బాతాఖానీ ఖబుర్లు –27

                                                                    మా అమ్మాయి ప్రతీ ఏడాదీ ప్రైజులు పుచ్చుకున్నప్పుడు మేము స్కూలికి వెళ్ళేవాళ్ళం. ఈ మధ్యలో మూడు నెలలకోసారి పేరెంట్-టీచర్స్ మీటింగ్ లకు నేను ఒక్కడినే వెళ్ళేవాడిని.  1978 ప్రాంతానికి మా డాక్టరమ్మ గారు పై చదువులు పూర్తి చేసి ఇండియా తిరిగి వచ్చేశారు.

ఆవిడని చూడడానికి వెళ్తే ” ఇదేమిటీ ఇంకా ఒక్క పాపేనా ” అన్నారు.” పర్వాలేదు ఒకళ్ళకి ఇంకోరు తోడుండాలి,” అని మొహమ్మాట పెట్టేశారు !! ఆవిడేదో రోజూ పొద్దున్నే లేచి టెంపరేచర్ చూసి ఓ చార్ట్ లా తయారుచేయమన్నారు, సరేఅని ఓ నెల పోయిన తరువాత నేను ఆ చార్ట్ పట్టుకొని ఆవిడ దగ్గరకు వెళ్తే ” కంగ్రాట్యులేషన్స్ ” అన్నారు. ఇదేమిటండీ పేషంట్ ని చెక్ చేయలేదు, అన్నాను. సరేనని ఆ వారాంతం లో వెళ్ళినప్పుడు, నన్ను బయట కూర్చోపెట్టి, మా రాబోయే బేబీ హార్ట్బీట్స్ వినిపించి, ” పోనీ ఇప్పుడైనా నమ్ముతావా ” అన్నారు !!

                                                                  ఫిబ్రవరి 23 న అర్ధరాత్రి తనకి కొంచెం అనీజీ గా ఉంటే ఆవిడకు ఫోన్ చేశాను, సరే హాస్పిటల్ కి తీసికొచ్చేయ్ అన్నారు.

మా ఇంటావిడ కి నెలలు నిండుతున్నాయని, మా రెండో మరదలిని సహాయంగా పంపారు. ఆ అమ్మాయినీ, మా పాపని, ఇంట్లో వదిలేసి హాస్పిటల్ కి వెళ్ళాము, ఆరొజు రాత్రి కే చేర్పించాను. ఆ మర్నాడు  ఆదివారం  రాత్రి కి బాబు పుట్టాడండీ మాకు. ఇంకో విషయం చెప్పనా వీడికి కూడా మేము పేరు ముందరే నిశ్చయించేశాము ( హరీష్ కుమార్ అని).( అతని పాప కూడా అదే హాస్పిటల్ లో 2006 వ సంవత్సరం లో అదే డాక్టరమ్మ గారి చేతిలో పుట్టింది.).

                                                                భగవంతుని దయ వలన మా ఇద్దరు పిల్లలూ సలక్షణం గా ఉన్నారు. జీవితాంతం నేను ఆ శ్రీ వెంకటేశ్వరునికి ఋణ పడి ఉంటాను.

                                                               రెండో రోజుకి మా అత్తగారు వచ్చారు, ఆవిడని, స్టేషన్ లో కోణార్క్ లో రిసీవ్ చేసికొని డైరెక్ట్ గా జహంగీర్ హాస్పిటల్ కే తీసికెళ్ళాను. ఆ మర్నాడు ( అంటే మూడో రోజుకి ) డిస్చార్జ్ చేశారు. వీళ్ళందరినీ ఓ 15 రోజుల తరువాత తణుకు పంపించేశాను. అక్కడ ఓ నెల రోజులుంచి, పూనా తిరిగి తిసికొచ్చెశాను. ఇక్కడ మేముండే క్వార్టర్ లో నీళ్ళు సరిగ్గా రావడం లేదని, ఇంకో చోటకి మారాము. అది పాత బంగళా, సర్వెంట్ లు ఉండేవాళ్ళు.. మా పిల్లల చదువు అంతా మాఇంటావిడే చూసుకొనేది. మా అబ్బాయికి నా దగ్గరే చేరిక, ఎన్ని దెబ్బలు తిన్నా నాదగ్గరకే వచ్చేవాడు!! కొంచెం పేచీ పెట్టేవాడు.

ఆ రోజుల్లో మా ఇంట్లో ఒక రూమ్ లో మా ఫ్రెండ్ ఒకతను ( బాంక్ లో పనిచేసేవాడు ) ఉండేవాడు. వాళ్ళకి కొత్తగా పెళ్ళి అయింది, ఇల్లు దొరికేదాకా మా ఇంట్లో ఉండేవాడు.

                                                             ఇదంతా ఇలా ఉండగా, మా మామగారు తణుకు లో టీచర్స్ అందరూ కలిసి ఓ కాలనీ లో స్థలాలు తీసికుంటున్నారూ, మనం ( అంటే మేము) కూడా తీసికుంటే బాగుంటుందన్నారు. ఆ రోజుల్లో 270 గజాలకి  4000  రూపాయలు సమకూర్చడానికి తల ప్రాణం తోకకి వచ్చింది. ఎలాగైతేనే ఆ పని పూర్తి చేశాను. మా అమ్మాయికి అక్కడ ఉండగా కర్నాటక సంగీతం నేర్పించాము. మా బాబుకి పూనా లో రెండు స్కూళ్ళలో ఎల్.కే.జీ లో అడ్మిషన్ కూడా దొరికింది. మర్చిపోయానండోయ్  మేము ఫాక్టరీ క్వార్టర్స్ కి వచ్చిన ఏడాదికి పూనా లో మొట్టమొదటి సారిగా టెలివిజన్ వచ్చింది. వదుల్తామా, సొసైటీ లో లోన్ తీసికొని, క్రౌన్ టివీ కొన్నాను. ఆ కాలనీ అంతటికీ మా ఇంట్లోనే టీ.వీ. ఉండేది. అక్కడ ఉండే ప్రాణులందరూ ఆదివారం సాయంత్రం అయేసరికి మా ఇంట్లో సినిమా చూడడానికి చేరేవారు. ఇల్లంతా నిండిపోయేది, ఒక్కోసారి దూరంగా ఉన్న మా ఫ్రెండ్ లు ఫామిలీలతో వచ్చేవారు, భోజనాలు చేసే వెళ్ళేవారు!! మొదట్లో బాగా ఉండేది మనకొస్తున్న అటెన్షన్ కి. రాను రానూ చిరాకెత్తిపోయేది. ఎక్కడికీ వెళ్ళడానికి ఉండేది కాదు, మరీ ఎవరో వస్తే వాళ్ళని ఇంట్లో వదిలి వెళ్ళలేముకదా !!

                                                         1983 లో ప్రమోషన్ మీద నాకు వరంగామ్ అనే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. ( ఈ ఫాక్టరీ నిజంగా ఆంధ్రప్రదేష్ లోని ” వరంగల్ ” రావాల్సింది , కానీ రక్షణ శాఖ మంత్రి వై.బి.చవాన్ (1962-63) ధర్మమాఅని మహరాష్ట్ర కి వచ్చేసింది). ఆయన చలవతో  మహారాష్ట్ర లో మొత్తం 10 ఆర్డినెన్స్ ఫాక్టరీలున్నాయి. ఇందిరాగాంధీ  “మెదక్ ” నుంచి నెగ్గేదాకా ఆంధ్ర ప్రదేష్ లో మా ఫాక్టరీ రాలేదు. 

                                                          ఆ ఊరు భుసావల్ కి 20 కిలోమీటర్ల దూరం లో ఉంది. అక్కడ అప్పటికి టి.వీ లూ అవీ ఉండేవికాదు. అందువలన మా టి.వీ. పూనాలోనే అమ్మేశాం.  టి.వీ ఇంట్లోంచి వెళ్ళిపోయే రోజున మా ఫామిలీ అంతా చాలా సెంటిమెంటల్ అయిపోయింది. నేను  ముందుగా వరంగామ్ వెళ్ళి జాయిన్ అయి క్వార్టర్ తీసికొని వచ్చాను. మే నెల 15 న ఓ ట్రక్ బుక్ చేసి సామాన్లతో మేము కూడా  ( నేనూ,మాఇంటావిడా, పిల్లలు, మా మామగారు ) అదే ట్రక్ లో ఆ ఊరు వెళ్ళిపోయాము.

                                                         ఒక్కసారి పూనా లాంటి సిటీ నుంచి ఓ కుగ్రామానికి వచ్చేసరికి అడ్జస్ట్ అవడానికి చాలా టైమ్ పట్టింది. ఓ టీ.వీ. లేదు, పేపర్ రెండో రోజుకి వచ్చేది, కాలక్షేపానికి మా ఫాక్టరీ క్లబ్ తప్ప ఇంకేమీ లేదు. సినిమాలయితే సింగిల్ ప్రొజెక్టర్ తో ఒపెన్ లో వేసేవారు !! మాకేమో ఈ క్లబ్బులూ అవీ అలవాటు లేదు. అడక్కండి ఎలా గడిపేమో అక్కడ. మా అమ్మాయికి ” కేంద్రీయ విద్యాలయ ( అంటే సెంట్రల్ స్కూల్) ” లో  క్లాస్ 4 లో అడ్మిషన్ టెస్ట్ పెట్టారు. ఈవిడకేమో హిందీ రాదు ( మాకు కూడా ఏదో మాట్లాడడానికి పనికొచ్చేదే తప్ప ఇలా స్కూళ్ళకి ఉపయోగించేది రాదు !!). ఎలాగోలాగ మా అమ్మాయీ,  వాళ్ళ అమ్మా కలిసి తిప్పలు పడి మొత్తానికి స్కూల్లో చేర్పించాము.

%d bloggers like this: