బాతాఖానీ ఖబుర్లు –50

    డిశంబర్ 15 వ తారీఖు నా అసలు జన్మదినం. కానీ ఎస్.ఎస్.ఎల్.సి బుక్ లో ఫిబ్రవరి 26 అని వేయడం వలన రిటైర్మెంట్ ఫిబ్రవరి 28 న అయింది.మా పిల్లలు నాకు షష్టిపూర్తి చేయదలచి, తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామి కల్యాణానికి టికెట్లు బుక్ చేశారు. పూణే నుండి మా అబ్బాయీ, అమ్మాయీ,అల్లుడూ వచ్చారు. చెన్నైనుండి మా కాబోయే కోడలు వచ్చింది. స్వామివారి కల్యాణం పూర్తిచేసికుని, చెన్నై వెళ్ళాము.నన్నూ, మా ఇంటావిడనీ తమిళనాడు టూరిస్ట్ వాళ్ళ దక్షిణదేశ యాత్రకి పంపారు.

    ఆ యాత్రలో మహాబలిపురం, కంచి, పాండిచేరీ, తంజావూరూ, రామేశ్వరం,మధురై,కన్యాకుమారి, కొడైకెనాల్, చిదంబరం, నాగపట్టణం ఇంకా మరికొన్నీ యాత్రా స్థలాలు చూసుకొని, డిశంబర్ 25 కి చెన్నై చేరాము. ఆ మర్నాడు పూణే కి ప్రయాణం. మాకు ఆ రోజు ఏదీ తెలియలేదు. హైదరాబాద్ నుండి ఫోన్ వచ్చింది-మేమందరం ఎలా ఉన్నామూ అని. అప్పుడు టి.వి పెడితే తెలిసింది– సునామీ వలన అపార ప్రాణనష్టం కలిగిందని. మేము ఆ వారంలో చూసిన ప్రదేశాలన్నీ,నాశనం అయిపోయాయి.పూణే వెళ్ళాలంటే ట్రైన్లు బంధ్. ఇంక మరోమార్గంలేక ఫ్లైట్ లో ముంబై వచ్చి, రాత్రికి పూణే చేరాము. మేము యాత్రలో ఎక్కడెక్కడైతే ఉన్నామో, ఆ హొటళ్ళన్నీ నాశనం అయిపోయాయి. ఒక్క రెండు రోజులముందు ఆ విపత్తు వచ్చుంటే, మా పరిస్థితి ఊహించుకోవడానికే భయం వేసింది. , మాకు ఈ భూమిమీద నూకలు మిగిలాయి కాబట్టి, భగవంతుడు మమ్మల్ని క్షేమంగా ఉంచాడు.

    మా అబ్బాయి పెళ్ళి, మే 29 వ తారీఖుకి నిశ్చయించాము. అందువలన పెళ్ళికూతురు చీరలు చెన్నైలోనే, మా అవబోయే కోడలు చాయిస్ ప్రకారం కొన్నాము. ఫిబ్రవరీ లో ఎలాగూ రిటైర్ అయిపోతున్నాను కదా అని, జనవరి లో కలకత్తా ప్రయాణం పెట్టుకున్నాము. నేను అంతకుముందు, మూడు సార్లు వెళ్ళాను. రిటైర్ అయేలోపల, మాకు తిండి పెట్టిన ఆర్డ్నెన్స్ ఫాక్టరీ బోర్డ్ ముఖ్యకార్యాలయం చూపిస్తానని, మా ఇంటావిడకి మాట ఇవ్వడం వల్ల ఈ ప్రయాణం. కలకత్తాలో చూడవలసినవన్నీ చూసి, ఒక రోజు గంగాసాగర్ కి వెళ్ళాము. పెళ్ళిలో పెట్టుబడి చీరలన్నీ బెంగాలీ కాటన్ శారీస్ కొనిపించింది.

    అలా చూస్తూండగానే నా రిటైర్మెంట్ దగ్గరకు వచ్చేసింది. ఏవేవో పార్టీలూ. అన్నింటిలోకీ ఫాక్టరీ చరిత్ర లో మొట్టమొదటిసారిగా అయిందేమంటే–మామూలు గా పర్చేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళూ, అకౌంట్స్ వాళ్ళూ పామూ ముంగిసలాగ ఉండేవారు. అలాటిది మొట్టమొదటిసారిగా, అకౌంట్స్ వాళ్ళు నాకు ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు. ఈ విషయం మా జి.ఎం గారికి కూడా ఆశ్చర్యం వేసింది.

    ఫిబ్రవరి 28 , 2005 నాడు చివరకి నేను రిటైర్ అయానండి. ఆరోజు నన్ను ఇంటికి తీసికెళ్ళడానికి, పిల్లలు ఫాక్టరీకి వచ్చారు. ఇంకో విషయము అదే రోజు మా 33 వ వివాహ వార్షికోత్సవం కూడా. అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, 33 సంవత్సరాలు పూర్తి చేశానుకాబట్టి ఇంట్లో కూడా పెన్షన్ కి ఎలిజిబిలిటీ సంపాదించానన్నమాట !!

    చెప్పినట్లుగా ఎచ్.డి.ఎఫ్.సి వాళ్ళదగ్గరకు వెళ్ళి మార్చ్ 1 వ తేదీన ఇంటి కాగితాలు తెచ్చేసి, మా అబ్బాయి నాగురించి చేసిన లోన్ క్లియర్ చేశాను. ఇంతట్లో తనకో ఆలోచన వచ్చింది, మేము ఉంటున్న ఇల్లు చిన్నదైపోతుంది, అందరూ కలిసే ఉండాలంటే పెద్ద ఫ్లాట్ తీసికోవాలని. రిటైర్మెంట్ డబ్బులు చేతిలో ఉన్నాయి కదా, అవీ, ఈ ఫ్లాట్ అమ్మేసి, ఆ డబ్బులూ వేసి ఇంకో పెద్ద ఫ్లాట్ లోకి మారేము.

మే 29 వ తారీఖున మా అబ్బాయి వివాహం హైదరాబాద్ లో చేశాము. వాళ్ళ గృహప్రవేశం పూణే లో మా కొత్త ఫ్లాట్లోనే జరిగింది.

    మా అమ్మగారు తన 95 వ ఏట, మునిమనవరాలుని ( అబ్బాయి కూతురు) చూసికొని, మా ఇంట్లో, మా ఇంటావిడ చేతిలోనే సునాయాసంగా ప్రాణం విడిచారు.

ఇదండీ నా కథ. ఇప్పుడు చెప్పండి, అస్సలు పెళ్ళే అవుతూందా అని అనుకునేవాడిని, నాకున్న ల్యుకోడెర్మా వల్ల. అలాటిది, 37 సంవత్సరాల క్రింద ఓ అమ్మాయి నిస్వార్ధంగా, తనగురించి కాకుండా, ఇంకోళ్ళ గురించి ఆలోచించి, నాకంటూ ఒక జీవితం ఇచ్చింది. దానికి నేను భగవంతుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడినే. అందుకే మొదట్లోనే చెప్పాను, సుధామూర్తి గారు వ్రాసిన నవలకి ముందే నా జీవితంలోకి ఓ వెలుగు వచ్చిందీ అని. భగవంతుడి దయ ఉన్నంతకాలం, ఇంకోళ్ళకి సహాయం చేస్తూండాలనెదే మా కోరిక. ఈ బాతాఖానీ ఖబుర్లకి ఇది ఆఖరి భాగం. ఇన్నాళ్ళూ ఓర్పుగా చదివినందుకు ధన్యవాదాలు.

%d bloggers like this: