బాతాఖానీ ఖబుర్లు–33

                                                              ఇదంతా ఇలా ఉండగా 1986 కి నా సొసైటీ వ్యవహారం పూర్తి అయ్యింది. ఈ లోపులో పూణే తిరిగి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేశాను. మా పెద్దన్నయ్య గారి ద్వారా. కాని ఏమీ ఉపయోగం లేకపోయింది. మాకు తెలుసున్న ఒకాయన మా బోర్డ్ లో కలకత్తా లో ఉండేవారు. ఒకసారి ఆయనని కలుసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళాను. ఆ రోజున ఆయనని కలుసుకోలేకపోయాను, కానీ ఆయన తండ్రి గారు( 90 సంవత్సరాలు ) ఉన్నారు. ఆయనతో నా కష్టాలన్నీ చెప్పాను, అంటే మేముంటున్న చోట ఉన్నత విద్య కి అవకాశాలు లేవనీ, మా అమ్మాయి చాలా బాగా చదువుతుందనీ.” మీ అబ్బాయి తలుచుకుంటే నాకు పూనా లోని ఏ ఫాక్టరీకైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చనీ” చెప్పాను. ఆయన అప్పుడు నా డిటైల్స్ అన్నీ తీసికొని ” అలాగా, మనవాళ్ళకి చేయకపోతే మావాడి ఉద్యోగం ఎందుకూ, నువ్వెళ్ళు, నీ పని చేయిస్తాను ” అని పంపేశారు. ఆయన అన్నట్లుగానే అక్టొబర్ 31 వ తేదీ కి నాకు పూనా ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేసింది.. చెప్పానుగా నేను సొసైటీ లో ఉన్నప్పుడు, నా ముందరి కాషియర్ ఓ ” ఫ్రాడ్ ” చేశాడని. మా జనరల్ మేనేజర్ గారు, నా సొసైటీ గవర్నమెంట్ ఆడిట్ అయ్యేదాకా నన్ను రిలీజ్ చెయ్యనన్నారు. ఇంతలో నా ఆర్డర్ కాన్సిల్ అయిపోయింది !!ఇదే ” దేముడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడని ” అనే సామెత నా విషయం లో నిజం అయ్యింది. చూద్దాం ఇదీ మన మంచికే అనుకొంటే సరిపోతుందిగా.

                                                            మా అమ్మాయీ, అబ్బాయీ కేంద్రీయ విద్యాలయ లో అన్ని కార్యక్రమాలలొనూ టాప్ లోనే ఉండి మాకు చాలా ఆనందాన్నిచ్చెరు. అన్ని పరీక్షలలోనూ వాళ్ళదే ఫస్ట్. దీనికంతా కారణం నా భార్యదే. వాళ్ళతో కూర్చొని చదివించడం, వాళ్ళు చెప్పేవి వినడం, ఏదైనా స్కూల్ పుస్తకాలు కావలిసినప్పుడు నాచేత తెప్పించడం. నాకు ఆదివారాలు మాత్రమే పిల్లలతో గడిపే అవకాశం ఉండేది. వాళ్ళ స్కూల్లో ప్రతి రోజూ న్యూస్ చదవడం ఒక కార్యక్రమం ఉండేది. నేను ఆ ముందు రోజు టి.వీ లో వచ్చే అన్ని న్యూస్ లూ కాగితం మీద వ్రాసిచ్చేవాడిని, స్కూల్ కెళ్ళే ముందర అది అప్డేట్ చేసి ఇచ్చేవాడిని. మా పిల్లల విషయం లో నాదేమైనా కంట్రిబ్యూషన్ ఉందా అంటే– వాళ్ళ పుస్తకాలకి అట్ట వేయడం, యూనిఫారమ్ ప్రతీ రోజూ ఇస్త్రీ చేయడం, షూస్ పాలిష్ చేయడం, ఏ పుస్తకం కావల్సివచ్చినా దానిని ఎక్కడినుండైనా ఎలాగైనా తెప్పించడం. ఇంతకంటే నేను ఏమీ చేయలేకపోయేవాడిని. ఆ ఫాక్టరీ చాలా రిమోట్ ఏరియా అవడం తో ఆస్కూల్ కి ఎవరూ టీచర్లు వచ్చేవారు కాదు. అందువలన మా పిల్లలకి ఏమైనా చదువు వచ్చిందంటే అదంతా వాళ్ళ స్వశక్తి మీదే. ఇంకోటేమిటంటే ఆ వూళ్ళొ సిటీ లలో ఉండే డిస్ట్రాక్షన్స్ ఉండేవి కాదు. ఓ సినిమా లేదు, ఎప్పడైనా సినిమాకి వెళ్ళాలంటే 25 కిలోమీటర్ల దూరం లో ఉన్న భుసావల్ దాకా వెళ్ళాలి. అంత ఓపికా, టైమూ లేదు.

                                                       పిల్లల ధర్మమా అని స్కూల్లో ఉన్న టీచర్లు, ప్రిన్సిపాలూ , మా తోటి చాలా క్లోజ్ గా ఉండేవారు. వాళ్ళతో ఎప్పుడూ మా పిల్లల చదువు విషయం చర్చించలేదు. కానీ ఈ సాంగత్యం చాలా మందికి ఇష్టం ఉండేది కాదు. ” టీచర్లంతా తెలిసి ఉండడం వల్లే ఫణిబాబు పిల్లలు ఎప్పుడూ ఫస్టే వస్తారు ” అనేవారు. ఎవరి అభిప్రాయం వారిది, మనం చేసేపని నిజాయితీగా చేస్తే ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. మా పిల్లలు చదువుతారా లెదా అనెది మేము చూసేవాళ్ళం, ఇంక ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటే మనకేమిటీ అని దాన్ని గురించి పట్టించుకొనేవాళ్ళం కాదు.

                                                   మా అమ్మాయి కి 10 త్ క్లాస్ లో నూటికి 90 వచ్చి స్కూల్ ఫస్ట్ వచ్చింది. అప్పుడు మా జనరల్ మేనేజర్ గారు వారి నాన్నగారి

జ్ఞాపకార్ధం ఓ  రోలింగ్ కప్ ఇచ్చారు. అదే కప్ మా అబ్బాయికి 1995 లో వచ్చింది..

                                                   మా జనరల్ మేనేజర్ గారికి  ” క్వాలిటీ సర్కిల్ ” అనే ఓ కాన్సెప్ట్ చాలా ఇష్టం. అందువలన ఆయన నన్ను, దానికి ఇన్చార్జ్ గా వేసి, ఆ కార్యక్రమాలన్నీ నన్ను చూడమనేవారు. అదే కాకుండా ఈ కాన్సెప్ట్ ని మా ఇతర ఫాక్టరీల లో  ప్రోపగేట్ చేయడానికి నన్ను ఆగ్రా, కాన్పూర్, లకు పంపేవారు. ఈ సందర్భంగా నాకు ఊళ్ళు చూసే భాగ్యం కలిగింది. ఎక్కడ ట్రైనింగ్ ఉన్నా నన్నే పంపేవారు. ఎప్పుడు బయటకు వెళ్ళినా, మా కాలనీ లో వాళ్ళు ఎవరికి కావల్సినా

మందులూ, పుస్తకాలూ తీసుకురావడానికి నేను ఎప్పుడూ సిధ్ధం గా ఉండేవాడిని. ఈ రెండు వస్తువులూ మాకు ఆ ఎస్టేట్ లో దొరికేవి కాదు.

                                               ఈ కార్యక్రమాల సందర్భం లోనే మా టీమ్ ని ఓ సారి డిల్లీ లోని ” ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ క్వాలిటీ సర్కిల్స్ ” కి పంపేరు. అది తాజ్ ఇంటర్నేషనల్ లో జరిగింది. అదో చాలా మంచి అనుభవం.  ఇలాంటి వాటి వల్ల నాకు బయటి వారితో ఎలా ఉండాలో నేర్చుకొన్నాను. 

                                              స్కూల్లో మా పిల్లల వలనా , ఫాక్టరీ లో నేను చేసే పని వలనా మాకు ఎంతో గౌరవం కలిగేది.

%d bloggers like this: