బాతాఖానీ–తెరవెనుక ( లక్ష్మి ఫణి ) ఖబుర్లు-పుట్టిన రోజు జ్ఞాపకాలు

   నిన్న 15 వ తారీఖున అస్సలు సమయం లేకపోవడం వలన వ్రాయలేకపోయాను. మా బంగారు తల్లి చి. నవ్య 3 వ జన్మదినం. హైదరాబాద్ నుండి వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య కూడా వచ్చారు. ప్రొద్దుటే ఇంట్లో హారతి ఇచ్చి ఆశీర్వదించాము. మధ్యాహ్నము 4.30 కి తనురోజూ వెళ్ళే క్రెచ్ కి వెళ్ళీ, అక్కడ కేక్ కట్ చేయించి, అక్కడ ఉన్న పిల్లలందరికీ రిటర్న్ గిఫ్ట్ లు ఇచ్చి ఇంటికి వచ్చాము. అలాగే సాయంత్రం దగ్గరలో ఉన్న తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచాము. మళ్ళీ ఇంకో కేక్, రిటర్న్ గిఫ్ట్ లు, వాళ్ళు తినడానికి ఏవేవో తినుబండారాలూ, గేమ్సూ వగైరా వగైరా.. అన్నీ అయిన తరువాత హొటల్ కి వెళ్ళి, మా అల్లుడు, ఇంకో మనవరాలూ, మనవడి తో డిన్నర్ చేసి ఇంటికి వచ్చాము.అమ్మాయి ఓ వారం రోజులకై ఇండియా బయటకు వెళ్ళడం వలన తను రాలేకపోయింది. ఇంత హడావిడి లో నాకు వ్రాయడానికి తీరిక దొరకలేదు

    పుట్టిన రోజు పండగ మా రోజుల్లో ఎలా ఉండేదీ, ఇప్పుడు ఎన్ని మార్పులు చేసికొందీ అనే విషయం మీద కొన్ని అభిప్రాయాలు మీతో పంచుకొందామనుకొంటున్నాను. ఆ రోజుల్లో పుట్టిన రోజు అంటే, పొద్దుటే తలంటు పోసుకోవడం,ఇంట్లో చుట్టాలు వచ్చి నెత్తిమీద అక్షింతలు వేయడం, సాయంత్రం సినిమాకి పంపడం. ఈ గిఫ్తులూ, రిటర్న్ గిఫ్టులూ ఎక్కడ చూశామూ? నాకు జ్ఞాపకం ఉన్నంతవరకూ, మా నాన్నగారు ఎప్పుడూ నా పుట్టిన రోజుకి ఊళ్ళో ఉండేవారు కాదు. అలాగని మన మీద ప్రేమ లేదనుకోము కదా.సినిమాకీ, కొత్త బట్టలకీ గుర్తు పెట్టుకొని డబ్బిచ్చేవారుగా !! బర్త్ డే కి కేక్కులూ అవీ ఉంటాయని మాకు పిల్లలు పుట్టిన తరువాత తెలిసింది.

   ఆ రోజుల్లో ఇప్పటి కుటుంబాలలాగ ఉండేవి కాదుగా.ఇంటికి కనీసం అయిదు లేక ఆరుగురు పిల్లలుండేవారు. అందరికీ పుట్టినరోజులు చేసుకోవడం అంటే ఆర్ధికంగా మధ్య తరగతి వాళ్ళమైన మన లాంటి వారికి సాధ్యం అయ్యేది కాదు. ఏదో ఏడాదికి మూడు సార్లు పండగలకీ, ఒకసారి పుట్టినరోజుకీ ( తిథుల ప్రకారమే ) కొత్త బట్టలు. ఖర్మ కాలి, పుట్టినరోజూ, ఇంకేదైనా పండగా ఒకేసారి వచ్చేయంటే, ఓ జత బట్టలు మిస్ అయేవారం.ఆ రెండూ ఒకే వారం లో వచ్చినా ఇంతే సంగతులు. పాపం మా ఇంటావిడకి దసరాల్లో సప్తమి నాడు పుట్టిన రోజూ, అందువలన వాళ్ళ చెల్లెళ్ళ లాగ తనకి దసరా బట్టలు ఉండేవి కావుట. ఒక్కొక్కళ్ళ అదృష్టం అలా ఉండేది. నాకైతే డిశంబర్ లో వచ్చే అమావాస్య. ఆ చుట్టుపక్కల ఎక్కడా ఏ అమావాస్యకీ ఏ పండగా ఉండేదికాదు !!

    మేము మా పిల్లలి దగ్గరకు వచ్చేటప్పడికి, ఏదో మన జీవితంలో మనకి దొరకనిది ఏదో పిల్లలకి చేసేసి ఉధ్ధరించేద్దామని, వాళ్ళకి ఏవేవో గిఫ్టులూ, కొత్త బట్టలూ, ఏ పిల్ల బర్త్ డే ఐనా రెండో వాళ్ళకి కూడా బట్టలూ ( వాళ్ళేం అనుకోకుండా!!). మనకి బాగా తెలిసిన వాళ్ళెవరైనా వచ్చేవారు. ఎవరినీ ఎప్పుడూ ప్రత్యేకంగా పిలువ లేదు. పూనా లో ఉన్నంత కాలం, కయానీ బేకరీనుండి కేక్ తెచ్చేవాడిని. వరంగాం వెళ్ళిన తరువాత ఆ సదుపాయం ఉండేదికాదు. అందువల్ల ఒక ఓవెన్ కొన్నాము. దాంట్లో నేర్చుకొని మా ఇంటావిడే కేక్ చేసేది.ఎగ్గ్ ముట్టుకునేది కాదు. ఆగొడవంతా నాకిచ్చేది.ఆ గిన్నెలూ అవీ దేంట్లోనూ కలపకూడదు. వామ్మో ఎంత మడీ, ఆచారమో!! అదేం చిత్రమో మా పిల్లల పుట్టినరోజు కి ఎవరినీ పిలవకపోయినా, ఎప్పుడూ పదిహేనుమందికి తక్కువ ఉండేవారుకాదు !!అందువలన ఎప్పుడూ అంతమందికీ తినడానికి ఏదో ఒకటి తయారుచేసి ఉంచేది మా ఇంటావిడ. మా మనవరాలి పుట్టిన రోజు పండగ చూసిన తరువాత, మేము మాపిల్లలకి న్యాయం చేశేమా అనిపించింది. ఈ రోజుల్లో చేసే దానితో పోలిస్తే, అదంతా నథింగ్. పోనీ అలాగని వాళ్ళు ఏమైనా అడిగేవారా అంటే, అదీ లేదు. మరి ఇప్పుడు అంత గిల్టీ ఫీల్ అవడానికి కారణం ఏమిటి ? మనం మన పిల్లలకి చేయలేనిది, వాళ్ళు వాళ్ళ పిల్లలకి చేస్తున్నారని ఓర్వ లేని తనమా? ఎందుకు దీని గురించి ఇంతగా ఆలోచిస్తున్నానో తెలియదు. మా ఆర్ధిక స్తోమతని బట్టి చేయకలిగింది చేశాము.ఇప్పుడెవ్వరూ మనని అడగటం లేదు మీరు మాకు ఎందుకు చేయలేకపోయారూ అని. ఐనా అదో రకమైన ” ఎంప్టీ ఫీలింగ్ ”

    రోజంతా మా వియ్యాలవారితో ఇదే చర్చ. వాళ్ళకీ, మాలాగే.ఇద్దరే పిల్లలు. మా ఇద్దరి భావాలూ ఒక్కలాగే ఉన్నాయి.వాళ్ళు సాయంకాలం హైదరాబాద్ ట్రైన్ కి వెళ్ళిన తరువాత చివరకి మా కోడలుని అడిగాను. ” నిన్నంతా నవ్యకి పుట్టినరోజు పేరు చెప్పి అంత అట్టహాసంగా చేసారు కదా , చిన్నప్పుడు నీకు, ఇలాగే చేసేవారా, పోనీ చేసిన దానిలో మీకు ఆనందం పొందేవారా ” అని. తను చెప్పిన వివరణ నాకు చాలా నచ్చింది. ” మనం ఉండే పరిసరాలు, మధ్య తరగతి వాళ్ళుండేవి, అక్కడ ఈ అట్టహాసంగా చేయడమూ అవీ ఉండేవి కాదు.అంతే కాకుండా మనం పెరిగిన వాతావరణం, స్కూల్ లో ఉండే స్నేహితులు కూడా మనలాంటి వారే,.ఇదొక కారణం రెండోది మన ఆర్ధిక పరిస్థితి కూడా తెలుసు “.

   ఇప్పుడు మా మనవరాలు వెళ్ళే క్రెచ్ అనండి,మేము ఉండే సొసైటీ అనండి, ఎక్కడ చూసినా అంతా అట్టహాసాలే.మూడేళ్ళ పిల్లకూడా, నా బర్త్ డే కి మా ఫ్రెండ్స్ అందరినీ పిలవాలీ,వాళ్ళు గిఫ్టులు తెస్తారూ, వాళ్ళకి మనం రిటర్న్ గిఫ్టులు ఇవ్వాలీ అని చెప్పడమే.తల్లితండ్రులు వాళ్ళ గారాబు పట్టిలు చెప్పినవి చేయలేకపోతే ఇంతే సంగతులు !! ఇంకో పాతికేళ్ళు పోయిన తరువాత ఈ పుట్టిన రోజు పండగలు ఏ స్థితి కి చేరతాయో మన ఊహకు అందదు !!

బాతాఖానీ ఖబుర్లు–40

మా అబ్బాయి అభిరుచులు వాళ్ళ అక్కకి భిన్నంగా ఉండేవి. చదవడం కూడా తనది ఇంకో స్టైలు.మా అమ్మాయైతే ఎప్పుడు చూసినా ఏదో పుస్తకం చేతిలో కనిపించేది. వీడు ఎప్పుడు చదివేవాడో తెలియదు, కానీ క్లాసులో ఎప్పుడూ ఫస్టే. టీచర్లు కూడా వీడి గురించి ఎప్పుడూ మంచిగానే చెప్పేవారు. పరీక్షలైన తరువాత ఎలా చేసాడో అడగడానికి ఎప్పుడూ భయమే–ఏం చెప్తాడో అని !! మా అబ్బాయి క్లాస్ 10 పరీక్షలు బాగానే చేశానని చెప్పాడు. తన రిజల్ట్ టైము లో కూడా జి.ఎం. ఆఫీసులోని మా ఫ్రెండ్ శ్రీ రావు గారే రిజల్ట్ తెప్పించారు, మద్రాసు నుండి.స్కూలు కి ఫస్ట్ వచ్చాడు. మా అమ్మాయి టైము లో ప్రారంభించిన రోలింగ్ కప్ ఈ సారి మా అబ్బాయికి వచ్చింది. ఒక్క విషయం ముందుగానే చెప్పాడు. క్లాస్ 12 లో బయాలజీ సబ్జెక్ట్ మీద అంత ఆసక్తి లేదని. ఇంక మెడిసిన్ చదివించాలేమో ననే సమస్యే లేదు. క్లాస్ 10 లో సోషల్ సైన్సెస్ లో 90 పైగా మార్కులు తెచ్చుకొన్నాడు. ఈ మధ్యన మా ఫాక్టరీ లలో ఐ.ఎస్.ఓ సర్టిఫికేషన్ తప్పకుండా ఉండాలని ,ఓ ఆర్డర్ వచ్చింది. దానికి సంబధించిన పని అంతా నాకు అప్పచెప్పారు. అప్పటికి మా జి.ఎం. శ్రీ సుందరం గారు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. నేను అనుకొనేవాడినీ, కొత్త జనరల్ మేనేజర్ వచ్చినప్పుడు, నన్ను ఇంకో సెక్షన్ కి మార్చేస్తారేమోనని. కానీ నా పనితీరువు చూసి కొత్తాయన శ్రీ బెట్టగిరి గారు నాకు ఆ ఐ.ఎస్.ఓ పని అప్పచెప్పారు. ఇది ఒక ఛాలెంజ్ గా తీసికొన్నాను. నాకు కావలిసిన స్టాఫ్ ఇచ్చారు.నేను అడిగిన అన్ని ఫెసిలిటీలూ ఇచ్చారు. నాకు ఇచ్చిన ఒకే ఆర్డర్ ” యు హావ్ టు గెట్ ఐ.ఎస్.ఓ . ఆస్క్ ఫర్ ఎనీథింగ్ యు విల్ గెట్ “. ఇంత పెద్ద బాధ్యత నేను నిర్వహించగలనా అనిపించింది. మా జి.ఎం. గారు అందరి ఆఫీసర్లతోటీ చెప్పారు ” ఫణిబాబు ఏది చెప్పినా, నా తరఫునే అనుకోవాలి, అతని దగ్గరనుండి ఏ విధమైన కంప్లైంటూ రాకూడదు ” అని.నేను ఒక కోర్ గ్రూప్ తయారుచెసి, ముందుగా మా వాళ్ళందరికీ ఐ.ఎస్.ఓ. గురించి బి.ఐ.ఎస్ వారి ద్వారా ట్రైనింగ్ ఇప్పించాను. అసలు ఈ ఐ.ఎస్.ఓ అంటే ఏమిటీ, దానికి కావల్సిన ముఖ్యమైన రికార్డులూ, మాన్యుఅల్సూ, అన్నీ ముందుగా తయారు చేసికొన్నాము. ఈ సందర్భం లో నా అసిస్టెంట్లు చాలా సహాయ పడ్డారు. ఈ విషయం లో నేను ప్రతీ 15 రోజులకీ ఢిల్లీ, ముంబై లు వెళ్ళవలసి వచ్చేది. నేను ఒక కోఆర్డినేటర్ గా పనిచేశాను. ముందుగా ఒక ప్లాన్ ఆఫ్ ఆక్షన్ తయారుచేసేవాడిని, దానికి మా జి.ఎం గారి అనుమతి తీసికొని అమలు చేయడమే. ఎలా అయిందంటే ఒకానొక టైము లో ఫణిబాబు అంటే ఐ.ఎస్.ఓ అని.అన్ని రికార్డులూ తయారుచేసికోవడానికి, ప్రతీ రోజూ రాత్రి 11.00 గంటలదాకా పనిచెసేవారము. అంతసేపూ, మా జి.ఎం. గారు కూడా ఆయన అఫీసులోనే ఉండేవారు. ఓ ముహూర్తం చూసుకొని బి.ఐ.ఎస్ వారిని ఆడిట్ కి పిలిచాము. ఆడిట్ జరిగిన మూడు రోజులూ నా జీవితం లో ( ఉద్యోగ రీత్యా ) ముఖ్యమైనవి. మా జి.ఎం. గారిచ్చిన ఛాలెంజ్ నెగ్గకలనా అని. ఒక్క రోజు కూడా కంటి మీద నిద్ర లేదు. ఆడిటర్లు ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ ల నుండి వచ్చారు.ఒక్క సంగతి ఏమంటే, వచ్చిన ఆడిటర్లకి కూడా నా సిన్సియారిటీ మీద నమ్మకం కలిగింది. ఆఖరి రోజున ఆడిట్ పూర్తి అయిన తరువాత ఓ మీటింగ్ పెట్టి అక్కడ ఎనౌన్స్ చేస్తారు, మాకు ఐ.ఎస్.ఓ ఇస్తున్నారో లేదో. ఆరోజు రాత్రి 8.00 గంటలదాకా మా ఫాక్టరీలోని వర్కర్స్ కుడా అందరూ ఆగిపోయారు, రిజల్ట్ తెలుసుకోవడానికి. మా జి.ఎం గారైతే ఎంత టెన్షన్ పడ్డారో. ఆడిటర్ల మీటింగ్ అవుతుండగానే ముందుగా నాకు చెప్పారు, సర్టిఫికెట్ ఇస్తున్నామని. మా జి.ఎం గారితో ముందుగా ఆవిషయం చెప్పగానే, ఒక్కసారి ఆయన కుర్చీలోంచి లేచి నన్ను ఎత్తేశారు. అది మాత్రం నా జీవితం లో మరచిపోని మధుర సంఘటన. మీటింగ్ లో అనౌన్స్ చేయగానే, అందరికీ తెలిసింది. ఏదో నేనే అంతా చేశానని అందరూ పొగడడమే. పోన్లెండి నేనూ ఒక విజయానికి కారణం అయ్యానూ అనిపించింది.అక్కడ వరంగాం లో ఉన్నన్నాళ్ళూ ఇంక నాకు తిరుగు లేకుండా అయిపోయింది. ఫాక్టరీ లో అందరూ చూపించిన ప్రేమాభిమానాలు మాటల్లో చెప్పలేను. భగవంతుడి దయ వలన పిల్లలిద్దరూ కూడా చదువులో ఎంతో ఎత్తుకి తీసికెళ్ళారు. ఈ కారణాల వల్ల నా బాధ్యత కూడా ఎక్కువయ్యింది.దీనిని చూసి ఈర్ష్య పడ్డవాళ్ళూ ఉన్నారు ( మన వాళ్ళలోనే ).నా డెజిగ్నేషన్ మిగిలిన తెలుగు వారి కంటే తక్కువది.కానీ ఫాక్టరీలో పొజిషన్ మాత్రం వారందరికంటే పైన ఉండేది. ఇది నచ్చేది కాదు కొంతమందికి. ఇలాంటి విజయాలు సాధించాలని రాసి పెట్టి ఉందేమో , అందుకే నాకు 1986 లో వచ్చిన ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాన్సిల్ అయిపోయింది. ” ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ “. అందుకే నేను దేనికీ నిరుత్సాహ పడను ” ఏదైనా మన మంచికే ” అనేది నా ప్రిన్సిపల్.

బాతాఖానీ- తెరవెనుక ( లక్ష్మి ఫణి ) ఖబుర్లు–మాల్ కల్చర్

మేము ఇక్కడికి వచ్చిన ముఖ్యమైన కారణం –మా మనవరాలు చి.నవ్య పుట్టిన రోజు కూడా. 15 వ తారీఖున తనకి 3 సంవత్సరాలు నిండుతాయి.

తనకి ఎదైనా గిఫ్ట్ కొనడానికి మా అబ్బాయి, కోడలు తో కలసి మేము లైఫ్ స్టైల్ మాల్ కి వెళ్ళాము. నేను ఈ రోజు వ్రాసేదేమిటంటే, అక్కడి మా అనుభవాలు. అలాంటి పెద్ద పెద్ద మాల్స్

అన్నీ కళ్ళకి ఇంపుగా, జిగేల్ మనిపించేటట్లుగా ఉంటాయి. అక్కడకొచ్చే వాళ్ళు కూడా అదే స్టైల్ లో ఉన్నారు. చిన్న చిన్న పిల్లల్ని చూస్తూంటే చాలా ఆశ్చర్యం వేసింది. మా రోజులకీ,

ఇప్పటికీ ఎంత తేడా ఉందో అని. ఈ రోజుల్లో వచ్చే జీతాలతో పిల్లలు ఏది అడిగినా కొనడానికి తల్లి తండ్రులు వెనుకాడరు. నేను ఏదో చాదస్థం గా రాస్తున్నాననుకోకండి. అవన్నీ అవసరమా?

పిల్లలు అడిగినవన్నీ కొంటేనే వారి మీద ప్రేమ ఉన్నట్లా ? లేక, వారితో గడపడానికి ప్రతీ రోజూ సమయం లేక, వారం లో ఒకరోజు వాళ్ళని ఇలా మాల్స్ కీ, ఆ తరువాత ఏదో ‘ఈటింగ్

జాయింట్ కీ తీసికెళ్తే వాళ్ళ బాధ్యత తీరిపోతుందా ?

ఇంక ఆ ఈటింగ్ జాయింట్ లో దొరికే తినుబండారాల ఖరీదులు చూస్తూంటే కళ్ళు తిరిగి పోయాయి. రవ్వ మసాలా దోశ 45 రూపాయలేమిటండీ ?

అవసరమైన చోట ఖర్చు పెట్టవచ్చు. వీళ్ళు ఖర్చు చేసే విధానం చూస్తూంటే , ప్రతీ రోజూ మనం పేపర్లలో చదువుతున్న ” ఆర్ధిక మాంద్యానికి ” ఏమీ అర్ధం లేదనిపించింది. ఆ పేపర్లలో

వచ్చెదంతా ఉత్తినే పబ్లిక్ సింపతీ కోసం వ్రాసినట్లనిపించింది. అందరూ శుభ్రం గా తింటున్నారు, తిరుగుతున్నారు.

నగరాల్లో పెరిగే పిల్లల జీవన శైలి చాలా ఫాస్ట్.అదే ప్రగతి అనుకోవడం చాలా విచారకరం. నెను వ్రాసేదంతా పాత చింతకాయ పచ్చడి లా ఉంటుందని చాలా

మంది అనుకోవచ్చు. కానీ దీనిలో కూడా ఓ మంచి విషయాలు గమనించాను. రెండేళ్ళ పిల్ల కూడా తనకి కావల్సిన వస్తువు ఏమీ సంకోచం లేకుండా చక్కటి ఇంగ్లీష్ లో అడగగల్గుతోంది

దానికి కారణం — వాళ్ళు వెళ్ళే ప్లే స్కూల్స్,క్రెష్ లు, ఇంట్లో వాళ్ళ తల్లితండ్రులు సమకూర్చిన ఆధునిక సౌకర్యాలూ.

ఇదివరకైతే నాకు ఇలాంటి మాల్స్ కి వెళ్ళడం కొంచెం మొహమ్మాటంగా ఉండేది. కానీ క్రిందటేడాది నేను చేసిన ” మిస్టరీ షాపింగ్ ” ల ధర్మమా అని, ఆ

గొడవ లెదు ఇప్పుడు.ఒకటే సమస్య ఏమిటంటే అక్కడ కూర్ఛోవడానికి ఏమీ స్థలం కానీ, సదుపాయం కానీ వాళ్ళు ఏర్పాటు చేయలేదు. మొత్తం రెండు గంటలు గడిపాము. అంతసేపు

నాలాంటి వాడు కొంతసేపైనా కూర్చోకుండా ఉండలేడు కదా. ఈ విషయ మై నేను రేపు “మౌత్ షట్.కాం ” లో వ్రాస్తాను.నా అదృష్టం కొద్దీ నేను అందులో వ్రాసేదానికి కూడా మంచి

స్పందన ఉంటోంది .

నాకు ఒక్క విషయం అర్ధం అవదు. అందులో అంత డబ్బు పోసి కొన్న వస్తువుల మన్నిక ఎలా ఉంటుందీ అని.

నేను నిన్న వ్రాసిన రైలు ప్రయాణం గురించి ఒకరు ( పేరు మరచిపోయాను ) తన స్పందన వెలిబుచ్చారు. దురదృష్టవశాత్తూ అది ” స్పాం ” లో వచ్చింది. ఏదో నొక్కితే ఆకామెంట్

కాస్తా డిలీట్ అయిపోయింది. నన్ను మనసారా క్షమిస్తూ, ఆయన ఆ కామెంట్ ని మళ్ళీ పంపమని ప్రార్ధిస్తున్నాను.ఆయన నేను వ్రాసినదానికి, బాంకులకి వెళ్ళేటప్పుడు పెన్ను లేకుండా

వెళ్ళే వారిని గురించి ప్రస్తావించారు.

రేపటి నుండి మళ్ళీ నా గోల ప్రారంభిస్తాను…

బాతాఖాని-తెరవెనుక (లక్ష్మిఫణి) ఖబుర్లు–రైలు ప్రయాణం

రెండు రోజులనుండి కనిపించడం లేదూ, ” వదిలేడురా బాబూ ” అనుకుంటున్నారా ? నేనెక్కడికి వెళ్తానండీ ? మా పిల్లల్ని చూడడానికి కోణార్క్ లో వెళ్తే బాగానే ఉంటుంది.నేను మామూలుగా ఆన్లైన్ లొనే టికెట్లు బుక్ చేస్తూ ఉంటాను.ప్రతీసారీ అప్పర్,మిడిల్ బెర్త్ లే వస్తూంటాయి. పెద్ద గొప్పగా బుక్ చేస్తున్నప్పుడు, మన ప్రిఫరెన్స్ కుడా అడుగుతారు. అప్పతికీ ఒకసారి నేను ఐ.ఆర్.సి.టి.సి వాల్లని అడిగాను–మీరు ఖాళీలు ఉన్నప్పుడు కూడా సీనియర్ సిటిజెన్స్ కి క్రింద బెర్త్ లు ఎందుకు ఇవ్వరూ అని. అదెదో రాండం పధ్ధతిలో చేస్తారూ, అది మా చేతిలోలేదూ, అని సమాధానం ఇస్తూ ఓ ఉచిత సలహా కుడా ఇచ్చారు– మీరు మీ తోటి ప్రయాణీకులతీ అడ్జుస్ట్ చేసుకోవచ్చూ అని. నెను సీనియర్ సిటిజెన్ అయినప్పటి నుండీ అదే పనిచేస్తున్నాను. కోణార్క్ రాజమండ్రి వచ్చేసరికి అర్ధరాత్రవుతుంది, అప్పుడు ఎవరినీ లేపేందుకు వీలు పడదు, నాకు అంత ఎత్తు ఎక్కడం కుదరదు. ఇలా కాదని అప్పటినుంచీ, కాకినాడ–భావ్నగర్ లో వెళ్తున్నాము. ఆట్రైన్ రాజమండ్రి పొద్దుట 5.00 గంటలకి రావాలి. ఎప్పుడూ రాదు. అలాగని మనం ఆలశ్యం గా వెళ్తే ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది !! ఫోన్ చేసి కనుక్కుందామా అంటే రాజమండ్రి లో తెల్లవారుఝామున మనకి జవాబు చెప్పేవాడుండడు. అందువల్ల, రాత్రంతా మెళుకువగా ఉండి, పొద్దుటే ఆటో లో 4.30 కి రాజమండ్రి స్టేషన్ కి చేరాము. ట్రైన్ 5.00 గంటలు లేటన్నారు. ఆఖరికి 10.30 నిమిషాలకి వచ్చింది. ఈ సారి మాకు రెండూ లోయర్ బెర్త్ లే దొరికేయి. మా ఇంటావిడ అంటూనేఉంది. ఇలా రావడం విచిత్రం, ఏదో ఒకటి జరుగుతుందని. దీని ధర్మమే ఈ లేట్ గా రావడం. పైగా ఇంకో బాధ–దీనికి పాంట్రీ కార్ లేదు. ఇంత లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ కదా ఎందుకు లేదూ అని విచారిస్తే తెలిసిందేమిటంటే–ఇందులో ఎక్కువ ప్రయాణీకులు, మార్వాదీ లూ, గుజరాతీలే ఉంటారు. వారు తమతోనే తెచ్చేసుకుంటారు రెండు రోజులకీ సరిపోయే తిండి. దీని వలన పాంట్రీ కారు ఒకసారి పెట్టేరుట–కానీ వాడు నష్టాలు భరించలేక పారిపోయాడు ఇంకెవ్వరూ ముందుకు రాలేదు.ఇదండీ ఈ ట్రైన్ భాగోతం!! చెప్పేదేమిటంటే ట్రైన్ లో మనకి ఎదురయ్యే అనుభవాలు- ప్రయాణం లో చదువుకోవచ్చుకదా అని నెను అన్ని రకాల పుస్తకాలూ, పేపర్లూ (తెలుగువి) కొంటాను. ఇంగ్లీష్ వి అయితే అందరూ అడుగుతారు కనుక. మన అదృష్టం ఎప్పుడూ బాగుండదు. ప్రయాణం లో కొందరు ” ప్రాణులు ” ఉంటారు. ఎదుటివాడెవడైనా ఏదో పుస్తకమో, పేపరో తెరిస్తే చాలు ” గుంట కాడ నక్క ” లాగ ఎదురుచూస్తూ ఉంటాడు. ఆ పేపర్ ఎప్పుడు అడగడమా అని. మనం ఏదో ఖబుర్లు చెప్పడానికి పేపర్ పక్కన పెట్టేమనుకోండి, సిగ్గూ శరమూ వదిలేసి ” ఓ సారి ఇలా ఇవ్వండి చూసి ఇస్తానూ ” అని మన ప్రమేయం లేకుండానే లాగేసుకుంటాడు!! చివరకి ఆ పెపర్ వాడు కొన్నంత పోజు పెట్టేస్తాడు.మనం అడిగేమంటే అదేదో వాడి సొమ్ము ధార పోస్తున్నట్లుగా మొహం పెడతాడు. దీని కి కొసమెరుపేమంటే వాడి ఫామిలీ భోజనం చేసేటప్పుడు, వాడి బట్టలు పాడౌకుండా మన పేపర్ అడుగుతాడు. ఇంక మేగజీన్లైతే అడగఖ్ఖర్లెదు. ” అరే స్వాతి తెచ్చారా, ఆంధ్రభూమి ఈ వారానిది రాలేదా ” అని ఓ పరామర్శా !!ప్రపంచం లో ఉన్న ప్రతీ సమస్య మీదా, ప్రతీ తెలుగు సీరియల్ మీదా తన అమూల్యమైన అభిప్రాయాన్ని అందరిమీదా రుద్దడం. అందరూ అలాగే ఉంటారని అనడం లేదు.వారు ఒక మాగజీన్ తెస్తే అది ఇతరులకిచ్చి వారి దగ్గర ఉన్నది తీసికోవడం. కానీ నాకైతే అంత అదృష్టం ఎప్పుడూ కలగ లేదు. నెను ఇప్పటి దాకా ఎవరిదగ్గరా పెపర్ కానీ, పుస్తకం కానీ ఎరువు తీసికొని చదవలేదు. చదవాలని కోరిక ఉన్నప్పుడు, కొనే గుణమూ ఉండాలి. అంతేకానీ ఇంకోడెవడో కొంటే అది ఫూకట్ గా చదవాలనేది ఓ పెద్ద దుర్గుణం. ఈ అలవాటున్నవారు ” కొందామంటే టైము లేకపోయిందీ, అలాగని మీరు అందరినీ విమర్సించకూడదు” అని.చదవాలంటే ట్రైన్ పెద్ద స్టేషన్ లో ఆగినప్పుడు కొనుక్కో, అంతేకానీ ఇంకోళ్ళ ఖర్చు మీద మజా చేయవద్దనీ. నా దగ్గర ఈ వారం స్వాతి,నవ్య, రచన మాస పత్రికా ఉన్నాయి. ఛస్తే బయట పెట్టకూడదనుకొన్నాను. ఎందుకంటే అప్పటికే ఓ మహానుభావుడు తీసికొన్నానా దగ్గర ‘ఈనాడు ” పేపరు త్డీసికొన్నాడు, గుడ్లగూబలాగ చూస్తూన్నాడు ఇంకా ఏమున్నాయా అని !! అవతలివాడు సిగ్గు విడిచి అడిగినట్లుగా మనం చెప్పడానికి మొహమ్మాటం అడ్డు వస్తుంది. ఇలాంటి వారి బారి నుండి తప్పుకొనే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి. మా ఇంటావిడ, పిండి పులిహారా , పెరుగూ అన్నం చేసి తీసికొని రావడం వల్ల తిండికేమీ లోటు లేకుండా అయింది.కానీ తనకి చదవడానికే ఏమీ పుస్తకం ఇవ్వలేక పోయాను .

బాతాఖానీ-లక్ష్మిఫణిఖబుర్లు–మాతృదేవోభవ

సరీగ్గా రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజు ( తిథుల ప్రకారం ) మా అమ్మగారు తన 95 వ ఏట స్వర్గస్థులైనారు. మాకు ఆవిడ చివరి 3 సంవత్సరాలూ సేవ చేసే అదృష్టం కలిగింది. అప్పటి దాకా ఆవిడ చాలా సంవత్సరాలు మా అన్నయ్యల దగ్గర ఎక్కువగా గడిపే వారు. మా చెల్లెలి దగ్గర కూడా కొంత సమయం గడిపారు. ప్రతీ సంవత్సరమూ ఓ రెండు నెలల పాటు మా దగ్గరకి వచ్చేవారు. వచ్చినప్పటినుంచీ, ఆవిడకు కాలక్షేపం లేక మన ప్రాంతాలకి వెళ్ళిపోతాననేవారు.

ఒకవిషయం మాత్రం చెప్పాలి– నన్ను ఎప్పుడూ మందలించిన జ్ఞాపకాలు లేవు.” ఏరా వెధవా ” అనికూడా ఎప్పుడూ అనలేదు. మరీ కోపం వచ్చినప్పుడు అదేదో  ” దొబ్బిడాయి ” అనే వారు. దానర్ధం ఇప్పటికీ నాకు తెలియదు. చిన్నప్పుడు ఆవిడతో పెరంటాలకి వెళ్ళిన గుర్తు. ఒకటి రెండు తీర్థయాత్రలకి ( అరసవిల్లి, శ్రీకూర్మం ) వెళ్ళాను.ఎడపిల్లాడిగా మా అమ్మగారి ఒడిలో కూర్చొని, మా చెల్లెలు పుట్టినప్పుడు పురిటి స్నానం చేయించారు. 60 సంవత్సరాలు జరిగిపోయినా ఇప్పటికీ గుర్తే.

ఆవిడకు వినిపించేది కాదు. ఏ కారణంవలనో ఆవిడకు చెవికి మిషన్ పెట్టించలేదు. అందువలన , ఆవిడ చెప్పేవి మేము వినడమే కానీ,మేము చెప్పేవి ( ఎప్పుడైనా విసుక్కున్నాకానీ ) ఆవిడకు వినిపించేవి కావు–అదృష్టంతురాలు !! నేను అమలాపురం లో ఉన్నన్నాళ్ళూ, మా ఇంటికి వచ్చే అతిథులకి మర్యాదలు చేయడం లోనే ఆవిడకు టైము గడిచిపోయేది. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వండుతూనే కనిపించేవారు. ఆవిడ చేతి మీదుగా అంతమంది అన్నం తినడం వలనే  ఈ వేళ మేము  ఎటువంటి లోటూ లేకుండా  సుఖంగా ఉంటున్నామని నా నమ్మకం.

2003 వ సంవత్సరం లో మా చిన్నన్నయ్యగారు స్వర్గస్థులైన తరువాత, ఆవిడ మా దగ్గరకు పూణే వచ్చేశారు. అంతకుముందు ఒకసారి మా అబ్బాయితో అన్నారు ” నీకు పెళ్ళై ఓ పిల్ల పుట్టేదాకా నేను ఎక్కడికీ వెళ్ళను ” అని. ఓర్నాయనో అయితే ఇంకా చాలా కాలం ఉండాలి నువ్వు, అప్పటిదాకా నేను ఉండడం గారెంటీ లేదు అనేవాడిని !!

అదేం చిత్రమో ఆవిడ ఆశీర్వదించినట్లుగానే 2005 లో మా అబ్బాయి వివాహమూ జరిగింది,2006 లో వాడికి అమ్మాయి పుట్టింది, ఆ పాప మొదటి బర్త్ డే కి ముందరే ఆవిడ ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు.

ఆవిడకు   చట్ట కి ( హిప్ బోన్ ) దెబ్బతగిలి,అదేదో రాడ్ వేశారు. రెండో సారి 2004 లో పూణే వచ్చేముందర మళ్ళీ విరిగింది. ఇంక ఆపరేషన్ చేయకూడదన్నారు. అందువలన అన్నీ మంచం మీదే జరిగేవి. అంత వయస్సు వచ్చినా ఆవిడకు బి.పి , సుగర్ లాంటి సమస్యలుండేవి కాదు. జ్ఞాపక శక్తి అద్భుతం. ఎప్పడెప్పడివో ( ఆవిడ పెళ్ళి దగ్గరనుంచీ ) ఖబుర్లు చెప్పేవారు. అన్నింట్లోకీ అద్భుతం ఏమంటే ఆవిడ తన రాలిపోయిన జుట్టుని, అదెదో నెట్ లాగ పేనుకొని అదే కట్టుకొనేవారు. చాలా కాలం వరకూ తెలుగు వార పత్రికలూ, పేపరూ చదివేవారు, దానిలో విషయాలు చర్చించడం ఒకటీ.

ఆవిడ పోవడానికి ముందు ఓ పదిహేను రోజులు, మా పనిపిల్ల ( ఆవిడ కి సంబంధించిన పనులన్నీ చేసేది ) శలవు పెట్టడంతో నేను ఆవిడను ఎత్తుకొని బాత్ రూం కి తీసికెళ్ళడం లాంటి పనులు చేసేవాడిని. మా ఇంటావిడైతే టైముకి ఆవిడకు అన్నీ అమర్చేది. ఒకానొక టైములో మా ఇంట్లో

95 ఏళ్ళ మనిషి దగ్గరనుంచి, నెలల పాప దాకా అందరూ ఉండేవారు. సాయంత్రం అయ్యేసరికి, మా పిల్లలు ఆఫీస్ నుండి రావడం, మా ఇంకో మనవరాలు స్కూల్ బస్సు మా ఇంటిదగ్గరే దిగడం, దానిని తీసుకోవడానికి మా అమ్మాయి మా మనవడితో రావడం. ఇల్లంతా అదేదో ” డే కేర్ సెంటర్” లాగ ఉండేది !!

ఓ వారం రోజులు ముందునుంచీ ఆహారం తినడం పూర్తిగా మానేశారు. డాక్టర్కి చూపిస్తే అన్నీ చెక్ చేసి, ఫాకల్టీలు అన్నీ బాగానే ఉన్నాయీ, మనం బలవంతంగా ఏమీ ఇవ్వలేము అన్నారు. పోయేముందు మా డాక్టర్ శ్రీదేష్పాండే గారుకూడా పరీక్షించి ఏమీ ఫర్వాలేదన్నారు.

ఎందుకో కారణం చెప్పలేను కానీ పోయేముందు ఆదివారం, మా అబ్బాయీ, కోడలూ ఘంటసాల గారి భగవద్గీత సి.డి. పెట్టారు ఆరోజంతా అబ్బాయీ, కోడలూ, మా ఇంటావిడా ఆవిడ దగ్గరే గడిపారు.  తెల్లవారుఝాము 4.00 గంటల దాకా ఆవిడ పక్కనే ఉండి, కొంచెం కునుకు పట్టితే, మా ఇంటావిడని లేపి కూర్చోపెట్టాను. సోమవారం ఉదయం 6.00 గంటలకు ప్రశాంతంగా మా ఇంటావిడ చేయి పట్టుకునే నిద్ర లోనే కన్ను మూశారు.

మనకి ఎంత వయస్సు వచ్చినా అమ్మ అమ్మే. ఇంకెవరూ ఆ స్థానాన్ని పూడ్చలేరు.అమ్మే లేకపోతే మనకి అస్థిత్వమే లేదు కదా. చేయవల్సినంత చేయకలిగామా అని అనుకుంటూ ఉంటాను. అయినా ఇప్పుడేమీ చేయలేము కదా !!

బాతాఖానీ ఖబుర్లు –39

అప్లికెషన్ ఇచ్చిన 15 రోజులకి      కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పూణే ( సి.ఓ.ఈ.పి ) నుండి కౌన్సెలింగ్ కి తేదీ తెలిసింది. మేం నలుగురం కలసి వెళ్ళాము. మా అమ్మాయి రాంక్ బాగా పైనే ఉండడం వలన తనని త్వరగానే పిలిచారు. ఆ ఏడాదే మొదటిసారిగా ” కంప్యూటర్ సైన్స్” మొదలుపెట్టారు. తన ఇష్ట ప్రకారం దానిలోనే దొరికింది. ఇంక హాస్టల్ లో కూడా,రాంక్ ధర్మమా అని, తన రూం మేట్ల ని ఎన్నుకోవడం లో ప్రయారిటీ ఇచ్చారు.

మొదటి సారి మమ్మల్ని అందరినీ వదిలి పెట్టి వెళ్తున్నందుకు, చాలా బెంగ వచ్చేసింది. అయినా తప్పదుగా. పుణే లోనే ఉన్న మా స్నేహితుడి ని ” లోకల్ గార్డియన్ ” గా పెట్టాము. భుసావల్ నుండి పూణే కి ఒక రాత్రి ప్రయాణం( బస్సైనా, ట్రైన్ అయినా ). చెప్పానుగా మాకు వరంగాం లో

టెలిఫోన్ సౌకర్యం ఒక్క మా జి.ఎం. ఆఫీసు లోనే ఉండేది., అందువల్ల ఉత్తరాలే గతి మాకు. రోజూ ఉత్తరాలలోజరిగిన ప్రతీ విషయమూ వ్రాసేది. అదే నిష్పత్తి లో నేనూ జవాబు ఇచ్చేవాడిని.

ప్రతీ నెలా నేనైనా పూణే వెళ్ళేవాడిని లేకపోతే తనైనా వరంగాం వచ్చేది. మా ధర్మమా అని పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళూ, రైల్వే వాళ్ళూ, ప్రైవేట్ బస్సుల వాళ్ళూ బాగుపడ్డారు ఆ నాలుగుఏళ్ళలోనూ !!!

తన ఫస్ట్ ఇయర్ లో 1992 లో మా పెద్దన్నయ్య గారు అకస్మాత్తుగా తణుకు లో పరమపదించారు. టెలిగ్రాం రాగానే మేము నలుగురమూ కలసి రాజమండ్రి వెళ్ళాము. మా అమ్మాయికి పరిక్షల టైము అవడం వల్ల, వాళ్ళు ముగ్గురినీ తిరిగి పపించేసి, నేను రాజమండ్రి లో ఉండిపోయాను.

ఆ పదిరోజులూ కార్యక్రమాలు చేసే అదృష్టం నాకు కలిగింది. ఈ విధంగా మా పెద్దన్నయ్య గారికి ఋణం తీర్చుకోగలిగాను.

ఎప్పుడైనా ఉత్తరం  రాలేదూ అంటే మా అమ్మాయి వరంగాం వస్తున్నట్లన్నమాట.. అలాగే కాలెజీ నుండి వచ్చేసరికి, నా దగ్గరనుండి ఉత్తరం లేకపోతే, నేను ప్రత్యక్షం అయ్యేవాడిని !!

అమ్మాయి ఇంజనీరింగ్ లో చేరే సమయానికి మా అబ్బాయి క్లాస్ 7 లో ఉండేవాడు. తనకి క్విజ్ ల మీద చాలా ఆసక్తి ఉండేది. టి.వీ. లో వచ్చే బోర్నవిటా ( డెరెక్ ఓ బ్రైన్ ది ),క్విజ్, అలాగే సిద్ధార్థ్ బాసూ నిర్వహించే ” ఇండియా క్విజ్ ” అనుకుంటా ఎప్పుడూ మిస్ అయేవాడు కాదు. పుస్తకాలూ,  ఇంగ్లిష్ మాగజీన్లూ సరేసరి. చిన్నప్పటినుండీ ఇలాంటి వాటి మీద ఎక్కువగా శ్రధ్ధ చూపేవాడు.క్రికెట్ అయితే చెప్పఖర్లెదు. మా అమ్మాయి పుణే వెళ్ళినా, మాకు  ఒంటరితనం ఎప్పుడూ ఉండేది కాదు, అబ్బాయి మాతోనే ఉండడం వలన.

మా జి.ఎం శ్రీ సుందరం గారు బహూకరించిన రోలింగ్ కప్ ( క్లాస్ 12 వారికి ) ముందటేడాది వచ్చినవాడు తనతో తీసికెళ్ళిపోవడం వలన, మళ్ళీ అప్పటికప్పుడు కొత్తది కొని, మా అమ్మాయి వచ్చినప్పుడు తనకి ప్రెజెంట్ చేసారు. అలాగే స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు, మా సొసైటీ ల వాళ్ళూ సత్కారం చేశారు.

మా అమ్మాయి ఉన్నంత కాలం స్కూల్లో జరిగే అన్ని విషయాలూ తెలిసేవి. అబ్బాయి తో అలా కాదు, ఏమీ చెప్పేవాడు కాదు.

వీడికి  మా అమ్మాయి లాగ పాటలమీద ఆసక్తి ఉండేదికాదు.రెసిటేషన్, గేమ్స్, క్విజ్, లలో ఎక్కువగా పాల్గొనేవాడు. స్నేహితులు కూడా  ఎక్కువే. మా క్వార్టర్ కి ఎదురుగానే స్కూల్ ఉండడం వలన ఇంటర్వెల్ లో ఇంటికి రావడానికి వీలు పడేది.చదువు విషయం లో నన్నెప్పుడూ ఇరుకులో పెట్టలేదు. ఏమైనా డౌట్ వచ్చినా

మా డాక్టర్ గారినే పట్టుకొనేవాడు.   వాళ్ళ అక్క కి కొన్న రిఫరెన్స్ పుస్తకాలు, తనకీ బాగానే ఉపయోగించాయి. కొత్తవేమన్నా కావాలంటే తెప్పించేవాడిని. అన్ని క్లాసులలోనూ తనుకూడా వాళ్ళ అక్క లాగే ఫస్ట్ లోనే ఉండేవాడు.

బాతాఖానీ ఖబుర్లు –38–(డాక్టరు కానన్న అమ్మాయి)

మా వరంగాం ఏరియా ఉత్తర మహరాష్ట్ర యూనివర్సిటీ ఏరియా లో ఉండేది. పూణే యూనివర్సిటీ లో సీట్ కావాలంటే, మైగ్రేషన్ ( తహసిల్దార్ ఆఫీసు నుండి) సర్టిఫికేట్, జలగాం కలెక్టర్ ఆఫీసునుండి సిటిజెన్షిప్ సర్టిఫికేట్ ( నాకు ఇప్పటికీ అర్ధం అవదు, దిని అవసరం ఏమిటో ) తీసికోవాలన్నారు. ముందుగా  భుసావల్ వెళ్ళి కొద్దిగా ” చాయ్ పానీ ” డబ్బులు సమర్పించుకొని మైగ్రేషన్ సర్టిఫికెట్ తీసికొన్నాను. దానిని తీసికొని జలగాం వెళ్ళాను. మా అమ్మాయి మార్కులు చూసి, అక్కడ స్టాఫ్ ఏ విధమైన చాయ్ పానీ డబ్బులు ( ఉల్టా నాకు వాళ్ళు చాయ్ ఇప్పించారు !! ) తీసికోకుండా సిటిజెన్షిప్ సర్టిఫికేట్ ఇచ్చారు.

ఆ మర్నాడు పూణే వెళ్ళి, మెడికల్ కి, ఇంజనీరింగ్ కీ అప్లికేషన్ ఫారం లు తెచ్చాను.. ఇంజనీరింగ్ మెరిట్ లిస్ట్ లో రాష్ట్రానికి 3 వ నంబర్ లోనూ, మెడికల్ ( బి.జె. మెడికల్ కాలెజ్ లో ) కి 7  వ నంబర్ లోనూ మా అమ్మాయి రాంక్ వచ్చింది. ఇప్పుడు సమస్య ఏమిటంటే దేనిలో చేరాలా అని.

దేనికైనా మేము సిధ్ధమే. ఇలా కాదు అనుకొని మా డాక్టరమ్మ గారి దగ్గరకు సలహా కి వెళ్ళాము, మేము నలుగురం కలసి. ఆవిడ కంటే మాకు శ్రేయోభిలాషి ఎవరూ లేరు. ఆవిడైతే మార్కులు చూసి చాలా సంతోషించారు. మేం అడిగిన సమస్య ఆవిడకు అర్ధం అయ్యింది. చాలా ఓపికగా, మెడికల్ లో చేరాలంటే కావలిసిన గుణాలు చెప్పారు — (1) ఓర్పూ, సహనం ఉండాలి (2) ఆర్ధికంగా నిలదొక్కుకునే ( నాకు ) దన్నుండాలి (3) మెడికల్ లో ఒక్క ఎంబీబిఎస్ తో సరిపోదు ఆ తరువాత ఏదో ఒక దానిలో స్పెషలైజేషన్ చేయాలి, అదంతా అయేసరికి చాలా కాలం పట్టవచ్చు. (4) ఆ తరువాత ప్రాక్టిస్ పెట్టడానికి,నిలదొక్కుకోడానికీ శ్రమ పడాలి.– అలాగని ఆవిడ మమ్మల్ని నిరుత్సాహ పరచలెదు. ఉన్న విషయమెమిటో చెప్పి, ఆఖరి నిర్ణయం మా అమ్మాయికే వదిలేశారు. మేము కూడా మా అమ్మాయి  ఏది చదవాలంటే దానికి సిధ్ధ పడ్డాము. డబ్బుకేముందీ ఎలాగోలాగ సర్దవచ్చు. మెడికల్ లో పిలిచి సీట్ ఇస్తా మంటే వద్దనేవారు ఎవరైనా ఉంటారా ? మెడికల్ లో సీట్ గురించి లక్షలు,లక్షలు పోసి ” పేమెంట్ ” సీట్ లు తెచ్చుకొన్నవారిని చాలా మందిని చూశాము. అందువలన మేము అన్నింటికీ సిద్ధం అయ్యాము.

ఏమనుకుందో ” డాడీ నేను ఇంజనీరింగ్ లోనే చేరుతానూ ” అంది. తను చెప్పిన కారణాలు చాలా కన్విన్సింగ్ గా ఉన్నాయి.

” తమ్ముడి చదువు పూర్తయినా నేను ఇంకా చదువుతూనే ఉంటాను, నాకు అంత ఓపికా, సహనమూ లేవు, మన  కుటుంబం లో అమ్మాయిలు చాలా మంది డాక్టర్లే ఉన్నారు, నేను మొదటి లేడీ ఇంజనీర్ అవ్వాలని ఉంది ”

మేము నలుగురం కలిసే ఈ విషయం చర్చించి ఈ నిర్ణయం తీసికొన్నాము. చాలా మంది అన్నారు ” కాళ్ళ దగ్గరికి మెడికల్ సీట్ వస్తే అలా వదిలేస్తున్నారేమిటీ ” అని. ” వుయ్ ఆర్ డిఫరెంట్ ” అని అదేదో “టొమాటో సాస్ ఎడ్వర్టైజ్మెంట్ ” లాగ చెప్పాము. నచ్చిన వాళ్ళకి నచ్చింది లేనివాళ్ళకు లెదు. చదవవలిసినది మా అమ్మాయి, చదివించేది మేము, మా ఇష్ట ప్రకారమే చేస్తాము కానీ ఊళ్ళో వాళ్ళందరి కోరిక ప్రకారం కాదు కదండీ .

అప్పుడు చెప్పాము మా అమ్మాయి తో ” జీవితం లో మాకు కావల్సినది మేము అడగఖర్లేకుండా ఇచ్చావు. ఇంతకంటే ఏ తల్లితండ్రులూ, పిల్లల మార్కుల విషయం లో ఆశించలేరు.  ఇప్పుడు నీకు కావల్సినది అడుగు. “అన్నాము. ” నేను ఇంజనీరింగ్ పూర్తి అయిన తరువాత నాకు కావల్సినది అడుగుతానూ, కాదనకుండా ఇవ్వాలి ” అంది.

నా వరకూ నెను ఒక్క విషయం చెప్పాలి. మా ఇంటావిడ కానీ, మా అమ్మాయి కానీ, మా అబ్బాయి కానీ నన్ను ఎప్పుడూ ఏమీ తీర్చలేని కోరికలు అడగలేదనడంకంటే, అస్సలు ఏమీ అడిగేవారేకాదు !! అది నాకు భగవంతుడూ, వాళ్ళూ ఇచ్చిన  ఓ వరం !!

అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను నేను వాళ్ళకి ఈ నాటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఏమీ చేయలేకపోయానూ అని.వాళ్ళకి న్యాయం చేయలేకపోయానేమోనని. నేను ఏ జన్మ లో చేసికొన్న పుణ్యమో నాకు అలాగ సహకరించే జీవిత భాగస్వామి, రత్నాల్లాంటి పిల్లల్నీ భగవంతుడు నాకిచ్చిన వరాలు.

%d bloggers like this: