బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు–తెలుగు కార్యక్రమాలు

     మన తెలుగు చానెళ్ళు కొన్నింటిలో ప్రసారం చేసే కార్యక్రమాలు చూస్తూంటే, ఫరవాలేదూ, ప్రయత్నం చేయ్యాలే కానీ, వాళ్ళూ మంచికార్యక్రమాలు చూపించగలరనిపించింది. నిన్న ఆదివారం, ఈటివీ–2 లో ప్రసారమయ్యే ” తెలుగు వెలుగు” అలాటి కార్యక్రమమే.తెలుగు భాష ప్రచారానికి, వివిధ రంగాలలో చేస్తున్న కొంతమంది చేసే సేవలు చూపిస్తున్నారు. ఇదివరకు డాక్టర్.మృణాలిని గారు సారథ్యం వహించేవారు. ఇప్పుడు ఇంకొకరు చేస్తున్నారు. ఆవిడ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఒకొక్కప్పుడు చూపించే కార్యక్రమాలు చూడచక్కటివిగా ఉంటాయి.

అలాగే ఈ వేళ టి.టి.డీ వారి “తెలుగు వైభవం ” అనే కార్యక్రమం చూసే అదృష్టం కలిగింది. శ్రీమతి ఝాన్సీ చేసిన ప్రశ్నోత్తర ( క్విజ్) కార్యక్రమం చాలా చాలా బాగుంది. అడిగిన ప్రశ్నలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.సమాసాలూ, సంధుల గురించి కూడా ప్రశ్నలున్నాయి. చిన్నప్పుడెప్పుడో నేర్చుకున్న ఛందస్సు గురించి మళ్ళీ వింటూంటే వినసొంపుగా ఉన్నాయి.

    ” భక్తి” టి.వీ వారి కార్యక్రమాలు చెప్పనక్కరలేదు. వాటిలో అందరూ దురంధరులే. ఈ కార్యక్రమాలు చూస్తూంటే, తెలుగు భాష మీద ఇంకా ఇంకా ఆపేక్ష పెరిగిపోతూంది. తెలుగు వాడిగా పుట్టడం మన అదృష్టం , ఏ జన్మలో చేసికున్న పుణ్యమో అనిపిస్తుంది.

అంతర్జాలం ( నెట్) ధర్మమా అని, తెలుగు కి సంబంధించిన అన్ని రకాల సైట్లూ చూడడం ఓ వ్యసనంలా అయిపోయింది. ఈ మధ్యన, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి, ” వేయి పడగలు”డౌన్లోడ్ చేసికుని చదువుతున్నాను. పుస్తకం కొనాలని చాలారోజులు ప్రయత్నం చేశాను. నా అదృష్టం కొద్దీ నెట్ వెదుకుతూంటే దొరికింది. అలాగే “ గోదావరి కథలు” కూడా. ఇంక భక్తి పాటలు/ శ్లోకాలు కి అంతేలేదు. ఈ మధ్యన శ్రీ ఎం.ఎస్.రామారావు గారు పారాయణ చేసిన ” సుందర కాండ” వినే భాగ్యం కలిగింది.

    నేను చేయకలిగినదల్లా ఏమిటంటే కనిపించిన ప్రతీ వారితోనూ, వీటి గురించి చెప్పడమూ, వారిలో కూడా ఆసక్తి కలిగించడమూ. మన తెలుగు బ్లాగర్లలో ఒక్కరైన శ్రీ మల్లిన నరసింహారావు గారు, నన్ను కలుసుకోవడానికి శ్రమ తీసికొని, రాజమండ్రీ వచ్చారు. సమయాభావం వల్ల ఎక్కువసేపు ఉండలేక పోయారు.ఈ బ్లాగ్గు ప్రపంచం లో ప్రవేశించి ఇప్పటికి నాలుగు నెలలయింది.అందరి ప్రోత్సాహంతోనూ,ఏదో వ్రాస్తున్నాను. ఈ మాధ్యమం ద్వారా చాలా మందితో పరిచయం అయింది.

కావలిసినంత కాలక్షేపం అవుతోంది.

%d bloggers like this: