బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు–UTI & PAN Card

    ఈ రోజుల్లో పాన్ కార్డ్ అనేది మన జీవితం లో ఒక విదదియరాని అనుబంధం అయిపోయింది. ఇల్లు కొనుక్కోవాలంటే కావాలి, డీమాట్ అకౌంట్ కి కావాలి,బ్యాంక్ అకౌంట్ కి కావాలి. అవసరంలేని చోటు కనపడడంలేదు.అది పొందడానికి అంత కష్టపడఖర్లెదు. కానీ, దానిలో ఏదైనా సవరింపులు చేయాలంటేనే వస్తుంది తంటా.

    ఆడపిల్లలు వివాహం అయిన తరువాత ఇంటిపేరు మారుతుంది కదా. వీళ్ళేమో పాన్ కార్డులు వివాహానికి ముందర తీసికొని ఉంటారు, ఇంటి పేరు మార్చాలంటే మళ్ళీ మన కార్డుని ప్రభుత్వం వారికి తిరిగి ఇచ్చేసి, దానిలోనే మార్పు చేయించాలిట. పోనీ ఈ గొడవంతా ఎందుకూ, కొత్త కార్డ్ కి అప్లై చేస్తే పోతుందిగా, అనుకుంటే, అబ్బే ఒక కార్డ్ ఉండగా ఇంకో కార్డ్ జారీ చేయరుట .ఇవన్నీ గత 20 ఏళ్ళలోనూ వచ్చిన రూల్స్. నాకొకటి అర్ధం అవదు–ఎలాగూ కొత్త పేరు ( ఇంటిపేరు) మీదే కార్డ్ అడుగుతున్నాము కదా, పాతది క్యాన్సిల్ చేసి ఇంకోటి ఇవ్వొచ్చుకదా.ఎలాగూ వాళ్ళు చేసేది చివరకు అదే !

    ఏది ఎలాగున్నా, ఈ వ్యవహారాలన్నీ మన ప్రభుత్వం వారు యు.టి.ఐ కి ఇచ్చారు చేయమని, కొత్తది ఇవ్వవలసినా, పాతది మార్పులు చేయవలసినా. ఈ పిల్లలు ఏం చేస్తారంటే, పని చేస్తున్న ఆఫీసులో ఎవడో ఏజెంట్ ఉంటాడు, ఇలాంటి చిల్లర పనులన్నీచేయడానికి, ఈ పిల్లలకి టైముండదు, శలవు దొరకదు. అందువల్ల ఈ ఏజెంట్లు అనే ప్రాణి మీదే ఆధార పడాలి. వాడు వీళ్ళ పాన్ కార్డ్ తీసికొని, దాని ఫొటోకాపీ ఒకటి వీళ్ళకి ఇచ్చి, ఏవేవో ఫారం ల మీద సంతకాలు పెట్టించుకుని, ” మీకేం భయం లెదు మేడం , మీ పాన్ కార్డ్ ఇంటిపేరు మార్చి, పదిహెను రోజుల్లో వచ్చేస్తుందీ ” అని భరోసా ఇచ్చేస్తాడు. సదరు ఏజెంట్ ఈ అప్లికేషనూ, సంబంధిత డాక్యుమెంట్లూ ( అంటే పెళ్ళి ధృవపత్రాలూ వగైరా) తీసికుని ఆ ఊళ్ళో ఉన్న యు.టి.ఐ ఆఫీసులో ఇచ్చి ఓ రసీదు తీసికొని ఇచ్చేస్తాడు. వాడి పని అంతదాకానే.

    మనం ఓ నెలదాకా ఆగి, అప్పటిదాకా మన పాన్ కార్డ్ రాలెదని ఇంక ఖంగారు పడడం మొదలెడతాము. ఆ ఏజెంట్ ని ఎప్పుడడిగినా, ఇదిగో చూస్తా, అదిగో చూస్తా అంటాడే కానీ ఫలితం శూన్యం. ఆ కార్డొచ్చేదాకా మనం ఎలాటి ఆర్ధిక సంబంధిత కార్యక్రమాలూ చేయలెము, ఇదెప్పుడొస్తుందో భగవంతుడే దిక్కు.. ఇదిగో ఇలాటి పరిస్థితి వచ్చిన తరువాత, మా అబ్బాయీ, కోడలూ నా దృష్టికి తెచ్చారు. అప్పటికి ఆరు నెలలు పుర్తి అయ్యాయి.

    నేను రిటైర్ అయి ఉన్నాను, కావలిసినంత ఖాళీ సమయం, పనెమీ లేదు, ఈ వ్యవహారం ఏదో తేల్చుకుందామని, మా కోడలిచ్చిన డాక్యుమెంట్లు అన్నీ తీసికుని, ముందుగా పూణే లో ఉన్న యు.టి.ఐ ఆఫీసుకెళ్తే, నా గొడవంతా విని, ఆన్ లైన్ లో చెక్ చేసి, అవునూ, ఇంకా కొత్తది తయారు అవలెదూ అన్నాడు. ఆ విషయం వాడు చెప్పేదేమిటి, రాలెదు కాబట్టే వీళ్ళదగ్గరకు వచ్చాను. అలాగ ఓ నెల గడిపాడు,నా గోల భరించలెక చివరకు అస్సలు సంగతి చెప్పాడండి. వీళ్ళ పనేమిటంటే మనం అందరం ఇచ్చిన అప్ప్లికేషన్లు అన్నీ నవీముంబైలో ఉన్న యు.టి.ఐ హెడ్డాఫీసుకి పంపడం వరకేట.అది ఎప్పుడు వస్తుందో అవన్నీ వాళ్ళు ఏమీ చెప్పలెరుట !! అంటే వీళ్ళుకూడా ఓ కొరియర్ సర్వీసులాగేనన్నమాట.

    ఇంక ఇదికాదు సంగతీ అని రోజువిడిచి రోజు ముంబైలో ఉన్న హెడ్డాఫీసుకి ఫోన్లు చేయడం మొదలెట్టాను. మొత్తానికి పట్టువీడని విక్రమార్కుడి లాగ, ఆ ముంబై ఆఫీసువాళ్ళని ఊదరగొట్టేసి, చివరకు, వాళ్ళు ” మీ కార్డు తయారయ్యింది బాబొయ్” అని చెప్పేదాకా వదలలెదు.దానిని కోరియర్ లో పంపాము అన్నాక, వాటి నెంబరూ తీసికొని, చివరకు చేతికి వచ్చిందండి. అప్పటికి పట్టిన సమయం--రెండురోజులు తక్కువగా తొమ్మిది నెలలు !!

    పై విషయమంతా ఎందుకు వ్రాశానంటే, ఎవరైనా ఇలాటి పరిస్థితిలో చిక్కుకుంటే, ఊరికే మీ ఊళ్ళొ ఉన్న యు.టి.ఐ ఆఫీసువాళ్ళని అడిగితే లాభం లేదు. వాళ్ళు ఒట్టి కొరియర్లు మాత్రమే. ఓ పదిహేను రోజులు ఆగి, నవీముంబైలో ఉన్న హెడ్డాఫీసు వాళ్ళ వెనుక పడి, వాళ్ళ మెదడు తినేయండి .మీ పని అవుతుంది !!మరీ నాలాగ తొమ్మిది నెలలూ ఆగకండి, సరేనా ?

%d bloggers like this: