బాతాఖానీ–తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు

    ఈ వేళ సాక్షి పేపర్లో ఒక వార్త చదివాను–“స్నేహంగా నమ్మించి..పెళ్ళికి వెళ్ళి వస్తానంటూ పదిన్నర కాసుల బంగారు ఆభరణాలు తీసికెళ్ళిన ఒక మహిళ తిరిగి రాలెదంటూ పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన ఓ మహిళ పోలీసు రిపోర్ట్ ఇచ్చింది ” అని. అసలు ఈవిడ అంత బంగారం ఇంకోళ్ళకి నమ్మి ఎలా ఇచ్చిందో భగవంతుడికే తెలియాలి. ఇదివరకటి రోజుల్లో పక్క వాళ్ళింటికి వెళ్ళడం, ఏదో పప్పో, ఉప్పో, నూనో, అప్పడగడం ఓ అలవాటుగా ఉండేది.

    ఇప్పడుకూడా చూస్తూంటాము, కొంచెం పరిచయం ఉంటే చాలు, స్కూటర్/బైక్ నుండి కెమేరా దాకా అన్నీ అడిగేయడమే.కర్మకాలి, మొహమ్మాటానికి ఇచ్చేమా, ఇంక దానిగురించి మర్చిపోవాలి.ఏ వస్తువైనా ఒన్ మాన్ హాండ్లింగ్ ఉన్నంతవరకూ ఫర్వాలెదు. అందరూ ఒకేలాగ వాడరుగా.కొంతమంది అయితే, తీసికెళ్ళిన వస్తువు, తిరిగి ఇచ్చేటప్పుడు, అది పాడైందనికూడా చెప్పకుండా ఇస్తారు. దానికేమైనా రిపేర్లు వస్తే నోరుమూసుకొని చేయించుకోవడమే. అది ఓ ఎలక్టానిక్ వస్తువే కానక్కర్లేదు.కొంతమంది స్టూళ్ళూ, నిచ్చెన్ల దగ్గరనుండి అన్ని వస్తువులూ అడుగుతూనే ఉంటారు. పోనీ పని అయిపోయిన తరువాత తిరిగి ఇస్తారా, అబ్బే, మనమే మళ్ళీ వాళ్ళ వెనక్కాల పడి తెచ్చుకోవాలి. అలా అడిగినప్పుడు, ఏదో మెహర్బానీ చేస్తున్నట్లుగా మొహంపెట్టి, మరీ ఇస్తారు.

    ఈ ఎరువు తెచ్చుకోవడం అనేది ఒక ” నేషనల్ అబ్సెషన్” అనుకుంటా.మొన్న ఏదో బ్లాగ్గులో చదివాను, కొంతమంది ఇడ్లీ పిండి రుబ్బించుకోవడానికి కూడా పక్కవాళ్ళ మీద ఆధార పడతారు!!వీళ్ళింట్లో వెట్ గ్రైండర్ కొనుక్కున్న పాపానికి. నేను బ్రహ్మచారిగా ఉన్నప్పుడే ఇంట్లోకి కావలిసిన వస్తువులన్నీ కొనుక్కున్నాను.నాకొచ్చిన గొడవ ఏమిటంటే మా పక్కింటివాళ్ళు నేను అవన్నీ అస్తమానూ ఉపయోగించుకోను కదా అని, వాళ్ళింట్లో పెట్టుకునేవారు, స్టీల్ డబ్బాలనుండి,గిన్నెల దాకా. పెళ్ళైనతరువాతైనా తిరిగి ఇవ్వాలన్న ఇంగితజ్ఞానం ఉండాలా, అలాంటిదేమీ లెదు. నా భార్య వాళ్ళింటికి వెళ్ళి అడిగేదాకా, నా వస్తువులు తిరిగి గూటికి చేరలేదు. పైగా అలా అడిగినందుకు కోపాలూ–వాళ్ళ ఆస్థేదో మనం తినేసినట్లుగా!!

    ఇక్కడ రాజమండ్రీలో ఒక అబ్బాయి—- “మేము పిక్నిక్ కి వెళ్తున్నామూ, మీ దగ్గర డిజిటల్ కెమేరా ఉంటే ఇవ్వండి,ఓ నాలుగు రోజుల తరువాత ఇచ్చేస్తానూ, నాది మాఫ్రెండొకడు తీసికెళ్ళాడూ (ఇదో ఎక్స్క్యూజూ మళ్ళి)”అని అడిగాడు ఓ రోజు.నేనన్నానూ” మనిద్దరికీ పరిచయం ఎన్నాళ్ళండీ, మీరు అడగ్గానే ఇచ్చేస్తానని ఎలా అనుకున్నారూ “అని అడిగాను.అంటే అతనన్నాడూ ” ఒక సారి ఇస్తే అరిగిపోతుందా” అని ఓ రిటార్టూ!! అప్పుడు చెప్పాను ” నేను ఎవరిదగ్గరా ఏ వస్తువూ ఎరువు తెచ్చుకోవడం కానీ, ఇవ్వడం కానీ అలవాటు లేదు” అని మొహమ్మాటం లేకుండా చెప్పి వదుల్చుకొన్నాను! ఇది చదివిన తరువాత ,కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు. నేనేం చేయలేను. నన్నో “అన్సోషల్ క్రీచర్” లాగ భావించవచ్చు. అంత్యనిష్టూరం కంటే ఆదినిష్టూరమే మంచిదిగా.

    కొంతమంది ఉంటారు, ఎవరింటికైనా వెళ్ళగానే వాళ్ళింట్లో ఉండే టి.వీ. రిమోట్ చేతిలోకి తీసేసుకొని ఒకే పనిగా చానెల్స్ మార్చేయడం, లెకపోతే వాళ్ళింట్లో ఉన్న సి.డీ లు చూసి ” ఓ సారి చూసి ఇచ్చేస్తామని” తీసేసుకోవడం. వీళ్ళింట్లో ఉన్న పుస్తకాలు సంగతి చెప్పనక్కర్లెదు. అపార్ట్మెంట్లలో ఉన్న కొంతమందికి ఇంకో దురల్వాటు కూడా చూస్తూంటాము, మనింటికి వచ్చే న్యూస్పేపర్, దారి కాసి ఆ పేపర్ ముందే తీసేసుకోవడం.మనం ఏదో వాళ్ళకి ఋణ పడి ఉన్నట్లుగా.

    మనం ఎన్నో తిప్పలు పడి వస్తువులు సమకూర్చుకుంటాము, అవి ఇలాంటి వాళ్ళ బారిన పడి పాడైపోతే రిపేర్ చేయించుకుందుకు మళ్ళీ తడిపి మోపెడౌతుంది. అయినా ఇలాంటి ప్రాణులు మనకి జీవితంలో తారస పడుతూంటారు. ఏ సిగ్గూ,ఎగ్గూ లేకుండా అడిగేవాళ్ళకి, మనం కూడా ఏ మొహమ్మాటం లేకుండా ముందుగానే చెప్పెయ్యాలి, లెకపోతే తరవాత బాధ పడి లాభంలేదు.

    ఇంకో రకం ఉంటారు, ఏ హొటల్, లేదా సినిమాకైనా వెళ్ళామనుకోండి టికెట్లు తీసే సమయంలో ఏదో పని ఉన్నట్లుగా ఎక్కడకో మాయం అయిపోతూంటారు. అలాగే హొటల్ బిల్లు ఇచ్చేసమయానికి,వాష్ బెసిన్ దగ్గరకి వెళ్ళిపోతాడు.అంటే ఇలాటి వాళ్ళు ఊళ్ళో వాళ్ళమీదే బ్రతుకుతారన్నమాట.ఇలాటి వారిని మనమే ముందుగా గుర్తించి దూరంగా ఉంచాలి. కానీ చెప్పే ఖబుర్లు మాత్రం కోటలు దాటేస్తాయి. సామాన్యంగా ఈ రకం వాళ్ళే, ఇంకోళ్ళు చెప్పినదానిమీద ఓర్వలేనితనం ప్రదర్శించి ” చెప్పారులెద్దూ, సలహాలు ఇవ్వడం తేలికే, అందరినీ ఒకే లాగ చూడడమూ, చేతికొచ్చినదల్లా వ్రాయడమూ, తనే ఓ గొప్పవాడినని చూపించుకోవడమూ “ అనొచ్చు.

%d bloggers like this: