బాతాఖానీ -తెరవెనుక ( లక్ష్మి ఫణి ) ఖబుర్లు

                                                                

  నా కున్న చిన్న కోరికల్లో ఒకటి బెల్లం మిఠాయి తిందామని.దానిలో ఉన్న రుచి ఎక్కడుంటుందండీ ? నోట్లో వేసికొంటే కరిగిపోతుంది.  ఇప్పుడు  ఏ కొట్లో నైనా అడిగితే బెల్లం మిఠాయి అచ్చులు ఇస్తారు.  కిందటి ఏడాది జూలై లో ఇక్కడకు ( రాజమండ్రి) కి వచ్చాము. ఆ బెల్లం మిఠాయి కోసం తిరగని చోటు లేదు. ఎవరిని అడిగినా ఒకటే మాట– ఆ రోజుల్లో  మా పూర్వీకులు చేసేవారండి, ఇప్పుడు ఆ పాకం రావడం లేదండి –అనేవారే.

                                                                   ఆ మధ్యన ఒకసారి ఏ.పీ.ఆర్.టీ.సీ వాళ్ళ ధర్మమా అని  ” నవ జనార్ధన టూర్ ” కి వెళ్ళాం. తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న 9 జనార్ధనస్వామి దేవాలయాలు చూపించారు. వెళ్ళిన చోటుల్లో నేను నా బెల్లం మిఠాయి గురించి ఎంత వెదికానో. ఎక్కడా దొరకలేదు.

                                                               

    మా చిన్నప్పుడు ప్రతీ మిఠాయి కొట్లోనూ ( అద్దాల బండి తో సహా ) దొరికేది. ఎవరికైనా ” సారి ” ఇస్తే అందులో ఈ బెల్లం మిఠాయి ఒక ముఖ్యమైన భాగం. ప్రపంచం లో ఎన్నెన్నో జీవరాసులు ” ఎక్స్ టింక్ట్ ” అయిపోతున్నాయని  చదివేము కానీ, ఈ బెల్లం మిఠాయి కూడా ఆ కోవ లో జేరిందని తెలుసుకోలేక పోయాను !!

                                                           

     రాజమండ్రి లో ఎవరో చెపితే ఓ కొట్టు వాడిని పట్టుకొన్నాను. ముందర అడిగితే చేస్తానన్నాడు. సరేనని ఓ రెండు కిలోలు చెయ్యమన్నాను. పూణే వెళ్ళేటప్పుడు పిల్లలకి కూడా తీసికెళ్ళొచ్చుకదా అని. కొట్టు అతను చెప్పిన రోజు అక్కడికి వెళ్ళి అమ్మయ్యా ఇప్పడికైనా నా కోరిక తీరుతోందని సంతోషించాను. ఇంటికి వచ్చి ఓ ఉండ రుచి చూద్దామని పాకెట్ తెరిచి చూస్తే అందులో “తిరుపతి లడ్డు ” సైజ్ లో ఇచ్చాడండి.  అది నోట్లో పట్టదు, పోనీ పగల కొట్టి ముక్కలు చేద్దామా అని చూస్తే, ఆపని చేయడానికి ఓ గంట పట్టింది. ఎంత చిరాకు వేసిందీ అంటే  ఆ పాకెట్ తీసికెళ్ళి ఎదురుగుండా ఉన్న గోదాట్లో పడేద్దామన్నంత.

ప్రతీ రోజూ గోదావరి గట్టున ఉన్న దేవాలయాలకి వెళ్తూంటాను, పోనీ ఆ గుడి బయట  కూర్చొంటారు, వాళ్ళకి ఇచ్చేద్దామనుకొన్నాను. సరే మర్నాడు ఆలోచిద్దామని

ఆ కొట్టు వాడి దగ్గరకు మళ్ళీ వెళ్ళాను, అతనిని అడిగాను ” ఏమండీ మీకు నేను అడిగిన మిఠాయి చేయడం రాకపోతే చెప్పొచ్చుకదా, నిన్న ఇంటికి వెళ్ళి ఓ ఉండ రుచి చూద్దామనుకొంటే ఒక ఉండ పగలు కొట్టడానికే అరగంట పైగా పట్టిందీ, నన్నేం చేయమంటారూ ” అని.  అతను ఏ మూడ్ లో ఉన్నాడో ” పోనీ మీకు నచ్చకపోతే తిరిగి ఇచ్చెయ్యండి, మేమే  ఏదోలా అది అమ్మేసుకొంటాం”. నాకైతే చాలా ఆనందం వేసింది పొన్లే ఎలాగోలాగ ఇవి చెల్లుబాటవుతున్నాయని !!

                                                      

    నా గొడవ భరించలేక మా కజిన్ వాళ్ళ అత్తగారు ( 80 సంవత్సరాల ఆవిడ ) ఏదో సందర్భం లో వాళ్ళింట్లో చేయిస్తే నాక్కూడా, ఓ అర డజను పట్టుకొచ్చాడు. ఎవరినీ ముట్టుకోనీయకుండా నేనే నాలుగు రోజులు మనసారా తిన్నాను. మరీ తమ్ముడి అత్తగారిని అస్తమానూ చేయించి ఇవ్వండి అని అడగడం బాగోదు కదా !!

                                                  

      మా చిన్ననాటి స్నేహితుడు ఒకతను ధవళశ్వరం లో సెటిల్ అయ్యాడు. నా వేవిళ్ళ కోరిక తెలుసుకొని పాపం అక్కడ అన్ని కొట్లూ తిరిగి  ఓ  ” పూర్ కజిన్ ఆఫ్ బెల్లం మిఠాయి ” తయారుచేయించాడు. ఏదో సరిపెట్టుకొంటున్నాను. కానీ నా మనసు ఇంకా తీరలేదు. ఏదో ” కాంప్రమైజ్ ” అయిపోయాను.

                                               

      మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి బాబూ నా ఆల్ టైమ్ ఫేవరిట్ బెల్లం మిఠాయి ఉండ ( అచ్చు కాదు బాబోయ్ ) ఎక్కడ దొరుకుతుందో !!

%d bloggers like this: