బాతాఖానీ-తెరవెనుక(లక్ష్మిఫణి)ఖబుర్లు–బంధాలూ ,అనుబంధాలు-2

    ఈ చుట్టాల వ్యవహారం ఒక్కొక్కప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టేస్తూంటుంది. వారికి ఏ అయిదు ఆరు వయస్సు కల పిల్లలున్నారంటే, ఎవరింటికైతే వెళ్ళేరో, వాళ్ళ తిప్పలు ఇంక పగవాడికి కూడా రాకూడదనిపిస్తుంది. ఇంటి బయటకు వచ్చేశాముకదా అని, వాళ్ళుకూడా ఫ్రీ అయిపోతారు. పోనీ మన ఇల్లుకాదుకదా అని ఏమీ అనుకోరు,ఆ తల్లితండ్రులు కూడా వాళ్ళని ఏమీ కంట్రోల్ చేయరు. ఇంక వీళ్ళదే రాజ్యం!!ఇల్లంతా పీకి పందిరేస్తారు.

    విధాయకమైన వారికి ఆతిథ్యం ఇవ్వక తప్పదు.గొడవల్లా చెప్పా పెట్టకుండా వచ్చే ఈ సో కాల్డ్ అతిథుల వల్లే.ఏ తిరుపతి లాంటి పుణ్యక్షేత్రం లో ఉన్నామంటే,తిరుమల లో కంటే ఎక్కువ అవుతుంది మన ఇంట్లో ఈ చుట్టాల క్యూ !! ఏడాది పొడుగునా ఎవరో ఒక్కరు వస్తూనేఉంటారు.హాయిగా ఏదో ఒక హొటల్లో దిగి, తెలిసిన వారింటికి చూడడానికి వెళ్ళాలని ఎందుకు ఆలోచించరో. ఏమైనా అంటే హొటల్లో దిగితే ఖర్చెక్కువా అని,మరి వీళ్ళు ఎవరింటికైతే వెళ్ళేరో వాళ్ళకి మాత్రం ఖర్చు కాదూ? మనం ఎప్పుడోకానీ వెళ్ళలేదుకదా, ఒక్కసారి వెళ్తేనే ఇలా ఏడవాలా అని అనకండి. అలాగే ప్రతీవాళ్ళూ అనుకొని ఆ ఇంటివాళ్ళని దివాలా చేయిస్తారు.

    ఇంకొంతమందుంటారు–చుట్టాలే–గత పాతికేళ్ళబట్టీ వీళ్ళగురించి ఏమీ పట్టించుకోరు, ఉన్నారా ఊడేరా అని తెలిసికోరు, అయినా ఈ మహానుభావులు ఆ ఊరు వెళ్ళవలసిన అవసరం వస్తే సడెన్ గా గుర్తొస్తుంది, అరే మనవాడొకడున్నట్లు గుర్తూ, వాడింట్లో దిగితే హాయి, అన్నీ వాడే చూసుకుంటాడూ, అని.అంతే ఎవరిదగ్గరో మన కాంటాక్ట్ నెంబర్ సంపాదించి, ఓ ఫోన్ కొట్టేయడం, మేము ఆ ఊరు వస్తున్నామూ, ఓ వారం రోజులుండవచ్చూ అని. కొంతమందైతే రిటర్న్ టికెట్ కూడా బుక్ చేయ్యమంటారు. ఈ రోజుల్లో ప్రతీ చోటా ఆన్లైన్ రిజర్వేషన్లు ఉన్నా సరే. అదేదో వాళ్ళ హక్కులాగ. ఇదివరకటి రోజుల్లో అయితే చేయవలసివచ్చేది.

    విదేశాల్లో అయితే తప్పదు ఈ అతిథి సత్కారాలూ అవీనూ.అక్కడ ఇంకో గత్యంతరం లేదు కాబట్టి. ఇక్కడ అలా కాదుగా. ప్రతీ ఊళ్ళోనూ శుభ్రంగా హొటళ్ళున్నాయి. వీళ్ళూ హాయిగా ఉండొచ్చు, ఎవరికీ గొడవ ఉండదు

    ఇలా రాస్తున్నాడూ, ఎప్పుడైనా వీళ్ళ ఊరికి వెళ్తే వీళ్ళింట్లో ఉండనీయడేమో అనుకోకండి.పరిస్థితులబట్టి, మా ఇంట్లో ఉండవచ్చు, లేకపోతే ఉండడానికి తగిన ఎరేంజ్మెంట్స్ చేయగలను.నేను రిటైర్ అయిపోయినవాడిని, కావలిసినంత సమయమూ ఉంది చేతిలో. నేను చెప్పేదల్లా సిటీ లలో ఉంటూ, భార్యా భర్తలిద్దరూ ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళ సంగతి మాత్రమే. వాళ్ళ కష్టాలుకూడా దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని ఈ పోస్ట్.

    ఇన్ని వ్రాస్తున్నాడూ ఈయనేంచేస్తాడు ఏ ఊరైనా వెళ్తే అని అనుమానం రావచ్చు మీకు. నేను వివాహం అయ్యేవరకూ, ప్రతీ ఏడాదీ మా అన్నయ్య గారింటికే వెళ్ళేవాడిని. కానీ పిల్లలతో వెళ్ళినప్పుడు హోటల్లోనే ఉండి, మా వాళ్ళందరినీ చూడడానికి వెళ్ళేవాడిని.అందరికీ సుఖం.ఎప్పుడైనా ఎవరింట్లో నైనా ఉండవలసి వస్తే, తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళకో ఐటం కొని పెట్టేవాడిని.దానివలన వాళ్ళకి ఏదో కలసివస్తుందని కాదు, అదో తృప్తీ.అక్కడ డబ్బుతో కాదు మనం బేరీజు వేసికోవడం,మన మధ్య సంబందబాంధ్వ్యాలు ఎలా ఉన్నాయీ అని.ప్రస్తుతం రాజమండ్రీలో అపార్ట్మెంట్ అద్దెకు తీసికుని ఉంటున్నాము, ఇక్కడ చుట్టాలు లేరని కాదు. ఉన్నా ఎన్నిరోజులుండగలమూ? ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే అందరికీ బాగుంటుంది.

    ఇలా వ్రాసినందుకు కొంతమంది అనుకోవచ్చు– ఈయనకి సలహాలు ఈయడం అలవాటూ, అసలు సంబంధ బాంధవ్యాలంటే తెలుసునా, రాకపోకలుంటేనే కదా

అవి గట్టిపడేదీ అని. సంబంధాలు గట్టిగా ఉంచడానికి చాలా మార్గాలూ, పధ్ధతులూ ఉన్నాయి. ఎప్పుడో మనకి అవసరం ఉన్నప్పుడే, వాళ్ళని గుర్తు చేసికొని, వాళ్ళ నెత్తిమీద కూర్చోవడమే మార్గం కాదు.నెలకోసారైనా, ఆఖరికి ఏడాదికోసారైనా ఒకరితో ఒకరికి కమ్యూనికేషన్ అనేది ఉంచుకోవాలి. పనే ఉండఖర్లేదు, ఊరికే ఫోన్ చేసి వాళ్ళ కుశలం అడగొచ్చు.ఇలా మీ ఊరు వస్తున్నామూ అన్నామంటే వాళ్ళకి వీలుంటే తప్పకుండా వాళ్ళింటికే ఆహ్వానిస్తారు. మనం గత్యంతరం లేక వెళ్ళవలసివచ్చినా, అలాటి వారింటికే వెళ్ళాలి. ఏమో ఇదీ నా అభిప్రాయం. ఎంతమంది ఏకీభవిస్తారో తెలియదు !!

%d bloggers like this: