బాతాఖాని–తెరవెనుక (లక్ష్మి ఫణి ) ఖబుర్లు–తీరిన కోరిక

                                                              

   ఈ వేళ పొద్దున్న  ” మా  టీ వీ ” లో ములుగాయన చెప్పారు, ఈ వేళ వృశ్చిక రాసి వారికి చిరకాల కోరిక తీరుతుంది అని. చివరగా చెప్పారు ” ఈ రోజు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి ” అని. ఏదో ఆయన చెప్తూనేఉంటారూ, మనకేమి ఉంటాయిలే అని కొట్టి పారేశాను. చెప్పానుగా మా కజిన్ రోజు విడిచి రోజు మా ఇంటికి వస్తూంటాడు, నిన్న వచ్చాడు , ఈ వేళ కొంచెం మబ్బు గా ఉండడం తో నేను కూడా ఎక్కడికీ వెళ్ళలేదు. ఏమిటో కుడి కన్ను ఒకే పనిగా అదురుతోందండి మధ్యాన్నం నుండి. సాయంత్రం మా వాచ్ మన్ వచ్చి కరెంట్ బిల్ ఇచ్చి వెళ్ళాడు.  ఇంతలో మళ్ళీ బెల్ రింగయ్యింది. ఎవరా అని చూస్తే మా కజిన్. ఇదేమిట్రా ఈవేళ వస్తావనుకోలేదూ, ఏమిటి సంగతులు , అన్నాను. ఉందిలే మంచీ కాలం అంటూ ఘంటసాల గారి పాట మొదలెట్టాడు, వాడికి తెలుగు పాటలు పాడడం మహా ఇష్టం. చేతిలో ఓ ప్లాస్టిక్ బుట్ట అందులో ఓ స్టీల్ డబ్బా ఉన్నాయి. ఊరగాయలైతే చాలా రోజులక్రితమే తెచ్చాడు, ఇదేమిటీ అన్నా. ” తెరిచి చూసుకో ” అన్నాడు. చూస్తే ఏముందీ    నేను ఎన్నోరోజులనుండి ఎదురు చూస్తున్న నా ” ఆల్ టైమ్ ఫేవరెట్ ”  ” బెల్లం మిఠాయి ఉండలు ” తెచ్చాడండి. ఇంక నా ఉత్సాహం పట్టలేకపోయాను. మా ఇంటావిడ కూడా ” అమ్మయ్యా ఇంక ఈయనకి రోజూ నిద్ర పడుతుంది, ఊళ్ళో వాళ్ళని ప్రశాంతంగా ఉండనిస్తారు ” అంది.

                                                           

     సంగతేమిటంటే మా మరదలు ( అంటే మా కజిన్ భార్య), వాళ్ళ అక్కయ్య గారిని రిక్వెస్ట్ చేసి, వీళ్ళిద్దరూ కలిసి శ్రమ పడి తయారు చేశారన్నమాట.ఇంకా ఫ్రెష్ గా ఉన్నాయీ ఈవేళే ఇస్తే వాడూ సంతోషిస్తాడూ అనుకొని అర్జెంట్ గా తీసికొచ్చేశాడు. అది ఒక కారణం, నేను పడుతున్న బాధ వాడికి కూడా తెలుసును, బెల్లం మిఠాయి గురించి కలుసుకున్నప్పుడల్లా వాడినీ, వాళ్ళావిడనీ “బోర్ ” కొట్టేస్తూంటాను. అందరికీ నా బెల్లం మిఠాయి ఒక ” అబ్సెషన్ ” అయిపోయింది !! ఎలాగో అలాగ వీడు ” పోయేలోపల ” ( అంటే రాజమండ్రి నుంచండి బాబూ ) వీడి కోరిక తీర్చలేకపోతే మన జన్మెందుకూ అనే స్టేజ్ కి వచ్చేశారందరూ. లేకపొతే   మా పెద్దమ్మగారి కోడలుకి అక్కయ్య గారు నా గురించి ఇంత శ్రమ తీసికోవడం !! ఇదన్నమాట పొద్దున్న ములుగాయన చెప్పింది, నా కుడి కన్ను అదరడం  సంగతి !! ఏమిటొ రాసిపెట్టిఉంటే అన్నీ జరుగుతాయి !!

                                                          

  ఆ సంతోషం లో నేను ఇల్లూ , వళ్ళూ మర్చిపోయాను. నోటి దురద అంటే ఇలాగే ఉంటుంది. ఊరికే కూర్చోచ్చా, కాలం కలిసి రాకపోతే తాడే పామౌతుందిట !!  ” పోన్లేరా ఓ 10 రోజులకి , నాకు గ్రాసం దొరికిందీ, వేవిళ్ళ కోరికా తీరింది, మా ఇంటావిడ తను చేయదూ, బయటనుంచి కొనుక్కోనివ్వదూ ” అన్నానండి. నా ఉద్దేశ్యం ఏమిటంటే– నాకు రాత్రిళ్ళు డబ్బాలు వెతుక్కుని చిరుతిళ్ళు తినడం ఓ వెధవ అలవాటు, మా ” స్వర్ణ యుగం ” రోజుల్లో పాపం మా ఇంటావిడ ఏదో ఒకటి చేసి డబ్బాల్లో ఉంచేది, నేను అందరూ పడుక్కున్న తర్వాత, చప్పుడు చేయకుండా తినేవాడిని !! ఇప్పడికీ అదే అలవాటు, ఏం చెయ్యనూ, పుట్టుకతో వచ్చిన అలవాటూ, ఎప్పుడు పోతుందో మీకూ తెలుసు….. నేను అలా అనగానే మాఇంటావిడకి ఏక్ దం  కోపం వచ్చేసిందండి. ‘ రోజూ పొద్దుటే చపాతీలు, ఉప్మా, ఇడ్లీలూ, దోశలూ చేస్తున్నానుగా, ఒఖరోజైనా మానేనా, కావలిస్తే ఓ వంట మనిషిని పెట్టుకోండీ, మీకు కావల్సినవన్నీ చేయించుకోండీ, ఎట్స్ ఎట్స్… ” అనీ ఓ రైజయిపోయిందండి. ‘ అయ్యబాబోయ్, నేనన్నది నువ్వు చేయడం లేదనికాదు, ఏదో నా చిరుతిండిల గురించి అన్నానూ ” అంటే వినదే. పచ్చి కొట్టేసిందండి.

 

   ఈవిడెలాగూ అన్ని రకాల వంటలూ చేస్తోంది కదా, అనుకొని     నా చిరు తిళ్ళు బయటనుంచి తెచ్చుకొనేవాడిని ఏదో గంగరాజు కోవా, ఆనంద్ స్వీట్స్ నుంచి కాజాలూ, మినపసున్నుండలూ లాంటివి. ఈ మధ్యన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాజమండ్రీ లో చెకింగులు చేసి  తినుబండారాల్లో కల్తీ ఉంటోంది అన్నప్పటినుంచి, బయట ఏసరుకూ కొనడం లేదు.  ఏదో పళ్ళతో  లాగించేస్తున్నాను,   స్వర్ణకమలం లో భానుప్రియ అన్నట్లుగా ” ఏమిటో నన్నెవరూ అర్ధం చేసికోరూ “.

                                                      

    ప్రపంచం లో నూటికి     90 మంది భర్తలకున్న రోగం ఇదేనండి రొజూ ఇంట్లో పంచభక్ష్యపరమాన్నలతోటి భార్య చేసిపెడుతున్నా,

ఎప్పుడైనా బయట ఎవరింట్లో అయినా తిన్నామనుకోండి, అంతవరకూ ఫర్వాలెదు, ఖర్మ కాలి అది చాలా బాగుంది అన్నామంటే గోవిందా గోవిందా అయిపోతుంది.

ఏదో పెట్టిన వాళ్ళు సంతోషిస్తారు కదా అని అంటాము కానీ ” నిజంగానాండీ “. మా బాస్ ఒకాయన చెప్పెవారు ” నైబర్స్ వైఫ్ ఈజ్ ఆల్వేజ్ బ్యూటిఫుల్ “, తెలుగులో అయితే ” పొరుగింటి పుల్లకూర రుచు గానే ఉంటుంది “.

                                        

   ములుగాయన చెప్పిన రెండో విషయం  నా ” ఫుట్ ఇన్ ద మౌత్ ” డయలాగ్ తో నిజం అయ్యింది !!

%d bloggers like this: