బాతాఖానీ-తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు

    ఈ వేళ భక్తి టి.వీ. లో శ్రీ గరికపాటి నరసింహరావుగారు,చెప్పే ఆంధ్రమహాభారతం సామాజిక వ్యాఖ్య విన్నాను.ఈ వేళ్టి ప్రవచనంలో యమధర్మరాజు విదురిడిగా ఎందుకు జన్మించారో చెప్పారు–మాండవ్య మహాముని ఎంతో పుణ్యం చేసికున్నవారు. అయినా ఆయనని నరకానికి పంపుతారు యమధర్మరాజు.కారణం ఏమిటని మాండవ్యుడు, యమధర్మరాజును అడగ్గా, ఆయన చిత్రగుప్తుడిచే ఆయన చిఠా చదివిస్తారు. దానిలో, మాండవ్యుడు ఎప్పుడో చిన్నతనంలో చేసిన పాపం ఒకటి కనిపిస్తుంది. దానిప్రకారం ఈయన (మాండవ్యుడు) చిన్నతనంలో తుమ్మెదలని పట్టుకుని వాటిని ఈత ముళ్ళతో గాయపరచేవాడట. మాండవ్యుడన్నారూ అదేదో నేను చిన్నతనంలో తెలియక చేసిన పాపము, దానికి ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేశారూ, పైగా నెను చేసిన పని “పాపం” అని నా తల్లితండ్రులు చెప్పాలీ, చిన్నపిల్లలకి తక్కువ శిక్షా, పెద్దవాళ్ళకి పెద్దశిక్షా ఉండడం ధర్మమూ అని చెప్పారుట. అప్పుడు యమధర్మరాజు ” ఓహో ఈయన చెప్పినదానిలో ధర్మసూక్షం ఉందీ, చిన్నపిల్లలు ఏదైనా తప్పుచెస్తే, అలా చేయకూడదని చెప్పడం తల్లితండ్రుల బాధ్యత కదా ” అని ఒప్పుకున్నాడట. “అయినా ఒకసారి శిక్ష వేసిన తరువాత దానిని తగ్గించే అధికారం నాకు లేదూ, భవిష్యత్తులో మీరు చెప్పినది దృష్టిలో పెట్టుకుని ధర్మ పరివర్తన చేస్తామూ” అన్నారుట. దానికి మాండవ్యుడు ఒప్పుకొని, “మీరు ఇన్నాళ్ళూ తెలిసో తెలియకో న్యాయం సరీగా చేయలేదూ అందువలన మీరు కూడా శిక్ష అనుభవించాలీ, భూలోకంలో మానవుడిగా జన్మ ఎత్తి, అన్నిరకాల భవబంధాలూ అనుభవించండీ” అని శాపం ఇవ్వడం వలన యమధర్మరాజు భూలోకంలో విదురిడి గా జన్మించారుట. ఇదండీ కథ…

    ఇదంతా ఎందుకంటే, చిన్న పిల్లలు చేసే తప్పులకి తల్లితండ్రులదే పూర్తి బాధ్యత అని చెప్పడానికి. ఈ మధ్యన ఒక పెళ్ళికి వెళ్ళాము. అక్కడ అకస్మాత్తుగా ఒక ఆయన, పెళ్ళి జరిగే హాల్ లోకి వచ్చి, ఓ పదహారేళ్ళ పిల్లాడిని, ఛడా, మడా తిట్టేస్తూ చెయ్యి పట్టుకుని లాక్కొనిపోయారు. ఎవరికీ ఆయనని ఆపే ధైర్యం లేకపోయింది. జరిగిన సంగతి ఏమిటంటే, ఈ అబ్బాయి ఈయన కారు తాళాలు కార్లోనే మరచిపోయారని చూసి, ఆ కారు ఇంజన్ స్టార్ట్ చేసేశాడు. కంట్రోల్ చేయడం చేతకాక, ఎదురుగా పార్క్ చేసిన ఇంకోళ్ళ కారుని గుద్దేశాడు. అంతా హంగామా అయిపోయింది. ఈ రెండు కార్లూ డామేజ్ చేసేసి, గుమ్ముగా వచ్చేసి కూర్చున్నాడు. అది ఈయనకి తెలిసి, ఈ పిల్లాడిని అలా లాక్కొనిపోయారుట. మొత్తం ఈ వ్యవహారం అంతా సెటిల్ చేయడానికి ఈయనకి 50,000 రూపాయలయ్యాయి. మరి ఒళ్ళుమండిందంటే తప్పేముందీ?

    దీనికంతకూ మూల కారణం ఏమంటే, పూర్తిగా నేర్చేసుకోకపోయినా మన వాళ్ళు, వాళ్ళ పిల్లల చేతిలో,కార్లూ, బైక్కులూ ఇవ్వడం. అదేదో పేద్ద ఘనకార్యం చేసేమనుకుంటారు. పైగా అందరితోనూ చెప్తారు కూడా, మా వాడికి ఇంకా పదిహేనేళ్ళు నిండలేదూ, అప్పుడే కారు నడిపేస్తున్నాడూ అని. ఇంక ఈ హీరో లకి చేతిలో బైక్కో, కారో చేతికి వచ్చిందంటే, వాళ్ళు షూమాకర్
అయిపోయామనుకుంటారు. రోడ్ల మీద వీళ్ళు నడిపించే పధ్ధతి చూస్తే ఆ భగవంతుడే మనని కాపాడాలి. నూతుల్లో బైక్కులు తొక్కేవాళ్ళలాగ పేద్ద చప్పుళ్ళు చేసికుంటూ, రోడ్డంతా వీళ్ళదే అనుకుంటారు. పోనీ తల్లితండ్రులు ఏమైనా కంట్రోల్ చేస్తారా?

    వీళ్ళనే అని లాభం ఏమిటీ, మన ట్రాఫిక్ పోలీసులు కూడా ఏమీ పట్టనట్లు వదిలేస్తారు. పోనీ ఇంకా మీసాలైనా రాని కుర్రాడు అంత స్పీడ్ గా వెళ్తున్నాడూ, వాడికి లైసెన్స్ ఉందో లేదో చూద్దామనేనా ఉండదు. ప్రతీ తండ్రికీ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉందిగా. అంత చిన్నపిల్లల చేతికి బైక్కులూ, కార్లూ ఇచ్చి రోడ్లమీదకి వదిలెస్తే ఎలాగా? అసలు శిక్ష ఆ బాధ్యతారహిత తండ్రికి వేయాలి.

    ఒకసారి రోడ్డుమీదకు వెళ్తే క్షేమంగా ఇంటికి వచ్చేమంటే కారణం మన ఇంట్లో వాళ్ళ మాంగల్యాలు గట్టిగా ఉండడం వలనే. ఇలా వ్రాయడం కొంతమందికి నచ్చక పోవచ్చు. ఈయనకి సైకిలు తొక్కడం కూడా రాదు, చిన్నప్పటినుండీ వాహనం చేతిలో పెడితే, పెద్ద అయ్యేసరికి మా వాడు ఎక్స్పర్ట్ అవుతాడూ, ప్రాక్టీస్ లేకపోతే ఎలాగా అని. ప్రాక్టీస్ ఇవ్వడంలో తప్పులెదు, వాళ్ళని ఇలా రోడ్లమీద వదిలేయడమే తప్పు. ఇందులో తండ్రి పాత్ర ఎంతో ఉంది. ఒకసారి ఆలోచించండి.

%d bloggers like this: