బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు –ICICI Health Policy

   మీకెవరికైనా ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంక్ వాళ్ళ ఆరోగ్య భీమా పాలసీ తో పరిచయం ఉందా? చాలా మందికి ఉండిఉండొచ్చు. మాకు కేంద్ర ప్రభుత్వం వారి ఒక సీ.జీ.ఎచ్.ఎస్ అని ఒక ఆరోగ్య పథకం ఉంది. రిటైర్ అవగానే ఓ 18 వేలు కట్టేస్తే నాకూ, నా భార్యకూ జీవితాంతం ఆరోగ్య భీమా ఉంటుంది. ఏదో పేద్ద ఉధ్ధరించేద్దామని, అది తీసికోకుండా, ఈ ప్రెవేట్ బ్యాంక్ వాళ్ళది పుచ్చుకున్నాము;. వాడెవడో ఏజెంట్ వచ్చి, నా చేత సంతకాలు పెట్టించాడు, క్రెడిట్ కార్డ్ ఉందికాబట్టి దాంట్లోంచి కట్ చేసికుంటారూ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఓ పదిహేను రోజుల తరువాత, ఓ పాలసీ, ఓ కార్డూ వచ్చాయి. ఈ లోపులో నా క్రెడిట్ కార్డ్ మీద ప్రతీ నెలా,850 రూపాయలు; ఈ.ఎం.ఐ. కట్టేవాడిని. అంతా బాగానే ఉందీ నాక్కానీ, మా ఇంటావిడక్కానీ ఎప్పుడైనా ఆసుపత్రికి వెళ్ళవలసి వచ్చినా, వీళ్ళిచ్చిన కార్డ్ పుచ్చుకొని హాస్పిటల్ కి వెళ్తే, మనం ఏమీ డబ్బు కట్టఖర్లెదు కదా అని అనుకున్నాను.

   ;కట్టిన రెండో ఏడు, మా ఇంటావిడకు ఏదో గైనిక్ ఆపరేషన్ (చిన్నదే) చేయించవలసి వచ్చి, పూణే లో వీళ్ళిచ్చిన హాస్పిటల్ లో చేర్పించాను.ఆ భీమా వాడికి ఫోన్ చేస్తే, అప్రూవల్ రావడానికి సమయం పడుతుందీ, అందువలన, ముందు ఆపరేషన్ చేయించుకుని, ఆ తరువాత బిల్లులూ అవీ జతపరచి పంపితే, వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారూ, అన్నాడు. సరే నని, హాస్పిటల్ లో మా పని పూర్తి చేసికుని, డాక్టర్ చేత సంతకాలూ అవీ చేయించి, బిల్లులు అన్నీ వాళ్ళకి పంపాను.

ఓ రెండు వారాల తరువాత,నేను పంపిన బిల్లులు, అన్నీ ఒక ఫైల్ లో పెట్టి దానికి ఓ ఉత్తరం జతచేసి, నా బిల్లు అనుమతించబడద ని ఓ ఉత్తరం వ్రాశారు !!

కారణం ఏమిటయ్యా అని చదివితే, వాళ్ళు జారీ చేసిన పాలసీ రూల్ అదేదో వ్రాశాడు..ఫలానా, ఫలానా క్లాజు ప్రకారం, నేను పాలసీ తీసికొన్న రెండేళ్ళలోపు  ఫలానా రోగానికి కానీ, సర్జెరీ కి కానీ నా బిల్లు అనుమతించబడదూఅని ఆ ఉత్తరం సారాంశం.

   వాళ్ళిచ్చిన భీమా పాలసీ తీసి చదువుదామని చూస్తే దానిలో మన నేకెడ్ ఐ కి కనిపించనంత చిన్న అక్షరాలతో ఓ పదో పదిహెనో రోగాల లిస్ట్ ఇచ్చాడు. వాటిని చదవడానికి ఓ భూతద్దం కొనుక్కుని చదవ వలసి వచ్చింది. దాంట్లో ఉన్న లిస్ట్ ప్రకారం మామూలుగా వచ్చే రోగాలు వేటికీ, పాలసీ తీసికున్న రెండేళ్ళలో డబ్బు ఇవ్వరుట!! మనకెమైనా రోగం వచ్చినా అది రెండేళ్ళ తరువాతే రావాలన్నమాట.ఈలోపుగా అవసరం వస్తే తూర్పుకి తిరిగి దండం పెట్టుకోవడమే

   ఇదేమిటిరా భగవంతుడా అని, వాళ్ళకి వ్రాస్తే, జవాబు ఇవ్వడం వాళ్ళకి అలవాటు లేదుగా, ఎన్నిరోజులైనా, ఫోన్ కి జవాబివ్వరు, ఉత్తరానికీ, సమాధానం ఇవ్వరూ, ఇలా కాదని, నా గొడవంతామనీలైఫ్ అని ఒక ఇంగ్లీష్ మాగజీన్ కి పంపాను. అక్కడశ్రీమతి సుచెతా దలాల్ ( హర్షద్ మెహతా కెసు బయటపెట్టినావిడ నా ఉత్తరాన్ని ఐ.సి.ఐ.సి.ఐ వాళ్ళకి పంపి, వారంలోపుగా సమాధానం పంపాలని, నా లెటర్ పబ్లిష్ చేశారు. ఆ వారం లో ఆ భీమా కంపెనీ నుండి ఎవడో ఫోన్ చేసి–ఏవేవో కారణాలు చెప్పి చివరకు నాకు ఏమీ దొరకదని తేల్చాడు.

   ఈ ప్రకరణానికి కొసమెరుపేమంటే  రెండేళ్ళూ పూర్తయిందని, వాళ్ళ ఏజెంట్ మళ్ళీ వచ్చాడు నాదగ్గరకు, రిన్యూ చేస్తారా అంటూ, వాడిని పట్టుకుని కడిగేశాము, పైగా ఇంకో విషయమేమంటే, ఇప్పటిదాకా కట్టినదానికి డబుల్ కట్టాలిట.  అప్పటికి రెండేళ్ళకీ 16000/- కట్టాము. మేము కనుక రిన్యూ చేసికోకపోతే, ఆ డబ్బంతా వేస్ట్ అన్నాడు.అంటే వాళ్ళ పాలసీ ప్రకారం, ప్రతీ రెండేళ్ళకీ రెట్టింపు చొప్పున జీవితాంతం కడుతూఉంటే , మనకి వాళ్ళు భీమా చేస్తారన్నమాట !!

   నోరు మూసుకొని, మావాళ్ళ ఆఫీసుకెళ్ళి 18000/- కట్టి సి.జి.ఎచ్.ఎస్ వాళ్ళ స్కీమ్ లో చేరాను.ఇదంతా ఎందుకు వ్రాశానంటే, మన దగ్గరకి వచ్చే ఈ బ్యాంకు వాళ్ళ భీమా ఏజెంట్లు, అన్ని విషయాలూ పూర్తిగా చెప్పకుండా, చేతిలో కైలాసం చూపించి, మనచేత ఓ పాలసీ తీయించేస్తారు. ఆ తరువాత ఏవేవో రూల్స్ చెప్పి, మనకివ్వవలసిన డబ్బు మనకివ్వరు. ఆ పాలసీలో కూడా వ్రాసినది చదవడానికి ఓ భూతద్దం కొని పెట్టుకోండి. పారా హుషార్ !

%d bloggers like this: