బాతాఖాని-లక్ష్మిఫణి ఖబుర్లు–మన సినిమాలు

    ఈ మధ్యన మన తెలుగు చానెల్స్ ధర్మమా అని, సినిమాలు, కొత్తవీ, పాతవీ చూడకలుగుతున్నాము.కొత్త సినిమాల్లో చూపించే వయొలెన్స్,డబల్ మీనింగ్ డైలాగ్గులు, చేసే డ్యాన్సులూ చూస్తూంటే, మంచిదయింది, డబ్బులు తగలేసి, క్యూల్లో నిలబడి సినిమాలు చూడడంలేదని సంతోషిస్తున్నాము. టి.వీ అయితే, కనీసం రిమోట్ కి పనిచెప్పి కట్టేయొచ్చు. థియేటర్లో అయితే డబ్బులు వేస్ట్ అవుతాయని, చచ్చినట్లు కూర్చోవలసివస్తుంది!!

ఆ డాన్సులు చూస్తూంటే, మా చిన్నప్పుడు డ్రిల్ మాస్టారు చేయించే ఎక్సర్సైజ్ లా ఉంటోంది. ఇంక డయలాగ్గుల సంగతైతే, ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ప్రస్తుతం ఆంధ్రదేశంలో, చిన్న చిన్న పిల్లల దగ్గరనుండీ, సినిమా వాళ్ళలాగే మాట్లాడుతున్నారు. బహుశా నా లాటివారే ఇంకా ప్రగతి సాధించలేదేమో అనిపిస్తుంది.మన తెలుగు భాషని ఎంత డిబాచ్ చేయకలరో, ఈ రోజుల్లో వచ్చే సినిమా డైలాగ్గులు వింటే తెలుస్తుంది. పైగా ప్రేక్షకులు అలాటివే ఇష్టపడతారూ అంటూ అదో సాకు.

అన్ని సినిమాలూ అలాగ ఉన్నాయని కాదు. ఏడాదికి ఓ అయిదో. ఆరో మంచి సినిమాలు వస్తూంటాయి.ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించేవి. అదృష్టం ఏమిటంటే, ప్రభుత్వం వారి నంది బహుమతులు, ఫిల్మ్ ఫేర్ లాటి వారు ఇచ్చే బహుమతులూ ఇంకా కరప్ట్ అవలెదు. ఈ రోజుల్లో వస్తున్న వయొలెన్స్ సినిమాలు, మన భాషకే పరిమితమా అంటే ఔననే చెప్పాలి. నేను చెప్పేది, హిందీ, తెలుగు సినిమాల గురించే. మిగిలిన భాషలు నాకు అర్ధం అవవు, కాబట్టి చూడను. మళ్ళీ మరాఠీ సినిమాలు మరీ అంత దరిద్రంగా ఉండవు. హిందీలో కూడా, మరీ పెద్ద బడ్జెట్ సినిమాలు కాకుండా, చిన్నవి అధిక శాతం చూడడానికి బాగానే ఉంటాయి.

ఇదివరకటి సినిమాలలో కొంత కథా, మంచి పాటలూ ఉండేవి. ఇప్పుడు తెలుగు సినిమాల్లో ఒకరిద్దరు తప్పించి, మిగిలిన హీరోయిన్లందరూ దిగుమతి చేసికున్న బాపతే. డబ్బింగ్ ధర్మమా అని వీధిన పడకుండా లాగించేస్తున్నారు. హీరోలని ఇంకా దిగుమతి చేయడంలేదు.విలన్లందరూ చాలామంది హిందీ ఫీల్డ్ నుండి వచ్చినవారే. మన వాళ్ళలో ఆమాత్రం చేయకలిగినవారే లేరా? లేక బయటవాళ్ళు, తక్కువ ఖర్చుతో వస్తారా?

సినిమా హాళ్ళకెడితే ఇంకో గొడవ ఉంది పాటలు వచ్చినప్పుడు ఎదో డాల్బీ సౌండ్ అని వళ్ళు జలదరించేలా పేద్ద సౌండ్ పెట్టేస్తారు.చెవుల్లో ఉన్న తుప్పంతా పోతుంది.పోనీ ఆ పాటలేమైనా, జీవితాంతం గుర్తుపెట్టుకునేలాగ ఉంటాయా అంటే అదీ లేదూ, సినిమా ఎంత త్వరగా వెళ్ళిపోతుందో అంతే స్పీడ్ తో ఆ పాట కూడా హూష్ కాకి!!

రాత్రిళ్ళు 10 దాటిన తరువాత మన చానెల్ వాళ్ళు, కొన్ని పాత సినిమాలు వేస్తూంటారు. ఎంత రిఫ్రెషింగ్ గా ఉంటుందో. ఇప్పటి హీరోయిన్లలాగ, బట్టలూడతీసేసుకొని ఉండనవసరం లేకుండా కూడా, వాళ్ళూ చాలా అందంగా ఉండేవారు. ఒప్పుకోవడానికి మొహమ్మాటం పడతారుకానీ, ఆనాటి పాటలు ఏ భాషవైనా ఇప్పటికీ వినడానికి మధురంగానే ఉంటాయి. వీటిని రీమిక్స్ లాటిది చేసి తగలేస్తున్నారు.

అన్నింటిలోనూ పాత ఫాషన్లు తిరిగి వస్తున్నాయి. మన సినిమాలకి ఆ అదృష్టం ఎప్పుడు పడుతుందో !!

%d bloggers like this: