బాతాఖానీ-తెరవెనుక ( లక్ష్మి ఫణి ) ఖబుర్లు

World Space Sattelite Radio

                                                                 ఈ వేళ పొద్దున్నంతా ఇక్కడ వర్షం రావడం తో దేవాలయాలకి వెళ్ళే కార్యక్రమం మానేశాను. వర్ల్డ్ స్పేస్ రేడియో కొని ఓ నాలుగు నెలలైంది. కానీ దాన్ని ఆస్వాదించినది ఈ రోజు మాత్రమే. పూణే లో ఉన్నప్పుడు  మా అబ్బాయి ఓ బర్త్ డే కి ఇచ్చాడు. అది అక్కడే వదిలేసి రావడం వల్ల మళ్ళీ ఇక్కడ ఒకటి తీసికొన్నాము. ఆ రేడియో ఒక అమృత భాండం. తెలుగు పాటలు, కర్ణాటక, హిందుస్తానీ సంగీతం, హిందీ పాత, కొత్త పాటలే కాకుండా ఇంకా చాలా మంచి జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలు కూడా ఆనందించవచ్చు. ఈ వేళ సుసర్ల దక్షిణామూర్తి గారి సినిమా పాటలు విన్నాను. కొత్త పాటలు వేయడం మొదలెట్టగానే హిందీ పాత పాటలు… మనకి వినే ఓపిక ఉండాలి.

                                                               నిన్న లైబ్రరీ నుండి యండమూరి గారి  “ధ్యేయం”, మల్లాది కృష్ణమూర్తి గారి “సద్దాం ఆంటీ కథ ” తెచ్చాను. ఎంత బాగున్నాయండీ.  “ధ్యేయం” మామూలుగా ఉండే యండమూరి నవలలకి విభిన్నంగా ఉంది. మనస్తత్వాల  విశ్లేషణ అద్భుతం గా ఉంది.. ఇంక మల్లాది గారిది చదువుతూంటే మనం నవ్వలేక చచ్చిపోతాము. ప్రతీ పేజ్ లోనూ హాస్యమే.  ఆఖరికి విలన్  చేసే పనులు కూడా హాస్యం గానే ఉన్నాయి.

                                                                మా ఇంటావిడ ఈ వేళ శనివారం కాబట్టి భోజనం ( అంటే రైస్ ) తినదు. నాకు కోకోనట్ రైస్ ( బాసుమతి రైస్, కొబ్బరి పాలు ) చేసింది. చాలా రుచిగా ఉంది. మా కేబుల్ వాడు ఈ వేళనుంచి ” కలర్స్ ” చానెల్ మొదలెట్టాడు. దాంట్లో తను మూడు నెలలనుంచి చూడలేకపోయిన హిందీ సీరియల్ అంతా చూపెట్టేశాడు. ఆవిడ అందులో లీనం ( 4 గంటలపాటు ) అయిపోయింది.

                                                               చెప్పానుగా గోదావరి నీళ్ళు ఫిల్టర్ చేసికోవడానికి ఓ ” ప్యూర్  ఇట్ ” కొన్నాను. దానికి బ్యాటరీ కిట్ మార్చవలసి వచ్చింది. నాలుగు రోజుల క్రితం నాకు ఆ యూనిట్ అమ్మినవాడికి ఫోన్ చేస్తే, అతను ఆ ఉద్యోగం మానేశాననీ, ఇంకో నంబరిచ్చాడు. ఆ నంబర్ పనిచేయడం లేదట. ఎలాగరా బాబూ, అనుకొని ” నెట్ ” లో వెదికాను. ముందుగా హిందుస్తాన్ లీవర్ మీద అన్నీ కంప్లైంట్ లే, వాళ్ళ సర్వీస్ బాగాలేదని. సరే మన అదృష్టం ఎలాఉందో అని, ఫోన్ చేస్తే మూడు రోజుల్లో పంపుతానన్నాడు. అతను ఈ వేళ వచ్చి కొత్త బ్యాటరీ కిట్ తెచ్చి వేశాడు. నేను చెప్పేదేమిటంటే ఈ నెట్ లో వివిధ కంపెనీల గురించీ మనం అందరూ వ్రాసే వన్నీ నమ్మఖర్లేదు.

                                                         అందుచేత ఈ వేళంతా ” ఫీల్ గుడ్ అట్మాస్ఫియర్ ” లోనే ఉన్నాము. సర్వేజనా సుఖినోభవంతూ

%d bloggers like this: