బాతాఖానీఖబుర్లు —31

                                                       ఆ మర్నాడు  మా డైరెక్టర్లందరూ కలిసి, భుసావల్ నుండి ఓ తాళాలు తీసేవాడిని తెచ్చారు. అతను వచ్చి ఆ గోద్రెజ్ సేఫ్ ని పరీక్షించి, ఇంకా ఏవో పనిముట్లు కావాలని, మర్నాడు వస్తానని వెళ్ళిపోయాడు. వెళ్తూ, తన దగ్గర ఉన్న కొన్ని సామాన్లు మా సొసైటీ రూం లో వదిలేసి వెళ్ళాడు !!

నాకు రాత్రి అంతా భయం. ఎవడైనా దొంగ వచ్చి ఆ సేఫ్ రొంతా బద్దలుకొట్టి అన్నీ తీసుకుపోతాడేమో అని. అందులో లక్ష రూపాయల పైగా డబ్బుంది. అది నాకొక్కడికే తెలుసు!! ఆరోజు రాత్రి నిద్ర పట్టలేదు, ప్రతీ రెండు గంటలకీ ఓ రౌండ్ వేయడం చూడ్డానికి. ఏమైతేనేం తెల్లారగానే వచ్చేసి సొసైటీ లోనే కూర్చుండిపోయాను.

                                                    రెండో రోజు ఆ మెకానిక్ వచ్చి మూడు గంటలు కుస్తీ పట్టి ఏమైతేనే ఆ గాద్రెజ్ సేఫ్ తాళం తీశాడు.ఆరోజు ఆ డబ్బంతా తీసి బాంక్ లో జమా చేసిన తర్వాతే భోజనం చేయకలిగాను. ప్రతీ వాడూ పరామర్శించేవాడే. ” అయ్యో అలాగా బాగ్ కొట్టేశారా, అక్కడ భుసావల్ లో ఇలాంటివి చాలా ఎక్కువా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫలానా ఫలానా “. నా అదృష్టం కొద్దీ, నాకు సంబంధించిన డబ్బు మాత్రమే పోయింది. అదే ఫాక్టరీ డబ్బు పోయుంటే గోవిందా !!

                                                  ఈ ఇన్సిడెంట్ అయిన ఓ పదిహేను రోజులకి మా జనరల్ మేనేజర్ గారి వద్దనుండి అర్జెంట్ గా రమ్మని పిలుపు వచ్చింది. ఆయన చేంబర్ లో కి వెళ్ళగానే ” నీకు సస్పెన్షన్ కావాలా, లేక డిస్మిసల్ కావాలా ” అన్నారు. అంతకు ముందు వారం లోనే ఓ సీనియర్ ఫోర్మన్ ని సస్పెండ్ చేశారు. ఓరి నాయనో ఇదేం గొడవరా బాబూ అనుకొన్నాను. సంగతేమంటే మన తెలుగు వాడే ఒకడు, ఓ రూమర్ ప్రారంభించాడు. ” ఫణిబాబు సొసైటీ కి సంబంధించిన డబ్బు స్వంతానికి వాడుకుంటున్నాడూ, దానిని వడ్డిలకి తిప్పుతున్నాడూ ఫలానా ఫలానా ” అని. ఆ విషయం, కొత్తగా వచ్చిన ఓ బెంగాలీ ఆఫీసర్ మా జి.ఎం. గారికి మోశాడు.అదన్నమాట ఆయనకి నామీద అంత కోపం రావడానికి కారణం. నేను ఏమీ భయ పడకుండా,” అవునూ, బాంక్ లో నాపేరుమీద లాకర్ తీసికొని ఆ డబ్బుని పెట్టానూ, ఈ విషయం మా కమెటీ అందరికీ తెలుసును. వారి అనుమతి తొనే ఈ పని చేశాను, మీకు ఈ విషయం చెప్పవలసిన బాధ్యత వాళ్ళది” అన్నాను.

ఏ పరిస్థితుల్లో చేయవలసి వచ్చిందో కూడా చెప్పాను. ఆ లాకర్ లో ఉండే డబ్బు నోట్ల వివరాలతో సహా ఓ కాగితం మీద రాసుకొని నా జేబులో పెట్టుకొనేవాడిని.

” మరి నాకెందుకు ఈ విషయం చెప్పలెదూ, ఆరోజు భుసావల్ లో దొంగతనం విషయం బంగ్లా కొచ్చి చెప్పావుగా ” అన్నారు. ” క్షమించండి మా కమెటీ వాళ్ళు మీకు ఈ వివరాలు చెప్పేఉంటారనుకొన్నాను “.అన్నాను.అయితే నువ్వు వెళ్ళి ఆ లాకర్ లో ఉన్న డబ్బంతా బాంక్ అకౌంట్ లో వేయకలవా అన్నారు. ఓ కార్ ఇచ్చి నన్ను బాంక్ కి పంపారు. ఈ లాకర్ లో ఉన్న డబ్బు సంగతి వివరాలు బాంక్ మేనేజర్ కి కూడా తెలుసుగా, అక్కడకు వెళ్ళిన 15 నిమిషాలలో ట్రాన్సాక్షన్ అంతా పూర్తి చేసికొని, ఫాక్టరీ కి వచ్చి మా జనరల్ మెనేజర్ గారికి    ” ఏక్షన్ కంప్లీటెడ్ రిపోర్ట్ ” ఇచ్చాను. ఆ యన నాకు ” సారీ నేనే నిజం తెలుసుకోకుండా నీమీద నేరం మోపాను “అన్నారు. ఛూశారా నిజాయితీగా మన పని మనం చేసికొంటే ఆ భగవంతుడు మనకి ఎల్ల వేళలా సహాయ పడుతాడు !!

                                                ఆ తరువాత 6 నెలకి ఆ జనరల్ మేనేజర్ శ్రీ భావి కట్టి గారు ఇంకో ఫాక్టరీకి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగా, మా సొసైటీ ఇదివరకటి కమెటీ వాళ్ళ అకౌంట్ లు ఆడిట్ చేయడానికి గవర్నమెంట్ ఆడిటర్లు వచ్చారు. వాళ్ళకి లెడ్జర్లు అన్నీ ఇచ్చాను. ఒకరోజు ఓ ఆడిటర్ వచ్చి, ” ఇదివరకటి కమెటీ వాళ్ళు   60,000 రూపాయల బాంక్ ఫిక్సెడ్ డిపాజిట్ వేశారూ, ఆ కాగితాలు చూపించమన్నారు. నా దగ్గరేమైనా ఉంటే కదా చూపించడానికీ. లేదన్నాను, వాళ్ళు నమ్మలేదు. ఇద్దరం కలిసి బాంకికెళ్ళి చూస్తే, ఆ 60,000 రూపాయలూ ఎప్పుడో డ్రా చేసి ఖర్చు పెట్టేశారని తేలింది. అంతే ఓ పెద్ద ” ఫ్రాడ్ ” అయినట్లు తేల్చారు. నా ముందరి క్యాషియర్ దగ్గర వసూలు చెశారు.

                                                అప్పటికి మాకు కొత్త జనరల్ మేనేజర్ శ్రీ సుందరం గారు వచ్చారు. ఈ సొసైటీ ఫ్రాడ్ క్రితం జనరల్ మేనేజర్ గారి “టెన్యూర్ ” లో జరిగిఉంటే మా పాత కేషియర్ డిస్మిస్ అయిపోయుండేవాడు !!. ఈ యన తో నా మొదటి పరిచయం అంత శుభకరంగా లెదు. ఈయన సొసైటీ కి రావడమే ఒక రాంగ్ ఇంప్రెషన్ తో వచ్చారు. ముందుగా నా రూమ్ లోకి వచ్చి నా కాష్ రెజిస్టర్ తో నా దగ్గరున్న డబ్బు టాలీ చేయమన్నారు. నా అదృష్టం బాగులేక, అంతకుముందే మా సెక్రటరీ వచ్చి ఓ వంద రూపాయల కి చిల్లర ఇమ్మని, నాకు ఇచ్చి వెళ్ళాడు, మా పెద్దాయన రావడం చూసి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు. అందుచేత మా జి.ఎం  చెక్ చేసినప్పుడు నా దగ్గర 100 రూపాయలకి తేడా వచ్చింది. ఫాక్టరీ కి వెళ్ళి నాకో నోట్ పంపించారు. మా సెక్రటరీ ని ఆయన వద్దకు పంపి ఆయనకు వివరణ ఇప్పించవలసి వచ్చింది !!

                                             ఈ పైన వివరించిన రెండు విషయాల వల్లా నేను జీవితం లో ఎన్నో నేర్చుకొన్నాను. వాటి వల్ల నేను మళ్ళీ ఎప్పుడూ డబ్బు విషయం లో అజాగ్రత్తగా ఉండలేదు.

%d bloggers like this: