బాతాఖానీ–తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు

    ఈ మూడు రోజులూ కొంచెం బిజీ గా ఉండడంచేత ఏమీ వ్రాయలేకపోయాను. శుక్ర, శనివారాలు, మా ఇంటావిడ వరలక్ష్మీ పుజ సందర్భంలో చేసిన 9 పిండివంటలూ చెల్లించడంలోనే సరిపోయింది. ఇక్కడ ఇంట్లో చిన్నపిల్లలెవరూ లెరు, ఆవిడేమో డైటింగ్ అంటూ ఏమీ తినదు. ఏంచేస్తాం అనుకుంటూ లాగించేశాను. శుక్రవారం సాయంత్రం అయితే మా తమ్ముడు వచ్చాడు, వాడు పులిహోర, పరమాన్నం లాంటివి తినడు.

    శనివారం సాయంత్రానికి మా అన్నయ్యగారి అమ్మాయి యు.ఎస్. లో ఉంటున్నది, మమ్మల్ని చూడడానికి రాజమండ్రీ వచ్చింది. విజయవాడలో అమ్మవారిని దర్శించుకొని సాయంత్రానికి రాజమండ్రీ వచ్చింది. తనని చూడడానికి, దానవాయి పేట నుండి వాళ్ళ అమ్మగారివైపు( అంటే మావదినగారు) చుట్టాలందరూ వచ్చారు. ఇల్లంతా బిజీ బిజీ. మంచి కాలక్షేపం అయింది. ఆ మర్నాడు అంటే ఆదివారం ఓ ఇన్నోవా మాట్లాడుకొని కోనసీమ వెళ్ళాము.

    ముందుగా అమలాపురం వెళ్ళి అక్కడ ఓ రెండు గంటలు గడిపాము.దారిలో బండార్లంక లో ఆగి ఓ కొట్టులోకి వెళ్ళి బండార్లంక నెత చీరలూ అవీ తీసికొన్నాము.అమలాపురం అంతా మారిపోయిందండీ.పఠాభి వీధి నుండి,కాలేజీ రోడ్డుమీదుగా, భూపయ్య అగ్రహారం మీదుగా ఒకసారి రౌండ్ వేశాము. ఎక్కడచూసినా అపార్ట్మెంట్లే.అసలు రూపమే మారిపోయింది.నేను చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలు ఒక్కటంటే ఒక్కటి కనిపించలెదు. అవన్నీ తీపి జ్ఞాపకాలలా ఉండిపోయాయి.ఒక్కొక్కప్పుడు అనుకుంటూండేవాడిని–కొంతకాలమైనా నెను చిన్నప్పుడు గడిపిన అమలాపురంలో కొన్ని రొజులు గడపాలని, కానీ మొన్న చూసిన తరువాత, ఉద్దేశ్యం మార్చుకొన్నాను.అక్కడ ఉండి పాతరోజులు గుర్తుచేసికొని, అయ్యో ఇలా అయిపోయిందా అని బాధ పడడం కంటే దూరంగా ఉండడం మంచిదనిపించింది. జ్ఞాపకాలైనా తీయగా ఉంచుకోవచ్చు. కోనసీమ రూపమే మారిపోయింది. ఇదివరకటి రోజుల్లో బస్సులో వెళ్తూంటే ఒక పక్క నిండుగా ప్రవహించే కాలవా, అందులో పగ్గాలతో లాగే రహదారీ పడవలూ, కొన్ని కొన్ని చోట్ల కాలవ దాటడానికి బల్లకట్లూ, రెండో వైపు వరసగా అరటి తోటా, కొబ్బరితోటా, వరిపైర్లూ--అబ్బ వర్ణించడానికి మాటలు చాలవు. రావులపాలెం (కోనసీమ కి ముఖద్వారంలాంటిది) దాటగానే ఈ సుందరదృశ్యాలన్నీ కనుల పండువగా ఉండేవి.ఇప్పుడు ఎక్కడ చూసినా కాలవలమీద వంతెనలు వేసేశారు. అక్కడనుండి గన్నవరం మీదుగా మల్కిపురం వెళ్ళాము

   .దారిలో గన్నవరం దగ్గర దిగి ఆక్విడక్ట్ చూశాము. దానికి శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి ఆంధ్ర ప్రదేష్ ప్రభుత్వం చాలా మంచి పని చేశారు. ఎవడో ఎందుకూ పనికి రాని రాజకీయ నాయకుడి పేరు పెట్టలేదు. ఈ సందర్భంగా అయినా ఆ మహాసాధ్వి శ్రీమతి డొక్కా సీతమ్మ గారిని గుర్తుచేసికుంటారు.– ఈ మధ్యన శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తిగారు వ్రాసిన “దైవంవైపు” పుస్తకంలో ఆవిడ గురించి ఇలా వ్రాశారు—” మహిమాన్విత తూర్పు గోదావరి జిల్లాకి చెందిన డొక్కా సీతమ్మగారు, ఈమె సేవాతత్పరని కూడా పాటలరూపంలో గోదావరీ జిల్లాలవారు తలచుకుంటారు. ఇది నూట పాతికేళ్ళ కిందటి మాట.పంతొమ్మిదో శతాబ్దంలో శ్రీ డొక్కా జోగన్న భార్య అయిన సీతమ్మ నివాసం లంకల గన్నవరం అనే కుగ్రామం.అడిగిన వాడికి లెదనకుండా ఆవిడ అన్నం పెట్టారు. డొక్కా సీతమ్మ గారి ఔదార్యం తెలిసికొన్న కింగ్ ఎడ్వర్డ్ 7 ,ఆమెకి ప్రశంసా పత్రాన్ని పంపడమే కాకుండా, జనవరి 1, 1903 న జరిగిన ఆయన పట్టాభిషేకానికి ప్రత్యేక ఆహ్వానాన్ని పంపారు.ఆమె సున్నితంగా ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు.నర్సాపురం మెజిస్ట్రేట్ ఆమె ఫొటో తీయించి లండన్ పంపారు. ఈ అపర అన్నపూర్ణ చిత్ర పటం కాశీలోని అన్నపూర్ణ ఆలయంలో ఉందట.1909 లో శ్రీమతి డొక్కా సీతమ్మ గారు స్వర్గస్థులైనారు.” అలాంటి అన్నపూర్ణ నడిచిన ప్రాంతం లో , ఆవిడ పీల్చిన గాలిని ఆస్వాదించడానికి ఒ అవకాశం దొరికింది.

తిరుగు ప్రయాణంలో ధవళేశ్వరం దగ్గర దిగి సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఆనకట్ట చూసికొని ఇంటికి చేరాము. వర్షాలు లెకపోవడంతో గోదావరి తల్లి చాలా నీరసంగా కనిపించింది.

%d bloggers like this: