బాతాఖనీ ఖబుర్లు–32

                                                            ఆ తరువాత శ్రీ సుందరం గారు ( అంటే మా జి.ఎం )  ఎవరిద్వారా తెలుసుకున్నారో ఏమో, నా గురించి, నా పని గురించీ విచారించారు. దానికి సాయం మా అమ్మాయి స్కూల్లో పెర్ఫార్మెన్స్ వలనైతేనేమిటి , మా ఇద్దరి సంబంధాలూ ఊహించనంతగా అబివృధ్ధి చెందాయి. ఆయనకి నామిద

చాలా మంచి అభిప్రాయం వచ్చింది. ఆ రోజుల్లో మా చిన్నన్నయ్య గారు హైదరాబాద్ నుండి ఓ ఉత్తరం వ్రాశారు– వారి అమ్మాయి అప్పుడే ఎం.బి.బి.ఎస్, పూర్తిచేసింది, పై చదువుకి వెళ్ళే లోపులో ఖాళీ గా ఉండడం ఎందుకని, మా ఫాక్టరీ లో ఏదైనా టెంపరరీ గా మెడికల్ ఆఫీసర్ పోస్ట్ ఏదైనా ఉందేమో కనుక్కోమన్నారు.నెను ఫాక్టరీ కి వెళ్ళి, మా జి.ఎం గారిని అడిగాను. నేను అడగ్గానే ఊహించని విధం గా ఆయన ” ఓ అపాయింట్మెంట్” ఆర్డర్ తయారుచేయించారు ( ఆ రోజుల్లో జి.ఎం లకి షార్ట్ టర్మ్ మెడికల్ ఆఫీసర్ లను నియమించే పవర్ ఉండేది ). ఇంక మేమైతే మా పక్కన ఉన్న క్వార్టర్ కూడా మా అన్నయ్య గారి అమ్మాయి కోసం రిజర్వ్ చేసి ఉంచాము !!

తనకి బెంగుళూర్ లో అడ్మిషన్ దొరకడం వల్ల ఈ ఉద్యోగానికి రాలేకపోయింది. కానీ కొద్ది రోజులలో ఒక యువ జంట డాక్టర్లు పూణే నుంచి అదే క్వార్టర్ లో చేరారు.

మేమూ పూణే నుండే రావడం వల్లనైతేనేమిటి, స్వభావాలూ ఒకటైతేనేమి వారితో మా సంబంధ బాంధవ్యాలు  అప్పుడు ప్రారంభమైనవి ఈ రోజు వరకూ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఆయనకీ, నాకూ వయస్సులో ఓ 18-20 సంవత్సరాల తేడా ఉంది. అయినా సరే మాతో చాలా క్లోజ్ గా ఉంటారు. వారి నాన్నగారికైతే ఇప్పటికీ ఆశ్చర్యమే ” మీ ఇద్దరికీ దోస్తీ ఎలా కుదిరిందీ ” అంటూంటారు.

                                                    ఓ విషయం చెప్పడం మర్చిపోయాను. మేము వరంగామ్ వచ్చేముందర మా పూనా డాక్టర్ గారు ( పిల్లల డాక్టర్ ) ఏదైనా అవసరం వస్తాయేమో అని కొన్ని మందులు వ్రాసిచ్చి, అవి మాతో తీసికెళ్ళమన్నారు ( అంటే అప్పుడప్పుడు వచ్చే దగ్గులు,జ్వరం, లాంటివాటికి ). మా అబ్బాయి కి అప్పుడు మూడున్నర ఏళ్ళ వయస్సు. ఓ  ఆదివారం మేమందరం మధ్యాహ్నం పడుక్కొని ఉండగా వాడికి ఏమీ తోచక, ఆకలేసి ఆ మందులన్నీ తాగేశాడు. ఏడవడం మొదలెట్టాడు, ఏమయ్యిందో తెలియదు, వళ్ళంతా మందుల వాసన, మా ఇంటావిడేమిచేసిందంటే వాడి చేత ముందుగా కక్కించేసింది. అదంతా బయటకు వచ్చేసిన తరువాత పడుక్కున్నవాడు ఓ పది గంటల దాకా నిద్ర లేవలేదు. మా కాలనీ లో ఉన్న డాక్టర్లందరూ ఇండోర్ లో ఏదో క్రికెట్ మాచ్ అవుతూంటే అది చూడడానికి వెళ్ళారు. ఒఖ్ఖడాక్టర్ కూడా లేరు, మాకెమో ఖంగారు. డాక్టర్లు రాత్రి తిరిగి వచ్చిన తరువాత వాడిని ఎక్జామిన్ చేశారు. అంతా బాగానే ఉంది.

                                                ఇంకోసారి ఏమయ్యిందంటే మేము నలుగురం తిరుపతి వెళ్లి తిరుగు ప్రయాణం లో హైదరాబాద్ మీదుగా, మా అమ్మ గారిని తీసికొని

మన్మాడ్ ఎక్స్ప్రెస్ ఎక్కాము. నిజామాబాద్ వచ్చేక, ఆ పైనేదో డిరైల్మెంట్ అయిందీ ఇంక ట్రైన్ ఇక్కడే ఆగిపోతుందన్నారు. ఇంక చూసుకోండి అంచెలంచెలుగా, బస్సు లో కొంత దూరం ప్రయాణం చేసి, ఆ తరువాత రిజర్వేషన్ లేకుండా మన్మాడ్ నుండి భుసావల్ దాకా రైల్లో నుంచుని మా సామాన్లు, ప్లస్ మా పిల్లలూ , అమ్మగారూ, మా ఇంటావిడ తో అర్ధ రాత్రి డిశంబర్ 31 న చేరాము. విపరీతమైన చలి. అందరూ వణికి పోతున్నారు. ఎలాగోలాగ ఓ ఆటో చేసికొని రాత్రి రెండు గంటలకి ఇల్లు చేరాము. చేరీ చేరగానే వీళ్ళందరికీ ఇంట్లో ఉన్న రగ్గులూ, దుప్పట్లూ, బొంతలూ కప్పేసి పడుక్కోపెట్టాశాను. పొద్దున్నే ఎవ్వరూ లేవలేదు. ఉన్నారో ఊడేరో తెలియదు,

వంటి మీద కప్పినవి తెరిచి చూడడానికి ధైర్యం చాలలెదు. ఎలాగైతెనే పొద్దుట పది గంటల తర్వాత లేచారండి.సర్వేజనా సుఖినోభవంతూ!!

                                             నా అదృష్టమేమంటే  ఇన్ని సంవత్సరాలలోనూ డాక్టర్లతో ఉన్న పరిచయం ఐతేనేమి, ఎప్పుడూ చిన్న చిన్న రోగాలకి హాస్పిటల్ కి వెళ్ళవలిసిన అవసరం కలుగలెదు. ఇప్పడికీ  మా కేమైనా ప్రోబ్లమ్ వస్తే మా డాక్టర్ దేష్పాండే గారినే అడుగుతూంటాను. ముందుగా ఆయన సలహా పుచ్చుకొన్న తరువాతే ఇంకో డాక్టర్ ని కలుసుకోవడం. ఏ జన్మలో ఋణమో ఇది !! మా అబ్బాయికైతే ఆయనో హీరో– చిన్నప్పటినుంచీ చూశాడేమో, వాడు ఎం.బి.ఏ చేయడానికి

గుర్గామ్ వెళ్ళినప్పుడు కూడా ఏమైనా అవసరం వస్తే ఆయననే అడగడం. మళ్ళీ ఆవిడను నమ్మడు !! ఆవిడేదైనా చెప్తే ఈయనతో మళ్ళీ సెకండ్ ఒపీనియన్ అడిగేవాడు. మా కుటుంబం తో  ఆ డాక్టర్లు కుటుంబం బాగా కలిసిపోయారు. అది నా అదృష్టం గా భావిస్తున్నాను.

%d bloggers like this: