బాతాఖానీ ఖబుర్లు —26

                                                          

   నాకు సైకిలు తొక్కడం  జీవితం లో ఇంక రాదని అందరూ నిశ్చయించేశారు. రోజూ వెళ్ళడం వరకూ బాగుండేది కానీ, వచ్చేడప్పుడు మాత్రం రాత్రిళ్ళు కుక్కల భయం చాలా ఉండేది !! ఇది ఇలా ఉండగా మా షిఫ్ట్ లోనే పనిచేస్తున్న ఓ పెద్దమనిషిని పట్టుకున్నాను. అతని దగ్గర

“సువేగా ” మోపెడ్ ఉండేది. పెట్రోల్ డబ్బు ఇస్తానూ, నన్ను తీసికెళ్ళమన్నాను. కొన్ని రోజులు బాగానే జరిగింది. అప్పుడప్పుడు అనిపించేది అతనికి రాత్రిళ్ళు సరీగా కనిపించదేమో అని. ఎందుకంటే ఎదురుగా ఏదైనా లైట్ బాగా ఫోకస్ అయితే పక్కకు తిసికెళ్ళి ఆపేసేవాడు. మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు అతనికి షార్ట్ సైట్ అని. సరే దొందుకు దొందే అనుకున్నాను. నాకు కూడా అదే కదా (  – 6 ). ఇంక చూసుకోండి ఎలా ఉంటుందో !! ఓ అగ్రీమెంట్ కి వచ్చాము, ఎదురుగుండా ఏదైనా లైట్ కళ్ళల్లో

పడితే, ఆ లైట్ మమ్మల్ని క్రాస్ చేసేదాకా మేము ఆగిపోవడం. ఓ రోజు సెకండ్ షిఫ్ట్ లో రాత్రి 10.30 కి బయటకు వచ్చాము. కొద్దిగా తుంపర పడుతోంది. ఇంతలో కొద్ది దూరం లో ఏదో  బ్రైట్ లైట్ కనిపించింది. పోనీ అదేదో మమ్మల్ని క్రాస్ చేసింతర్వాత బయల్దేరుదామని ఆగిపోయాము. ఓ గంట గడిచినా ఆ బండేదో రాదే,  మేము,ఫాక్టరీ టైము అయిపోయిన తరువాత అంతసేపు అక్కడ రాత్రి పూట ఉండకూడదు. ఇంతలో మా ఎదురుగా ఓ సెక్యూరిటీ అతను వచ్చి , “ఇక్కడేంచేస్తున్నారూ ” అని అడిగాడు. ఫలానా కారణం అని చెప్పాం. అతను నవ్వు ఆపుకోలేక చెప్పాడూ ” ఆ దూరంగా కనిపిస్తున్న లైట్లు అక్కడే ఉంటాయీ, ఎందుకంటే అవి వీధి దీపాలూ, నీళ్ళల్లో ఆ ప్రతిబింబం మీకు అలా కనిపిస్తోంది!! “. అప్పడికి ధైర్యం చేసి బయలుదేరాము, కొంపకి చేరేడప్పటికి రాత్రి  12.00 అయింది. ఇక్కడ మా ఇంటావిడ కి పాపం ఖంగారూ, ఏమైపోయామో అని, ఆరోజుల్లో సెల్ ఫోన్లూ వగైరాలు లేవు కదా !!

                                                      

    1977 లో మా చిన్న మరదలు ని పూనా తీసికెళ్ళాను. కొన్ని రోజులు మాతోనే ఎక్కడికైనా తీసికెళ్ళేవారం. ఓ రోజున మా క్వార్టర్ కి దగ్గరలోనే తనని వదిలేసి ఇంటికీ వెళ్ళూ అని చెప్పి, మా పనిమీద ఇంకో చోటుకి వెళ్ళాము. మా పని పూర్తి చేసికొని ఇంటికి వచ్చి చూస్తే ఈ మరదలు పిల్ల ఇంకా చేరలేదు. వామ్మో ఎక్కడికి వెళ్ళిందిరా బాబూ అని ఖంగారు పడ్డాము. ఏం చేయాలో తెలియదు, పాపం ఆపిల్లకి భాష రాదూ, ఎలారా భగవంతుడా అని టెన్షన్ వచ్చేసింది. మా అదృష్టం బాగుండి ఓ అరగంట పోయిన తరువాత అలసిపోయి, వేళ్ళాడిపోతూ వచ్చిందండి. ఇంక మా ఇంటావిడ అయితే తనని పట్టుకొని ఏడుపులూ, రాగాలూ, సంగతేమిటంటే మా మరదలు పిల్ల ఓ టర్న్ బదులు ఇంకో టర్న్ తీసికొంది, ఎక్కడకో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఏమైతేనే కధ సుఖాంతం !!

                                                     

   మేము మా బిల్డింగ్ లో  పై ఫ్లోర్ లో ఉండేవాళ్ళం, ఓ రోజున మా ఇంటావిడ కిందకు కూరలు తీసికోవడానికి వచ్చింది, తాళం చెవి తీసుకురాకుండా. ఇంట్లో మా పాప ఉంది.  మా తలుపు సెల్ఫ్ లాకింగ్ టైపు. తనేమో తలుపు మూసేసింది. పైగా కిటికీ లోంచి వాళ్ళ అమ్మతో ఖబుర్లు చెప్పడం,

ఏమయ్యిందో తెలుసుకొనేసరికి ఇంకేముంది ఖంగారొచ్చేసింది. పాపం చిన్న పిల్లకేం తెలుసూ, తలుపు ఎలాతీయాలో, చుట్టుపక్కల వాళ్ళందరూ పోగయ్యారు. తలుపు బద్దలుకొడితేనే కానీ కుదరదు. ఆ పోర్షన్ కి ఇంకో ద్వారం లేదు.  ఏం చేయాలా అని అందరూ ఖంగారు పడుతూంటే, ఓ 7 సంవత్సరాల కుర్రాడు వచ్చి, మీరందరూ ఏమీ ఖంగారు పడకండీ, నేను కిటికీలోంచి వెళ్ళి తలుపు తీస్తానూ అన్నాడు. అందరూ కలిసి ఓ నిచ్చెన తీసుకొచ్చి, వాడిని ఆ కిటికీ దాకా పంపారు. ఆ అబ్బాయి ఏదో మ్యాజిక్ చేసినట్లుగా , కిటికీకున్న చిల్లులోంచి లోపలికి దూరి తలుపు తీసేశాడు !!

                                              

         ఆ రోజుల్లో బియ్యం దొరకడం చాలా కష్టం గా ఉండేది. బెంగాలీలకి, మనవాళ్ళకి  బియ్యం లేకుండా రోజు వెళ్ళదు.. ఎవరికైనా ఎక్కడైనా బియ్యం దొరికితే ఇంకొళ్ళకి చెప్పేవారు కాదు !! అంత సీక్రెట్ అన్న మాట. మా బిల్డింగ్ లో 5 బెంగాలీ ఫామిలీ లు ఉండేవి.  ఆరోజుల్లో మద్రాసీలు ఎక్కడినుంచి తెచ్చేవారో,  ఇంటింటికీ వెళ్ళి అమ్మేవారు ఓ తక్కెడ తెచ్చేవారు.దానితో తూచడం, ఇంకెవరికీ తెలియకుండా ఇంట్లోకి వెళ్ళి, ట్రాన్సాక్షన్ పూర్తి చేసేవారు.

అలాగే మా బిల్డింగ్ లో ఉన్న 5 ఫ్యామిలీ వాళ్ళూ కలిసి,  ఓ 50 కిలోలు, కిలో ఒక్కంటికీ 20 రూపాయలచొప్పున తీసికొన్నారు. వీళ్ళ ఎదురుగుండానే లెఖ్ఖ పెట్టి 50 కిలోలూ తూచి, డబ్బు పుచ్చుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. మా ఫ్రెండ్స్ ఆ బియ్యానంతటినీ ఓ మంచం కింద పోయించారు. ఆ తరువాత ఆ మిగిలిన 4 ఫామిలీలవాళ్ళూ, తమ తమ కోటా బియ్యం తీసికోవడానికి వచ్చి చూస్తే– నమ్మండి, నమ్మకపోండి అక్కడ ఉన్నవి  10 కిలోలు మాత్రమే. అదే మిస్టరీ. సంగతేమంటే ,

ఈ మద్రాసీ వాళ్ళు కొనేవాళ్ళని     ” హిప్నొటైజ్ ” చేసి సరుకు అమ్మేవారు. అంటే మా వాళ్ళు కిలోకి 100 రూపాయల చొప్పున కొనుక్కున్నారన్నమాట. ఇదంతా మింగా లేరూ, కక్కాలేరు, ఎవరితోనూ చెప్పుకోలేరు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ మర్నాడు పేపర్లలో చదివితే మా అందరికీ తెలిసింది. వెళ్ళి అడిగితే ఓ వెర్రి నవ్వు నవ్వేశారు. ఇలాంటి మోసాలు ఆరోజుల్లో చాలా జరిగేవి.

%d bloggers like this: