బాతాఖానీ ఖబుర్లు –28

                                                    

     మా అన్నయ్యలతొ నా అనుబంధాన్ని గూర్చి చెప్పాలి. మా పెద్దన్నయ్య గారు శ్రీ అచ్యుతరామసోమయాజులు గారు, చిన్నన్నయ్య శ్రీ లక్ష్మినారాయణ గారు. నేను స్కూలు లోకి వచ్చేటప్పడికే మా చిన్నన్నయ్య గారు కాకినాడ పీ.ఆర్. కాలేజీ కి  ఇంటర్ చదవడానికి వెళ్ళారు, పెద్దన్నయ్యేమో మెడ్రాస్ లో ప్రెసిడెన్సీ కాలేజ్ లో బి.ఎస్.సి చదవడానికి వెళ్ళారు. మా అమ్మమ్మగారు అస్తమానూ , నేను చదవనప్పుడల్లా ” వెధవా, మీ అన్నయ్యల్లాగ పెద్ద చదువులు లేకపోతే గోచీ పెట్టుకొని పాలెరు పని చెయ్యాలి అనేవారు !! ఓహో చదువుకోకపోతే ఇదో ఆప్షన్ ఉందన్నమాట అనుకొనేవాడిని,. అందువలన ఏమిటో నేను బాగా చదవలేకపోవడం వల్ల నాకు ఒక ” డిఫిడెంట్ ఆటిట్యూడ్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ” వచ్చేయనుకుంటా. అదే కాకుండా మా ఇంట్లో

ఎటువైపు చూసినా ( అమ్మ వైపు, నాన్నగారి వైపు ) అందరూ బాగా చదువుకున్నవాళ్ళే. ఎవరు మాట్లాడినా ఈ చదువుకున్నవాళ్ళగురించే !!

                                                  

      మా పెద్దన్నయ్య గారు  బి.ఎస్.సీ పూర్తి చేసి, ఆ తరువాత బి.ఇ.డి చేసి  కోనసీమలోనే టీచర్ గా సెటిల్ అయిపోయారు. చిన్నాయనైతే వాల్తేరు ఆంధ్రా యూనివర్సిటీ లో ఎమ్.ఎస్.సి, ఆ తరువాత డి.ఎస్.సి చేశారు.  ఎక్కువగా మా పెద్దన్నయ్య గారితోనే నాకు ముందర చనువు ఎక్కువ. చిన్నాయనైతే ఎప్పుడో శలవలకి మాత్రమే వచ్చేవారు, నాకు ఆయనతో చిన్నప్పటి జ్ఞాపకాలు ఎక్కువ లేవు. నా 4 వ ఫారం నుండి, మా పెద్దన్నయ్యగారే నాకు చదువు చెప్పేవారు, మానాన్నగారంటే చాలా భయం నాకు, కొడతారని !! అందుకనే ఎస్.ఎస్.ఎల్.సీ కి వచ్చేటప్పడికి మండపేట నుంచి అమలాపురం పంపేశారు. ఆరోజుల్లో పెద్దన్నయ్య బెనారెస్ యూనివర్సిటీ నుంచి ఎమ్.ఏ ఇంగ్లీష్ చేశారు, ఆ తరువాత  హిస్టరీ చేశారు. ఎందుకో ఇన్ని డిగ్రీలూ అవీ అనుకొనేవాడిని. ఏమిటో తలుచుకున్నప్పుడల్లా ఈ ఇంట్లో నేను తప్ప పుట్టాననుకొనేవాడిని, పొనీ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా!! లేదు అదో శ్మశాన వైరాగ్యం లాంటిది, అలా ఉంటుంది, తరువాత మరిచిపోతాము !!

                                               

     ఒకసారి శలవలకీ నన్ను మా చిన్నన్నయ్య గారి దగ్గరకు వైజాగ్ పంపారు. పోనీ ఆయనను చూసైనా ఏమైనా మార్పు వస్తుందేమో అని. అప్పుడు ఆయన ” కిర్లంపూడి”హాస్టల్లో ఉండేవారు. రాత్రిళ్ళుకూడా లేబరేటరీ కి వెళ్ళేవారు, ఆయనతో వాళ్ళ రూమ్ లో శ్రీ జంధ్యాల శోభనాద్రి గారూ, శ్రీ జంధ్యాల రామకృష్ణగారూ, శ్రీ జీ.వీ.కృష్ణారావు గారూ,– వీళ్ళందరితోపాటూ నేను కూడా రాత్రిళ్ళు లేబరేటరీ కి వెళ్ళి గోళ్ళు కొరుక్కుంటూ కూర్చునేవాడిని. ఏదో ప్రయత్నం చేసేవారు నాకు జ్ఞానోదయం చేయడానికి. అబ్బే అలాంటిదేమీ జరగలేదు!! వాళ్ళు పదిహేను రోజులకోసారి సినిమాకో, లేదా పిక్నిక్ కో వెళ్ళేవారు. పోనీ అలాంటి వాతావరణం లో, అంత చదువుకున్న వారి మధ్యన అన్ని రోజులు గడిపాను కదా, ఏమైనా నేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చుగా, నాకు రాసిపెట్టుందండీ నీ చదువు బి.ఎస్.సీ తరువాత లేదూ అని ! అందుకే కాబోలు నేను డిగ్రీ పుచ్చుకోగానే ఇంక ఎందుకూ పనికి రానని ఉద్యోగం లో చేర్పించేశారు. పోన్లెద్దురూ సుఖ పడ్డాను.

                                              

     చెప్పానుగా  ఉద్యోగం లో చేరిన తరువాత ప్రతీ మూడు నెలకీ శలవు పెట్టి హైదరాబాద్ మా చిన్నన్నయ్య గారి దగ్గరకు వెళ్ళిపోయేవాడిని. అక్కడ మాత్రం బలేగా ఉండేది. చదువుకోరా అని అడిగేవాళ్ళు లేరు ( ఉద్యోగం లో ఉన్నాను గా !!), తిండం, తిరగడం, సినిమాలు చూడ్డం ఇంతేపని. ఇవే కాకుండా ఓ కిళ్ళీ కొట్లో  తెలుగు నవలలూ అవీ అద్దెకు తెచ్చేవాడిని. అవి చదవడానికి మాత్రం మా అన్నయ్య గారూ, వదినా పోటీ కి వచ్చేవారు. పైగా నేను ఇంకా చదవలేదు కదా అని పుస్తకం మార్చకపోతే అడగడం ఒకటీ ” ఇంకా పుస్తకం మార్చలెదా ” అని. పాపం వాళ్ళకీ ఇలాంటి మామూలు పుస్తకాలు చదవాలని ఉంటుంది, కానీ నాలాగ  కిళ్ళీ కొట్ట్లనుండి అద్దెకు తీసుకురాలెరుగా !! మొహమ్మాటం, ఎవరైనా  ఏదో అనుకుంటారేమో అని. అందుకనే కామోసు నేను శలవు పెట్టి వెళ్ళేసరికి వాళ్ళిద్దరికీ మహ ఆనందం గా ఉండేది !! మా అన్నయ్యగారి  అమ్మాయి , అప్పడికి  బాగా చిన్న పిల్ల, రాత్రిళ్ళు తనకి నన్ను కాపలా పెట్టి వాళ్ళు సినిమాలకి వెళ్ళేవారు !! నేనైతే పగలు మాట్నీలకి వెళ్ళేవాడిని. వాళ్ళింట్లో ఓ ” జిగ్ సా ” పజిల్ ( న్యూయార్క్ హార్బర్ ది ) ఒకటుండేది. మా ఇద్దరినీ అది పూర్తిచేయమనే వాళ్ళు. అది పూర్తిచేయడానికి కనీసం ఓ రెండు గంటలైనా పట్టేది, ఈ లోపులో మా అన్నయ్య, వదినా ఎక్కడికైనా వెళ్ళి వచ్చేవారు. నాకూ శలవలు బాగా గడిచిపోయేవి. వాళ్ళింట్లో ఓ టేప్ రికార్డర్ ( గ్రుండిగ్, స్పూల్ టైప్) ఉండేది. అదో సరదా.

                                            

      మా చుట్టాల్లో చాలామందేమిటీ, అందరూ బాగా చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినవాళ్ళే. అయినా నాలాగ 18 సంవత్సరాలకి ఉద్యోగం లో చేరారా !! ఆ క్రెడిట్ నాకు మాత్రమే దక్కింది. ఎప్పుడినా ఖర్మ కాలి వాళ్ళని కలిస్తే ” ఓ హో ఆర్డినెన్స్ ఫాక్టరీలో నా ” అని అదేదో చేయరాని పని చేస్తున్నట్లు ప్రవర్తించేవారు. పోన్లెండి ఎవరి మీదా ఆధార పడకుండా నా బతుకెదో  నేను కాలరెత్తుకొని  బతికాను.

                                            

      1975 లో మా నాన్నగారు స్వర్గస్థులైనప్పుడు మా అన్నదమ్ములం  ఒకే చోట కలుసుకున్నాము. ఆ తర్వాతేడాది సంవత్సరీకాలకి మాత్రమే ఆఖరి సారి ఒకే చోట కలుసుకున్నాము. ఆ తరువాత ఎప్పుడినా ముగ్గురం కలుసుకునే వాళ్ళం కానీ విడి, విడి గా మాత్రమే.  1992 లో మా పెద్దన్నయ్య గారూ, 2003 లో మా చిన్నన్నయ్య గారూ స్వర్గస్థులయ్యారు. మా అమ్మ గారు వాళ్ళున్నంత కాలమూ, ఏడాదికోసారి మాత్రమే ఓ రెండు నెలలుండడానికి మా దగ్గరకు వచ్చేవారు. వాళ్ళిద్దరూ స్వర్గస్థులయ్యాక , పూర్తిగా నా దగ్గరే ఉండేవారు. ఆవిడ 2007 వ సంవత్సరం లో మునిమనవరాలుని చూసుకొని, 95 వ సంవత్సరం లో  బుల్లి కోడలి ( నా భార్య ) చేతిలో ప్రశాంతం గా కన్ను మూశారు.

%d bloggers like this: