బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు–ఉత్తరాలు

    మొన్న మా ఇంటావిడ ” అమ్మ ఉత్తరం” అని ఒక బ్లాగ్ పోస్ట్ చెసింది. అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో వాళ్ళ అమ్మగారు వ్రాసిన ఉత్తరం ఇప్పటికీ జాగ్రత్తగా దాచి ఉంచి, దానిని చదివే పోలాల అమావాస్య పూజ చేసికుంటూంది. అది చూసి నేను వ్రాస్తున్నాను.ఆ రోజుల్లో ఈ టెలిఫోన్లూ అవీ ఉండేవి కావు కాబట్టి, క్షేమసమాచారాలు ఉత్తరాలద్వారానే తెలిసేవి. ఏదో మరీ అర్జెంటయితే తప్ప టెలిగ్రాములూ, టెలిఫోన్లూ వాడేవారు కారు.

    నాకు బాగా గుర్తు– ఆ వచ్చిన ఉత్తరాలన్నీ ఓ ఇనుప తీగ కి గుచ్చి ఉంచేవారు, అదీ చాలా పొడుగ్గా ఉండేది. దాన్ని పైన ఒంచి, ఓ మేకుకి తగిలించేవారు. ఆ ఉత్తరాలన్నీ దుమ్ముకొట్టుకు పోయేవి. ఎవరిదైనా ఎడ్రస్ కావాలంటే, ముందుగా దుమ్ము దులిపి, ఉత్తరం తీయడం, మనకి కావలిసిన ఉత్తరం ఎక్కడో మధ్యలో ఉందంటే, ఆ పైన ఉన్నవన్నీ తీయాల్సివచ్చేది. మళ్ళీ అవన్ని తిరిగి ఆ తీగలో గుచ్చడం ఓ పెద్ద ఎక్సర్సైజూ. ఆ పని చిన్న పిల్లలకిచ్చేవారు. మనం ఎప్పుడైనా మన అమ్మలకి వ్రాసేటప్పుడు– ” మహాలక్ష్మి సమానురాలైన అమ్మకి నమస్కారములు” అంటూ అన్ని వివరాలతోనూ వ్రాయాల్సిందే.

    మా చుట్టం ఒకావిడ ఉండేది, పాపం ఆవిడకి చదవడం వ్రాయడం వచ్చేది కాదు. గేటు బయట నిలబడి, నేను స్కూలునుండి వచ్చేటప్పుడు, నన్ను లోపలికి పిలిచి, చేతిలో ఓ బెల్లం ముక్క పెట్టి , వాళ్ళ అత్తారింటినుండి వచ్చిన ఉత్తరాలు చదవమనేది !!అందులో ఏం వ్రాశారో వాళ్ళ ఇంటాయన చెప్పడూ, కానీ ఈవిడకి అన్నీ కావాలీ, అందుకని నన్ను పిలిచేవారు.అవన్నీ పూర్తిగా చదవడం విసుగనిపించి, తూతూ మంత్రంలా చదివేసి, ఆ ఉత్తరంలోని భావాన్ని చెప్పేవాడిని. ఆవిడ ఊరుకుంటుందా, ” అదేమిట్రా ఆ ఉత్తరం అంత పెద్దగా రెండువైపులా ఉంటే, అంత కొచెమే చెప్పావూ ” అనేది.

    మాకు స్కూల్లో ఇంగ్లీషులో, లెటర్ రైటింగ్ ఒకటి ఉండేది–క్లాస్ టీచర్ కి ఓ ఉత్తరం,ఏదో కంపెనీకి ఉద్యోగానికి ఓ ఉత్తరం, –లాటివి ఉండేవి.అందులో ఎడ్రస్ కి కొన్ని మార్కులూ, స్టేషన్, డేట్ లకి కొన్ని,లెటర్ బాడీ కి కొన్నీ, అన్నీ పూర్తి అయిన తరువాత చివర సంతకం ఇంకో పేరుతో చేయాలి.కామాలూ, ఫుల్ స్టాప్పులూ ఎక్కడినా తప్పులుంటే మార్కులు కట్ !

    సాధారణంగా ఉత్తరాలన్నీ కార్డులమీదే వ్రాసేవారు. మరీ పెద్దవీ, ఇంకోళ్ళు చదవకూడనివీ అయితే తప్ప. శుభ సమాచారం అయితే కార్డుకి నాలుగు వైపులా పసుపు వ్రాసేవారు. అశుభమైతే నల్లగా ఏదో వ్రాసేవారు,అలాటి ఉత్తరాలు వస్తే చదివేసి చింపేయడమే. ఇంట్లో ఉంచితే కీడనేవారు.ఇంక పోస్ట్ మాన్ గురించి ఎదురు చూడడం ఓ నిత్యకృత్యం. మాకు అమలాపురం లో బస్సు( అదీ మెయిల్ బస్సనేవారు) మీద వచ్చేవి. రేవు దాటి టపా వచ్చేదాకా, ఈ బస్సు అక్కడే ఉండాలి ప్రొద్దుటే పోస్టాఫీసుకి వెళ్ళడం, కిటికీ బయట నుంచోవడం, మన ఏరియా పోస్ట్ మాన్ మనకి ఏమైనా ఉత్తరాలుంటే ఇచ్చేవాడు. అతనికి నమ్మకం ఉంటేనే.

    ఇప్పుడంటే కంప్యూటర్లూ అవీ వచ్చి ఉత్తరాల సందడి తగ్గిపోయింది కానీ, నాకు తెలిసిఉన్నంతవరకూ, 1998-99 దాకా నేనూ అందరికీ ఉత్తరాలు వ్రాసేవాడిని. ఉద్యోగంలో చేరిన కొత్తలో అంటే 1963 లో రోజు విడిచి రోజు ఇంటికి ఉత్తరం వ్రాయవలసిందే. పూనా లో,రైల్వే స్టేషన్ కి కొంచెం దూరంలో ఆర్.ఎం.ఎస్ వాళ్ళ పోస్ట్ బాక్స్ ఒకటి ఉండేది. ఎప్పుడో ఒకసారి చూసిన గుర్తూ, ఆదివారాలు తప్పించి ప్రతీ రోజూ ఉత్తరాలు రెండేసి గంటలకోసారి తీస్తారని చదివినట్లు. ఓ సోమవారం సాయంత్రం ఒక అర్జెంట్ ఉత్తరం దాంట్లో వేశాను. నేను వేయగానే, ప్రక్కనే నుంచున్న ఓ పెద్దమనిషి వచ్చి, ఉత్తరం వేశావుకదా పోస్ట్ బాక్స్ మీద ఏం వ్రాశారో చదివేవా అన్నాడు. చూస్తే

” ఆదివారాలు మాత్రమే తెరువబడును” అని వ్రాసుంది. మరి నీకు తెలిసినప్పుడు నాకు చెప్పొచ్చుకదా అంటే, నేను చూసుకోకుండా వేశానూ, నా లాగ ఇంకెందరు వెర్రివెధవలుంటారో అని చూస్తున్నానూ, నువ్వు నాలుగోవాడివీ అన్నాడు. అప్పటినుండి ముందుగా బాక్స్ మీద రాసింది చదవడం ఓ అలవాటుగా చేసికున్నాను.

    ఆ మధ్యన పూణే లో మా అమ్మాయి,ఓ శనివారం సాయంత్రం ఫోన్ చేసి ” డాడీ,మా అమ్మాయిని స్కూల్లో పోస్ట్ కార్డ్ తీసికొనిరమ్మన్నారూ, ఆదివారం శలవు కదా, కొనడానికి వీలుపడదూ,నీ దగ్గర ఎలాగైనా దొరుకుతాయీ అనే నమ్మకం” అంది. ఉత్తరాలు వ్రాసినా లేకపోయినా, కార్డులూ, ఇన్లాండ్ లెటర్లూ,ఏరోగ్రామ్సూ నాదగ్గర ఉంచుకుంటాను.

    ఈ రోజుల్లో ఎంతమంది పోస్టాఫీసులకి వెళ్తున్నరన్నది తెలియదు. సరదాగా మీ పిల్లలకి కార్డులమీద ఉత్తరాలు వ్రాయడం నేర్పండి,మని ఆర్డర్ ఫారం నింపడం ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి. ఇంకో పదేళ్ళు పోతే ఇవన్నీ ఎక్స్టింక్ట్ అయిపోతాయి. ఆ మధ్యన మా మనవరాలి చేత ఓ పోస్ట్ కార్డ్ మీద పిచ్చి గీతలు వ్రాయించి,దానిమీద మా అబ్బాయి ఎడ్రస్ వ్రాసి రాజమండ్రి కి పోస్ట్ చేయించాడు. అది మాకు వచ్చింది, దానిని లామినేట్ చేయించి, పూణే వెళ్ళినప్పుడు తనకి చూపిస్తే ఎంత సంతోషించిందో. ఇలాటి చిన్న చిన్న ఆనందాలు ఈయండి ఈ తరం వాళ్ళకి.

%d bloggers like this: