బాతాఖానీ-లక్ష్మిఫణి ఖబుర్లు–” పల్లె వెలుగు”–1

    నా చిన్నప్పుడు ఎప్పడైనా అమలాపురం నుండి ఏ కాకినాడో,రాజమండ్రీ యో వెళ్ళవలసివస్తే గోదావరి రేవు దాటవలసివచ్చేది. కాకినాడ కైతే ముక్తేశ్వరం రేవు దాటి, కోటిపల్లి నుండి బస్సులో వెళ్ళేవాళ్ళం. బొబ్బర్లంక రేవు దాటితే రాజమండ్రీ.. తణుకు వెళ్ళవలసివస్తే గన్నవరం నుండి లంకలలో నడిచి, కోడేరు రేవు దాటేవాళ్ళం. ఈ ముక్తేశ్వరం, బొబ్బర్లంక, గన్నవరం దాకా బస్సుల్లో వెళ్ళడం. ఆ రేవులదాకా వెళ్ళడానికి అయితే గియితే 10 నుండి 30 మైళ్ళదూరం ఉండేది అనుకుంటాను. ఆదూరం వెళ్ళడానికి బస్సులే దిక్కు. అవికూడా ప్రైవేటు బస్సులు,అప్పటికి ఇంకా బస్సు రూట్లు జాతీయం చేయలేదు. కోనసీమ లో బండార్లంక శర్మ గారి కంపెనీ వాళ్ళవే ఎక్కువగా ఉండేవి. కాకినాడ కి వెళ్ళాలంటే రాం దాస్ ట్రాన్స్ పోర్ట్ వాళ్ళవి.

కోటిపల్లి రేవు దాటి, అమలాపురం రావాలంటే ముక్తేశ్వరం దగ్గర, పడవలోంచి బస్సు చూసేవాళ్ళం, మనం వేళ్ళేదాకా ఉంటుందో ఉండదో ఖంగారు. సామాన్లన్నీ పట్టుకుని, ఆ బస్సు దగ్గర ఓ కూలీ బస్సు ఎక్కి ఆ సామాన్లన్నీ టాప్ మీద వేసేవాడు.బస్సులో చిన్న పిల్లలకి సీట్లుండేవి కాదు. పైగా ఆ బస్సుల్లో అన్లిమిటెడ్ కెపాసిటీ, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళకి ఫ్రంట్ సీట్ దొరికేది ( అంటే డ్రైవర్ పక్కనుండేది), కొంచెం ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి రెండో వరసలో . మా నాన్నగారు కోనసీమలో హెడ్మాస్టర్ గా చేయడం వల్ల సామాన్యంగా రెండో వరసలో దొరికేది. కోనసీమలో బస్సులు ఓపెన్ గాఉండేవి. అంటే కిటికీలూ అవీ ఉండేవికావు. వర్షం వస్తే, జల్లుకొట్టకుండా ఉండడానికి, టార్పొలీన్లు ఉండేవి. వాటిని నొక్కిపెట్టి ఉంచడానికి బటన్లూ.ఒక్కొక్కప్పుడు అవి లేకపోతే వర్షం జల్లు అంతా లోపలికే. అంటే వర్షాకాలంలో బస్సుప్రయాణం చేశామా, పూర్తిగా తడిసిపోయేవాళ్ళం. ఇంక ఆ బస్సు బాడీ లో కొంతమంది కూర్చొనేవాళ్ళు.అక్కడే స్టెఫ్నీ టైర్లూ అవీ పెట్టేవారు. కొంతమందికి వాటిమీదే కూర్చొనే భాగ్యం కలిగేది. స్త్రీ లకి ఎప్పుడూ బాడీలోనే కూర్చోవడమే. వాళ్ళ ఒళ్ళో పిల్లలు. ఆయిదేళ్ళదాకా పిల్లలకి టికెట్లుండేవికాదు–ఫ్రీ అన్నమాట.అందుకే అమ్మల వళ్ళో కూర్చోవడం. నాన్నలు ఎప్పుడూ ఫ్రంట్, సెకండ్ సీట్లలోనే కదా.

బస్సుల్లో బలే విచిత్రమైన బోర్డ్ లుండేవి– “హరే రామ, హరేకృష్ణ”, “బస్సులో ధూమపానం చేయరాదు”, “చేతులు బయట పెట్టరాదు “ అంటూ.అవన్నీ బోర్డులవరకే పరిమితం. ఆడా, మగా కూడా లంకపొగాకు చుట్టలు కాల్చేవారు. పైగా అవి, ఉల్టా పెట్టుకుని మరీనూ ( అంటే నిప్పున్నవైపు నోట్లో అన్నమాట !). చేతులు బయట పెట్టొద్దంటారుకానీ, మన శరీరం అంతా బయటకే ఉండేది ఓపెన్ బస్సులు కదా !! బస్సు టాప్ మీద,పేద్ద లగేజీ వేసేవారు, వాటి కిందో మధ్యలోనో, మన సామాన్లుండేవి. మన అదృష్టం బాగోలేక ఆ లగెజీ మధ్యలో ఎక్కడైనా దింఛారో, వాటితో మన సామాన్లు కూడా దింపేసేవారు..

రాజమండ్రీ వెళ్ళాలంటే తెల్లవారుఝామున నాలుగున్నరకి బస్సు ఎక్కేవాళ్ళం. మధ్యలో కొత్తపేటలో కాఫీలకి హాల్టూ, తాలూకాఫీసు దగ్గర ఆపేవాడు.అందరూ కాఫీ టిఫిన్లు చేసి, కిళ్ళి వేసికొని, ఓ దమ్ము కొట్టేదాకా బస్సు కదలదు. బొబ్బర్లంక చేరే లోపల ఊబలంకలో పాలకోవా బిళ్ళలు అమ్మకానికి వచ్చేవి. బొబ్బర్లంకలో దిగి లాంచీ లో గోదావరి దాటి రాజమండ్రీ చేరడం, అక్కడ ఏ వరదరావు హొటల్లోనో, శాంతి నివాస్ లోనో టిఫిన్లు చేయడం. మాకు కొత్తపెటలో బస్సు ఆగినప్పుడు పెట్టించేవారుకాదు!! మెడ్రాసు వెళ్ళాలంటే రాజమండ్రీలోనే మెయిల్ ( హౌరా–మెడ్రాస్) ఎక్కవలసివచ్చేది.

కాకినాడ వెళ్ళాలంటే ముక్తేశ్వరం రేవుకి 10 మైళ్ళు దూరం. బస్సు ప్రయాణం డిట్టో ..పైన చెప్పినట్లు.వచ్చిన గొడవల్లా ఏమిటంటే, గోదావరి పడవల్లో దాటడం. అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ భయమే నాకు పడవ ఎక్కి రేవు దాటడం. ఆ పడవ ఎప్పుడూ ఒరిగే వెళ్ళేది. కళ్ళుమూసుకొని కూర్చొనేవాడిని.కోటిపల్లి రేవులో దిగి , ఓ మైలు నడవ వలసివచ్చేది, బస్సు దాకా. గోదావరి బయటకదా, ఇన్ఫ్లుఎన్సులూ అవీ పనిచేసేవి కాదు. కండక్టర్ ఎక్కడ కూర్చోపెడితే అక్కడే కూర్చోవడం. మధ్యలో ద్రాక్షారం లో టిఫిన్లకి హాల్ట్. భీమేశ్వరస్వామి దేవాలయం చెరువు పక్కన ఆపేవాడు.

అన్నింట్లోకీ చిత్రమేమంటే, ఆరోజుల్లో టికెట్లు వ్రాసేవారు. బస్సు కదులుతున్నా సరే, ఆ చిన్న పుస్తకంలో, కార్బన్ పేపర్ పెట్టి టికెట్ వ్రాసేవారు. ఒరిజినల్ మనకీ, కార్బన్ కాపీ బస్సు వాళ్ళకీ. ఆ రోజుల్లో ఓ జోక్ ఉండేది– ఒకసారి ఓ బస్సు కండక్టర్ శలవులో ఇంట్లో ఉన్నాడుట, వాళ్ళ నాన్నగారికి ఉత్తరం వ్రాయవలసివస్తే, టేబిల్ మీద కార్డ్ పెట్టి, వాళ్ళ పిల్లాడిని టేబిల్ ఊపమన్నాడుట. ఉగితేనే కానీ అతడు వ్రాయలేడు, బస్సులో టికెట్లు వ్రాసి వ్రాసి అలవాటు పడిపోయాడు !!

ఇదంతా ఎందుకు వ్రాశానంటే, ఈ వేళ “పల్లె వెలుగు” బస్సులో తణుకు వెళ్ళి వచ్చాము. ఆ ప్రయాణంలో నా చిన్నతనంలో జరిగేవన్నీ గుర్తుకు వచ్చాయి. మరిన్ని విశేషాలు రేపు.

%d bloggers like this: