బాతాఖానీ–తెరవెనుక( లక్ష్మిఫణి) ఖబుర్లు–మొహమ్మాటాలు


మామూలుగా మనం, పరిచయం ఉన్నవాళ్ళింటికి ఎప్పుడో ఒకసారి వెళ్తాము.అది, కొంచెం పరిఛయమైనా సరే, గాఢ పరిచయమైనా సరే.

రాకపోకలు ఉంటేనే కదా మన స్నేహం వృధ్ధి చెందేది.మొదటిసారి ఎవరింటికైనా వెళ్ళేం అనుకోండి, ముందుగా హల్లో లతో ప్రారంభం అవుతుంది, ఆఫీసు లో అతనితో పరిచయం ఉంటుంది,

అందువలన ఒకరితో ఒకరికి పరిచయాలు పూర్తి అయిన తరువాత అస్సలు సంగతి ప్రారంభం అవుతుంది. వాళ్ళింట్లో ఆ మధ్యనే వారి కొడుకుదో, కూతురిదో పెళ్ళి అయిఉంటుందనుకొందాం,

ఇక్కడ ఆ వచ్చిన వాళ్ళ పని అయిపోతుంది. పెళ్ళి ఆల్బం తో ప్రారంభం అవుతుంది, అవి కూడా రెండు ఎన్సైక్లోపీడియా బ్రిటానికా సైజు లో ఉన్నవి, ఆ వచ్చిన వారి చేతిలో పెట్టేసి చూస్తూ

ఉండమంటారు. మనచేతి లో పెట్టి భార్యా భర్తలిద్దరూ కిచెన్ లోకో మరెక్కడికో వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలుసు, ఈ ఆల్బం లు చూడడానికి కనీసం గంటైనా పడుతుందని. ఈ లోపులో వాళ్ళు

ఏదైనా తయారుచేసికోవడానికి కావలిసినంత టైము దొరుకుతుంది.ఉప్మా ఓ, లేక ఇంకోటో.

ఇక్కడ హాల్లో మన శిక్షాకాలం ప్రారంభం అవుతుంది.మధ్య మధ్య లో ఓ చూపు విసిరి, మనం శ్రధ్ధగా చూస్తున్నామా లేదా అని ఓ లుక్ వేస్తారు

ఆ ఫొటోల్లో ఉన్నవాళ్ళెవరూ మనకి తెలియదు. ఇంటి పెద్దమనిషి, మనని ఒక్కరినీ వదలడం బాగా ఉండదని, మనతో హాల్లో కూచుంటాడు. ఏదో మనకి ఆసక్తి ఉన్నట్లుగా, ఫొటోలో ఎవరినో

చూపించి వారెవరూ అని అడగండి–ఆయనా అని ఏదో గుర్తు చేసికోవడానికి విఫల ప్రయత్నం చేస్తాడు. మా అవిడని అడిగితే తెలుస్తుందండి, వాళ్ళవైపు వాడే. మన ప్రాణానికి ఎవరైనా

ఒక్కటే. ఇలా ఈ డ్రామా, ఇంటావిడ టిఫినీలు తయారుచేసేదాకా సాగుతుంది.ఆవిడ చేతులు కడుక్కుని, చీర చెంగుకి తుడుచుకుంటూ, ఇక్కడ సీన్ లోకి వస్తుంది. అప్పుడు ఇంటాయనకి

మన దురదృష్టంకొద్దీ, మనం ఆయనని అడిగిన సందేహం గుర్తుకు వస్తుంది.మనం అయితే మొగవారిగురించి, మనవాళ్ళైతే ఆడవారిని గురించీ ఏదో రాండం గా అడుగుతాము.ఇంక ఇంటావిడ

ఆ అడిగినావిడ గురించి వివరాలు చెప్తుంది– ఆవిడ మా పిన్నత్తగారి, ఆడపడుచు మరిది పెళ్ళాం–అని.వాళ్ళెవరైతే మనకెందుకు, ఆర్చేవారా తీర్చేవారా.అయినా అదో మొహమ్మాటం.

ఈ కొస్చన్ ఆన్సర్ సెషన్ పూర్తి అవడానికి చెప్పానుగా ఓ గంట పడుతుంది. అప్పుడు కానీ ” పనికి ఆహారం స్కీం ” లో లాగ, మనకి తిండానికి

పెట్టరు.ఇంటావిడ మొహం నిండా నవ్వు పులుముకొని ఎప్పుడైనా వస్తూండండి అని టాటా చెప్తుంది.మనరోజు బాగుండకపోతే వాళ్ళింట్లో ఆ పెళ్ళికి సంబంధించిన సీ.డీ కూడా ఉంటే ఇంక

” అవర్ డే ఈజ్ మేడ్ ” అంతే సంగతులు !!

మా ముందు తరం వాళ్ళైతే, పెళ్ళి అయిన తరువాత, వధూవరులిద్దరూ మెడలో కర్పూరం దండలతో ఫొటో కి దిగేవారు. మన చుట్టాలిళ్ళల్లో అందరికి

ఫ్రేం కట్టీచ్చేవారు.అందుకనే ఒకే ఫొటో అందరి ఇళ్ళల్లోనూ ప్రామినెంట్ గా కనిపించేది. మా రోజులు వచ్చేటప్పడికి, ఏదో పీటలమీద కూర్చున్నప్పుడూ, మంగళసూత్రం కడుతున్నప్పుడూ

ఫొటో తీసేవారు. అందులో పెళ్ళికొడుకు తల్లి తండ్రులు కనిపించేవారు కాదు. ఆరోజుల్లో పెళ్ళిళ్ళకి రిజిస్ట్రేషన్ లూ గట్రా ఉండేవి కాదు, అందుకని సాక్ష్యం గా ఈ ఫొటోలు అన్నమాట.

మా పెళ్ళి అన్నవరం లో జరిగింది. అక్కడ ఇంకో పెళ్ళికోసం, ఓ ఫొటోగ్రాఫర్ ( తణుకు వాడు ) వస్తే, అతన్ని కాళ్ళావేళ్ళ పడి మాకు ఫొటో తీయించారు. నాకు ఒక విషయం

అర్ధం అవదు. మంగళసూత్రం కడుతున్నప్పుడు కెమేరా వైపు చూస్తూ మెడలో మూడు ముళ్ళూ ఎలా వేయడం వీలౌతుందీ అని.ఆ రోజుల్లోని ఏ ఫొటో అయినా చూడండి, మీకే అర్ధం

అవుతుంది. పెళ్ళికూతురి తల్లి జడ పైకి ఎత్తి పట్టుకుంటుంది, మనవాడేమో కెమేరాకి పోజు కొడుతూ తాళి కట్టేస్తాడు. రెండే ఫొటోలు శాంక్షన్.

ఈ రోజుల్లో అమ్మో ఎన్ని ఫొటోలో, వీడియోలో, గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళిన ప్రతీ వాడితోనూ ఓ గ్రూప్ ఫొటో దిగాల్సిందే. ఆ వధూ వరుల ఓపికని మెచ్చుకోవాలి

ఈ మధ్యన జీలకర్ర బెల్లం కార్యక్రమానికి ముందే ఈ రెసెప్షన్లూ అవీ అయిపోతున్నాయి.పెళ్ళికి ముందరే, ఆ పిల్లతో అంత సేపు గడపొచ్చనే బోనస్ తో ఆ ఓర్పు వచ్చేస్తుందేమో!!

ఈ ఫొటో సెషన్ల ఫలితమే నేను పైన చెప్పిన హింసా కాండ కి నాంది !!!

11 Responses

  1. బాగుందండీ… చక్కగా నవ్వుకున్నాను.. ఇంతకాలం మీ బ్లాగు చూడనేలేదు…
    మీది తణుకు దగ్గరా??

    Like

  2. శ్రీనివాస రాజు గారూ,

    మా ఇంటావిడది తణుకండి. నాది అమలాపురం. పూణే లో సెటిల్ అయ్యాము.

    Like

  3. సర్లెండి, మా కాలేజీలో ఒక లెక్చరర్ గారింటికి పొరపాటున వెళ్ళామంటే వాళ్లవిడ ఆల్బం లు చేతికిచ్చి పప్పు నానబోస్తుంది. అవి నాని, గారెలు వండి పెట్టేదాకా ఇవి చూస్తూనే ఉండాలి మనం.

    Like

  4. హ హ హ బాగుంది, ఇండియా లో మీరు బతికి పోతున్నారు.. వాళ్ళ ఇంటికి వెళితేనే వుంటుంది ఈ గోల.. మాకు ఇక్కడ పెళ్ళి అయ్యి ఆ అబ్బాయో/అమ్మయో వచ్చాక తప్పని సరి హింస లలో ఇది ఖచ్చితం… ఇంటికి వచ్చి నప్పుడు ఒక సూట్ కేస్ లో వేసి మరి తీసుకువస్తారు.. ఒక cd కాదు బోలెడన్ని cd లు ఈ మధ్య….. వద్దు అనలేం పోని మీకు లా తిండి బోనస్ కాదు మళ్ళీ కొత్త గా పెళ్ళి అయ్యి వచ్చిన వాళ్ళు/చిన్న వాళ్ళు అనే వంక వుంటుంది మనమే తిండి కూడా పెట్టాలి ఇంకా ఆ పని వుంటుంది అయ్యో రామా అన్నట్లు ఫణి బాబు గారు reception గోల చెపుతుంటే గుర్తు వచ్చింది.. చాగంటి కోటేశ్వర రావు గారి web site లో చూడాండి, పెళ్ళీ కాకుండా ఈ reception లు ఫొటో లు వాటి ఫోజ్ లు గురించి వుతికి తలంటేరు మనలాంటి వాళ్ళందరిని, నాకైతే మా అమ్మాయి పెళ్ళి కి వీడియో పెట్టాలన్నా భయం వెస్తోంది (ఇప్పుడే కాదు లెండి పెళ్ళి ఇంకో 10 ఏళ్ళు వుంది) 🙂

    Like

  5. ఫణి గారు..
    బాగుందండి.. నవ్వించారు 🙂
    అదెదొ సామెతుండెది.. మొహమాటం కని వెళ్తె..$%్$& గుర్తు రావట్లేదు…

    Like

  6. సుజాత గారూ,

    ఆల్బం ల కార్యక్రమం, మన శిక్షాకాలం, మన తల రాతలను బట్టి ఉంటుంది .ఇప్పటి దాకా మాకు గారెల శిక్ష పడలేదు.

    Like

  7. భావనా,

    దెశ కాల మాన పరిస్థితులని బట్టి , మన శిక్షా పధ్ధతులు మారుతూంటాయి.

    Like

  8. నెలబాలుడు,

    పోన్లెండి సామెత గుర్తుకు రాలేదు.ఎప్పుడైనా ముఖా ముఖీ కలుసుకుంటే దానిగురించి మాట్లాడుకుందాము.

    Like

  9. బాగుందండీ…!,
    మాది తణుకు దగ్గర చిన్న గ్రామం… తణుకులోనే నేను డిగ్రీ వరకూ చదువుకున్నాను..
    ఇంకొక విశేషమేమంటే.. ప్రస్తుతం ఉద్యోగరిత్యా పూణేలోనే ఉన్నాను…
    🙂

    నాకు మెయిల్ చెయ్యండి… ఫోన్ నెంబరిస్తాను… ప్రస్తుతం పూణేలోనే ఉంటే… వీలైతే కలుద్దాం…

    Like

  10. >> ఈ మధ్యన జీలకర్ర బెల్లం కార్యక్రమానికి ముందే ఈ రెసెప్షన్లూ అవీ అయిపోతున్నాయి.
    This is really true. My wife’s sister got married *AFTER* their reception was over. I did not attend the marriage but when I saw the video, I was surprised how this could be. The answer was, “ah, these are normal. Guests cannot stay for marriage sometimes!” Great stuff. They had garlands together, posed as wife and husband, shook hands with each and every person came to attend marriage and then? Married next day 🙂

    After an year got a kid ready, and now the wife is fighting with mother-in-law day in and day out for territorial naunces. A lady’s first and last enemy is another lady living in the same house! huh?

    Like

  11. ఒకసారి మా వైఫ్ స్నేహితురాల ఫ్యామిలి వాళ్ళు, మేము,ఇంకా వాళ్ళ చుట్టాలు మొత్తం 8 మంది, దగ్గరలో ఉన్న చిన్న యాత్రకి వెళ్ళాము…తిరిగి సాయంత్రం వాళ్ళ స్నేహితురాలి ఇంటికి వెళ్ళాము, బాగా ఆలస్యం అవ్వడంతో అందరూ వాళ్ళింట్లో నే భోజనం చేసి బయలుదేరుదాము అని అందరం అనుకున్నాము, సరే ఆడ వాళ్ళు వంట పనిలో నిమగ్నమయ్యి (అక్కడ ఎవరికి ఓపిక లేకపోవడం వలన ఒక కూర,రసం మాత్రమే చెయ్యాలని నిశ్చయించుకున్నారు).

    ఇక మాకు చూడడనికి, ఇంటికి వెళ్ళిన వాళ్ళ తాంబూలాలు,పెళ్ళి, రెసెప్షన్ సి.డి లు పెట్టారు… ఒకపక్క నాకేమో కారు నడపదం వల్ల నిద్ర వస్తుంది, మా ఆవిడేమో సి.డి లు చూడు, నిద్ర పోతే బాగుండదు అని ఒకటే నస (కారణం ఆమె మా వైఫ్ కి చిన్నప్పటినుండి డిగ్రీ వరకు క్లాస్మేట్)… ఇంక నేను మొహమాటపడకుండా వాళ్ళతో (స్నేహితురాలు,భర్త) తో చెప్పాను, మొత్తం 6 గంటలు కారు నడిపి, తిరిగి తిరిగి నాకు నిద్ర వస్తుంది, మీరు ఏమి అనుకోకుండా ఉంటే సి.డి లు ఇప్పుడు చూడటం కష్టం, ఇంటికి తీసుకెళ్ళి చూసి, మరలా వచ్చేవారం మీరు మాఇంటికి వస్తారుగా అప్పుడు ఇస్తాను అని చెప్పాను….వాళ్ళు సరే అనేసరికి హమ్మయ్యా అని అనుకున్నాను 😀

    Like

Leave a comment