బాతాఖానీ -తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు

    నెను నిన్న వ్రాసిన దానికి రెండో పార్ట్ ఇది. నెను వ్రాసిన దానికి కొంతమంది దగ్గరనుండి స్పందన వచ్చింది.సంతోషం. అందరికీ ధన్యవాదాలు.మేము మరీ అంత ఐడియలిస్టిక్ కపుల్ అనలేను.ఇన్నేళ్ళ సంసారం లోనూ మాకూ చిన్న చిన్న కలహాలు వచ్చాయి. కానీ అవి మమ్మల్ని వీడతీయలేదు.ఏదో అలా దెబ్బలాడూకుంటూనే 37 సంవత్సరాలూ లాగించేశాము. భగవంతుడు అనుగ్రహిస్తే ఇంకో జన్మ ఇచ్చినా ఆవిడే నా సహధర్మచారిణి అవాలని ఆయనను ప్రార్ధిస్తాను.నాకు సహనం ఓర్పూ చాలా తక్కువ. బయట వాళ్ళందరికీ నేనంటే చాలా గురి. నేను మనస్సులో ఏదీ పెట్టుకోను. ఎవడైనా నవ్వుతూ మాట్లాడితే, వాడు ఏమి అడిగినా చేస్తాను.అది నా బలహీనత.

    మా ఇంటావిడంటుందీ, అలా ఉండకూడదూ, బాలెన్స్డ్ గా ఉండాలీ అంటుంది.మా ఫ్రెండ్ ఒకాయన చెప్పేవాడు–సంసారం అంత సాఫీగా ఎలా జరుగుతుందీ అంటే, సంసారానికి కావలిసిన ముఖ్య విషయాలన్నీ మా ఆవిడ చూసుకుంటుందీ, అంతర్జాతీయ విషయాలు అంటే భారత్-పాకిస్తాన్ సంబంధాలూ, అమెరికా తో దౌత్య సంబంధాలూ వాటి గురించి నేను మాట్లాడతానూ అన్నాడు !! ఇక్కడ అంతా ఉల్టా.డబ్బు వ్యవహారాలు నేను చూసుకుంటాను, మిగిలనవి అన్నీ ఆవిడ.బయటకు వెళ్ళాలంటే తోడుండాలి. కూరలు, గ్రోసరీ ఖరీదులెంతో కూడా తెలియదు.ఈ మధ్యన బాంక్ కి వెళ్ళి ఏ.టి.ఎం కార్డ్ ఎలా ఉపయోగించుకోవాలో నేర్పాను.ఆన్లైన్ బాంకింగ్ కూడా నేర్చేసుకుంది.అందువలన ఆవిడకు తెలియకుండా తన అకౌంట్లోంచి డబ్బులు నొక్కేయలేను!!పెళ్ళి అయినప్పటినుండీ ఆవిడకు చీరల సెలెక్షన్ నాదే. రిటైర్ అయినప్పటినుంచీ, నన్ను కూడా సెలెక్షన్ కమిటీ లోంచి రిటైర్ చేసేసింది !!

    ఇంట్లోకి ఏదో ఫలానా వస్తువు కావాలని లౌడ్ థింకింగ్ లాగ ఏదో గోడకో దేనికో చెప్పేస్తుంది. సరే ఈవిడకి ఇది కావాలని తెలిసికొని నేనే ఇంక ఆవిడ సలహా తీసికోకుండా బజార్ కి వెళ్లి ఆ వస్తువు తెచ్చేస్తాను. అది ఓ మైక్రోవేవ్ అవొచ్చు, ఇంకోటేదో అవొచ్చు. తీరా ఇంటికి తెచ్చాక ఓ క్లాసు పీకుతుంది.నేనేమైనా ఇప్పటికిప్పుడు తెమ్మన్నానా అంటూ. ఆ మధ్యన ఓ సారి అంది–వర్క్ సారిస్ ఇక్కడ ఆంధ్రా లో బాగుంటాయీ అని,వరలక్ష్మి వ్రతానికి బజార్ కి వెళ్ళి ఒకటి కొంటే రెండు ఫ్రీ అన్నాడని మూడు తెచ్చేశాను. మూడూ ఒకలాగే ఉన్నాయని అదో లెక్చరూ. అలాగైతే మీ అమ్మాయికోటి, కోడలుకోటీ ఇచ్చేయ్ అన్నాను. ప్రస్తుతం ఆ మాట మీదే ఉన్నాము.అన్నీ అయి గురువారం సాయంత్రం–ప్రతీ ఏడాదీ చిన్న పిసరైనా బంగారం కొనేవారూ, ఈ ఏడాదే ఏమీ కొనలేదూ అని మళ్ళీ లౌడ్ థింకింగూ.

పొలో మని కొట్టుకు వెళ్ళి తెచ్చాను. మరీ ఎక్కువ కాదనుకోండి.ఇలా ఉంటుందండి మా కాపురం.

ఈ మధ్యన ఓ స్టేట్మెంట్ ఇచ్చేసింది–రాజమండ్రీ నుండి పూణే తిరిగి వెళ్ళేలోపల మంచి నేత చీరలు తీసికోవాలీ అని.చీరలు చవకగానే వస్తాయి. గొడవల్లా వాటికి ఇస్త్రీ చేయడానికి పూణే లో చాలా కాస్ట్లీ .ఇక్కడైతే నాలుగు రూపాయల్లో అయిపోతుంది. అక్కడ దానికి నాలుగు రెట్లు అవుతుంది.

    చెప్పానుగా ప్రతీ వారం ఇంట్లో ఉన్న కర్టెన్లన్నీ ఉతకడానికి పెడుతుంది, అలాగే పక్కమీద దుప్పట్లూ, వాషింగ్ మెషీన్ లోనే అనుకోండి.ఖర్మ కాలి ఆరోజునే ఎవరో వస్తారు మా ఇంటికి, ఈవిడకి ఒక్కటే టెన్షనూ. అందుకోసం ప్రతీ దానికీ ఓ స్టాండ్ బై ఉండాలంటుంది. ఒక జత కొనడానికే ప్రాణం మీదకు వస్తోంది, మళ్ళీ డూప్లికేటొకటా.తప్పదు గా. ఇంక అవి ఆరిన తరువాత తను భరత నాట్యం చేయడం ఎందుకని, నేను ఏదో హెల్ప్ చేద్దామని, ఆ కర్టెన్లన్నీ ఆ లూప్ల్లోకి రాడ్ ఎక్కిస్తాను.

ఈవిడొచ్చేసి అదేదో ఉల్టా వేశానంటుంది, అదేదో డిజైన్ సరీగ్గా రాలెదంటుంది. మళ్ళీ అన్నీ తీసేయడం, జన్మలో ఇంకెప్పుడూ హెల్ప్ చేయకూడదనిపిస్తుంది. తప్పుతుందా. ఇంక మంచం మీద దుప్పట్ల దగ్గర కొస్తే, నేను వేసినదేదీ నచ్చదు. వేసిందే వేసి తాదాత్మ్యం చెందుతుంది. ఎందుకో ఈ గొడవలన్నీ, ఊరికే తాపత్రయం అంటానా, ” మిమ్మల్నేమైనా వేయమన్నానా” అంటుంది. అన్నింట్లోకీ హింసాత్మకం ఏమిటంటే , తన స్నాన పానాదులైన తరువాత ఆ బాత్ రూం లో ఫినైలూ, హార్పిక్కూ వెసేస్తుంది. ఖర్మ కాలి దాంట్లోకి వెళ్ళానా అయిపోయిందే మన పని. అదేం దురదృష్టమో తను ఫ్లోర్ పోచా చేసిన వెంటనే, ఆ రూం లోకీ,హార్పిక్ వేసిన వెంటనే బాత్రూం లోకి వెళ్ళాలని ఊరికే టెంప్టేషన్ వచ్చేస్తుంది.అలా కాదని బాత్రూం లో అంతా సోప్ వాటర్ వెసేసి నన్ను దాంట్లోకి వెళ్ళనీయకుండా ఈ మధ్యన

కట్టడి చేసేస్తోంది. ఇన్నాళ్ళు అంటే నేను ఉద్యోగం లో ఉన్నన్నాళ్ళూ ప్రొద్దుటే 7.30 కి వెళ్ళిపోయి సాయంత్రం 6.00 గంటలకి వచ్చేవాడిని. అందుచేత ఇల్లంతా తన ఇష్టం, ఏం కావాలనుకుంటే అది చేసేది.ఇప్పుడలా కాదుగా రోజంతా ఇంట్లోనే ఉంటాను, మరీ ఇలాటి కర్ఫ్యూ లైతే ఎలాగండి బాబూ. అదండీ బాబూ మా సంసార నౌక ఎలాటి ఒడుదుడుకులు లేకుండా అప్పుడప్పుడు కర్ఫ్యూ లతో కాలక్షేపం చేస్తున్నాము.

%d bloggers like this: