బాతాఖానీ–తెరవెనుక ( లక్ష్మిఫణి) ఖబుర్లు

                                                                  

   ఈ వేళ నా పుస్తకాల అభిరుచి గురించి రాయాలనిపించింది. నెను మీరు అనుకొన్నట్లుగా ఏవో పెద్ద పెద్ద క్లాసిక్స్ లాంటివి చదవలేదు. చదివినా అర్ధం చేసుకొనేంత జ్ఞానమూ లేదు. ఏదో మామూలు పుస్తకాల మీదే ఆసక్తి ఉంది. ఏ పుస్తకమైనా చదువుతూంటే వదలకుండా చదివి, ఒకే ” సిటింగ్ ” లో చదివి దానిని అస్వాదిస్తే చాలు అని నా ఉద్దేశ్యం. ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా మనం ఎంజాయ్ చేయకలిగితే అది మంచి పుస్తకం కింద లెఖ్ఖ.

   మిగిలిన వారు దీనితో ఏకీభవించవలసిన అవసరం లేదు. ఏదో అందరూ చాలా బాగాఉందన్న పుస్తకం , మనకు నచ్చకపోవచ్చు.ఎవరిష్టం వాళ్ళది. అయినా పబ్లిసిటీ కోసం , మనం ఆ పుస్తకాన్ని మన షోకేస్ లో పెట్టుకోవడం ఓ” స్టేటస్ సింబల్”, మన ” ఇమేజ్ ” కూడా పెరుగుతుంది. అది వట్టి ” హిపోక్రసీ ” అని నేననుకొంటాను.

                                                                  

    నేను చదివిన మొట్టమొదటి ఇంగ్లీష్ పుస్తకం పెరల్ బక్ వ్రాసిన ” గుడ్ ఎర్త్ ” . చాలా చిన్నప్పుడు, అంటే ఇంకా తల్లితండ్రుల వద్ద ఉన్నప్పుడు !! బాగా నచ్చింది.. ఆ తరువాత  ఉద్యోగం లో చేరిన తరువాత మా ఫ్రెండ్ మూర్తి అన్నతను  జేమ్స్ హాడ్లీ చేజ్ పరిచయం చేశాడు. అంతే వరసగా ఆయన రాసిన పుస్తకాలన్నీ  లైబ్రరీ నుండి తెచ్చుకొని చదివేశాను.  అవన్నీ చదివి 20 సంవత్సరాలయ్యింది. నా అభిరుచి తెలిసికొని , మా అబ్బాయి ఈ మధ్యన నా పుట్టిన రోజు కి జేమ్స్ హాడ్లీ చేజ్ రాసిన పుస్తకాలు అన్నీ ఓ సెట్ ( ఈ మధ్యనే పబ్లిష్ చేశారు ) కొని నాకు బహుమతి గా ఇచ్చాడు. అందులో మొత్తం 80 పుస్తకాలున్నాయి. మళ్ళీ ఇంకోసారి చదువుతున్నాను. ఇవి కాకుండా  గార్డ్నర్ రాసిన పెర్రీ మేసన్ అంటే చాలా ఇష్టం. అవి కూడా అన్నీ చదివాను.

                                                                 

    వరంగామ్ ఫాక్టరీ లో ఉన్నప్పుడు, మాకు కాలక్షేపం ఉండేదికాదు. అప్పుడు  క్లబ్ లైబ్రరీ నుండి, ఇర్వింగ్ వాలెస్, ఆర్థర్ హైలీ, జెఫ్రీ ఆర్చర్, సిడ్నీ షెల్డన్, హెరాల్డ్ రాబిన్స్ నవలలు అన్నీ తెచ్చి చదివాను. మా ఇంటావిడ కూడా చదవడం మొదలెట్టింది. ఇప్పుదు చెప్తోంది– ఆరోజుల్లో తను  చదివిన నవలలు గురించి ఎవరితొనూ చర్చించడం కుదరక, మా అమ్మాయి ( అప్పుడు 7, 8, సంవర్సరాల వయస్సు !! ) తో చెప్పేదిట… ఓ విషయం నాకు చాలా నచ్చింది, జస్ట్ పీ.యూ. సీ వరకే చదివి, ఇంగ్లీష్ నవలలు చదివి అర్ధం చేసికొన్నందుకు నాకు చాలా ఆనందం గా ఉంది.

                                                            

      నేను పుస్తకాల మీద చాలా ఖర్చు చెసేవాడిని. ఆ రోజుల్లో ఎమెస్కో వారి ” ఇంటింటా గ్రంధాలయం ” లో సభ్యునిగా చేరి

చాలా పుస్తకాలు తెప్పించేను. అవే కాకుండా మన  తెలుగు మాస పత్రికలతో వచ్చే ” బోనస్ ” నవలన్నీ బైండ్ చేయించి ఉంచేవాడిని. మేము వరంగామ్ నుండి వచ్చేస్తూ, ఓ రెండు బస్తాల తెలుగు పుస్తకాలు, మాకు తెలిసిన మాస్టారికి ఇచ్చేశాము. ” మీరు చదవండి, ఆ తరువాత ఇంకెవరికైనా ఇవ్వండి, కానీ అమ్మవద్దు ” అని చెప్పాము. ఈ మధ్యన ఫోన్ చేశారు ఆయన, ” ప్రిన్సిపాల్ ” గా సెలెక్ట్ అయ్యారని. ఈ సారి కలిసినప్పుదు అడగాలి ఆ పుస్తకాలన్నీ ఏం చేశారో.

                                                           

      వార పత్రికల్లో వచ్చిన మంచి సీరియల్స్ కూడా కట్ చేసి బైండ్ చేయించేవాడిని. ఎప్పుడైనా  హైదరాబాద్ వెళ్తే విశాలాంధ్ర, నవోదయా లకి వెళ్ళి, కనీసం నాలుగు గంటలైనా గడపడం మా ఇద్దరికీ చాలా ఇష్టం.ఇవేకాకుండా మాకున్న మంచి స్నేహితురాలూ, బంధువు (మా కోడలి అమ్మమ్మ గారు), మాకు పుస్తకాల మీద ఉన్న అభిరుచి చూసి మంచి పుస్తకాలు బహుమతి గా ఇచ్చారు. అన్నింటి కంటే మంచి బహుమతేమిటంటే. ఆవిడ ధర్మమా అని మాకు శ్రీమతి బలభద్రపాత్రుని రమణి గారు,  మిథునం రచయిత శ్రీ రమణ గారూ, పరిచయం అయ్యారు. ఆ సమావేశం గురించి ఇంకోసారి చెప్తా

                                                        

       చెప్పానుగా పూణే లో వచ్చే తెలుగు వార, మాస పత్రికలన్నీ కొంటాను. కానీ చదవడానికి బధ్ధకం. మా ఇంటావిడ పుస్తకం తేగానే  గళ్ళనుడికట్టు తో సహా చదివేసి. ” కొత్త పుస్తకం రాలెదాండీ ” అంటుంది.  ఆ పుస్తకాలన్నీ  చాలా జమయినప్పడినుంచీ ఒకే గోల– రద్దీలో అమ్మేయండీ అని. అప్పుడు చదవడం మొదలు పెడతాను. తనకి చదవడానికి ఏమీ లేక , నాకు ఇన్ని పుస్తకాలున్నాయే అని దుగ్ధ అని నా ఉద్దేశ్యం !!

                                                         

     ఇప్పుడు రాజమండ్రీ వచ్చిన తరువాత మా ఇంటి దగ్గరలో  ఓ ” ప్రభుత్వ గ్రంధాలయం” పట్టుకొన్నాను.మొదటి రోజు ఆయన ఓ వంద రూపాయల డిపాజిట్ తీసికొన్నారు. ఓ పుస్తకం తీసికోవచ్చన్నారు. మనం అకౌంట్ క్లోజ్ చేసేటప్పుడు ఆ వంద రూపాయలూ తిరిగి ఇచ్చేస్తారుట !!

ఓ నెల పోయిన తర్వాత నుండీ ఇప్పుడు రెండేసి పుస్తకాలిస్తున్నారు. ఈ తెలుగు బ్లాగ్గులూ, నెట్ లో పడి నాకు ఈ నవలలు చదవడానికి టైమే దొరకడం లేదు. ఆవిడేమో పుస్తకాలు తెచ్చిన రెండో రోజుకి అవి చదివేస్తుంది. నేనేం చేస్తానంటే ఆ పుస్తకాలి ” ఎండింగ్ ” చదివేస్తాను.

                                                       

      నాకైతే ఏదో లైట్ గా ఉండే పుస్తకాలే ఇష్టం. ఆ లైబ్రరీ లో చాలా మంచి మంచి నవలలున్నాయి.  ఆవిడది నాకంటే కొంచెం స్టాండర్డ్ ఎక్కువా. పోనీ క్లాసిక్ నవలలు తెమ్మన్నావా అని అడిగాను. ఒద్దు బాబూ, అన్ని సమస్య ల నుండి గట్టెక్కి, ఇప్పుడెందుకండీ ఆ భారి భారీ నవలలు, ఎదో మీరు తెచ్చే మల్లాది, యెండమూరి, కొమ్మనాపల్లి, యద్దనపుడీ చాలండీ., హాయిగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పింది.. ఈ సందర్భం లో మల్లాది కృష్ణమూర్తి గారు రాసిన ” సద్దాం ఆంటీ కథ ” చదివాము. నవ్వుకోలేక చాలా అవస్థ పడ్డాము. ప్రతీ పేజీ నవ్వులే.

%d bloggers like this: