బాతాఖానీ ఖబుర్లు –49

    మా అల్లుడూ, అమ్మాయి, ఢిల్లీలో ఉండగా, మాకు ఆగ్రా,జయపూర్, మథుర చూసే అవకాశం కలిగింది. పిల్లలిద్దరూ దగ్గరలోనే ఉండడం వలన, వాళ్ళతో సమయం కూడా గడప కలిగేము. మధ్యలో గుర్గాం వెళ్ళి మా అబ్బాయి ఇన్స్టిట్యూట్ కూడా చూశాము. ఇంట్లో కంప్యూటర్ వదిలేశాడని చెప్పానుగా, అక్కడ మళ్ళీ ఇంకోటి కావాలంటే కొనిచ్చాను.

    ఇలా నా రిటైర్మెంట్ ఒక ఏడాదిలోకి వచ్చేసింది. 2004 మార్చ్ 7 వ తేదీన, మాకు మనవడు పుట్టాడు. పురుడు మా డాక్టర్ ( శ్రీమతి రావు)గారి ఆధ్వర్యంలోనే జరిగింది. అప్పటికి మా అబ్బాయి, గుర్గాం లో చదువు పూర్తిచేసికొని, పూణే తిరిగి వచ్చేశాడు. ఓ రోజు మా ముగ్గురినీ కూర్చో పెట్టి ,మా అబ్బాయి, ” మీరు ముగ్గురూ ఒకచోటే ఉన్నారూ, ఒక విషయం చెప్పాలి, నేను ఐ.ఐ.ఎం అహమ్మదాబాద్ వెళ్ళినప్పుడు, ఒక అమ్మాయిని కలుసుకొన్నానూ, తను నాకు నచ్చిందీ, మీరు ఒప్పుకుంటే , ఆ అమ్మాయి తల్లితండ్రులు వచ్చి మిమ్మల్ని కలుస్తారూ “ అన్నాడు.

పిల్లల వివాహ విషయంలో మేము ఎప్పుడూ, వాళ్ళ ఇష్టప్రకారమే చేశాము.వాళ్ళ పార్ట్నర్స్ ని వాళ్ళే ఎంచుకున్నారు. మా అంగీకారం చెప్పిన తరువాత, ఆ అమ్మాయి తల్లితండ్రులూ, అన్నయ్యా ,పూణే వచ్చి మాతో మాట్లాడారు.

    ఇదంతా ఇలా ఉండగా, తణుకు లో మా ఇల్లు అమ్మకానికి పెట్టేద్దామని నిశ్చయించుకుని, నెట్ లో ప్రకటించాను. ముందర చాలా మంది మెయిల్స్ పంపేవారు. చివరకు, ముంబై నుండి ఒక అబ్బాయి తో డీల్ అయింది. నేను చెప్పిన ధరకి అతను ఒప్పుకున్నాడు. వచ్చిన సమస్యల్లా, తణుకు వెళ్ళి రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయాలా అని. ఇతనితో మాటలు పూర్తి అయిన మర్నాడు, యూ.ఎస్ నుండి ఒకాయన ఫోన్ చేశారు–” తణుకు లో మీ ఇల్లు అమ్మకానికి ఉందని చదివాను, రేట్ ఎంతండీ”అని. ” ఒకాయనకి మాట ఇచ్చేశానూ” అన్నాను. ” మాటే కదా, టోకెన్ మనీ ఏమీ పుచ్చుకోలేదు కదా ” అన్నారు. పైగా నాకెంత కావలిసి వస్తే అంత ఇవ్వడానికి రెడీ అని కూడా చెప్పారు. అంటే ఇది డబ్బుగురించి కాదండీ, ఇచ్చిన మాట వెనుకకు తీసికొనే అలవాటు లెదూ అని చెప్పాను.అయినా ఇంకోసారి ఆలోచించండీ, మళ్ళీ ఫోన్ చేస్తానూ అన్నారు.ఇంక ఆలోచించడానికి ఏమీలేదూ అని క్లోజ్ చేసేశాను.

    మా ఇంటావిడ, అమ్మాయి పిలిచిందని ఢిల్లీ వెళ్ళింది. నేను అదే టైములో తణుకు వెళ్ళి ఇల్లు అమ్మకం వ్యవహారం పూర్తి చేసేసుకున్నాను. ఈ సందర్భం లోనే, నేను తణుకు లో ఉండగా, ముంబైలో ఒక ఏక్సిడెంట్ లో మా అన్నయ్య గారి అబ్బాయి, నేవీ లో పనిచేసేవాడు, స్వర్గస్థుడయ్యాడని తెలిసింది. దురదృష్టం.

    అక్కడ కార్యక్రమాలన్నీ పూర్తి చేసికుని, తిరిగి పూణే వచ్చాము. ఇంక మా ఇంటావిడకి టెన్షనూ. ఉన్న ఇల్లు నేను లేకుండా చూసి అమ్మేసి వచ్చారూ అని అందరితోనూ గొడవా. ఆ ఇల్లు అమ్మెసి పూణే లో సెటిల్ అవ్వాలని ఇద్దరమూ కలిసి తీసికున్న నిర్ణయమే, అయినా నన్ను ప్రొవోక్ చేసి ఎలాగోలాగ, చేతిలో ఉన్న డబ్బు ఖర్చయ్యేలొపులో, ఇంకో ఇల్లు కొనిపించాలని ఒకే నస.వదలదే. మళ్ళీ శూన్యమాసం, ఈ లోపులోనే ఇల్లు కొనేయాలీ అంటుంది. ఇదేమైనా దుకాణానికి వెళ్ళి

చింతపండూ, పంచదారా కొన్నట్లా ? ఈవిడ గొడవ భరించలేక మొత్తానికి ఇళ్ళ వేట ప్రారంభించాము. ఎక్కడ చూసినా ఖరీదులు, ఆకాశానికి ఉన్నాయి.ఒక ఏడాదికంటే ఎక్కువ సర్వీసు లేని నాలాంటి వాడికి ఏ బ్యాంకు వాడూ అప్పు ఇవ్వనన్నాడు, నా చేతిలో ఉన్నదానితో ఫ్లాట్ రాదు. అబ్బాయి, బెగుళూరు లో ఉన్నప్పుడు, ఫోన్ చేసి తన పేరు మీద లోన్ సంపాదించాము. నేను పెట్టినకండిషన్ ఏమంటే నేను రిటైర్ అయిన మర్నాడు, నాకొచ్చే రిటైర్మెంట్ డబ్బులోంచి, ఈ లోన్ అమౌంట్ క్లియర్ చేస్తానని.మొత్తానికి మా ఇంటావిడ ఓ ఇల్లు పూణే లో నాచేత కొనిపించిందండి.

    ఇప్పుడు మళ్ళీ ఇంకో గోల ప్రారంభం అయింది. రోజూ, నన్ను కూర్చోపెట్టి, మేము కొన్న ఫ్లాట్ లో ఏది ఎక్కడుండాలో, ఎలా చేయించాలో, తూర్పులో ఏం ఉండాలో, వాయవ్యంలో ఏం ఉండాలో అంటూ. నాకు ఎదురుగా నుంచుంటేనే ఈ దిక్కులూ అవీ తెలియదు, ఇలా త్రీ డైమెన్షలలో చెప్తే ఇంకేం తెలుస్తుందీ. ఇలా కాదని నాకు తెలిసిన ఓ ఇంటీరియర్ డెకొరేటర్ ని తీసికొచ్చి ఆవిడకు అప్పగించాను. నన్నేం అడగొద్దూ, ఈవిడకి ఎలా కావాలో అలా తయారుచెయ్యి, డబ్బులు ఎంత అవుతాయో మాత్రం చెప్పు, అన్నాను.

    సెప్టెంబర్ లో ఇంటి గృహప్రవేశం చేసికుని, మా అబ్బాయి ఎంగేజ్మెంట్ కి హైదరాబాద్ వెళ్ళాము. అమ్మాయీ, అల్లుడూ శలవు పెట్టి వచ్చారు. మేము తిరిగి పూణే వచ్చాము. ఎలాగూ స్వంత ఇంట్లోకి మారిపోయాము కదా అని, ఆ పై వారంలో ఫాక్టరీ క్వార్టర్ ఖాళీ చేద్దామనుకున్నాము. ఇంతలో ఆ రాత్రి మా అమ్మాయి దగ్గరనుండి ఫోన్ వచ్చింది.వాళ్ళు, యు.ఎస్ వెళ్ళిపోవడం కేన్సిల్ చేసికొని, పూణే లో ఉద్యోగానికి వచ్చేస్తున్నామని !! మా అల్లుడు పేరెంట్స్ కూడా పూణే లోనే సెటిల్ అయ్యారు, ఇప్పుడు మేము కూడా అక్కడే సెటిల్ అవుతున్నామూ, ఈ కారణాల వల్ల ఇక్కడైతేనే బాగుంటుందనుకున్నారు.అదృష్టం కొద్దీ, నా క్వార్టర్ ఇంకా నా చేతిలోనే ఉంది, ఏం వర్రీ అవకండి, ఫిబ్రవరీ దాకా మీకు ఇంటి గురించి సమస్య లెదూ, వచ్చేయండీ అన్నాను.ఇంతలో హైదరాబాద్ లో ఉన్న మా అబ్బాయి కూడా, నెనూ పూణే వచ్చేస్తున్నానోచ్ అన్నాడు.ఇలా అందరమూ పూణే లోనే సెటిల్ ఐపోయాము.

%d bloggers like this: