బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు

    మా చిన్నప్పుడు అమలాపురం లో నాలుగు సినిమా హాల్స్ ఉండేవి–కమలేశ్వర, శ్రీకృష్ణ,వెంకటేశ్వర, శ్రీనివాస ఇవేకాకుండా లక్ష్మినరసింహ అని ఓ టూరింగ్ టాకీసు కూడా ఉండేది. ఒక్కొక్క సినిమా హాల్లో ఒక్కొక్క పంపిణీ దారుల సినిమాలు వచ్చేవి, నవయుగ, శ్రీ ఫిల్మ్స్, పూర్ణా లాటివి. కమలేశ్వరాలో బాల్కనీ కి ఒక రూపాయ ఒక అణా టికెట్, కుర్చీకి 12 అణాలూ, బెంచీకి ఏడు అణాలూ, నేలకి పావలా. ఎడ్వాన్సు బుకింగులూ అలాంటివి ఉండేవికాదు. ఆటకి ఓ గంటముందుగా వెళ్ళి టికెట్లు తీసికోవడమే. సీట్లకి నెంబర్లూ అవీ ఉండేవి కాదు. పైగా కొత్తసినిమా అయితే బాల్కనీకి ఆనుకొనిఉన్న వరండాలో కూడా కుర్చీలు వేసేవారు. ఇంటర్వెల్ లో బయటకు వెళ్ళి సినిమా పాటల పుస్తకాలు కొనుక్కోవడం,సోడాలూ, కలర్ సోడాలూ తాగడం బలేగా ఉండేది.

మామూలుగా అయితే నేను కుర్చీకే వెళ్ళేవాడిని, మానాన్నగారు, అన్నయ్యలతో వెళ్ళేటప్పుడు బాల్కనీకి వెళ్ళేవాడిని.హెడ్మాస్టారుగారు కదా, వస్తున్నామని ముందుగా ఖబురు పంపితే కొత్తసినిమా అయినా టికెట్లుండేవి.సినిమాకి ముందర, హాల్లో పాటలు పెట్టేవారు. అదేదో ప్రార్ధన వేసేరంటే ఇంక సినిమా మొదలెడతారన్నమాట.సినిమా హాళ్ళదగ్గర వాతావరణం బలేగా ఉండేది.చుట్టుపక్కల ఊళ్ళకి అమలాపురమే పెద్ద టౌన్ కాబట్టి,పక్క ఊళ్ళనుండి, ఎద్దుబళ్ళు కట్టుకొని వచ్చి,మూడు హాళ్ళలోనూ మూడు ఆటలూ చూసికొని తిరిగి వెళ్ళేవారు.ఖర్చూ, టైమూ కలసివచ్చేది.

బాగా చిన్నప్పుడనుకునేవాడిని పెద్దైనతరువాత సినిమా హాల్లో గేట్ కీపర్ గా అయితేబాగుండునని, రోజూ సినిమా చూడొచ్చూ అని!! ఒక్కొక్కప్పుడు ఇంటర్వెల్ టూ ఇంటర్వెల్ దాకా టికెట్లిచ్చేవారు. అదో తమాషాగా ఉండేది, సినిమా రెండు మూడు వారాలు ఆడినతరువాతే ఈ ఫెసిలిటీ ఉండేది. కొన్ని కొన్ని సినిమాలలో పాటలు అద్భుతంగా ఉండేవి, అవి వినడానికి ఆ పాట వచ్చే టైముకి సినిమా హాల్ దగ్గరికి వెళ్ళడమూ.

ఇవన్నీ ఒక ఎత్తూ, హిందీ సినిమాలు ఒక ఎత్తూ.1960 నుండి అనుకుంటా అమలాపురం లో హిందీ సినిమాలు చూపించడం మొదలెట్టారు. హిందీ సినిమాలు సామాన్యంగా మేటినీ లు గానే వచ్చేవి. ఆ రోజుల్లో ఎవరికీ హిందీ అర్ధం అయేది కాదు. మా హైస్కూల్లో ఓ హిందీ మాస్టారు శ్రీ వేమూరి రామకృష్ణగారు, ఈ హిందీ సినిమాలకి అనువాదం చెప్పేవారు. బెంచీకీ, నేలకీ మధ్యలో నుంచొని సినిమా ట్రాన్స్లేట్ చేసేవారు. ఏ సినిమాకైనా ” అది బొంబాయి మహా నగరం, అక్కడ….” అంటునే మొదలెట్టేవారు. ఓహో హిందీ సినిమాల కథలన్నీ బొంబాయి లోనే జరుగుతాయనుకునేవాళ్ళం !! సినిమాలో పాట వచ్చినప్పుడు ఆయనకి రెస్టూ. ఎన్నిపాటలుంటే అంత సుఖమన్నమాట ఆయనకి.

ఇంకో సంగతేమంటే ఈ సినిమా హాళ్ళవాళ్ళు, పట్టణం లో ఉన్న మ్యునిసిపాలిటీ, ఎలెక్ట్రిసిటీ వాళ్ళకీ ఫ్రీ టికెట్లివ్వాలి. లేకపోతే సినిమా మధ్యలో కరెంట్ తీసేసేవారు.సినిమా డబ్బాలు, రాజమండ్రీ నుండి రేవు దాటి బస్సుల్లో తీసికొచ్చేవారు, ఆ డబ్బాలు వచ్చేదాకా టెన్షనే అందరికీ.ఇవి కాకుండా నాగ్గాడి అభిమానులూ, ఎంటీవోడి అభిమానులూ. అయినా ఇప్పట్లాగ కొట్టుకోవడాలూ అవీ ఉండేవికాదు.

వీటికి సాయం, బాగా చిన్నప్పుడు సినిమా హాళ్ళ దగ్గరకు షికార్ కి వెళ్తే, అప్పుడు ఆడుతున్న సినిమా ఫిల్మ్ ముక్కలు బయట అంటే ప్రొజెక్టర్ రూమ్ కింద దొరికేవి. ఎవడికి ఎక్కువ దొరికేయో వాళ్ళింట్లో ఆ బొమ్మలు చూడాలన్నమాట. అంత జ్ఞాపకంలేదూ, అదో చిన్న బాక్సూ, దానికి ఓ భూతద్దమూ, వాటికి ముందరో లైటూ పెట్టి ఆ బొమ్మని గోడకి తెల్లదుప్పటీ కట్టి దానిమీద వేసేవాళ్ళం!!ఇప్పుడు ఆసంగతులన్నీ తలుచుకుంటే నవ్వొస్తుంది.

చెప్పానుగా అమలాపురంలో ఓ టూరింగ్ టాకీసు కూడా ఉండేది. ఆ హాల్లో మధ్యగా పెద్ద పెద్ద స్థంభాలూ, ఒక్కోసారి ఆలస్యంగా వెళ్ళామనుకోండి, ఆ స్థంభాల టిక్కెట్లే మిగిలేవి. వచ్చిన గొడవల్లా ఏమిటంటే సింగిల్ ప్రొజెక్టర్ అవడం వలన, మూడు ఇంటర్వెల్ లు ఉండేవి. దానిలో ” దో ఆంఖే బారా హాత్ ” సినిమా చూశాను.

మండపేట లో చదివేటప్పుడు, అక్కడ వాణీ మహల్, శ్రీకృష్ణా అని హాళ్ళుండేవి. ఈ మధ్యన నవజనార్ధనం టూర్ కి మండపేట వెళ్ళినప్పుడు, బస్సులో వెళ్తూ, ఆ టాకీసులని చూసి, నా 1955-56 జ్ఞాపకాలు తాజా చేసికున్నాను. అలాగే తణుకు వెళ్ళినప్పుడు రాయల్ టాకీసూ, వెంకటేశ్వరా టాకీసూ.కాకినాడలో క్రౌన్ టాకీసూ గుర్తుంది. ప్రస్తుతం రాజమండ్రీ లో శ్యామలా టాకీసూ, కుమారీ టాకీసూ ఇప్పటికీ సినిమాలు వేస్తూంటే ఆనందం కలిగింది.

నా చిన్నప్పుడు శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం వచ్చినప్పుడు, కమలేశ్వరా టాకీసు బయట వెంకటేశ్వరస్వామి విగ్రహం పెట్టి, దానికి పూజలు చేయడం, వచ్చినవాళ్ళందరూ హుండీలో డబ్బులు వేయడం, బాగా గుర్తు. 1981 లో మా కజిన్ రాజొల్లో పనిచెసేవాడు, తను మమ్మల్ని అప్పనపల్లి తీసికెళ్ళాడు. అక్కడ అప్పుడే కొత్తగా ఆలయ నిర్మాణం జరుగుతోంది. గోపురం మీద ఉన్నస్వామి విగ్రహాల్లో ఎన్.టి.రామారావు గారి పోలికలు ఎక్కువగా కనిపించాయి. ఆ శిల్పాలు తయారుచేసిన శిల్పి బహుశా ఎన్.టి.ఆర్ అభిమానేమో !!

ఇంక 1963 తరువాత ఉద్యోగానికి పూనా వెళ్ళినప్పటినుండీ, నన్ను ఆపేవాడే లేడు !! వారానికి మూడు సినిమాల చొప్పునా చూసేవాడిని. ఆనాటి సినిమా హాళ్ళు రెండో, మూడో మిగిలాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా మల్టీప్లెక్సులు. వాటికి కుటుంబం అంతా కలసి వెళ్తే ఓ పెద్ద కాగితం ఖర్చైపోతూంది. పోనీ వెళ్దామా అంటే, సినిమాలూ అంత చూసేటట్లుగా ఉండడం లేదు. ఇదివరకైతే కొత్త హిందీ/ తెలుగు సినిమాలు టి.వీ లో చూపించడానికి చాలా టైము పట్టేది. ఇప్పుడలాగ కాదు కదా.

హాయిగా ఇంట్లో కూర్చునే చూస్తే బాగుంటుందనిపిస్తోంది.

%d bloggers like this: