బాతాఖానీ–తెరవెనుక ( లక్ష్మిఫణి) ఖబుర్లు

                                                              ఒక సారి మేము తిరుపతి దర్శనం పూర్తి చెసికొని, క్రింద అమ్మవారిని, గొవిందరాజస్వామి వారిని దర్శించుకొని తణుకు వెళ్ళడానికి  రైల్వేస్టేషన్ చేరుకొన్నాము. ఇంతలో ఒకాయన వచ్చి ” ఏమండీ మాది విజయవాడ, నేను ఫామిలీ తో ఇక్కడకు వచ్చాను, దురదృష్టవశాత్తూ, నా బాగ్, డబ్బులూ పోయాయీ, మేము విజయవాడ దాకా వెళ్ళడానికి మీకు తోచిన సహాయం చేయండి, మాకు విజయవాడలో సినిమా హాలు ఉంది, మీ ఎడ్రస్ ఇస్తే ఆ డబ్బు నేను మీకు తిరిగి పంపుతాను ” అన్నారు. నేను మామూలుగా ఇలాంటి వారికి సహాయం చేయడానికి వెనుకాడను. చూస్తే పెద్దమనిషిలాగానే కనిపించారు. మనం ఇలాంటి వారికి ఏదో పెద్దగా సహాయం చేయలేకపోయినా, మన తాహతు ని బట్టి , చేస్తే తప్పు లేదనుకొంటాను. సరే అని, ఓ రెండు వందలరూపాయలనుకొంటా ఇచ్చాను. నా ఎడ్రస్ ఇవ్వలేదు. నాది, మా ఇంటావిడదీ పాలసీ ఏమిటంటే ఎప్పుడైనా తీర్థయాత్రకి వెళ్తే ఆ భగవంతుడు మనచేత ఎంత ఖర్చు పెట్టించాలనుకుంటాడో ఆ ధనం ఏదో రూపేణా, మనచేత ఖర్చు చేయిస్తాడని. అదో మూఢ నమ్మకమన్నా సరే.

                                                            తణుకు లో ఓ నాలుగు రోజులుండి బయలుదేరాము. ఆ రోజుల్లో తాడేపల్లిగూడెం నుండి లింక్ లో వార్ధా దాకా వెళ్ళి ,అక్కడ

మహరాష్ట్ర ఎక్స్ ప్రెస్ లో భుసావల్ దాకా వెళ్ళాలి. తణుకు బస్ స్టాండ్ లో, మా పిల్లలూ, మామగారూ ముందర బస్ ఎక్కేశారు. నేను బస్ కదుల్తూండగా ఎక్కాను. టికెట్ తీద్దామని చూస్తే జేబులో పర్స్ లేదు. అందులోనే రైలు టికెట్లూ, డబ్బూ అన్నీ ఉన్నాయి. ఖంగారు వచ్చేసింది. ఏం చేయాలో తెలియలేదు. ముందర బస్ దిగెశాము. ఎక్కడని వెదకమూ?  డబ్బు వరకూ అయితే మా మామగారిదగ్గర పుచ్చుకోవచ్చు, టిక్కెట్లో, తణుకు స్టేషన్ లో ఇస్తాడో లేదో తెలియదు. అయినా ప్రయత్నిద్దామని స్టేషన్ కి బయలుదేరాము.  బస్ స్టాండ్ దగ్గర్లో ఉన్న లెవెల్ క్రాసింగ్ వద్ద గేట్ వేసేశాడు. అందుకని తిరిగి బస్ స్టాండ్ కి వచ్చాము. అక్కడ మళ్ళీ వెతకడం మొదలుపెట్టాము.

                                                        ఇంతట్లో ఒక అబ్బాయి ” ఏం వెదుకుతున్నారూ ” అన్నాడు. మా పర్స్ పోయిందయ్యా బాబూ అన్నాను. చేతిలో ఓ పర్స్ చూపించి ఇది మీదేనా అన్నాడు. ఒక్కసారి నా పోయిందనుకొన్న పర్స్ చూసేటప్పడికి నా మనొభావాలు చెప్పలెను. పర్స్ తిసి చూసుకోండి, అన్నీ ఉన్నాయో లేదో అన్నాడు.  సంగతేమంటే నేను పుస్తకాల షాప్ లో పుస్తకాలు కొనుక్కొన్న తరువాత, పర్స్ జేబులో వేశాననుకొని కిందకు వదిలేశాను. ఈ అబ్బాయికి దొరికింది. ఇది మా వాళ్ళతో చెప్తూ, ఆ అబ్బాయికి  థాంక్స్ చెప్పుదామని తిరిగి చూస్తే— ఏడీ ఎక్కడా కనిపించలెదు. ఇది కలయో వైష్ణవ మాయో తెలియదు, మా డబ్బులు, టికెట్లూ మాకు సురక్షితంగా చేర్చేసి ఆ మహానుభావుడు మాయం అయిపోయాడు.

                                                     ఈ పై చెప్పిన సంఘటన, నేను తిరుపతి రైల్వె స్టేషన్ లో ఆ ఆగంతునికి చేసిన సహాయానికి ( కొద్దిపాటిదైనా ) భగవంతుడు నా మీద చూపిన కరుణ అంటారా, లేక ఆయన మీద ఉన్న నా నమ్మకానికి ఓ తార్కాణమంటారా. ఏది ఏమైనా నన్ను  అప్పుడూ, ఇప్పుడూ సర్వవేళలా ఆ భగవంతుడు

కాపాడుతూనే ఉన్నాడు.

%d bloggers like this: