బాతాఖానీ ఖబుర్లు–48

    2001 వ సంవత్సరం లో నన్ను ఓ మూడు వారాల ట్రైనింగ్ కి మెదక్ ఆర్డ్నెన్స్ ఫాక్టరీకి పంపారు. పోనీలే మన వాళ్ళని చాలా కాలం తరువాత కలుసుకోవచ్చూ అనుకుంటే, అక్కడకు వెళ్ళగానే వైరల్ ఫీవర్ పట్టుకుంది. రెండు వారాలు దీనితోనే ఐపోయింది. అయినా గవర్నమెంట్ లో ఈ ట్రైనింగులూ అవీ, ఏవేవో నేర్పేద్దామని కాదు, ఊరికే పాత స్నేహితులందరూ ఒకసారి కలుసుకోవడానికి మాత్రమే అని నా అభిప్రాయం. క్లాసులో వింటున్నంతసేపూ బాగానే ఉంటుంది, ఏవేవో నేర్చేసుకున్నామనే భావనా, బయటకు వెళ్ళగానే హూష్ కాకీ !! కానీ, ఆ ట్రైనింగ్ సందర్భం గా, మా వాళ్ళు తయారుచెసే ఏ.పీ.సీ ( ఆర్మ్డ్ పెర్సొనేల్ కారీయర్), ఎలా తయారు చేస్తారో, బులెట్ ఫ్రూఫ్ గ్లాస్ ఎలా తయారుచేస్తారో చూశాము.అలాగే నా 42 సంవత్సరాల సర్వీసు లోనూ, హై ఎక్స్ప్లోజివ్స్ ఎలా తయారుచేస్తారో, 7.62/5.56 అమ్మ్యునిషన్ ఎలా తయారుచేస్తారో తెలిసికున్నాము. క్వాలిటీ సర్కిల్ కార్యక్రమాల ధర్మమా అని, మిగిలిన ఫాక్టరీలకి వెళ్ళి, అక్కడ తయారుచేసే వివిధ రకాలైన సామగ్రీ చూసే అదృష్టం కలిగింది. మా అర్డ్నెన్స్ ఫాక్టరీల వాళ్ళు, 24 గంటలూ పనిచేసి, దేశ రక్షణ కార్యక్రమంలో సైనికులకి చాలా చేయూత ఇస్తున్నారు, అయినా ఆర్మీ వాళ్ళకున్నంత గుర్తింపూ, గ్లామరూ లేకపోవడం వల్ల పాపం వీళ్ళగురించి ఎవరికీ తెలియదు !!

    ఇది ఇలా ఉండగా, మా అమ్మాయీ, అల్లుడూ హైదరాబాద్ లో ఉద్యోగంలో చేరారు. ఇంక మా ప్రయాణాలు, ముంబై నుండి హైదరాబాద్ కి ప్రారంభం అయ్యాయి.ఇదంతా ఇలా ఉండగా, మా బావమరిది కి పెళ్ళి నిశ్చయించి, ఇంటికి పెద్ద అల్లుడుని కదా అని మమ్మల్ని స్నాతకం పీటలమీద కూర్చోమన్నారు.మేం వెళ్ళడానికి నాలుగు రోజులముందుగా, మా అమ్మ గారికి తుంటి ఎముక విరిగి, ఆపరెషనూ అదీ, ఎలా పెళ్ళికి వెళ్ళడమా అనుకుంటూంటే, ఆవిడే చెప్పారు–” నాకు ఏమీ అవదూ, వెళ్ళి మీ బావమరిది పెళ్ళి చేయించేయ్ “అని. నేనూ, మా ఇంటావిడా ముందుగా తణుకు వెళ్ళాము. పెళ్ళి రోజుకి మా అల్లుడూ, అమ్మాయీ, అబ్బాయీ , మనవరాలూ కారులో పెళ్ళికి ఏలూరు వచ్చారు. అంతా పూర్తిచేసికొని తిరిగి వెళ్ళిపోయారు. మా ఇంటావిడ వాళ్ళ తమ్ముడూ, మరదలుతోపాటు మంగళూరు దాకా వెళ్ళి పూణే తిరిగి వచ్చింది.

    మా అబ్బాయి జి.ఆర్.ఈ కి వెళ్తానన్నాడు, సరే అన్నాను, ఏమనుకున్నాడో ఏమో కాట్ కి కూడా వెళ్తానన్నాడు. పై చదువుకి దేనికి వెళ్తానన్నా దేనికీ అడ్డు పెట్టలేదు. ఈ మధ్యలోనే నా పళ్ళ వ్యవహారం కొంచెం తీవ్రతరమై, మా కజిన్ ధర్మమా అని, మిలిటరీ హాస్పిటల్, కర్కీ, లో నాలుగు సిటింగుల్లో, మిగిలిన 24 పళ్ళూ తీయించేసుకున్నాను. ఆయన అక్కడ ఉండకపోతే అన్ని సౌకర్యాలతో, అంత విజయవంతంగా, నా పళ్ళ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేదికాదు. గాడ్ బ్లెస్ హిం.

    నేను పళ్ళు పూర్తిగా తీయించుకునే సరికి నాకు ఇంకా మూడు సంవత్సరాల సర్వీసు మిగిలి ఉంది. పళ్ళు లేకపోయినా,నేను మాట్లాడినది స్పష్టంగా ఉండేది, ఎవరికీ అర్ధం అవకపోవడమనే సమస్యే ఉండేది కాదు. అందువలన చాలామందికి నేను చెప్పేదాకా తెలియదు నాకు పళ్ళు లేవని !! అలా ఇప్పటికి 7 సంవత్సరాలయింది, మా ఇంటావిడ ధర్మమా అని, నేను తినగలిగేవే చేస్తుంది( అంటే మెత్తగా) ,భగవంతుడి దయతో ఎటువంటి ఆరోగ్య సమస్యా లేకుండా లాగించేస్తున్నాను.

    ఇంతట్లో మా అల్లుడూ, అమ్మాయీ హైదరాబాద్ నుండి ఢిల్లీ కి మారారు.మా అబ్బాయికి ఇంజనీరింగ్ అయిన తరువాత క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది.అమ్మయ్యా, ఇప్పటికి అబ్బాయి తన కాళ్ళమీద తను నిలబడతాడూ అనుకున్నంత సేపు పట్టలేదు, ఉద్యోగం లో చేరనూ, ఎం.బి.ఏ లో చేరతానూ అని.మా ఇంటావిడంటుందీ, చదువుకోవాలని ఉత్సాహం ఉన్నప్పుడు, మనం కాదంటే ఎలాగా అని.అదికూడా దగ్గరలో కాకుండా, గుర్గాం వెళ్తానన్నాడు. సరే అని, ఏవో తిప్పలు పడి, బాంక్ లో లోన్ తెచ్చుకుని అక్కడ చేర్పించాము. ఒక విషయం చెప్పుకోవాలి, మా అబ్బాయి ఇంజనీరింగులో ఉన్నప్పుడు, వాళ్ళ అక్క ముంబైలో ఉండేది. ఆ తరువాత అబ్బాయి గుర్గాం వెళ్ళినప్పుడు అమ్మాయి ఢిల్లీలో ఉండేది. ప్రస్తుతం ఇద్దరూ పూణే లోనే సెటిల్ అయ్యారు. మాకూ ఒక నిశ్చింతా– అక్కా తమ్ముళ్ళు ఎల్లప్పుడూ ఇలాగే ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉంటారని.

%d bloggers like this: