బాతాఖానీ–తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు

    నాకు ఒక్క విషయం ఎప్పుడూ విచిత్రంగా ఉంటుంది–పేపర్లలో ఎక్కడ చూసినా, మన రాజకీయ నాయకుల గురించి ఒక్క విషయమూ మంచిగా వ్రాయరు. వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుందా లేక అస్సలు వాళ్ళు ఎలాటి మంచి పనులూ చేయరా అని.నిన్న బూటా సింగ్ కొడుకు ఏదో లంచం తీసికుంటూ పట్టుబడ్డాడని చదివాము.అంతే తండ్రిగారు ఇంక నోటికొచ్చినట్లుగా మాట్లాడడం మొదలెట్టారు.రాజీనామా చేయమంటే చస్తానని బెదిరింపూ. అసెంబ్లీ లో ఆయనెవరో పెరుచెప్పకుండా ” ఓ మంత్రి గారి అల్లుడు విశాఖ లో ఓ మందు పార్టీలో పట్టుబడ్డాడన్నారు. రోసయ్య గారికి రోషం వచ్చేసింది. ఇంకో చోట వీరభద్రసింగూ, ఆయన భార్యమీద ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారుట.

    ఇవన్నీ ఇలా ఉండగా కొవ్వూరు ఎం.ఎల్.ఏ బైలు మీద రాజమండ్రీ జైలునుండి విడుదల అవగానే, ఆయనకి “హీరో వెల్కం” ఇచ్చారు.ఒక్కటంటే ఒక్కటైనా వీళ్ళందరూ ఏదైనా మంచిపని చేస్తే అది మన పేపర్లలో వ్రాస్తే చదువుదామని చాలా రోజులనుండి చూస్తున్నాను. అబ్బే అలాంటి అదృష్టం కనుచూపు మేరలో ఉన్నట్లు లేదు.

    ఇంక మన క్రికెటర్ల సంగతి చూస్తూంటే ఏమనాలో తెలియడం లేదు. వాడా కోడ్ మీద సంతకాలు పెట్టడానికి వీళ్ళకి అంత భయం ఎందుకూ? మన టెన్నిస్, బాడ్మింటన్, హాకీ ఆటగాళ్ళు పెట్టగా లేనిది వీళ్ళకేం రోగం? వీళ్ళకి క్రికెట్ బోర్డ్ వంత పాడడం ఇంకా వింతగా ఉంది.

    మొన్న జరిగిన బర్మింగ్ హాం టెస్ట్ లో ఆస్ట్రేలియా కాప్టెన్ రికీ పాంటింగ్ ఔట్ అయిన బాల్ చూశారా? సరీగ్గా కొన్ని సంవత్సరాలక్రితం షేన్ వార్న్ మొదటి టెస్ట్ లో ఇంగ్లాండ్ కప్టెన్ మైక్ గాటింగ్ ని ఎలా బౌల్ చేశాడో, అదేవిధంగా ఈ టెస్ట్ లో స్వాన్ పాంటింగ్ ని ఔట్ చేశాడు. దీన్ని కూడా “ బాల్ ఆఫ్ ద సెంచరీ “అంటారా?

    ఈ వేళ ప్రొద్దుట మా లాండ్ లైన్ పనిచేయడం మానేసింది. సెల్ లో మా కజిన్ కి ఫోన్ చేసి 198 కి చెప్పమని మా మరదలుతో చెప్పాను. ఆవిడేమో పొరబాటు విని,

” బావ గారు ఫోన్ చేశారు 108 కి చెప్పమనీ “అందట. మా వాడేమో ఖంగారు పడిపోయాడు ఏమయ్యిందో అని !! ఏ ఉపద్రవం లేకుండా 198 కే ఫోన్ చేశాడనుకోండి.

(విదేశాలలో వారికి సూచన.. 198 టెలిఫోన్ కంప్లైంట్,, 108 ఆంబ్యులెన్స్ సర్వీస్ !!)

   సాయంత్రం మా చుట్టాలింటికి పెళ్ళికి వెళ్ళాము.అక్కడ ఒక్కటి బాగా నచ్చింది–భోజనాలు బఫే కాకుండా టేబిళ్ళ మీద వడ్డించారు. మంచి నీళ్ళు గ్లాసుల్లో కాకుండా, మినరల్ వాటర్ బాటిల్స్ ఇచ్చారు. చేతిలో పళ్ళెం పెట్టుకుని భరత నాట్యం చేయనక్కర్లేకుండా శుభ్రంగా కూర్చొని తినకలిగాము.

%d bloggers like this: