్రమంతో పూర్తిగా అయినట్లే. మేము ఎక్కడనుండో రావడం ఏమిటీ,గోదావరి గట్టున ఉండడం ఏమిటి, మాకోసమే అన్నట్లుగా హైదరాబాద్ లో ఉండే వారు, మేము పూణే కి తిరిగి వెళ్ళేలోపలే, ఇలాటి కార్యక్రమం చేయడమేమిటి, ఇదంతా మేము ఎప్పుడో చేసికున్న పుణ్యం అనుకుంటా.

   ఈ వేళ్టి కార్యక్రమంలో, ఆ పండితులు మంత్రపుష్పం చెప్పారండీ, అబ్బ వర్ణించలేను, ఎప్పుడో నా చిన్నప్పుడు, మా తాతగారి ఊరు ముక్కామల ( కోనసీమ) వెళ్ళినప్పుడు, మా బాబుల్లా పెదనాన్నగారు (ప్రభుత్వం వారిచే సన్మానించబడిన వేద పండితులు), వారి ఇంటి అరుగు మీద శిష్యులచెత చెప్పించేవారు–అది గుర్తుకొచ్చి పులకరించిపోయాను.

   శుభ్రంగా భోజనం చేశాము.హాయిగా క్రింద కూర్చొని!! అక్కడకొచ్చిన వారి చుట్టాలలో ఒకాయన మా నాన్నగారి దగ్గర చదువుకున్నారుట, ఆయననీ , అమలాపురం లో మాఇంటినీ గుర్తుచేసికున్నారు. భోజనాలు వడ్డిస్తుంటే, మా చిన్నప్పటి నేతి జారీలూ, పులుసు గోకర్ణాలూ గుర్తు చేసికున్నాము. ఇప్పటి తరానికి, అవేమిటో, ఎలా ఉంటాయో కూడా తెలియదు. మేము ఈ వారం రోజులూ ఆస్వాదించిన అలౌకికానందం మీ అందరితోనూ పంచుకోవాలనే ఈ పోస్ట్.

%d bloggers like this: