బాతాఖానీ- తెరవెనుక ( లక్ష్మి ఫణి ) ఖబుర్లు

                                                              మేము పూణే నుండి రాజమండ్రి  రాక పూర్వం, ఈ వూళ్ళో ఖర్చులు ఎలా ఉంటాయా అని అనుకొన్నాము.  వచ్చి 10 నెలలవుతొంది.అక్కడ కంటే చాలా తక్కువ అనిపించింది.మొదట్లో రామాలయం సెంటర్ దగ్గర ఓ 2 బెడ్రూముల అపార్ట్మెంట్ తీసికొన్నాము. అది గోదావరి గట్టుకి ( మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ) చాలా దూరం లో ఉంది. ఆటో లో రావడం పెద్ద ఖర్చేమీ కాదు కానీ, ఎక్కువ టైమ్ గడపడానికి వీలుగా ఉండేది కాదు. ఆలశ్యం అయితే తిరిగి వెళ్ళడానికి ఆటో లు దొరకవేమోనని, తక్కువ టైమే గడిపేవాళ్ళం. ఇంకో సంగతేమంటే అక్కడ తాగడానికి రెండురోజులకొకమాటు గోదావరి నీళ్ళు వచ్చేవి. మొదట్లో మా దగ్గర ఫిల్టరూ అవీ ఉండేవికాదు. అందువల్ల మినరల్ వాటర్ కొనుక్కొని తాగేవాళ్ళం !!   రాజమండ్రీ లో ఉంటూ, గోదావరి నీళ్ళు తాగలేకపోవడం ఒక ” హీనస్ క్రైమ్ ” లా అనిపించేది.  వెతగ్గా వెతగ్గా మొత్తానికి, మా కజిన్, అతని భార్య ధర్మమా అని ఏమైతేనే గోదావరి గట్టు మీద ఓ అపార్ట్మెంట్ పట్టుకున్నామండి. మా అదృష్టం కొద్దీ మా ఇల్లుకలాయన కూడా చాలా మంచివారు.

                                                             అద్దె 5000/- రూపాయలు.ఇంక మిగిలినవి చూస్తే ఆటోలు ఎక్కడికెళ్ళాలన్నా 20-25 రూపాయలకంటే ఇవ్వఖర్లేదు. నేను ఒక్కడినీ అయితే  ” షేర్ ఆటో ” లో లాగించేస్తాను, మా ఇంటావిడ వస్తేనే స్పెషల్ ఆటో !! ఇదే పూణే లో అయితేనా, మా అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లకీ 40 రూపాయలు ( మీటర్ మీద ) పుచ్చుకొనేవాడు. సినిమా అయితే ఒఖటే చూశాము అదికూడా బాల్కనీ కి  50 రూపాయలు మాత్రమే ( కుమారీ లో ఆసోఫాలెంత బాగున్నాయో !). ఇదే పూణే లో అయితే ” మల్టిప్లెక్స్ ”  బాల్కనీకి 125 రూపాయలు. అందుకే ఓ సీడి కొనుక్కొని సినిమా చూడ్డం చవక అనిపిస్తుంది.

                                                          హొటల్ సంగతి చెప్పఖర్లేదు, ఎంత కొద్దిగా తిన్నా కానీ ఇద్దరికీ ఓ వంద కాగితం అయిపోయేది. అదే  ఈ ఊళ్ళో అయితే నలుగురు సంతృప్తి గా తినొచ్చు. గ్రొసరీ ఎక్కడైనా ఒక్కలాగే ఉంటుంది. కూరల సంగతి ఇక్కడ నా క్కావలిసిన కూరలన్నీ దొరుకుతున్నాయి ( పనస పొట్టు, అరటికాయలు, లాంటివి ) అక్కడ అరటి కాయల బదులు పచ్చిగాఉండే అరటి పండు ఇచ్చేవాడు. కొబ్బరి బొండానికి పూణే లో 15 రూపాయలిచ్చేవాడిని. ఇక్కడ ముందు 7 రూపాయలు చెప్పినా బేరం ఆడితే 5 రూపాయలకిస్తాడు.

                                                         ఇంక బట్టల ఇస్త్రీ అయితే పూణే లో ఒక్కొక్కదానికీ 3 రూపాయలు తీసుకొనేవాడు. ఇక్కడ జతకీ 3 రూపాయలు. చీరలు అక్కడ ఏదో ” రోలర్ ప్రెస్ ” అని  15 రూపాయలు లాగించేసేవాడు, మా సొసైటీ అతను బుధ్ధిగా చీరకు  3 రూపాయలు తీసికొంటాడు. ఈ మధ్యనే 4 ఇస్తే బావుంటుందన్నాడు, కానీ మా వాళ్ళు ‘ వీటో ” చేసేశారు !!

                                                        ఇక్కడ దేవాలయాలకి ప్రతీ రోజూ వెళ్తాను. అదో భక్తి భావం వస్తుందండి ఆ పురోహితుల్ని చూస్తూంటే శుభ్రంగా పంచె కట్టుకొని

గోత్ర నామాలతో ఎప్పుడు వెళ్ళినా పూజ చేయించడం. అక్కడ ఏ గుడికెళ్ళినా ఆ పూజారి పంచ, బనీన్లతోటే కనిపిస్తారు, ఇంక గోత్రం, పేరు అంటారా వాటి గురించి ఎప్పుడూ అడగలేదు, ఇంకొన్ని రోజులు ఇటువైపు రాకుండా ఉంటే మనం అవి మర్చిపోతాము !! ఇంకోటండోయ్ అష్ట లక్ష్మి, రంగనాధ దేవాలయాల్లో అయితే ప్రతీ రోజూ ప్రసాదం కూడా ( దధ్ధోజనం, కట్టు పొంగలి ) ఇస్తారు!! ఎంత రుచి గా ఉంటాయో !!

                                                        ఈ ఊళ్ళో ఒక్కటే విచిత్రం. ఎన్ని సందులున్నాయో  !! ఏసందులోంచి వెళ్తే ఎవరింటిలోకి పోతామో తెలియదు. ఏసందులోంచి వెళ్ళినా గోదావరి గట్టుకి చేరతాడు లేక మెయిన్ రోడ్ కి చేరతాడు. ఆ పోస్టల్ వాళ్ళు ఎలా ఎడ్రస్ గుర్తుపడతారో ఉత్తరాలు ఎలా డెలివర్ చేస్తారో ఆ భగవంతుడికే తెలియాలి !! ఈ సందుల్లో దారి తప్పిపోవడం అంటూ ఏమీ లేదు. ధైర్యంగా ముందుకు వెళ్తే జయం మనదే !! వచ్చిన గొడవేమిటంటే ఎవరైనా ఆ సందులో ఏదైనా

కొత్తగా నిర్మిస్తున్నారంటే ఆ ఇసకా, కంకరా లాంటి వాటితో ఆ సందంతా వాళ్ళ సొంతమైనట్లు నింపేస్తారు. మన అదృష్టం బాగుంటే చీకట్లో ఏ  చెయ్యీ, కాలూ విరక్కొట్టుకోకుండా కొంప చేరుతాము. అసలు రాజమండ్రి సందుల గురించి రామ్ గోపాల్ వర్మ కి తెలియదనుకొంటాను. లేక పోతే ఈ పాటికి ఓ ” క్రైం సినిమా” తీసేవాడు

                                                    ఒక సంగతి చెప్పాలండి మెయిన్ రోడ్ మీదకు వెళ్తే ట్రాఫిక్ సంగతి. ఏ రిక్షా ఎక్కడినుంచి వస్తుందో తెలియదు, టూ వీలర్స్ అయితే పెద్ద శబ్దం — నూతిలో మోటార్ సైకిలు  తొక్కేవాడు చేసినట్లుగా మనల్ని ఖంగారు పెట్టేస్తాడు !! ఎవరూ ఎవరికోసం ఆగరు, ఎవడి ఖంగారు వాడిది. ఎప్పుడైనా నేను బజారుకి వెళ్ళవలసి వస్తే ప్రతీ 10 నిమిషాలకీ మా ఇంటావిడకి ఫోన్ చేయాలి, నేను బాగానే ఉన్నానూ అని !!

                                                  డస్ట్ బిన్లు వాడడం ఇక్కడ వాళ్ళు నామోషీ అనుకొంటారు. చెత్తంతా ఆ డ్రైన్ లలోనే వేస్తారు. ఇక్కడి మునిసిపల్ వర్కర్స్ మాత్రం

చాలా సిన్సియర్ గా ప్రతీ మూడు రోజులకీ అవి శుభ్ర పరిచి, టన్నుల కొద్దీ చెత్త తీస్తారు.  ఎండనకా, వాననకా ప్రతీ రోజూ ఠంచనుగా .

                                                 ఇంకా ఎన్ని రోజులీ భోగం అంటోంది మా ఇంటావిడ పక్కనే కూర్చొని, ఎప్పటికైనా మా సొంతింటికి వెళ్ళాలిగా పూణే లో !!

%d bloggers like this: