బాతాఖానీ ఖబుర్లు —30

                                                               అక్కడ ” కీ ” పోస్ట్ లో ఉండడం తో కాలనీ లో అందరికీ పరిచయం అయి పోయాను. రోడ్ మీద ఎక్కడైనా కనిపించినప్పుదు, పలకరింపుగా నవ్వడం అలాంటివి బాగానే ఉండేది. ఒక్కొకప్పుడు కొంతమందైతే ” గాస్ బండి వచ్చిందా “, ” రేషన్ లో పంచదారఎప్పుడు వస్తుందీ”

రేపు మా వాడిని పంపిస్తానూ పాం ఆయిల్ ఇప్పించండీ ” అని మార్కెట్ లో అడగడం చిరాకు తెప్పించేది. ఆ కాలనీ లో ఉండే కిరాణా కొట్టు వాడికీ, నాకూ ఏమీ తేడా ఉండేదికాదు !! చిన్న కాలనీ అవడం తో  పోస్ట్ ఆఫీస్, బాంక్ లలో కూడా నాకు ప్రయారిటీ ఉండేది !! వాళ్ళు కూడా మా సొసైటీ నుండే కదా సరుకులు తీసికొనేది.

                                                              ఆ రోజుల్లో ఇండేన్ గాస్ కొత్త కనెక్షన్ లు ఇచ్చేవారు. మా డైరెక్టర్ లు వాళ్ళకి కావల్సిన వాళ్ళందరికీ , ఇష్టం వచ్చినట్లు కనెక్షన్లు ఇచ్చేశారు. దానికి సంబంధించిన డబ్బు ( సుమారు  75, 000 రూపాయలు ) నా దగ్గర డిపాజిట్ చేశారు.  దాని వివరాలు నా రఫ్ కేష్ బుక్ లో రాసేవాడిని. వచ్చిన గొడవేమిటంటే  ఆ డబ్బు అఫీషియల్ గా మా సొసైటీ అకౌంట్ లో వేయడానికి లేదు. ఇదంతా ఐ.ఓ.సీ వాళ్ళ పెర్మిషన్ లేకుండా ఇచ్చిన కనెక్షన్లకు సంబంధించిన డబ్బు. అలా అని మా సొసైటీ ” సేఫ్ ” లోనూ ఉంచలేను.  అక్కడేమీ సెక్యూరిటీ ఉండేదికాదు. అందుచేత నాతోపాటు ఇంటికే తీసికెళ్ళేవాడిని. ఇది ఇలా కాదని, మా సెక్రటరీ, డైరెక్టర్ , వైస్ ఛైర్మన్ ల తోనూ, బాంక్ వాళ్ళతోనూ చర్చించి , చివరకు , నా పేరు మీద ఓ లాకర్ తీసికొన్నానండి. అందులో పెట్టాశాను.

                                                             అంతకు ముందర ఓ సారి భుసావల్ వెళ్ళాను, ఏదో పని మీద. నాది మొట్టమొదట్లో( 1966) తీసికొన్న బర్షేన్ గాస్ ( దానికి డిపాజిట్ 75 రూపాయలు మాత్రమే ) సరెండర్ చేసేసి, ఇక్కడ ఇండేన్ ( ఎలాగూ మన చేతిలో ఉన్నదే కదా ) తీసికొందామని ప్లాన్. ఆ పని పూర్తి చేసికొని తిరిగి మా కాలనీ కి రావడానికి బస్ స్టాండ్ కి వస్తూంటే, రోడ్ మీద ఒకడు నన్ను ఆపుచేసి, వెనక్కాల చూసుకో షర్ట్ మీద ఏదో ఉంది అన్నాడు. పోన్లే అనేసి వదిలేశాను. కొంచెం సేపు పోయిన తరువాత, మా సెక్రటరీ కలిశాడు  , అతను కూడా ‘నీ షర్ట్ అంతా ఖరాబైపోయిందీ తుడుచుకో ” అన్నాడు. అక్కడేదో ” దూలగొండాకు” పేస్ట్ చేసి వేశారు. ఒకటే దురద, ఎలాగో అది అంతా కడుక్కుని , బస్ స్టాండ్ చేరాను. చేతిలో రెండు బ్యాగ్గులూ. కాలర్ మీద తడి తగిలేసరికి విపరీతమైన దురద పెట్టేస్తూంది. ఇంక చూసుకోండి నా పరిస్థితి !! దీనికి సాయం, ఓ చిన్న పిల్ల  ( 6 ఏళ్ళుంటాయి ) ఏదో సణగడం, డబ్బులు ఇవ్వమని, తను అడిగేదేమిటో నాకు వినిపించక, గోడకు ఆనుకుని కూర్చున్నవాడిని కొంచెం ముందుకు వంగి, ఏమిటీ అన్నాను.  ఈ రెండు ప్రక్రియలకీ పట్టిన టైము 5 సెకండ్లు కూడా పట్టి ఉండదు. వెనక్కి తిరిగి చూసేడప్పడికి నా బ్యాగ్ మాయం. ఎవరిని అడిగినా మాకేం తెలియదనేవాళ్ళే. సంగతేమంటే, ఇదంతా ఓ గ్యాంగ్ ఉంటారు, మనం ఎక్కడికెళ్తే అక్కడ ఫాలో అయి, మనని టార్గెట్ చేస్తారు. నా ఖర్మ కాలి నేను వాళ్ళకి విక్టిమ్ అయిపోయాను. ఈ మోడస్ ఆపరెండీ భుసావల్ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ప్రాంతంలో ఒక కుటిర పరిశ్రమ.

ఇవేమీ నాకు తెలియదు. రొజు బాగుండకపోతే ఇలాంటి వాటిల్లో చిక్కుకుపోతాము. నా వర్రీ అంతా డబ్బులు పోయాయని కాదు. ఆ బ్యాగ్ లో నేను తీసికొన్న గాస్ ట్రాన్స్ఫర్ కాగితమూ, దానికంటే విలువైన మా సొసైటీ ” గాద్రెజ్ సేఫ్ ” తాళాలూ. భోరుమని ఏడుస్తూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి, రిపోర్ట్ ఇచ్చాను. తిరిగి కాలనీకి వెళ్ళి ఏంచేయాలో, ఆ రొజు మా ఎంప్లాయీస్ కి జీతాలు ఎలా ఇవ్వాలో అంతా అయోమయం. చెక్ పుస్తకాలూ అవీ ఆ సేఫ్ లోనే ఉన్నాయి.

                                                         ఆ రోజు మా ఫాక్టరీ నుంచి చెక్ ( అంటే ఎంప్లాయీస్ నుంచి రికవర్ చేసిన డబ్బుకి ) వస్తుంది. మామూలుగా ఏం చేస్తానంటే ఆ చెక్ ని బ్యాంక్ లో డిపాజిట్ చేసి, ఆ తరువాత మా సొసైటీ చెక్ ద్వారా డబ్బు డ్రా చేసి జీతాలు ఇస్తాను. అలా డ్రా చేసిన డబ్బు కూడా ఆ ” సేఫ్ ” లోనే ఉండిపోయింది.

దాని తాళాలు భుసావల్ లో దొంగ గారి దగ్గర ఉండిపోయాయి!!.  ముందుగా బ్యాంక్ మేనేజర్ దగ్గరకు వెళ్ళి , నా ప్రోబ్లెం చెప్పి , ఆయననడిగేను మా వాళ్ళకి జీతాలు ఎలా ఇవ్వడం అని. నా దగ్గర ఉన్నది ఫాక్టరీ చెక్ మాత్రమే. ఆయన అన్నారూ, : ఈ చెక్ మీద జనరల్ మెనేజర్ గారి సంతకం తీసికో,కావల్సిన డబ్బు ఇస్తామూ, మిగిలనది సొసైటీ అక్కౌంట్లో జమ చేసేస్తామూ అన్నారు. బ్రతికేనురా భగవంతుడా అనుకొని, మా పెద్దాయన దగ్గరకు వెళ్ళి, ఆయనకు నా భాగవతం అంతా చెప్పి, చివాట్లు తిని, అయన సంతకం తీసికొని, ఎలాగైతే ఆరోజు గండం దాటాను.

%d bloggers like this: