బాతాఖానీ ఖబుర్లు–47

    అమ్మ్యునిషన్ ఫాక్టరీ పర్చెస్ డిపార్ట్మెంట్ లో పని చాలా ఆసక్తి కరంగా ఉండేది.అంతకుముందు 35 ఏళ్ళ సర్వీసులోనూ ఎన్నడూ ఇటువంటి పని చేయడానికి అవకాశం రాలేదు. మొదట్లో కొంచెం కన్ఫ్యూసింగ్ గా ఉండేది.ముందుగా సెక్షన్ లనుండి వాళ్ళ కి కావలిసిన వస్తువుల జాబితా వచ్చేది.మామూలుగాగవర్నమెంట్ శాఖలలో, ఏదో ఫలానా వస్తువు కావాలనే లేదు, జ్ఞాపకం వస్తే చాలు, అది కావాలనే వారు.అది నిజంగా అవసరమా లెదా అన్నది వేరే విషయం.ఇంకో సెక్షన్ ఉండేది, మాకు అనుబంధంగా మెటీరియల్ కంట్రోల్ ఆఫీసు అని, వాళ్ళు ముందుగా చెక్ చేసేవారు, ఆ వస్తువు అవసరమా లెదా అని, దాని స్టాక్ ఎంత ఉందీ, దానిని క్రిందటిసారి కొన్నప్పుడు ఖరీదెంత, ఎవరి దగ్గర కొన్నామూ లాంటి వివరాలతో. రోజుకి ఓ పాతిక రిక్విజిషన్లు వచ్చేవి. వాటినన్నిటినీ మళ్ళీ నేను స్వయంగా చెక్ చేసి, మా మేనేజర్ కి చెప్పేవాడిని. కొన్నింటిని కొనడం వాయిదా కూడా వేసేవాళ్ళం.

    ఒక్కో వస్తువూ కొనడానికి సుమారుగా ఎంత ఖర్చవుతుందీ అని ముందుగా ఎస్టిమేట్ చేయడం, 50,000/- రూపాయలైతే, నా లెవెల్ లోనే అయిపోయేది.నాలుగు లక్షలదాకా అయితే, ఇంకో కమెటీ ఉండేది, 4-20 లక్షలదైతే ఇంకో పెద్ద కమెటీ, 20–50 లక్షలైతే అన్నిటికంటే పెద్ద కమెటీ వాళ్ళూ, అలాగ 3 లెవెల్స్ లో కమెటీలుండేవి. అన్నిటికీ టెండర్లు పిలవడమూ, వాటిని తెరవడమూ, వాటి సి.ఎస్.టీ తయారుచేయడమూ నా బాధ్యతగా ఉండేది. వీటన్నింటనీ చేయడానికి నాకు ఓ ఆరుగురు స్టాఫ్ నిచ్చారు.ఒకసారి నాకు ఇచ్చిన తరువాత వాళ్ళతో ఎలా పనిచేయించుకోవాలో నా ఇష్టప్రకారమే జరగాలనేవాడిని. ఇది కొంతమంది నా పై ఆఫీసర్లకి నచ్చేది కాదు.జి.ఎం గారికి రిపోర్ట్ చేశారు. నన్ను ఆయన పిలిచి అడిగితే చెప్పాను-“సర్, అడిగినట్లుగా మెటీరియల్ టైముకి తెప్పించానా లెదా అనెదే ప్రశ్న, అంతేకానీ,నెను నాక్రింద వాళ్ళతో ఎలా చేయించానూ, ఎప్పుడు చేయించానూ అన్నది ఎవరికీ అవసరం లేదు.ఒక్కొక్కప్పుడు లంచ్ ఇంటర్వల్ లో కూడా పనిచేయించుకుంటాను, అలాటప్పుడు వాళ్ళకి, రెస్ట్ ఇవ్వల్సిన బాధ్యత నాది, నాకు తోచిన విధంగా ఇస్తాను” . నేను చెప్పిన దానితో ఆయన ఏకీభవించి, మా ఆఫీసర్లని పిలిచి వారికి చెప్పారు. అప్పటినుండీ, నా పనిలో ఎవరూ కలుగచేసికోలేదు.

    ఇవన్నీ ఒక ఎత్తూ, అకౌంట్స్ వాళ్ళదగ్గర వీటి అప్రూవల్ తీసికోవడం ఓ ఎత్తూ. ఏ ఫైల్ అయినా నేనే స్వయంగా తీసికెళ్ళి వాళ్ళు అడిగిన ప్రతీ సందేహానికీ జవాబు చెప్పేవాడిని. దీనివలన ఇంకో ఉపయోగం ఏమిటంటే ఫైళ్ళు ఎక్కడా ఉండిపోయేవి కాదు.ఎప్పుడైనా ఎకౌంట్స్ వాళ్ళు వివరణ అడిగితే, ఆ వస్తువు ఎవరైతే కావాలన్నారో వాళ్ళ సెక్షన్ కి కూడా వెళ్ళి వారితో సంప్రదించి, పని చేసేవాడిని. దీని వలన సాధించేదేమంటే అందరితోనూ సంయమనం.అందరికీ ఒక నమ్మకం ఏర్పడింది, ఏదైనా వస్తువు కావలిసి వస్తే, దానిని ముందుగా నాతో సంప్రదించేవారు. ఫాక్టరీ లో జి.ఎం గారి వద్దనుండి, యూనియన్ లీడర్స్ వరకూ ఓ నమ్మకం ఏర్పడింది–ఫణిబాబు తో చెప్తే ఏ పనైనా అవుతుందీ అని. అలా మొత్తం ఫాక్టరీ విశ్వాసానికి పాత్రుడనవడం భగవంతుని ఆశీర్వాదం, నా అదృష్టం అని భావిస్తాను.

    ప్రొద్దుటే 8.00 గంటలకి ఫాక్టరీకి వెళ్తే సాయంత్రం 7.00 గంటలదాకా, విశ్రాంతి అనెది ఉండేదికాదు.అక్కడ ఉన్న ఆఖరి ఆరు సంవత్సరాలూ శలవు అన్నది పెట్టింది మొత్తం ఆరు వారాలే, అదికూడా నా పళ్ళు తీయించుకున్నప్పుడు మిలిటరీ హాస్పిటల్ లో చేరినప్పుడు.

ఫాక్టరీలో ఉన్నవాళ్ళతో సంబంధాలు ఉండడం సరే, మాకు మెటీరియల్ సరఫరా చేసే వెండర్లతో కూడా సంబంధాలు అలాగే ఉండేవి. ఏ పనైనా న్యాయ బధ్ధంగా చెస్తానని వాళ్ళకీ ఓ నమ్మకం ఏర్పడింది.

పైన వ్రాసిందంతానా స్వంత డబ్బా కొట్టుకోవడానికి అనుకోకండి. ఏదైనా పని అప్పచెప్పినప్పుడు అది గవర్నమెంటైనా, ప్రెవేటైనా సరే, మనం ఆ పనికి సంబంధించినంతవరకూ అన్ని విషయాలూ తెలిసికోవాలి. మనకిచ్చిన పనిని, ఏ స్వార్ధం లేకుండా చేస్తే అందరి మెప్పూ సంపాదించవచ్చు. గవర్నమెంటులో రూల్స్ చాలా ఉంటాయి. ముందుగా అవన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మనకెందుకూ అవన్నీ పైవాడు చూసుకుంటాడులే అనుకుంటే కుదరదు. నేను పనిచేసిన విభాగంలో ఏమైనా తప్పులు వస్తే మన పీకకీ చుట్టుకుంటుంది, అందుకనైనా అన్ని రూల్సూ తెలిసికోవడం తప్పని సరి.మీరు ఎప్పుడైనా, నెట్ లో విజిలెన్స్ వాళ్ళవి కానీ, సి.ఏ.జీ వాళ్ళవి కానీ సైట్లు చూడండి, మా ఆర్డ్నెన్స్ ఫాక్టరీలలో ఎన్ని గందరగోళాలు జరుగుతాయో. ఎటువంటి విమర్శా రాకుండా ఎవరిచేతా మాట పడకుండా, క్లీన్ గా రిటైర్ అవడం నా అదృష్టంగా భావిస్తాను.

    ఏ వస్తువైనా కొనాలంటే కొల్లేటి చాంతాడంత ప్రొసీజరు. అన్నిటిలోనూ రూల్స్ పాటించడం కష్టం. అలాగని వాటిని అతిక్రమిస్తే ఏ ఆడిట్ వాళ్ళో పట్టుకుంటారు, మనం ఏదైనా రూల్ కి విరుధ్ధంగా చేయవలసి వస్తే, దాని గురించి ముందుగా అకౌంట్స్ వాళ్ళు అడిగే ప్రతీ ప్రశ్నకీ సమాధానం చెప్పి, వాళ్ళని కన్విన్స్ చేయాలి.అందరూ గవర్నమెంట్ లో పనిచెసేవాళ్ళే. అయినా కత్తిపీటకి అందరూ లోకువే అన్నట్లుగా, ఆడిట్, అకౌంట్స్ వాళ్ళకి మేమంటే లోకువా.ప్రతీ దానికి ఓ క్వెర్రీ వ్రాసేవారు. మనకి రూల్స్ అన్నీ తెలుస్తే ఇవన్నీ నల్లెరుమీద నడకలా అయిపోతాయి. అందువలన సబ్జెక్ట్ అంతా నేర్చుకోవడం ముఖ్యం.అది మనకు తెలియదని అవతల వాడు పసి కట్టేడా, ఇంక మన పని ఐపోయినట్లే. మా బాస్ అకౌంట్స్ తో ఏదైనా తేడా వస్తే వాళ్ళతో మాట్లాడడానికి నన్నే పంపేవారు.

    నేను చెసే పనిలో ఒక్క రోజూ విసుపు రాలేదు. ప్రతీ రోజూ ఓ కొత్తదానిలాగే ఉండేది. ఏ పనైనా మనం తీసికునే శ్రధ్ధ మీద ఆధార పడి ఉంటుంది.

%d bloggers like this: