బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు-“పల్లెవెలుగు”–2

    1960 ల్లో అనుకుంటా,బస్సు రూట్లు జాతీయం చేశారు. ప్రెవేట్ బస్సులవాళ్ళందరికీ ఏదో కాంపెన్సేషన్ లాటిదిచ్చి,ఆ రూట్లన్నింటిలోనూ గవర్నమెంట్ బస్సులు వేసేశారు. పాత బస్సులతో పాటు చాలా మంది డ్రైవర్లూ, కండక్టర్లకీ ఉద్యోగాలు ఊడిపోయాయి. కొత్తగా ప్రభుత్వం నియమించిన డ్రైవర్లనీ, కొత్త బస్సులనీ ప్రవేశపెట్టారు. అక్కడిదాకా బాగానే ఉంది.కోనసీమలో పుల్లేటికుర్రూ, బండార్లంకా చూసినవారికి అర్ధం అవుతుంది నేను వ్రాసేది. అక్కడ బస్సులు వెళ్ళే దారిలో ఆ రోడ్లు ఎంత ఇరుకో,ఒక్కొక్కప్పుడు ఎవరి ఇంట్లోకైనా బస్సు వెళ్ళిపోతుందేమో అని ! ఆ ఇళ్ళు ఎలా ఉంటాయంటే బస్సులో వెళ్తూ ఎవరైనా చెయ్యి జాపేరంటే అరుగు మీద కూర్చొన్నవాళ్ళకి షేక్ హాండ్ ఇవ్వొచ్చు, అంత దగ్గరన్నమాట.

    ఇన్నాళ్ళూ అలవాటు పడిన డ్రైవర్లు కాబట్టి, ఎటువంటి దుర్ఘటనా లేకుండా లాగించేశారు. ఇప్పుడూ కొత్త పొడుగాటీ బస్సులూ, కొత్త డ్రైవర్లూ. కోనసీమా మజాకా నా?

ఆ డ్రైవర్లకి కోనసీమలో బస్సులు ఇళ్ళలోకి వెళ్ళకుండా ఎలా నడపాలో, ఒక మలుపు తిరిగేసరికి ఇంకో మలుపు ఎలా మానిప్యులేట్ చేయాలో తెలీక చేతులెత్తేశారు. వీటికి సాయం రోడ్డుకోపక్క కాటన్ దొరగారి ధర్మమా అని తవ్వించిన కాలవలూ( పెద్దవి), రెండో పక్కన పంట కాలవలూ. ఓ బస్సు వచ్చిందంటే ఇంకో బస్సు వెళ్ళలేదు. ఇంక వర్షా కాలం అయితే దేముడే దిక్కు. రోడ్లు అంతంత మాత్రం, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా బస్సూ, మనమూ కాలవలోకే. అయినా నాకు తెలిసినంత వరకూ ఆ రోజుల్లో కాలవలోకి బస్సు దూసుకెళ్ళిన దుర్ఘటనా వినలెదు. అలాటి నిపుణులు మా కోనసీమ డ్రైవర్లు. కొత్తగా వచ్చిన ప్రభుత్వ డ్రైవర్లు ఇదంతా చూసి చేతులెత్తేశారు. ప్రతీ రోజూ ట్రాఫిక్ జామ్ములే !! తిరుపతి కొండల్లో డ్రైవర్లుగా పనిచేసిన వాళ్ళనీ ట్రై చేశారు. అబ్బే మా వల్లకాదన్నారు !! ఏ డ్రైవరూ రావులపాలెం దాటి రామన్నారు !!

ఇంక గత్యంతరం లేక ప్రభుత్వం వారు, కోనసీమ డ్రైవర్లందరినీ రిక్రూట్ చేసి, అదేదో స్పెషల్ డ్రైవ్ లాగ రావులపాలెం దాకా బయటి డ్రైవర్లూ, అక్కడినుండి వీళ్ళూ అని ఓ ఎరేంజ్మెంట్ చేసేశారు. అదేదో ట్రైనింగ్ లాగ కొత్తగా రిక్రూట్ అయిన ప్రతీ డ్రైవరూ, కోనసీమలో కనీసం ఆరునెలలు ట్రైనింగ్ పొందాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొంతకాలం పనిచెసే దాకా డాక్టర్లకి డిగ్రీ ఇచ్చేవారు కాదట , అలాగన్నమాట !! ఒక్క సారి కోనసీమలో బస్సు నడిపాడంటే అతను, ప్రపంచం లో ఎక్కడైనా నడపడానికి ఎలిజిబుల్ అన్నమాట !!

    ఇవన్నీ ఎందుకు గుర్తొచ్చాయంటే, నిన్న రాజమండ్రి నుండి తణుకు దాకా ఆ రోజుల్ని గుర్తుచెసే బస్సు–” పల్లెవెలుగు” లో వెళ్ళాము.ఇదివరకు ట్రైన్లోనో, టాక్సీలోనో వెళ్ళేవాళ్ళం. విఝేశ్వరం దాకా వెళ్లిన తరువాత, టర్న్ తీసికొని కానూరు, పెరవలి మీదుగా తణుకు చేరతాము. పగలు వెళ్ళేటప్పుడు గ్రామాల్లోనుండి వెళ్తూంటే, పక్కనే పచ్చటి పొలాలూ,సైకిళ్ళమీద పెట్టుకుని అరటిపళ్ళ గెలలూ. చెప్పానుగా కాటన్ దొర గారిచ్చిన వరం–ధవళేశ్వరం దాకా వచ్చిన అఖండ గోదావరికి ఆనకట్టలు నిర్మించి, వ్యవసాయం కోసం తవ్వించిన కాలవలు– మనం గోదావరి జిల్లాలలో( తూర్పూ, పశ్చిమ) ఎక్కడకెళ్ళినా నీడలాగ మనతో పాటే వస్తాయి !!

    ప్రతీ గ్రామానికీ అయిదేసి విగ్రహాలు దర్శనమిస్తాయి( మహాత్మా గాంధీ, అంబేద్కర్, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్.టి. రామారావు).ప్రక్కనే ఓ పంచాయితీ ఆఫీసూ, ఓ సైకిలు రిపెర్లు చేసే దుకాణమూ, బీర్ దుకాణమూ, ఓ పాక హొటలూ, ఓ కాయిన్ బాక్స్ టెలిఫోనూ. దారిలో ఎవడు చేయి ఆపినా బస్సు ఆపుతారు. ఆ బస్సు ఆపీ ఆపగానే, సోడాలూ, పువ్వులు అమ్మేవాళ్ళూ, అరటి, జామ పళ్ళు అమ్మేవాళ్ళూ, ఇప్పుడైతే బొగ్గులమీద కాలుస్తున్న మొక్కజొన్న పొత్తులు కూడా దర్శనం ఇస్తాయి. ఆ గ్రామాల్లో కనిపించే అందాలు ఎన్ని కోట్లిచ్చినా చూడగలమా? అలాగని అక్కడ నివసించాలంటే కొంచెం కష్టమే.ఇంకోటి మరచిపోయాను, పక్కనే కాలవ నిండుగా ప్రవహిస్తూంటుందని చెప్పానుగా, దాంట్లోనే ఓ పక్క స్నానాలు చేస్తూంటారు, ఓ పక్క బట్టలుతికేవాళ్ళూ, వాటితోనే సహజీవనం చేసే గేదెలూ.

    మా చిన్నప్పుడు త్రాగడానికి కాలవ నీళ్ళు ప్రత్యేకంగా పోయించుకునే వారు. దాంట్లో ఇండుపు గింజలు వేస్తే, మట్టి అంతా క్రిందకుపోయి శుభ్రంగా మంచినీరు పైకి తేరేది. ఎంత రుచిగా ఉండేవో. ఒకటో రెండో బిందెలు తెప్పించుకునేవారు, అందుకని ముఖ్యమైన వారికే ఇచ్చేవారు. త్రాగడానికి కాలవ నీళ్ళిచ్చారంటే వాళ్ళు వీ.ఐ.పీ లన్నమాట.ఇప్పుడు మనం మినరల్ వాటర్ కి బానిసలయిపోయి, నూతి నీళ్ళే త్రాగడం మరచిపోయాము. ఆరోజుల్లో నదులు కూడా నిర్మలంగా ఉండేవి. ఈ ప్లాస్టిక్కులూ,చెత్తా చెదారమూ కనిపించేవి కాదు.గొదావరి నీళ్ళు ఎంత రుచిగా ఉండేవో !!ఏడాదినుండి రాజమండ్రీలో ఉన్నా , అదీ గోదావరి గట్టుమీద ఉంటూ కూడా, గొదావరిలోని నీళ్ళలో చెయ్యి పెట్టడానికే భయం !!అంత దౌర్భాగ్య స్థితికి వచ్చాము.గోదావరి చూస్తూంటే కడుపు తరుక్కుపోతూంది.

మిగిలిన విశేషాలు రేపు…..

%d bloggers like this: