బాతాఖానీ-లక్ష్మిఫణి ఖబుర్లు-“పల్లెవెలుగు”-3

    ఈ గ్రామాలన్నీ దాటుకుంటూ, మధ్యలో బస్సులో కూర్చొన్నవాళ్ళ ఖబుర్లు వింటూ, గతుకుల రోడ్డుమీద ఎలాగైతేనే తణుకు చేరాము.బైపాస్ రోడ్డుమీద బెల్లంమార్కెట్ దగ్గర దిగి, మా అత్తగారింటికి చేరాము. మా ఇంటావిడ కంటే నాకే తణుకు రోడ్డులు బాగా తెలుసని, ఒప్పుకుంది. ఎప్పుడైనా తణుకు వెళ్ళినా, తను వాళ్ళ అమ్మగారితోనూ, చెల్లెళ్ళతోనూ ఖబుర్లు చెప్పుకుంటూ కూర్చొంటుంది, నేను నడిచి ఊళ్ళోదాకా వెళతాను.అందుకని అక్కడ రోడ్లన్నీ నాకు పరిచయం. ఇదివరకు బ్రిడ్జ్ లేనప్పుడు,టీచర్స్ కాలనీకి వెళ్ళడానికి, కాలవ( గోస్తనీ నది అనాలి) బల్లకట్టుండేది. ఎంత హాయిగా ఉండేదో.చెప్పానుగా అవన్నీ తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.తణుకు లో ఇప్పుడు ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లే. అస్సలు రూపే మారిపోయింది.తణుకు కొంచెం పెద్ద పట్టణాలలోకే వస్తుంది, రోడ్డుమీద ప్రతీ మూడో షాప్పూ, చెప్పుల దుకాణమే !! అయినా కొన్నికొన్ని పాతరోజులనాటి రాయల్ టాకీసూ, వెంకటేశ్వరా టాకీసూ అలాగే ఉన్నాయి.మిగిలిన చాలా పాత ఇళ్ళూ, కట్టడాలూ, డెవెలప్మెంట్ కి బిల్డర్స్ కిచ్చేశారు, ఈ సారి మళ్ళీ వెళ్ళేటప్పడికి కాంక్రీట్ జంగల్ అయిపోతుంది. అభివృధి ఉండాలి కాదనం, ఉన్న ఖాళీ ప్రదేశాలన్నీ,అపార్ట్మెంట్లకి వెళ్ళిపోతుంటే చాలా బాధ వేస్తుంది.ఆ ఊళ్ళో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోదు. రోడ్లు వెడల్పు చేయలేరు, ఎక్కడ చూసినా ట్రాఫిక్కూ, దానికీ ఓ వరసా వావీ ఉండదు. మా చిన్నప్పుడు తణుకు వెళ్ళాలంటే, చెప్పానుగా అమలాపురంనుండి గన్నవరం దాకా బస్సులోనో, జట్కాలోనో వచ్చి కోడేరు రేవు దాటడం. నాకు ఆ కోడేరు రేవు దాటడం అంటే భలే మజా గా ఉండేది. అక్కడ గోదావరి చిన్న పాయ, పడవలో వెళ్తూంటే క్రింద భూమి కనిపించేది, నీళ్ళు అంత క్లియర్ గా ఉండేవి. ఒక్కొక్కప్పుడు అంటే వేసంకాలంలో నడిచే వెళ్ళొచ్చు.ఇప్పుడైతే రావులపాలెం నుండి సిధ్ధాంతం బ్రిడ్జ్ మీదనుండి బస్సుమీద వెళ్తారు.ఆరోజులు మళ్ళీ రమ్మంటే వస్తాయా?

    సాయంత్రం ఆరుదాకా తణుకులో మా అత్తారింట్లో గడిపి మళ్ళీ బెల్లం మార్కెట్ దగ్గరకొచ్చి వెయిట్ చేశాము. రాజమండ్రీ బస్సు ఓ అరగంట తరువాత వచ్చింది.ఇక్కడో విషయం గమనించాము– దగ్గరలో ఉన్న గ్రామాలన్నింటినుండీ, చదువుకోవడానికి తణుకు వస్తారు. అందువలన సాయంత్రం ఈ బస్సులన్నింటిలోనూ కాలేజీ పిల్లలే ఎక్కువగా ఉంటారు, ఆడపిల్లలూ, మగపిల్లలూ ఖబుర్లు చెప్పుకుంటూ సందడిగా ఉంటుంది. మా ఇద్దరికీ సీట్ దొరికింది.కండక్టర్ ఒక అమ్మాయి.ఇదివరకటి రోజుల్లో ఎప్పుడూ పోలీసులూ, కండక్టర్లూ మగవాళ్ళే ఉండేవారు. ఇప్పుడైతే పోలీసులూ, కండక్టర్లూ, పెట్రోల్ బంకుల్లో అటెండర్లూ చాలా చోట్ల ఆడపిల్లల్ని చూస్తున్నాము.ఇంకో విషయమేమంటే అమ్మాయిలు, గ్రామీణులైనా చాలా ధైర్యవంతుల్లా కనిపించారు, లెకపొతే బస్సుల్లో ప్రయాణం చేసే వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం.

    ఈ ప్రాంతాల్లో సాయంత్రం ఆరయ్యేసరికి అకస్మాత్తుగా చీకటి పడిపోతుంది. ప్రొద్దుట చూసిన అందమైన దృశ్యాలు కనిపించవు సరే, బస్సులోంచి చూడాలంటే భయం కూడా వేస్తుంది. అంతా కటిక చీకటీ, ఆ చీకట్లో ఎంత హెడ్ లైట్లున్నా, ఎదురుగా వచ్చే లారీలూ, బస్సులూ, మధ్యమధ్యలో ఆటోలూ ఒకటేమిటి చెప్పకండి, ఈ హడావిడిలో సైకిళ్ళమీద వచ్చేవాళ్ళూ, వీళ్ళందరినీ తప్పించుకుంటూ డ్రైవ్ చేయాలంటే ఎంత నిపుణత ఉండాలో. పక్కకు చూడాలంటే భయం. ఎదురుగా వచ్చే వెహికిల్ లైట్ మన డ్రైవర్ గారి కళ్ళల్లో పడి, ఎక్కడ కంట్రోల్ తప్పి, పక్కనే ఉన్న కాలవలోకి పెట్టేస్తాడో, మర్నాడు పేపర్లో మన ఫొటోలు పడతాయో అని.మనం ఇక్కడున్నట్లు పూణేలో ఉన్న పిల్లలకి చెప్పలెదూ, ఎక్కడ దిక్కులెని చోట పడతామో, అని వెంటనే పిల్లలకి ఎస్.ఎం.ఎస్ పంపేశాను.

    దారిలో ఏదో కొంచెం పెద్దగ్రామాలైన పెరవలీ, కానూరూ తప్పించి, ఎక్కడాఆ లైటు కనిపించదు. అయినా ఆచీకట్లోనే ఈ బస్సులోఉన్న కాలేజీ పిల్లలూ దిగుతారు. పైగా లోడ్ షెడ్డింగ్ ధర్మమా అని గ్రామాలు చాలా చోట్ల కరెంట్ ఉండదు. దూరంగా మిణుకు మిణుకుమంటూ కనిపించే దీపాలూ, అమ్మో, పొద్దుట ఉన్న సంతోషమంతా డిప్రెషన్ లోకి దింపేసిందండి. చాలామంది తల్లితండ్రులు వాళ్ళ పిల్లల్ని విజయవాడ, రాజమండ్రి, కాకినాడ ,ఏలూరు లాటి ఊళ్ళలో ఉంచి హాస్టళ్ళలో పెట్టి అంత ఖర్చుపెట్టి ఎందుకు చదివిస్తారో ఇప్పుడు అర్ధం అయింది. ప్రొద్దుటెప్పుడో కాలెజీ కి వెళ్ళి, బస్సులు పట్టుకుని అంతంత చీకటిలో, ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియక, ఆ తల్లితండ్రులు పడే యాతన భరించడంకంటే దూరాభారమైనా హాస్టల్లో పెట్టడమే నయం. ఎక్కడో అక్కడ క్షెమంగా ఉండి చదువుకుంటున్నాడూ అనే సంతృప్తైనా ఉంటుంది. వర్షాకాలం అయితే చెప్పఖర్లెదు,ఆ సన్నటి రోడ్లమీద మన పల్లెవెలుగు బస్సు డ్రైవర్లు ఎలా తీసికెళ్తారో.

    ఈ చీకట్లన్నీ దాటుకొని,రాజమండ్రీ రోడ్,రైలు బ్రిడ్జ్ కనిపించగానే అమ్మయ్యా అని ఊపిరి పీల్చాను. ప్రొద్దుట వెళ్ళడమూ, ఆ చీకట్లో “పల్లెవెలుగు” బస్సులో తిరిగి రావడమూ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అందుకనే చెప్తాను “హైవే” మీద వోల్వో బస్సులోనో, ఏ.సీ. టాక్సీలోనో కాదు వెళ్ళడం, ఏ.పీ.ఎస్.ఆర్.టి.సి వాళ్ళ ప్యాసెంజర్ బస్సులో గ్రామీణ ప్రాంతాలకి, గొదావరి జిల్లాల్లో ప్రయాణం చేయండి, అస్సలు మజా ఆస్వాదించండి. సర్వేజనా సుఖినో భవంతూ !!

%d bloggers like this: