బాతాఖానీ–తెరవెనుక(లక్ష్మిఫణి)ఖబుర్లు–బంధాలూ అనుబంధాలు–1

    మా చిన్నప్పుడు అంటే 50 లలో,సిటీ లలో ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే, ఆ ఊళ్ళో ఎవరైనా చుట్టాలున్నారా అని ముందుగా చూసికోవడం, మొత్తం కుటుంబం అంతా వెళ్ళి వాళ్ళ ఇంట్లో దిగడం గా ఉండేది. ఆ రోజుల్లో బంధాలూ, అనుబంధాలూ కూడా అలాగే ఉండేవి.వీళ్ళింటికి వాళ్ళు వచ్చి ఎన్నిరోజులు గడిపినా సమస్య ఉండేదికాదు. గ్రామాల్లోఅయినా, చిన్నచిన్న పట్టణాలు అయినా ఇళ్ళూ పెద్దవిగానేఉండేవి, పైగా చిన్నచిన్న గ్రామాల్లో ఇప్పటిలాగ హొటల్సూ అవీ ఉండేవికావు. అందువలన గత్యంతరంలేక ఉండవలసి వచ్చేది.అదేకాకుండా, ఆ రోజుల్లో ఇంట్లో ఎవరో ఒకరు వయోవృధ్ధులుకూడా ఉండేవారు.ఆయన/ఆవిడ మాట ప్రకారమే జరిగేది. రాకపోకలు కూడా అలాగేఉండేవి.వేసంగి శలవలు వస్తే చుట్టాలందరూ ఒకచోట కలియడం, ఆటలూ,పాటలతో హాయిగా ఉండేది. వచ్చినవాళ్ళుకూడా ఉన్న పది పదిహేను రోజులూ హాయిగా గడిపి, వెళ్ళేటప్పుడు,” మీరు హైదరాబాద్/మెడ్రాస్/ ఇంకోటో ..వచ్చినప్పుడు మాఇంట్లోనే దిగాలి, అని ఆహ్వానించేవారు.గివ్ ఎండ్ టేక్ లా ఉండేది.వీళ్ళుకూడా ఆ సిటీ లో ఏదైనా అవసరం వచ్చి వెళ్ళవలసి వస్తే వాళ్ళు ఆతిథ్యం ఇచ్చిన వారింటికి ఏ సంకోచం లేకుండా వెళ్ళేవారు.అంతా బాగానే ఉండేది.

కాలం మారేకొద్దీ గ్రామాలూ,పట్టణాలూ కూడా మారేయి.నగరాలగురించి చెప్పనక్కర్లెదు. ఇప్పుడు ఆ రోజుల్లాటీ పెద్దపెద్ద ఇళ్ళు లేవు. ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లు, అవికూడా ఏదో ఒకటి, రెండు బెడ్రూంలు, ఒక హాలూ, కిచెనూ,/b>. దానిలోనే ఏదో గుట్టుగా తనూ, భార్యా,బిడ్డలతో ఏదో సంసారం లాగించేస్తున్నారు.ఆ అపార్ట్మెంట్ల ఈ.ఎం.ఐ లు కట్టడానికి భార్యా భర్తలిద్దరూ పనికి వెళ్ళవలసి వస్తోంది. అంటే ఈ రోజుల్లో ఎవరింటికైనా వెళ్ళాలన్నా, వాళ్ళ పరిస్థితి ఏమిటో తెలిసికొని మరీ వెళ్ళాలి.ఏదో చుట్టలొచ్చారు కదా అని ఆ భార్యాభర్తలు శలవలు పెట్టి ఈ వచ్చినవాళ్ళ అతిథిమర్యాదలు చూడలేరుకదా! ఉన్నవాళ్ళకంటే ఎక్కువగా ఓ ఫామిలీ వచ్చిందంటే, వీళ్ళని ఆ ఇంట్లో సద్దలేక, ఆ భార్యా భర్తలు పడే తిప్పలు చూడలేము.వీళ్ళకి పడుక్కోవడానికి ఓ పక్క ఏర్పాటు చేయాలి,ప్రొద్దుటే కాలకృత్యాలు తీర్చుకోవడానికి, ఒకటే బాత్ రూం ఉంటుంది. భార్యా భర్తలకి ఆఫీసుకెళ్ళే తొందరా, పిల్లలకి స్కూళ్ళకెళ్ళే తొందరా, మధ్యలో ఈ చుట్టాలు. ఆ ఇల్లాలికి అంతా శతావధానం, సహస్రావధానం అవుతుంది. పైగా అదేదో శాపం పెట్టినట్లు పనిమనిషి కూడా ఆ రెండు ,మూడు రోజుల్లోనూ పనికి రాలేనంటుంది. ఇంక చూసుకోండి, ఈ వచ్చిన వాళ్ళు భార్య తరఫువాళ్ళైతే ఆయనా, భర్త తరఫు వాళ్ళైతే ఆవిడా ఒకళ్ళమీద ఒకళ్ళు విరుచుకుపడిపోతారు. అదికూడా ఇంట్లో వచ్చినవాళ్ళెదురుగా కాకుండా,బయటకు వెళ్ళి.

మేము పూణే లో ఉన్నప్పుడు మా చుట్టం ఒకాయన మాఇంట్లో ఉండవలసి వచ్చింది. ఆయన పొద్దుటే లేచి ఎవరికీ డిస్టర్బెన్స్ లేకుండా,చన్నీళ్ళే పోసుకుని, మేము లేచేలోపలే రెడీ అయిపోయి బయటకు వెళ్ళిపోయేవారు. రాత్రి బయటే భోజనం చేసి రాత్రి పడుక్కోవడానికి మాత్రమే వచ్చేవారు. ఎంత చెప్పినా అదే మాట. ఇక్కడ షెల్టర్ కి మాత్రమే వచ్చాను, మీకు న్యూసెన్స్ గా ఉండకూడదూ అని.అలాంటి వారు లక్షల్లో ఒక్కరూ, అరా ఉంటారు.

ఎవరైనా హైదరాబాద్, తిరుపతిలాంటి ఊళ్ళ్లో ఉన్నారంటే, వాళ్ళ పని ఐపోయిందన్నమాటే. ఇక్కడ ఇంకో సమస్య ఉందండోయ్,ఎప్పుడైనా అక్కడికి వెళ్ళాలనుకోండి,

ఈ పెద్దమనిషి ఏం చేస్తాడూ, మన ఇంటికి వెళ్ళి అలా హైదరాబాద్ వెళ్తున్నానూ, ఏమైనా పని ఉంటే చెప్పండీ అంటాడు. అదేదో పరోపకారినికి కాదు, ఈ చెప్పిన వాళ్ళ అబ్బాయో, అమ్మాయో అక్కడ ఉన్నారని తెలుసు వీడికి. పాపం ఆ ఇంటి పెద్ద ఏమంటాడూ ” అరే హైదరాబాద్ వెళ్తున్నావా, అక్కడ మా అబ్బాయి/అమ్మాయి ఉన్నారు, నువ్వు మొహమ్మాట పడకుండా అక్కడే దిగూ” అని వాళ్ళ ఫోన్ నెంబరూ (ఇంటిదీ, సెల్లుదీ), ఇంటికి డైరెక్షన్లూ ఒకటేమిటి అన్ని వివరాలూ చెప్తారు. వీడికీ అదే కావాలి హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో హొటళ్ళలో దిగి డబ్బులు తగలేయడం ఎందుకూ, ఇలాటి ఓ బక్రా గాడిని పట్టుకుని, వాళ్ళ పిల్లకో, పిల్లాడికో ఓ చాక్లెట్ తీసికెళ్తే వీడూ పబ్బం గడుపుకోవచ్చూ, ఖర్చు ఏమీ ఉండదు.

అందరూ అలాగ ఉంటారని చెప్పడం లేదు.కొంతమంది ఉంటారు–కొన్ని అత్యవసర పరిస్థితుల్లో తెలిసిన వారింటికే వెళ్ళవలసి వస్తుంది. అక్కడ ఉన్న కొద్దిరోజులూ, వీళ్ళింట్లో భోజనం చేయవలసివస్తే, ఏదో బజారుకెళ్ళినప్పుడు కూరలు లాంటివి తేవడమో. లెక అందరూ కలసి ఏ హొటల్కో వెళ్ళి భోజనం చేద్దామని అనడమో చేస్తారు.

ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఎదో కలిసివస్తుందనికాదు, జస్ట్ ఆ వచ్చిన వారి మనస్థత్వం తెలుస్తుంది. ఆ ఉన్నన్నిరోజులూ అందరికీ ఆనందంగా ఉంటుంది, మనం ఎలా ఉండాలంటే వెల్కం గెస్ట్ లాగ. అంతేకానీ ” మళ్ళీ ఎక్కడ దాపురించాడురా బాబూ” అనేలా కాదు.

ఇన్ని ఖబుర్లు చెప్పుతున్నారూ, మీరేం చేస్తారూ ఎవరి నెత్తిమీద కూర్చుంటారూ అనకండి–తరవాయి భాగం రేపు….

%d bloggers like this: