బాతాఖానీ-తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు

    మేము పూణే లో ఉన్నప్పుడు, మా ఫ్రెండ్ ఒకాయన ఉండేవారు. ఆయన ఒక్కరూ ఉన్నప్పుడు మా ఇంటికి భోజనానికి పిలిస్తే, శుభ్రంగా మొహమ్మాట పడకుండా చేశారు. ఆ తరువాత ఇంకొక సారి ఆయన భార్య తో వచ్చారు.ఆయన ఎలా తింటారన్నది మాకు తెలుసును కనుక, ఆ పధ్ధతి లోనే తయారు చేశాము.అంతకుముందు ఉన్నట్లుగా కాక, ఒక్కో ముద్దతింటూ ఆయన భార్య కెసి చూడడం, ఆవిడ “ అనుమతి” లాంటిది ఉంటేనే తిన్నట్లుగా అనిపించింది.ఇది ఆయనకేనా, ప్రతీ భర్తా ఏదో ఒక సందర్భంలో ఎదుర్కునే “సమస్యా“అని అలోచిస్తే, నిజమేమో అనిపించింది.నేనేదో రిసెర్చ్ చేసేసి ఎదో కనిపెట్టేనని కాదు,ఎప్పుడైనా భార్యా భర్తలు ఎవరింటికైనా వెళ్తే, సాధారణంగా, ఈ భర్త అనే ప్రాణి వీలున్నంతవరకూ నోరు మూసుకొని కూర్చుంటే అందరికీ ఆరోగ్యకరం అని నా అభిప్రాయం.

    ఆడవారు మాట్లాడినంత తెలివిగా, లౌక్యంగా మగవారు మాట్లాడలేరు. ఏదో నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తారు, అది చాలా లైట్ గా మాట్లాడేమనుకుంటారు, కానీ దాని పరిణమాలు ఒక్కొక్కప్పుడు ప్రాణం మీదకు తెస్తాయి.ఇంటికి వెళ్ళిన తరువాత ఇంట్లో వాళ్ళు ఓ క్లాసు పీకుతారు. తూచి తూచి మాట్లాడడం ఆడవారికి వెన్నతో పెట్టిన విద్య. ఆ ప్రావీణ్యం ఎలా ఎక్కడనుండి వస్తుందో ఆ భగవంతుడికే తెలియాలి. వాళ్ళు మననేమైనా అంటే ఆ క్షణంలో ఎంతో కోపం వచ్చేస్తుంది. ” సరే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, నేను నోరు మూసుకు కూర్చుంటానులే. నువ్వే మాట్లాడు. మళ్ళీ నోరెత్తుతే చూడూ” అంటూ ఢాం ఢూం అని బ్లడ్ ప్రెషర్ పెంచేసుకుని, ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాం. కానీ కూల్ గా కూర్చొని ఆలోచిస్తే మన ఇంటి వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంతో నిజం ఉన్నట్లు కనిపిస్తుంది.

    నీట్ నెస్ సంగతి వస్తే చాలా మంది ఆడవారికి అదో ” అబ్సెషన్”.ఇల్లంతా రోజుకి, రెండు మూడు సార్లైనా తుడుస్తూంటారు. బూజులు దులపడం, పోచా చేయడం. ఫ్లోర్ ని తడిగుడ్డ పెట్టి పొచా చేసిన తరువాత ఖర్మకాలి చూసుకోకుండా అడుగులు వేశామా మన పని అయిపోయినట్లే !! మా పిల్లలు ” అమ్మని ఎప్పుడైనా ఎలక్షన్లో నుంచోపెడితే ఝాడూ, పోచాగుడ్డా తన సింబల్ గా పెట్టుకోవచ్చూ” అని జొక్ చేసేవారు. పాపం ఈ మధ్యన ఓపిక తగ్గిపోయి కొంచెం రిలాక్స్ చేసింది!! మామూలుగా చేయి కడుక్కుని, ప్రక్కనే ఉన్న కర్టెన్ కో, బనీన్ కో చెయ్యి తుడిచేస్తాము.మేము వరంగాం లో ఉన్నప్పుడు, ఒకసారి మా డాక్టర్ గారింటికి వెళ్ళినప్పుడు, ఆయన చేయి కడుక్కుని కర్టెన్ కి తుడవడం చూసి ఒక్కసారి గయ్య్ మంది. ఇన్నేళ్ళ తరువాత కూడా ఆయనకి గుర్తు, అస్తమానూ చెప్పుకొని నవ్వుకుంటూంటాము.అలాగే సోఫాలో కాళ్ళు పైకి పెట్టుకోకూడదు. చాయ్ త్రాగేటప్పుడు నాచేత జుర్రుకోవడం మానిపించింది మొత్తానికి. నాకు కొంచెం డ్రెస్ సెన్స్ తక్కువ. అంటే వేసికునే డ్రెస్ ఎలా ఉన్నా పట్టించుకోను. ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు,ఆఖరి నిమిషంలో చెప్తుంది--పోనీ ఆ డ్రెస్ మార్చేసి ఇంకోటి వేసికోవచ్చుకదా--అని. ఈ మధ్యన ఆవిడ సెహ్బాసీ సంపాదించడానికి, ఆవిడ చెప్పేముందరే ఇస్త్రీ బట్టలు వేసేసికుంటున్నాను !!

    ఒక్కవిషయం ఒప్పుకోవాలి. పైన చెప్పినట్లుగా, ఎవరింటికైనా భోజనానికి వెళ్ళినప్పుడు మాత్రం నామీద ఎటువంటి ఆంక్షలూ పెట్టదు.ఎవరైనా అకస్మాత్తుగా మన ఇంటికి వచ్చినప్పుడు, నిమిషాల్లో వాళ్ళకి అతిథి సత్కారాలు ఎలా చేస్తుందో ఇప్పటికీ నాకు తెలియదు.వాళ్ళని భోజనానికి కూడా ఉండమంటుంది, ఎలా చేస్తుందో, ఏంచేస్తుందో , ఇన్నేళ్ళైనా ఇప్పటికీ నాకు మిస్టరీ యే!! నూటికి 90 మంది ఆడువారు ఇదేపధ్ధతిలో ఉంటారు. దీనివల్ల మన ఇమేజ్ పెరిగిపోతూందికదా, ఫలానా వారింటికి వెళ్ళామూ, వాళ్ళిల్లు ఎంత బాగాఉందో,ఎంత బాగా అతిథిసత్కారం చేశారో అని చెప్పుకుంటారు.దీనికంతా మూల కారణం ఇంటి ఇల్లాలే కదా!!

ఇన్ని పాజిటివ్ అంశాలు ఉన్నప్పుడు, ఇంటావిడ మాట వింటే పోలేదూ? పుణ్యం, పురుషార్ధమూనూ.

%d bloggers like this: