బాతాఖాని-లక్ష్మిఫణి ఖబుర్లు–గృహ ఋణాలు

    ఇదివరకటి రోజుల్లో అయితే చేతిలో డబ్బులుంటేనే ఇల్లు కట్టడం మొదలుపెట్టేవారు,ఇపుడు అలాగ కాదుగా, ఎక్కడ చూసినా ప్రెవేటు బ్యాంకులూ, ప్రభుత్వ బ్యాంకులూ, అదరగొట్టేస్తున్నారు–మేమిస్తామంటే మేమిస్తాము ఋణాలూ అంటూ. ఒక్కఫోన్ చేయగానే, ఓ మార్కెటింగ్ ఎక్జిక్యుటివ్ మన ఇంటికి వచ్చేస్తాడు.అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు. మన నాన్న ఇల్లు కట్టడానికి 30 ఏళ్ళు పట్టింది, చూడు నేనైతే ఉద్యోగంలో చేరిన రెండో ఏడాది కల్లా ఓ ఇంటి వాడినైపోయాను అనుకుంటాడు.

    మన చేతికొచ్చే జీతాన్ని బట్టి ఏవేవో లెఖలు కట్టి, మనకొచ్చే అప్పూ, అది ఎన్ని సంవత్సరాల్లో కట్టాలీ, దాని ఇ.ఎం.ఐ ఎంతా, అన్నీ లెఖ్ఖ కట్టేసి, ఏవేవో కాగితాల మీద, ఓ నలభై సంతకాలు చేయించి, వాడి దారిన వాడు పోతాడు. మనం ఏదో బిల్డర్ ని పట్టుకుని, ఓ రెండు/మూడు బెడ్రూం ల ఫ్లాట్ మన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఆ కాగితాలు, మనం పూర్తిగా చూసే లోపలే బ్యాంక్ వాడు, గెద్దలా తీసికుపోతాడు.మనం ఏ ఇరవైయేళ్ళో, పాతికేళ్ళో డబ్బులు కడుతూండడమే.

ఓ అయిదారేళ్ళు పోయిన తరువాత, అదృష్టం కొద్దీ మనకి ఏమైనా డబ్బు చేతికి వస్తే, పోనీ మనం చేసిన అప్పులో కొంత భాగం తీరుద్దామని బ్యాంకు కి వెళ్తే, వాడు అవీ ఇవీ లెఖ్ఖ కట్టి ఎదో చెప్తాడు. చూస్తే మనం ఇన్నాళ్ళూ కట్టిన ఈ.ఎం.ఐ లు చాలా భాగం వడ్డీ క్రిందే జమ చేసికున్నట్లు తేలుతుంది.

    అదే మనం పనిచేసే కార్యాలయంలో ( కేంద్ర ప్రభుత్వ) ఇదే అప్పు తీసికుంటే ఎలా ఉంటుందో చూడండి. నాకు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల గురించి అంతగా తెలియదు. మన కొచ్చే జీతానికి, మనం ఎంత అమౌంట్ కి అర్హులో చెప్పి, ఓ నెలరోజుల్లో మనకి డబ్బు ఇస్తారు. సామాన్యంగా ఈ ఎచ్.బి.ఏ ( హౌస్ బిల్డింగ్ ఎడ్వాన్స్ ) గురించి,అన్ని ఆఫీసుల్లోనూ డిసెంబర్ లో పేర్లు( అప్పు కావలిసిన వారివి) అడుగుతారు. అంటే ఆ ఆర్ధిక సంవత్సరం పూర్తి అయెలొపల, వాళ్ళకి ఇచ్చిన గ్రాంటులు అన్నీ పూర్తి చేయాలి కనుక.

    మనకు మిగిలిన సర్వీసును బట్టి మన వాయిదాలు నిర్ణయించుకోవచ్చు, అది మనజీతంలోంచే తీసికుంటారు. అందువలన, కట్లు పోగా చేతికి వచ్చిన దానిలోనే మనం గడుపుకుంటాము ” పిండి కొద్దీ రొట్టె” అన్నట్లుగా. ప్రభుత్వం వారు ఇచ్చే అప్పు ముందర అసలు, అది పూర్తి అయిన తరువాతే వడ్డి తీసికుంటారు, ఏ కారణం చేతైనా, మనం సర్వీసులో ఉండగా మన అప్పూ, వడ్డీ పూర్తి అవకపోయినా ఫర్వాలెదు, రిటైర్మెంట్ సమయంలో మనకొచ్చే డబ్బుల్లో, ఇవన్నీమినహాయించుకుని, మిగిలినదే ఇస్తారు.

ఈ మధ్యలో అదృష్టం కొద్దీ కొంత అప్పు తీర్చడానికి నిశ్చయించుకున్నా,అది మన అస్సలు లోకే జమ చేసికుంటారు. బ్యాంక్ వాళ్ళ లాగ వడ్డీ క్రింద కాదు. అందువలన ఈ పోస్ట్ చదివేవారిలో ఎవరైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ,లేక వారింట్లో ఎవరైనా సంబంధిత వ్యక్తులెవరైనా ఉన్నా, వారిని ఓ “ఇంటివాడు” గా చేయండి.

ఊరికే ఈ బ్యాంకు ల వాళ్ళ తీపి తీపి మాటలు వినకుండా, హాయిగా మీకు తిండి పెడుతున్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయం వాళ్ళని ఓ ఇల్లు కూడా కట్టిపెట్టమనండి !! సర్వే జనా సుఖినోభవంతూ !!

%d bloggers like this: